కాకి గోల
కాకి గోల
కాకి గోల
***********
సాంబయ్య పాలెం గ్రామ ప్రాథమిక పాఠశాల విశాలమైన ఆటస్థలంతో, పచ్చని చెట్లతో చూపరులను ఆకట్టుకునేది. ఒకరోజు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్యుతరావు మాష్టారు ఐదవ తరగతిలోకి వెళ్ళేసరికి గోల గోలగా ఉంది. పిల్లలంతా మాటల్లో, ఆటల్లో మునిగి ఉన్నారు.
“ఆపండర్రా మీ కాకి గోల” అని గట్టిగా అరిచారు అచ్యుతరావు మాష్టారు. భయపడి పిల్లలంతా నోరు మెదపకుండ మౌనంగా ఉండిపోయారు. ”నేను చెప్పేది మీకు వినపడాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావాలి. నిశ్శబ్దంగా ఉండండి" అని చెప్పి పాఠం ప్రారంభించారు మాష్టారు.
మాస్టారు 'కాకి గోల' అనడం పక్కనే చెట్టు మీద ఉన్న కాకి పిల్ల విన్నది. ఆహారం తెచ్చి తినిపించబోయిన తల్లి కాకిని "అమ్మా! అమ్మా! మాష్టారు కాకి గోల అని అన్నారు. మనం ఆ పిల్లల్లా అరుస్తామా? చెప్పవా?” అని అడిగింది.
"మనం సంఘటితానికి పెట్టింది పేరు. ఒకరి కోసం అందరం అన్న భావన మనది. మనలో ఒకరికి ఆహారం కనిపిస్తే అందరికీ చెప్తాం. అందరం కలసి తింటాం. నిన్న మన బంధువు ఒకరు నూతి లో పడిపోయాడు. సహాయం కోసం కావ్ కావ్ మని అరిచాము. అది గమనించిన ఒక బాటసారి నూతి దగ్గరకు వచ్చి చూశాడు. నూతిలో ఉన్న మన బంధువును రక్షించాడు. మన అవసరానికి మాత్రమే మనం అరుస్తాం. మన అరుపులు మానవులకు వినసొంపుగా ఉండక, మన భాష అర్థం కాక 'కాకిగోల' అని అంటారు.” అని చెప్పింది తల్లికాకి.
”ఓహో అదా సంగతి" అంది పిల్లకాకి.
ఇంతలో భోజన విరామ సమయం గంట మ్రోగింది. పిల్లలు భోజనం చేసి, తినగా మిగిలిన ఆహారాన్ని మైదానంలో ఒక చెట్టు కింద వేసారు. అది చూసిన కాకులు 'కావ్ కావ్' మని అరుచుకుంటూ చెట్టు కింద చేరి ఆహారాన్ని తిన్నాయి.
“పిల్లలూ విన్నారా ఆ కాకిగోలని. చూశారా ఆ కాకుల గుంపుని? అదే కాకిగోల అంటే! ఒకరు చెప్పింది మరొకరికి అర్ధం కాదు, వినబడదు. అందరూ అరుచుకుంటూ మాట్లాడితే కాకిగోల అనే అంటారు. క్రమశిక్షణ లేకుండా ఎవరిమటుకు వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ జాతీయం వాడుతున్నారు." అని సోదాహరణంగా వివరించారు మాస్టారు.
(సృజన క్రాంతి దినపత్రికలో 29-9-24 న ప్రచురితమైంది)
