జీవితంలో అర్ధంచేసుకోవాల్సినది
జీవితంలో అర్ధంచేసుకోవాల్సినది
జీవితంలో అర్ధంచేసుకోవాల్సినది
ప్రతి మనిషిని బాధ పెట్టె విషయాలు ముఖ్యంగా రెండు ఉంటాయి. అందులో మొదటిది, ఎలాగైనా పేరు సంపాదించాలి, నా గురించి అందరూ చెప్పుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నేను ఎప్పుడూ కూడా సుఖంగానే ఉండాలి. ఇక రెండవది, నా వాళ్లెప్పుడూ సుఖంగానే ఉండాలి, వాళ్లెప్పుడూ బాధ పడ కూడదు, వాళ్లెప్పుడూ నాకు దూరం కాకూడదు. ఈ రెండూ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా సమ పాళ్ళల్లోనే ఉంటాయి ప్రతిమనిషిలోనూ కూడా. బ్రతికివున్నంత కాలం కూడా మనిషి వీటి గురించే బాధ పడుతూ ఉంటాడు.
కాకపోతే కొంతమంది మనుషులు వాళ్ళ వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా తమ గురించే ఆలోచించుకుంటూ వుంటారు. ఇంకొంత మంది మనుషులు తమ గురించి ఏమీ బాధ పడకుండా తమ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వుంటారు. చాలా కొంతమంది మాత్రం అటు తమ గురించి, తమ వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా వుంటారు. వీళ్ళు మాత్రం చాలా సుఖపడుతూ ఉంటారని చెప్పక తప్పదు.
అయితే తమ గురించి కానీ, తమ వాళ్ళ గురించి కానీ ఆలోచిస్తూ ఉండడం అనేది కావాలని చేసేటటువంటిది కాదు. అనుకోకుండా జరిగేటటువంటిది. తన పిల్లల గురించి, తన తల్లితండ్రుల గురించి, భార్య లేదా భర్త గురించి ఆలోచిస్తూ వాళ్లెప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలనుకోవడం దానంతట అదే, మన ప్రమేయం లేకుండా జరిగేటటువంటి విషయమే. అలాగే గొప్ప పేరు సంపాదించాలి, ఒక ప్రత్యేకత సాధించాలి, నన్నందరూ పొగడాలి అనుకోవడం కూడా మన ప్రమేయం లేకుండా జరిగేదే. కాకపోతే ఈ రెండు రకాలయిన ఆలోచనలు కూడా మనల్ని శాంతి గా ఉండనివ్వవు. మనం శాంతిగా ఉండాలి అంటే మాత్రం ఈ రెండు రకాలయిన ఆలోచనలనుంచి, భావాలనుంచి బయట పడాల్సిందే.
అయితే ఆలా ఆలోచించడం తప్పా, అటువంటి భావాలు ఉండడం తప్పా అని అడగొచ్చు. అందువల్ల తప్పు లేకపోయినా ఆ రకమయిన ఆలోచనలు, భావాలూ నిన్ను శాంతిగా ఉండనివ్వవు. నిజం చెప్పాలంటే ఆ రకంగా ఆలోచించ కుండా కూడా నువ్వు పని చెయ్యొచ్చు. ఉదాహరణకి ఒక డాక్టర్ పేషెంట్ మీద ప్రత్యేకమైన అభిమానము లేకుండానే, కేవలం తీసుకున్న డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తాడు. అయితే మాత్రం అతని వైద్యం పనిచేయడం లేదా? అలాగే నువ్వు నీ వాళ్ళ కోసం వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం లేకుండా కూడా పనిచేయొచ్చు. నిజానికి నువ్వు అభిమానానికి తావు ఇవ్వకుండా, నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను అని పనిచేస్తేనే ఎక్కువ బాగా పనిచెయ్యగలవు.
అలాగే నాకేదో పేరు రావాలి, నన్నందరూ పొగడాలి, నాకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అన్న ఆలోచన నుండి బయటపడితే వుండే హాయి అందులోనుండి బయటపడితే తప్పా నీకు బోధపడదు. ఈ ఇగో అనేది ఒక పెద్ద ఇనుప చట్రం. అది నిన్ను బంధించి ఉంచి బాధపెడుతుండే తప్ప సుఖాన్ని ఇవ్వదు. నీకు నిజమైన శాంతి కావాలంటే ఈ రకమైన ఆలోచన నుండి బయటకి రావాల్సిందే.
కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఇది అంత తేలికయిన విషయమా? మన గురించి మనం ఆలోచించ కుండా ఉండడం కానీ, మన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం కానీ, అంత తేలికగా సాధ్యపడే విషయాలా? ఎంత మాత్రం కాదు. బాగా సాధన చేస్తేను, అసలు అలంటి ఆలోచనలకి అసలు కారణం ఏమిటి అన్నది బోధపడితేను తప్ప అదెంతమాత్రం సాధ్యపడే విషయం కానే కాదు. మరి అదెలాగా సాధించాలి అనేదంలోకి ఇప్పుడు మనం వెళదాం.
పై రెండిటికి కూడా సెంటర్ పాయింట్ గా ఉండేది ఏమిటో ఒక్కసారి అలోచించి చూడండి. నాకు పేరు రావాలి, నా వాళ్లంతా బాగుండాలి. ఈ రెండింటిలోనూ కూడా కామన్ గా వున్నటువంటిది 'నేను'. ముఖ్యంగా ఈ నేను ఏమిటో బోధపడితే, ఈ 'నేను' కి నీ వాళ్ళకి వున్నా సంబంధం ఏమిటో బోధపడితే, ఈ ఆలోచనల నుండి బయటకి రాగలం.
ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసాం. అంటే మనం తెలుసుకోవాల్సింది ఈ 'నేను' అంటే ఏమిటి? ఇదేమిటో బోధ పడితే, ఈ రెండు రకాలయిన ఆలోచనలనుంచే కాదు ఇంకా చాలా రకాలయిన ఆలోచనలనుంచి బయట పడొచ్చు. కానీ ఈ నేను అంటే బోధపడాలంటే చేయాల్సిందేమిటి? ఎంత కాలం సాధన చేస్తే, ఏ రకాలయిన ప్రయత్నాలు చేస్తే, ఈ నేను అంటే ఏమిటో బోధ పడుతుంది?
వాస్తవానికి ఈ 'నేను' గురించిన చర్చ ఈ వాళ నిన్న మొదలు కాలేదు. చాలా శతాబ్దాలుగా, పురాణ కాలం నుంచి కూడా ఉంటూనే వుంది. రమణ మహర్షి ముఖ్యం గా చెప్పింది ఈ 'నేను' అంటే విచారణ చెయ్యమనే. కాక పోతే మహాత్ముల ఉద్దేశంలో కానీ, రమణ మహర్షి ఉద్దేశం లో కానీ అటువంటి విచారణ చెయ్యమనడంలో ఉద్దేశం 'నేను' అని నిజంగానే ఎదో ఉందని, అది తెలుస్తుందని కాదు. ఆ 'నేను' గురించి చేసే విచారణలో మొత్తం ఆలోచనలు, మనస్సు నశించి, నిజంగా వున్నదేమిటో అనుభవంలోకి వస్తుంది.
ఈ 'నేను' అనేది ఎండమావి ఎలాంటిది. ఎండమావులు గురించి అందరూ వినే వుంటారు. ఎడారుల్లో ఎక్కడో నీళ్లు వున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ ఎటువంటి నీళ్లు వుండవు, కేవలం ఇసక మాత్రమే ఉంటుంది. అలాగే ఫలానా విధంగా నేను ఉందేమో అనిపిస్తుంది. కానీ అక్కడ తరచి చూస్తే నేను ఉండదు.
ఉదాహరణకి దేహమే 'నేను' అన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. ఎదో మాట వరసకి నేను దేహం కాదు అని అంటూ వున్నా, మానసికంగా మాత్రం నేనే దేహం అన్న అభిప్రాయం తో ఉంటాం.
ఆలా కాకపోతే వయసు పెరిగిపోతోందని ఎందుకంత ఆరాట పడతాం? జుట్టు కొంత నేరుస్తూవున్న లేక బట్టతల అయిపోతూ వున్నా మన ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఇక బాగా అందంగా వున్నవాళ్ళకయితే, వయసుతో పాటుగా ఆ అందం తరిగిపోతూ ఉంటే కలిగే బాధ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే అందంగా లేనివాళ్లు ఈ విషయంలో చాలా సుఖపడతారు. వయసుతో పాటుగా అందం పోతోందన్న బాధ వాళ్ళకి ఉండదు. మనం దేహమే అన్న అభిప్రాయం లేకపోతే మనం ఇలా ఎందుకు ఆరాట పడిపోతాం?
కాకపోతే మనం దేహం అనుకోవడానికి మనకి కేవలం దేహం మీద వున్నా మమకారం మాత్రమే కారణం కాదు. ఈ దేహంలో ఆలోచనలకి కారణం అవుతూన్నదానికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఏ ఐడెంటిఫికేషన్ లేకపోతే అది వుండలేదు. దానికి అతి సమీపంలో వున్నది దేహం. కాబట్టి అది నేను దేహం అనుకుంటుంది. కాబట్టి దేహంలో వచ్చే మార్పులు, జరిగేవన్నీ నాకు జరుగుతున్నవి అనుకుంటుంది.
అయితే నేను దేహం కాదు అన్న భావన కలిగించడం మరీ అంతా పెద్ద కష్టం కాదు. కొచం విచారణ సరిపోతుంది. నా దేహం అంటున్నాడు కానీ నేనే దేహం అనటం లేదు. అలాగే గాఢ నిద్రలో ఈ దేహం తెలియడం లేదు. దేహమే నువ్వయితే ఈ దేహం ఎప్పుడు నీకు తెలుస్తూ ఉండాలి. అలాగే దేహానికి సంబందించిన ఎంతో సమాచారం నీకు తెలియదు. నీ కిడ్నీలు ఎలా పనిచేస్తాయో నీకు తెలీదు. నీ గుండె ఎలా పనిచేస్తుందో నీకు తెలియదు. నీ రక్తం ఎందుకు ఎర్రగా ఉందొ నీకు తెలీదు. నీ కళ్ళు ఎలా చూడగలుగుతూ ఉన్నాయో కూడా నీకు తెలియదు.
అయ్యో వాటి గురించి నాకు తెలియకపోవడం ఏమిటి, అంటావేమో. ఎలా తెలిసాయి అవన్నీ నీకు? నీకు స్కూల్లో టీచర్ చెప్పి వుంటారు, లేకపోతే పుస్తకాల్లో చదివి ఉంటావు లేదా విని ఉంటావు. ఏది ఏమైనా మరొకరకంగా నీకా విషయాలన్నీ తెలిసివచ్చాయే కానీ నువ్వే దేహం అయినందువల్ల నీ అంతటా నీకుగా తెలిసిన విషయాలు కావు. నిజంగా నువ్వే దేహం అయితే ఇన్ని విషయాల్లో దేహానికి సంబంధించి నువ్వెందుకు అజ్ఞానంలో వున్నావు?
ఇలాగ కాస్త విచారణ చేసి నేను దేహం కాదన్న ఆలోచనకి త్వరగానే వచ్చేవచ్చు. కానీ పెద్ద ఇబ్బంది ఇక్కడే వుంది. ఒకసారి దేహం నేను కాదు అన్న నిర్ధారణకి వచ్చాక వెంటనే వచ్చే ప్రశ్న, నేను దేహం కాకపోతే మరెవరు? ఏదైతే ఈ దేహంలో ఆలోచనలోకి, భావాలకి కారణం అవుతూ ఉందొ దానికి ఏదోఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చేవరకూ ఊరుకోదు.
ఇప్పటివరకూ మనం ఒక విషయం చర్చలోకి తేలేదు. అది మనస్సు. చాలా ముఖ్యమైనది. మన అందరిలోనూ వుంది ఇంకా అదిలేకపోతే ఏదీ లేదు. సరే నువ్వు దేహం కాదు కానీ మనస్సు అనడానికి ముందు ఈ మనస్సు అంటే ఏమిటో ఆలోచిద్దాం.
ఒక బాగా ప్రాచుర్యంలో వున్నా మాట వినే వుంటారు. మనస్సంటే వేరే ఏమీ కాదు ఆలోచనల మూట అని. అంటే దానర్ధం ఆలోచనలన్నిటిని కలిపి మనస్సు అంటున్నాం. కాకపోతే మనలో ఆలోచనలతో పాటుగా భావాలూ కూడా ఉంటాయి కాబట్టి ఆలోచనల, భావాల మూట మనస్సు అనుకుందాం. దారాలన్నిటిని కలిపి వస్త్రం అంటున్నట్టుగా. దారాలన్నిటిని తీసేస్తే వస్త్రం లేదు. అలాగే ఆలోచనలు, భావాల్ని తీసేస్తే మనసు లేదు. 'నేను' మనస్సు అని నువ్వన్నావంటే, 'నేను' ఆలోచనలు ఇంకా భావాలూ అని నువ్వంటున్నావన్న మాట. ఈ ఆలోచనలు, భావాలూ ఎప్పుడూ ఉండేవి కాదు, ఇంకా రక రకాలుగా మరి పోతూ ఉంటాయి. ఇంకా ఘాడ నిద్రలో ఈ మనసు తాలూకు ఉనికి కూడా ఎక్కడా ఉండదు. మరి మనసే నువ్వయితే ఘాడ నిద్రలో కూడా తెలియాలి కదా. మరి ఎక్కడికి పోతూంది అప్పుడు?
అందువల్ల 'నేను' దేహం కాదు, 'నేను' మనస్సు కూడా కాదు. మరి నేనెవరు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసే వరకు నువ్వు నిశ్చింతగా ఉండలేవు. దేహంతోనే, మనసుతోనే లేదా ఈ రెండిటితోనే ఐడెంటిఫికేషన్ జరిగిపోవాలి. అప్పుడే నీకు మనోశాంతి కలిగేది. ఆలా కలిగేటటువంటి మనోశాంతి ఎప్పుడూ వుండే మాట అయితే అందుకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇలా కలిగే మనోశాంతి ఎప్పుడూ ఉండదు.
దేహమే నేను అన్న భావం దేహం బాగున్నంత కాలం బాగుంటుంది. కానీ ముసలితనం వచ్చేసినప్పుడు, దేహం ఏమైనా వ్యాధులు అవీ వచ్చి బాధ పడుతూ వున్నప్పుడు ఇది బాగుండదు. దేహం తో సంబంధం లేకుండా మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే మాత్రం నేను దేహం అన్న భావం నుండి ఎంత త్వరగా బయటపడితే అంతా మంచిది. నిజంగానే నేను దేహం కాదు అన్న భావన నిన్ను చాలా బాధలనుండి బయట పడేస్తుంది.
మనసే నేను అన్న భావన కూడా మనసు బాగున్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ మనసు ఆందోళనలకు లోనయినప్పుడు, ఆవేదనలో వున్నప్పుడు ఇది బాగుండదు. కాబట్టి మనసు నేను కాదు అన్న భావననుంచి బయటకి రావడం కూడా ఆనందంగానూ, సుఖంగానూ ఉంటుంది. పైన చెప్పిన ప్రకారంగా ఆలోచిస్తూ ఉంటే దేహమే నేను, మనసే నేను అన్న ఆలోచనలనుండి బయటకి రావడం కష్టమేమి కాదు.
కానీ అసలు ఇబ్బంది, ఈ దేహంలో ఆలోచనలోకి, భావాలకి కారణం అవుతూ వున్నది ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. నువ్విది అని చెప్పేవరకూ అది ఊరుకోదు. మరేం చెయ్యాలి. ఒప్పించడం కష్టమే కానీ ఈ కింద ప్రకారంగా మళ్ళీ మళ్ళీ చెప్పి తీరాలి.
'నేను దేహం కాదు. నేను మనసు కూడా కాదు. నేను కనిపించే, తెలిసే ఏ విషయ వస్తువు కూడా కాదు. కానీ నేను ఉనికిలోనే వున్నాను. ఎలా వున్నాను అంటే ఇలా వున్నాను అని చెప్పడానికి అవకాశం లేకుండా వున్నాను.'
అవును, అదే నిజం. నువ్వు ఎలా వున్నావు అంటే ఇలా వున్నావు అనడానికి ఏ ప్రకారముగాను అవకాశం లేకుండానే వున్నావు. కానీ నువ్వు వున్నావు అనడానికి ఈ శరీరంలో వచ్చే ఆలోచనలు, భావాలూ మాత్రమే ఆధారం.ఒకచోట విద్యుత్తు వుంది అందానికి ఏమిటి ఆధారం? విద్యుత్హుని ఆధారం గా చేసుకుని వెలిగే బల్బు, ఫ్రిడ్జ్ ఇంకా ఫ్యాన్ లాంటివి మాత్రమే ఆధారం. అవి పనిచేస్తూ ఉంటే విద్యుత్ వుంది అంటాం. వేరే ప్రకారంగా విద్యుత్ వుంది అని ఎలా చెప్పగలం? శరీరంలో ఆలోచనలు, భావాలూ లాంటివి వస్తూ ఉంటే, అవి రావడానికి కారణం నువ్వు వున్నావు అంటాం. వేరే ప్రకారంగా ఏది నిన్ను తెలుసుకోవడానికి మార్గం లేదు.
రచయిత పరిచయం
రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై ఏడు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా పేపర్ బాక్స్ గా అమెజాన్ లాంటి పాపులర్ ఆన్ లైన్ వెబ్సైట్లు లో లభ్యం అవుతూ వున్నాయి. ఈయన వ్రాసిన మొత్తం అన్ని ఇంగ్లీష్ పుస్తకాల లోని పదాల సంఖ్య నలభై లక్షల పైమాటే. ఈయన పుస్తకాలని ఇంగ్లీషులో వ్రాసినా, అవన్నీ తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు వాళ్ళకి సంభందించినవే. ఇంగ్లిష్ లో రాసిన నలభై ఏడు పుస్తకాలూ కాకుండా, ఈ రచయిత తెలుగు లో రాసిన పుస్తకాలు ‘నిరుపమ’ 'నులివెచ్చని వెన్నెల', ‘ఆ ఊరి పక్కనే ఒక ఏరు’, ఇంకా ‘అరె ఏమైందీ?’ లవ్, సస్పెన్స్ అండ్ రొమాంటిక్ థ్రిలర్స్: రచయిత ఫోన్ నం:97019 37966: ఈ మెయిల్: kotrasivaramakrishna@gmail.com
