STORYMIRROR

Kotra Sivaramakrishna

Others

4  

Kotra Sivaramakrishna

Others

నిశ్చలతత్వే జీవన్ముక్తిహి

నిశ్చలతత్వే జీవన్ముక్తిహి

3 mins
248

నిశ్చలతత్వే జీవన్ముక్తిహి

(మనసు లేకపోవడమే మోక్షం)

మనోశాంతి ఎలా లభిస్తుంది?

మనోశాంతి అన్న పదంలో అర్ధం లేదు. మనసున్నంతకాలం మనోశాంతి ఉండదు. మనసు లేని స్థితి కావాలి.

మనసు లేని స్థితి ఎలా లభిస్తుంది?

మనసు లేని స్థితి లభించాలంటే ముందు మనస్సంటే ఏమిటో తెలియాలి

మరి మనస్సు అంటే ఏమిటి?

ఒక ప్రాచుర్యం పొందిన మాట ఉంది. అదేమిటంటే మనస్సంటే కేవలం ఆలోచనల మూట. ఇదేలాగంటే దారాలతో ఏర్పడ్డ వస్త్రం లాగా. దారాలన్నీ తీసేస్తే వస్త్రం లేదు. అలాగే ఆలోచనలన్నీ తీసేస్తే మనసు లేదు. అర్ధం చేసుకోవలసిందేమిటంటే మనసని ప్రత్యేకంగా ఏమీ లేదు. కేవలం ఆలోచనలన్నిటిని కలిపి మనసంటున్నాం.

ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? మనస్సు ఆలోచనలోకి కారణం కాకపోతే, ఆలోచనలే మనస్సుకి కారణం అయితే, మరి ఆలోచనలకి కారణం ఏమిటి?

అలలకి కారణం ఏమిటి? సముద్రం. అలాగే ఈ ఆలోచనలకి కారణం నువ్వే. మనస్సు కాదు.

మరి నాకు నేను ఎందుకు తెలియడం లేదు? కేవలం ఆలోచనలు మాత్రమే ఎందుకు తెలుస్తున్నాయి?

కళ్ళు తమని తాము చూసుకో లేవు. అలాగే నిన్ను నువ్వు చూసుకో లేవు.

మరి నాకు నేను తెలిసేదెలా?

నీకు నువ్వు తెలియాలంటే ఎలా తెలియాలి? ఎలా తెలియాలని నువ్వనుకుంటున్నావు?

నేను అన్నిటిని ఎలా తెలుసుకుంటున్నానో నన్ను నేను కూడా అలాగే తెలుసుకోవాలనుకుంటున్నాను.

అన్నిటిలా నీకు నువ్వు తెలియబడ్డానికి అన్నిటిలా నువ్వు లేవు. నువ్వు తెలుసుకునే విషయాలికి రూపం వుంది, అవి స్థలం ఆక్రమిస్తాయి, ఇంకా అవి అణువులుతో చేయబడ్డాయి. కానీ నీకు రూపం లేదు, నువ్వు స్థలాన్ని ఆక్రమించవు, నువ్వు అణువులుతో చేయబడి లేవు. కాబట్టి అన్నిటిని నువ్వు తెలుసుకునే విధంగా నీకు నువ్వు తెలియబడవు.

నాలో సంతోషం, అహంకారం, మొదలైన వాటికీ రూపం లేదు, అవి స్థలాన్ని ఆక్రమించి లేవు, అణువులుతో చేయబడి లేవు, కానీ అవి నాకు తెలుస్తున్నాయి. అలాంటిప్పుడు నాకు నేను ఎందుకు తెలియడం లేదు.

మంచి ప్రశ్న. ఈ సంతోషం, అహంకారం లాంటివన్నీ నీ నుండి వేరుగా వున్నాయి. కాబట్టి అవి నీకు తెలుస్తున్నాయి. నువ్వు నువ్వే అయివుండి వేరుగా లేనప్పుడు నీకు నువ్వు ప్రత్యేకంగా తెలియబడవు. ఇక్కడ ఒక ముఖ్య విషయం నీకు తెలియాలి.

ఏమిటది?

ఏ విషయం అయినా నీకు ప్రత్యేకంగా తెలియాలంటే అది నువ్వే కాకుండా ఉండాలి. నువ్వే అయినది నీకు ప్రత్యేకంగా తెలియదు.

నా శరీరం నాకు తెలుస్తూంది.

నువ్వు నా శరీరం అంటున్నావు. నేనే శరీరం  అనడం లేదు. నువ్వు శరీరం కన్నా వేరుగా వున్నావు. కాబట్టే శరీరం నీకు తెలుస్తూంది. అలాగే ఆలోచనలు, భావాలూ లాంటివి నీనుండి వేరుగా వున్నాయి. కాబట్టి అవి నీకు వేరుగా తెలుస్తున్నాయి.

మరి నాకు నేను తెలిసే అవకాశమే లేదా?

నీకు నువ్వు ప్రత్యేకంగా తెలిసే అవకాశం లేదు. నీకు నువ్వు అనుభూతం కాగలవు అంతే. అందుకే ఆత్మానుభూతి వుంది, ఆత్మ సాక్షాత్కారం లేదు.

మరి ఈ ఆత్మానుభూతి పొందేదెలా?

ఈ ఆత్మానుభూతి అన్నది నీకు ఎప్పుడూ ఉంది. ఇది ఒకప్పుడు వుండి ఒకప్పుడు పోయేది కాదు. కాకపోతే ఈ జీవత్వ బ్రాంతి వల్ల లేదు అనిపిస్తూంది. ఇక్కడ ఆత్మానుభూతి పొందడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. జీవత్వ భ్రాంతి పోగొట్టుకోడానికి ప్రయతినిస్తే చాలు. ఇక్కడ నేను నీకు ఒక ఉదాహరణ చెపుతాను.

వినాలని కుతూహలంగా ఉంది.

ఒక గొప్ప ధనవంతుడు వున్నాడు. అంతా ఆనందమయ జీవితమే అతనికి. విచారం ఏమీ లేదు. ఒక రోజు తన గదిలో హాయిగా నిద్రపోతున్నప్పుడు తాను కటిక పేద వాడయిపోయినట్టు కల వచ్చింది. నానా కష్ఠాలు పడుతున్నాడు ఆ కలలో. ఇప్పుడు కావాల్సినదేమిటి?

అతను ఆ కల నుండి బయటపడితే చాలు.

అతను ధనాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు. కష్టపడాల్సిన అవసరం లేదు. జరగాల్సిందిల్లా ఆ స్వప్నం నుండి బయటకి వస్తే చాలు. అతని కష్టాలన్నీ తీరినట్టే. ఇక్కడ జరగాల్సిందల్లా ఒక్కటే. నువ్వు జీవత్వ భ్రాంతినుండి బయటికి వస్తే చాలు, నీ కష్టాలన్నిటినుండి బయటికి రావచ్చు.

మరి నేను నా జీవత్వ భ్రాంతినుండి ఎలా బయటికి రాగాలను?

ఒక విషయం చెప్పు. స్వప్నానికి కారణం ఏమిటి?

స్వప్నానికి కారణం నిద్ర.

అలాగే జీవత్వ భ్రాంతికి కారణం అజ్ఞానము. అజ్ఞానము నుండి బయట పడితే జీవత్వ భ్రాంతి పోతుంది.

మరి ఈ అజ్ఞానము నుండి నేనెలా బయటపడాలి?

అంతకన్నా ముందుగా నువ్వడగాల్సిన ప్రశ్న అసలు అజ్ఞానం అంటే ఏమిటి. అజ్ఞానము అంటే ఏమిటో తెలుసుకోకుండా అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోగలవు?

సరే. అజ్ఞానం అంటే ఏమిటో సెలవివ్వండి.

నేను శరీరం అనుకుంటున్నావు. ఇది అజ్ఞానం. ఈ శరీరం కారణంగా ఏర్పడ్డ బంధుత్వాలన్నీ నిజంగా నీకు బంధుత్వాలనుకుంటున్నావు. ఇది అజ్ఞానం. ఈ శరీరం లో తెలుస్తున్న 'నేను' అన్నది ప్రత్యేకంగా ఉందనుకుంటున్నావు. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానాలన్నిటినుండి ముందు నువ్వు బయటపడాలి.

సరే. ఈ అజ్ఞానాలన్నిటినుండి నేను బయటపడే మార్గం సెలవివ్వండి.

చీకటినుండి బయటపడడానికి కావల్సినిదేమిటి? వెలుతురు. అలాగే అజ్ఞానము నుండి బయటపడడానికి కావలసింది జ్ఞానం. నేను శరీరం, ఈ శరీరం ద్వారా ఏర్పడ్డ బంధుత్వాలన్నీ నా బంధుత్వాలు, ‘నేను’ అని ప్రత్యేకంగా వుంది అన్న భావం నుండి నువ్వు బయట పడాలి.  

'నేను' అని ప్రత్యేకంగా ఏమీ లేనే లేదా?

'నేను' అని ప్రత్యేకంగా ఏమీ లేదు. ‘మనస్సు’ అనే చెరువులో పూసిన కలువ పువ్వుఈ ‘నేను’. చెరువు ఎండిపోతే కలువ పువ్వు ఎండిపోతుంది. ‘మనస్సు’ ఎండిపోతే ఈ ‘నేను’ కూడా ఎండిపోతుంది. ముందే చెప్పుకున్నాం. మనస్సని ఏమీ లేదు కాబట్టి ‘నేను’ అని కూడా ఏదీ లేదు. ఈ నేను అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే, ఒక భావన మాత్రేమే.

ఈ ‘నేను’ అన్న భావన కలుగుతున్నదెవరికి? సూన్యంలో భావాలూ, ఆలోచనలు కలుగలేవు కదా.

తెలివైన ప్రశ్న. ఇదే ప్రశ్న నువ్వు తరుచు అడుగుతూవున్న కూడా ఆ చైతన్యాన్ని చేరుకోగలవు. నువ్వు చెప్పినట్లుగా సూన్యంలో ఏది ఏర్పడదు. అలాగే ఈ భావాలూ, ఆలోచనలకి కూడా ఆధారం ఒకటి ఉంది.

అదెలా తెలుసుకోవడం?

భావాలూ, ఆలోచనలు ఇంకా ఆ చైతన్యానికి ఉన్న సంబంధం అలలు ఇంకా సముద్రానికి ఉన్న సంబంధం లాంటిది. సముద్రం విస్తృతి చాల ఎక్కువ. అలలు సముద్రం చివరలో మాత్రమే ఏర్పడతాయి. అలాగే ఆ చైతన్యం విస్తృతి చాల ఎక్కువ. ఎక్కువేమిటి అనంతం. కానీ ఈ భావాలూ, ఆలోచనలు కి ఆధారం మాత్రం ఆ చైతన్యం మాత్రమే. 

అంటే నేనే చైతన్యం, ఆ చైతన్యమే నేను అన్న స్పృహ కలగాలి, అంతే కదా.

ఆ స్పృహ కూడా ఎప్పుడూ వుంది. ప్రత్యేకంగా కలగాల్సిన అవసరం లేదు.

మరింకిప్పుడు జరగాల్సినదేమిటి?

ముందు చెప్పుకున్నదే. మనసులేని స్థితికి రావాలి. మళ్ళీ ఇంకో ప్రశ్న వేయకు. ఇప్పటివరకు చదివింది జాగ్రత్తగా చదువు. మళ్ళీ మళ్ళీ చదువు. విషయాన్నిఅర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. మనసు దానంతటదే మాయం అయిపోతుంది.


Rate this content
Log in