శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

కరోనా కరుణ

కరోనా కరుణ

2 mins
287


             కరోనా కరుణ 

             -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

        

    "ఒసేయ్ సంధ్యా....ఇంకెంతసేపు ఆ మొద్దు నిద్ర? టైం ఎనిమిదవుతుంది. ఎప్పుడు లేస్తావ్...? ఎప్పుడు తయారవుతావు...? ఒక కూతురున్నందుకు నాకు పనిలో సాయపడేది పోయి తిరిగి నేనే నీకు లంచ్ బాక్స్ దగ్గర నుంచి అన్నీ సర్ది ఉంచాల్సివస్తుంది. ఏం రోజులో ఏంటో...? ఈకాలం పిల్లలకు చెప్పలేకపోతున్నాం" కూతుర్ని దారిలోకి తీసుకురాలేక విసుగెత్తిపోయి ...తన పాఠం తాను రోజూ చదువుకోవడం మామూలే సత్యవతికి.


   "ఉండమ్మా లేస్తాను...పొద్దున్నే నసపెట్టకు" అంటూనే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచింది. నిజంగానే గోడగడియారం చూపిస్తున్న టైంకి ఒక్క ఉదుటున లేచి బాత్రూంలోకి పరిగెట్టింది సంధ్య.


   "వింటున్నారా...నేను చెప్పేది దానికి నసలా ఉంది. రేప్రొద్దుట పెళ్లిచేసుకుని అత్తారింటికి వెళ్తే...దాన్ని కాదు ఇలాంటి దాన్ని కని పెంచి ... ఏమీ నేర్పకుండా తమకు అంటగట్టారని నన్నే కదా ఆడిపోసుకుంటారు" కూతురుపై కంప్లైంట్ చేసింది భర్త ఆనందరావుకి. 


   "ఊరుకోవే...సమయం వచ్చినప్పుడు అదే నేర్చుకుంటుంది. ఇప్పటివరకూ దానికి సమయం ఎక్కడ చిక్కింది చెప్పు...? ఇంజనీరింగ్ చదువైపోగానే ఉద్యోగం రావడం వెంటనే జాయిన్ అయిపోవడం. పొద్దున్న పోయి రాత్రిప్పుడో వస్తుంది. తాను మాత్రం కాళీగా ఎక్కడుంటుంది చెప్పు..."? కూతుర్ని వెనకేసుకొచ్చాడు ఆనందరావు.


            ***    ***   ***


    రోజులన్నీ ఒకలా ఉండవు...

    చలాకీగా వుండే ప్రపంచమే స్థంభించిపోయింది.

    స్తంభించిపోయిన మనుషుల్లోనూ చలనమొచ్చింది.

    సత్యవతిలాంటి వారి మొర ఆ దేవుడు విన్నాడేమో...?

    

   ఇప్పుడు సంధ్య ఇంట్లో ఉండి చక్కగా అన్ని పనుల్లోనూ తల్లికి సాయం చేస్తుంది. ఇప్పుడిప్పుడే వంట కూడా నేర్చుకుంటుంది. ఆ తల్లి మనసు ఇన్నాళ్లకు కుదుటపడింది. 


    "నేను చెప్పాను కదా...సమయం వచ్చినప్పుడు అదే పనులు నేర్చుకుంటుందిలే అని. నువ్వూరుకునే నోరు పారేసుకుంటావు"...భార్యను చిలిపిగా మందలించాడు ఆనందరావు.


   "నిజమేనండీ...దానికీ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం...అలా గంటలు గంటలు ఇంట్లోనే కూర్చుని పనిచేయడం విసుగే కదా. అలాగని బయటకు వెళ్లలేని పరిస్థితి. టైం పాస్ అవ్వక పిచ్చెక్కినట్టుంది. పనిమనిషి కూడా రావడం లేదేమో...నేను ఒక్కదాన్నీ పనులుచేసుకోవడం చూసి...తానూ ఓ చేయేయ్యడం నేర్చుకుంది ఎలాగైతే. ఇకపై దానికి పనులు రావేమో అనే బెంగ పూర్తిగా నాకు పోయిందనుకోండి. దేవుడు నామొర ఆలకించే ...మనుషుల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ఇలా కరోనాని సృష్టించి ఉంటాడు" అంటూ కూతుర్ని పొగుడుతూనే కరోనాలో కరుణని చూసింది సత్యవతి.


   తండ్రితో చెప్తున్న తల్లి మాటల్ని వింది సంధ్య. 

    

   "పోమ్మా నువ్వెప్పుడూ ఇంతే..! నాకు పనులు రావేమోనని ఊరుకునే బెంబేలెత్తిపోతావు. ఓతల్లిగా నువ్వు కూతురు అన్నిట్టిలోనూ ఆరితేరి వుండాలని కోరుకోవడం సహజం అనుకో. ఒకవిధంగా నాపై నువ్వెంతో ప్రేమ చూపిస్తున్నావని నాకూ తెలుసు. 

     

   నేనూ నీలా ఆడదాన్నేగా. పెళ్ళై వెళ్ళాకా ఈపనులన్నీ నేనూ చేసుకోవాల్సిందే. నేనెక్కడ వున్నా...నా చిన్నప్పటి నుంచీ అమ్మ చేస్తున్న పనుల్ని ఎలా మర్చిపోతాను? నిన్ను తల్చుకుంటూ అయినా...నువ్వు చక్కబెట్టేవన్నీ నేనూ చేసుకోగలనని నిరూపించుకోడానికి నాకు నేను చాలు" అంటూ తల్లిని ప్రేమగా వాటేసుకుంది సంధ్య....!!*


 

      


   

     

      

      

      

      

      

  


         

         


   



Rate this content
Log in

Similar telugu story from Inspirational