ఉదయబాబు కొత్తపల్లి

Drama

4  

ఉదయబాబు కొత్తపల్లి

Drama

జగమంత కుటుంబం నాది !(కధ)

జగమంత కుటుంబం నాది !(కధ)

7 mins
724


''పిల్లలూ. మనింటికి ఎవరొచ్చారో చూడండి.!" ఆ ఇంటి మండువా లోగిలిలోకి అడుగుపెడుతూ చైతన్య అన్న మాటలకి ముద్దబంతుల్లాంటి ఇద్దరమ్మాయిలు''డాడీ'' ఆంట్ పరుగెత్తుకు వచ్చి తండ్రిని కౌగలించుకోబోతూ వెనుక 'నన్ను' చూసి మరింతగా అతుక్కుపోయారు వాళ్ళ నాన్నని.

''ఎవరు డాడీ?'' పెద్ద పాప కాబోలు అడిగింది. 

''మనింటికి ఎవరిని తీసుకొస్తానని చెప్పాను?'' చైతన్య కొంటెగా అడిగాడు.

''తా...తాతయ్య... తాతయ్యేనా?'' అంది సంభ్రమాశ్చర్యాలతో.

''అవునమ్మా. నేనే..తాతయ్యను. మిమ్మల్ని చూడాలి వచ్చానమ్మా." అన్నాను అక్కడే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటూ.

చూపిన పొడుగు దగ్గరకు చెంగు చెంగున గెంతి వస్తున్న ఆవుదూడల్లా ఇద్దరు పిల్లలూ నా దగ్గరకు వచ్చి కరుచుకుపోయారు. 

''తాతయ్యా. ''అంటూ వారి ఆత్మీయతతో అనుభూతి లయమై- నా ఒళ్ళు ఝల్లుమంది. ఎంతకాలమైంది ఏ పిలుపు విని...ఆర్ద్రతతో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి.

రెండు నిముషాలు వారిద్దరినీ చెరొకపక్క హృదయానికి హత్తుకుని అవ్యక్తానందం అనుభవించాను. ..కోటానుకోట్ల క్షణాల తర్వాత. 

అంతలో నా భుజం మీద చెయ్యి పడిన స్పర్శ కు తలెత్తాను. 

ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో చైతన్య. 

''నేను చెప్పానుగా డాడీ. చూసారా. మీ ప్రేమకోసం వీళ్ళు ఎంతగా తపించిపోతున్నారో...నాకు ఇపుడు..ఇపుడు చాలా ఆనందంగా ఉంది డాడీ." అంటూ కళ్ళు తుడుచుకుని, ''ప్రణతీ'' అంటూ భార్యను పిలిచాడు.

''ఎంతసేపయిందండీ వచ్చి? '' అంటూ నన్ను చూసి విస్మయంగా అడిగింది''బాగున్నారా మామయ్యా?''

''జస్ట్ ఇపుడే. రా. డాడీ కాళ్లకు నమస్కరించు.'' అన్నాడు

భుజం చుట్టూ పమిట కప్పుకుని చైతన్యతో పాటు నా పాదాలకు నమస్కరించింది ప్రణతి. 

నా కళ్ళు మరో వ్యక్తి కోసం వెతకడం గమినించి చైతన్య అన్నాడు. 

''అమ్మకోసమేనా డాడీ మీరు వెతికేది. అమ్మ...అమ్మ.. వాళ్ళ చెల్లిగారింటికి వెళ్ళింది. రెండు రోజుల్లో వచ్చేస్తుంది.'' చైతన్య మాటల్లో కంగారుకు ''అవును మామయ్యా.'' అంది ప్రణతి కూడా తొట్రుపాటుతో.

''వెళ్ళు ..వెళ్ళు . ఆయనకీ స్నానానికి నీళ్లు పెట్టి కాఫీ పట్టుకురా.'' అని భార్యను తొందర చేసాడు చైతన్య.

''అలాగే..అలాగే. ఆ వాతావరణంలోంచి సాధ్యమైనంత తొందరగా తప్పుకోవాలన్న ఆత్రుతతో ప్రణతి లోపలి వెళ్ళిపోయింది.

''పిల్లలూ. మీరు తాతయ్యతో ఆడుకుంటూ ఉండండి. డాడీ. కాఫి తాగాక స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండి. నేను స్నానం చేసి బయటకు వెళ్లొస్తాను .''అనేసి చైతన్య తన గదిలోకి వెళ్ళిపోయాడు.

''తాతయ్య. ఇంతకాలం ఎక్కడికి వెళ్లిపోయావ్ తాతయ్యా?;;అంది పెద్దపాప.

''నీ పేరేంటి తాతయ్యా?'' అప్పటివరకు నన్ను అపురూపంగా పరిశీలిస్తున్న చిన్నపాప అడిగింది.

''తాతయ్య...అని నాన్న చెప్పారు కదే మొద్దూ..'' అంది పెద్దపాప.

''అది అంటారూ పిలుచుకునే పేరు. నేను తాతయ్యని రాసుకునే పేరు అడిగాను. నువ్వే మొద్దువి..కదా తాతయ్యా!" అంది చిన్నపాప.

ఎవరివైపు చెప్పినా ప్రమాదమే. అప్పటికే వాళ్లిద్దరూ నా తెల్లమీసాలను రెండు చివర్లా మెలి తిప్పుతున్నారు. 

''నాపేరు చంద్రశేఖరం రా. ఇది నేను రాసుకునే పేరు. తాతయ్య అన్నది మీరు పిలుచుకునే పేరు.''అన్నాను.

''నేను చెప్పానా. నీ పేరు కంటే నువ్వే చాలా బాగున్నావ్ తాతయ్యా.''అంది చిన్నపాప.

''ఏంకాదు. తాతయ్యపేరే బాగుంది.'' అంది పెద్దపాప.

''కాదు. తాతయ్య బాగున్నాడు.''

''కాదు.పేరే బాగుంది.''

ఇద్దరూ వాదనకు దిగారు .

''అబ్బబ్బ, రెండూ నేనే కదమ్మా. . అవునా కాదా? '' అన్నాను లౌక్యంగా. 

ఇద్దరూ వాదన ఆపి తలలూపారు. 

అంతలోనే కాఫీతో వచ్చింది ప్రణతి.

''స్నానానికి వేడినీళ్లు కాగుతున్నాయి మామయ్యా. ముందు కాఫీ తీసుకోండి.''

''నువ్ కాఫీ తాగుతూ విను తాతయ్యా. నేను మా స్కూల్ విశేషాలు బోలెడు చెబుతాను.'' అంది చినపాప.

''నువ్వేనేంటి ? నేనూ మా ఫ్రెండ్స్ కబుర్లు ఎన్నో చెబుతాను.''అంది పెద్దపాప.

''అబ్బా. అలా దెబ్బలాడుకోకండర్రా.''అన్నాను వెచ్చని కాఫీని సిప్ చేసి.

''ఇది దెబ్బలాట కాదు తాతయ్యా. పోటీ ఉన్నప్పుడే గా బాగా చెప్పాలనిపిస్తుంది. ఎవరు బాగా చెప్పామో విని నువ్ బహుమతి ఇవ్వాలి.'' అంది చినపాప.

''గడుగ్గాయిలు'' అనేసి నవ్వుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది ప్రణతి.

నేను పిల్లల కాలక్షేపంలో పడ్డాను. 

*********

మధ్యాహ్నం భోజనం చేసి విశ్రమించాను. 

కలత నిద్రలో ఎవరో ' మా ఇంటికి 'రా అని లాక్కుపోతున్నారు. అందరూ పిల్లలే. హఠాత్తుగా మెలకువ వచ్చింది. మనవరాళ్లు ఆదుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నారు. '

పక్క గదిలోంచి నెమ్మదిగా వినిపించినా తీవ్రంగానే ఉన్నాయి మాటలు. 

''ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు.ఎప్పుడొస్తారో చెప్పరు.ఆ అప్పుల వాళ్ళకి, చీటీలు కట్టే వాళ్లకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. మొత్తం అందరికీ కలిపి పదివేలకు పైగా వడ్డీ కట్టాలి. మీకేమో చీమ కుట్టినట్టైనా ఉండదు. ఆవిడ తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాలు అని తిరుగుతుంది. ఎపుడో మీకు చెప్పకుండానే ఉరేసుకు చస్తాను. అపుడు తెలుస్తుంది నావిలువ.'' ప్రణతి అంటోంది.

''అబ్బబ్బ. నీతో వేగలేక చస్తున్నాను. ఉద్యోగం రాకుండా పెళ్లి వద్దు మొర్రో అంటే వినలేదు మా అమ్మ. పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనకపోతే ఎదో లోపం ఉందనుకుంటార్రా సన్నాసీ...అని తినేస్తుంటే రెండేళ్ల తేడాతో ఇద్దరూ ఊడిపడ్డారు. మనిషికి మనిషి పెరిగే కొద్దే ఖర్చులు. నేను మాత్రం ఏంచెయ్యను?''

''ఏంచేస్తారు? మళ్ళీ వెళ్ళిపోయి ఓ వారం రోజుల తర్వాత వస్తారు. ఎక్కడకి, ఎందుకు వెళ్తారో తెలీదు. ఈలోగా నేను ఇక్కడ కుక్కకాట్లకు చెప్పుదెబ్బలు తినాలి. అది సరే. ఎన్ని రోజులుంటారాయన? ఎన్ని రోజులుంటే నాకెందుకు గానీ ఓ పదివేలు సాయం చేస్తాడేమో అడగండి.''

''పిల్లలు తాతయ్య కోసం అలమటించిపోతుంటే బ్రతిమాలగా, బ్రతిమాలగా వచ్చాడు. నువ్వేం కంగారు పడకు. ఏదో విధంగా ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ప్లీజ్ ప్రనూ. అర్ధం చేసుకో..''

''డబ్బు లేకుండా ఇంటికొస్తే మాత్రం ఊరుకునేది లేదు.''

''సరే. ఆయన లేస్తాడేమో. జాగ్రత్తగా మేనేజ్ చేయి. నా గురించి అడిగితె రాత్రికి గానీ రాదు అని చెప్పు.'' సంభాషణ ఆగిపోయింది.

అన్ని మాటలు విన్న నేను నిత్తోర్చాను. 

ఈ ప్రపంచంలో అందరికీ లేదా ప్రతీ ఒక్కరికీ ఎదుటివారి దగ్గరున్న వాటిల్లో ఒక్కటైనా కావాలి. 

ఔదే పుట్టిన బిడ్డకు తల్లి పాలు కావాలి. తల్లి లేని బిడ్డకి ఆలంబన కావాలి. ఆలంబన దొరికినవాడికి అవసరాలు తీర్చే డబ్బు కావాలి. డబ్బుసంపాదించే మార్గాలు కావాలి. మార్గాలు దొరికినవాడికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి పెట్టినవాడికి లాభాలు కావాలి. లాభాలు వచ్చిన వాడికి సౌఖ్యాలు కావాలి. సుఖాలు మరిగిన వాడికి చివరికి ఒంటరితనం కావాలి. ఒంటరిగా మిగిలినవాడికి చివరికి మనస్సాన్తి కావాలి. ఇలా ప్రతీవాడికీ ఎదో కావాలి. అలా కావాలనే తానూ అంగీకరించి ఇక్కడకు వచ్చాడు. ఎన్ని కోట్లు గుమ్మరిస్తే ఆ పిల్లలు మూడు గంటలపాటు అందించిన ఆనందం దొరుకుతుంది? మనిషి మనుగడకు సంజీవనిలా పనిచేసే ప్రేమను కూడా డబ్బు పెట్టి కొనుక్కునే దౌర్భాగ్యం రావడం ఎంతటి దురదృష్టం? 

నా ఆలోచనలకు అంతరాయం కలుగుతూ అలికిడి అయింది. 

వెంటనే కళ్ళు మూసుకున్నాను. 

నేను పడుకున్న గదిలో ఏవో ఏవో చిన్న చిన్న చప్పుళ్ళు .అనంతరం వెళ్ళిపోయిన చప్పుడు. 

అయిదు నిముషాల అనంతరం కళ్ళు తెరిచాను. 

ఈవయసులో తప్పు చేస్తున్నానా? 

ప్రమీల నాతొ ముప్పై సంవత్సరాలు కాపురం చేసి కాలగతిలో కలిసిపోయింది. 

తరువాత నా జీవితం, నందు ఐశ్వర్య ల దగ్గరే గడిచింది. 

తమ ఇద్దరికీ వచ్చే జీతాలతో స్థాయికి మించిన విలాస జీవితానికి అలవాటు పడ్డ ఇద్దరూ అనునిత్యం పోట్లాడుకుంటూ ఉంటె నా పెన్షన్ ఏ .టి .ఎం. కూడా అప్పగించేసాను. 

నాకంటూ ఆ ఇంట్లో మిగిలిన ఆశ సుష్మ తల్లి. నా బంగారు తల్లి. 

''తాతయ్యా.. నీకు అది తెలుసా..ఇది తెలుసా...'' అని ప్రతీదీ పూస గుచ్చినట్టు అడిగేది.

''ఈవయసులో తెలుసుకోవడం నాకు అవసరమా అమ్మా?'' అని అడిగేవాడిని.

''ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా తెలిసింది ఆవగింజలో అణువంత మాత్రమే. అందుకే అనుక్షణము తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. బాల్యం లోనే బీజం పడాలి - అని నువ్వు చెప్పిన మాటలే కదా తాతయ్యా..నేను ఆచరిస్తున్నాను. ఈ కంప్యూటర్ ప్రపంచం ఇంతవరకు మీకు తెలియంది. తెలియని ఎన్నెన్నో విషయాలను తనలో దాచుకున్న తరగని నిధి. మీకు ఆధ్యాత్మికత, సాహిత్యం ఇష్టం కదా. అవన్నీ చూసుకోండి - '' అని ఏ ఏ వెబ్సైటు లో ఎలా సైనప్ అవ్వాలో, ఎలా లాగిన్ అవ్వాలో...అన్న విషయాల దగ్గరనుంచి నా అభిప్రాయం తెలుగులో టైపు చేసి ఎలా పి.డి. ఎఫ్. ఫైగా పంపాలో..అటువంటి అన్ని విషయాలనూ నేర్పించింది.''

''ఎంతసేపూ ఆ ముసలాయనతో కబుర్లు, పుస్తక పఠనం. అసలు క్లాస్ పుస్తకాలు ఎపుడు చదువుతావో తెలీదు. ఆ కాలం చెల్లిపోయిన వాళ్లతో కూర్చుని భవిష్యత్తు తగలెత్తుకోకు.'' అని ఐశ్వర్య నా ముందే నిష్కర్ష గా చెప్పడం విని భరించాను - నా కొడుకు ముఖం చూసి.

ఆత్మాభిమానానికి కూడా ఓ పరిధి ఉంటుంది ఎంతటి ప్రాణికైనా. అది హద్దు దాటితే మన ఆత్మ సంరక్షణ కోసం మనమూ తలా విదల్చక తప్పదు. 

నా పెన్షన్ ఏ. టీ .ఎం. కార్డు అడిగేసాను. 

''మీ నెత్తిన కట్టుకుని ఊరేగండి. అది మీరు తీసుకున్నాకా ఇక్కడే ఉండాల్సిన పనిలేదు. మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు.''అంది ఐశ్వర్య చాలాకోపంగా.

''ఏం మాట్లాడుతున్నావ్? ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్తారు?''నందు అడ్డుపడ్డాడు.

'' ఆ జ్ఞానం ఆయనకుండాలి. తలా కొరివి పెట్టవలసిన కొడుకు ఇంట్లో అణగి మానగి ఓ మూల కూర్చోవాల్సిందే. అంటే తెప్ప నా పిల్ల చదువు పాడుచేస్తే, ఆయన్నే కాదు ఎవరినీ క్షమించను. అసలు దాన్ని అనాలి. అన్ని అవసరాలు తీర్చి అనుక్షణం దాని ఉన్నతికోసం ఆరాటపడుతున్న మనల్ని వదిలేసి''తాతయ్యా''అంటూ వేలాడిపోతుంది. ఇలా కాదు. సాయంత్రానికి దాని పని చెబుతా. అనేసి వెళ్లి ఆ సాయంత్రమే కార్పొరేట్ కాలేజీ హాస్టల్ లో సుష్మ ను చేర్పించేసింది.

ఇక ఆ ఇంట్లో నా ఉనికి సూన్యమనిపించింది. ఇంతలో చైతన్య 'మాఇంటికి రండి డాడీ. అన్నయ్య లేకపోతె నేను లేనా? '' అనడంతో ఇక్కడకు రావడం జరిగింది. 

దీర్ఘంగా నిట్టూర్చిన అనంతరం లేచి షార్ట్ వేసుకుని హాల్లోకి వచ్చాను. ఇల్లు ప్రశాంతంగా ఉంది. 

''లేచారా మామయ్యా.'' అంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది ప్రణతి.

''పిల్లలేరమ్మా?''

''మీరు అలసిపోయి పడుకున్నారు కదా. నాలుగైదు సార్లు వచ్చి చూసి తాతయ్య ఇంకా లేవలేదు అనుకుని ఆటలకు వెళ్లిపోయారు మామయ్యా. ఇక ఆయన పొద్దున్న వెళ్ళినాయనఇంతవరకూ ఇంటికే రాలేదు. కష్టపడకపోతే నాలుగు వేళ్ళూ లోపలికి వెళ్లవు కదా మామయ్యా. టీ తెస్తానుండండి.'' అని లోపలి వెళ్ళింది. ఆమె ఇచ్చిన టీ తాగి 'అలా బయటకువెళ్ళొస్తానమ్మా' అన్నాను.

''సరే మామయ్యా.'' అంది ప్రణతి.

గేటు దాటి బయటకు రాగానే ఒక నలభై ఏళ్ల మధ్యవయస్కుడు ఎదురు పడ్డాడు.

''నమస్కారం బాబూ.ఈ ఇంట్లోంచి వత్తన్నారు . మిమ్మల్నెప్పుడూ సూడలేదే?''

''అవును. ఇంతకు ముందు ఎపుడూ నేను ఇక్కడికి రాలేదు.''

''మీది గోదారి జిల్లాలవైపా బాబు?'' అడిగాడు.

''అవును. ఎలా గుర్తు పట్టావ్?''

''మీరు వత్తి పలికే బాస ను బట్టి. అద్సరే గానీ బాబూ చైతన్య ఊళ్లోకి వచ్చాడంట గదా.''

'' అదేమిటీ. ఎప్పుడూ వూళ్ళో ఉండడా?''

;;భలేవారే బాబూ. మీరు అతనికి ఏమవుతారు?''

'' అతను మా అబ్బాయి.''

'' అయితే మీతో సాలా ఇసయాలు సెప్పాల. రండి బాబూ. అట్టా నడుత్తా మాటాడుకుందాం.'' అంటూ ముందుకు నడుస్తూ చెప్పడం కొనసాగించాడు. టీ బడ్డీ కొట్టు దగ్గర కూర్చున్నాం. అరగంటలో మొత్తం చరిత్ర చెప్పాడతను.

''ఎక్కడ చూసినా అప్పులే బాబూ. రోజూ నలుగురైదుగురు గుమ్మం ఎక్కీతేగాని ముద్దా దిగాడు. ఆ ఆడపిల్లల ముకం సూసి గాని లేకపోతే నాయాల్ది...''

''నేనెవరో తెలిసాకా కూడా ఆమాట అనడం బాగాలేదు.'' అన్నాను.

'' చమించండి బాబు. ఇసిజి ఏసారిపోయామనుకోండి వత్తాను.''అని అతను వెళ్ళిపోయాడు.

నేను బాదంఘీర్ తాగుదామని జేబులో చెయ్యి పెట్టి పర్సు బయటకు తీసాను. అయిదు వెయ్యిరూపాయలు నోట్లు, నాలుగు వంద నోట్లు, కొంత చిల్లర ఉండాల్సిన పర్సులో మూడు వంద నోట్లు, కొంత చిల్లర తప్ప మరేం లేవు. 

నాకు విషయం కొంత అర్ధమైంది. 

నేను బాదంగీర్ తాగి ఇంటికొచ్చేసాను. 

******

సుదీర్ఘంగా రాసిన ఉత్తరం ప్రశాంతంగా మరోసారి చదవడం మొదలెట్టాను. 

'' చిరంజీవి చైతన్యకి,

ఆశీస్సులు .ఈ వయసులో ఆశ్రయం కోల్పోయిన నాకు ఎడారిలో ఒయాసిస్సులా దొరికావనుకున్నాను. నిజమే. ఒయాసిస్సులో నీళ్లు ఉండవు. ఉన్నట్లు భ్రమ కల్పిస్తుందంతే . నీ గురించి ఎంతో ఉన్నతంగా వూహించుకున్నాను. నందు దగ్గర కోల్పోయినది నీ దగ్గర పొందవచ్చని ఆశపడ్డాను. ఎవరో నానీ కవి అన్నాడు. 

''అబ్బాయికి

పెళ్ళయిపోయిందా? 

ఋణం 

తీరిపోయినట్టే. ..!!!'' అని.

వేల వేల సంవత్సరాల కుటుంబ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తోంది డబ్బు. మనుషుల మధ్య సున్నితమైన అందమైన ఆప్యాయతానురాగాలు నశించిపోయి ఆ బీటలు డబ్బుతో అతుక్కుంటూ కొనసాగుతున్న దీన అవస్థ లో ఉంది నేటి కుటుంబ వ్యవస్థ. 

ఆధునిక పరిజ్ఞానం నాకు నేర్పిన గురువు నా మనవరాలు సుష్మ. సరిగ్గా ఆ ప్రారంభ దశలో ఫేస్-బుక్ లో నీ అంతట నువ్వు నాకు ఫ్రెండ్- షిప్ రిక్వెస్ట్ పెట్టావు. 'మీతో స్నేహంకోరుతున్నాను 'అంటూ. వియానికైనా కయ్యానికైనా సమఉజ్జీ ఉండాలని భావించే నేను స్నేహానికి, విద్యాసముపార్జనకి, వయసు అంతరం తో పని ఏముంది అనుకుని బాగా ఆలోచించినమీదట చాలా కాలానికి నీ రిక్వెస్ట్ అంగీకరించాను.

ఈ లోగా నీ కుటుంబ పరిస్థితిని, నీ ఇంట్లో వ్యక్తుల్ని పరిచయం చేసావ్. 'చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నేను నిష్కల్మషమైన మీ ప్రేమను కోరుకుంటున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన పిల్లలకు తాతయ్య ప్రేమను పంచండి. ' అని అభ్యర్ధించావు. మీ ఇంటి ఫోన్ నెంబర్ ద్వారా అందరిచేత నేను తమ సొంత వ్యక్తి అన్నట్టు, కారణాంతరాలవల్ల దూరమైనట్టు, తొందరలోనే అందరినీ కలుసుకుని మీతో ఉండేటట్టు మాట్లాడించావు. 

నా ఒక్కగానొక్క కొడుకైన నందు, నా ప్రాణాధికమైన సుష్మ తల్లి నాకు క్రమేపీ దూరం అయిపోతున్న సంఘటనలు పునరావృతం కావడంతో నా ఆలంబనకోసం నిన్ను అంగీకరించాను. భగవంతుడు ఈ వయసులో నిన్ను నాకు ప్రసాదించాడనుకున్నాను. 

మీ ఇంటిలో మొదటి రోజు అవ్యక్తానందం అనుభవించాను. ..కానీ నీ స్నేహం నీ ఆర్ధిక సమస్యలు తీర్చుకునే స్వార్ధం కోసం ఉపయోగించుకుంటున్నావని అర్ధమైన మరుక్షణం నేను చేసిన తప్పు అర్ధమైంది. 

ఆ రోజు నేను పడుకున్న గదిలో నువ్ వచ్చి నా పెట్టి తెరచి ఏ. టి .ఎం. కార్డు పట్టుకెళ్ళావని నాకు అర్ధమైంది. నా మతి మరపు వలన ఏ. టి. ఎం. కార్డు ఉంచిన ఫోల్డర్ కార్నర్ లో కోడ్ రాసి ఉంచాను. అది నువ్ గమనించిన విషయం నేను గుర్తించలేదు. దాని ద్వారా పదివేలు విత్ డ్రా చేసుకున్నట్టు అర్ధమైంది. నీ భార్య నా పర్సులోని అయిదు వెయ్యినోట్లు, ఒక వంద నోటు తీసుకున్నట్టు గమనించాను. 

నిష్కల్మషమైన ప్రేమను కోరిన నువ్వు కూడా 'డబ్బు'మనిషివి అని అర్ధం అయింది. 

మనిషి ఒక బాధ్యత స్వీకరించినపుడు దానిని పరిపూర్ణంగా నిర్వహించడం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి. పెళ్లి చేసుకున్నావు. భార్యను, పిల్లల్ని పోషించాలంటే నువ్ కస్టపడి తీరాలి. స్మపాదించాలి. కానీ నీ పరిస్థితుల్ని , కష్టపడలేని నీ బాధ్యతని బాధలుగా మర్చి, ఎదుటివారికి జాలిగొలిపే కథలు చెప్పడం ద్వారా నన్ను మోసం చెయ్యగలిగావు. అటువంటి స్నేహం నాకు అవసరం లేదు. డబ్బు పెట్టి కొనుక్కునే ప్రేమ నాకు వద్దు. 

ఈ ప్రపంచం లో ఎందరో అనాధాలున్నారు. ఎన్నో గుళ్ళు, దైవ పీఠాలు, అనాధాశ్రమాలు ఉన్నాయి. అటువంటి చోట నా డబ్బు సద్వినియోగమౌతుంది. 

జగమంతా కుటుంబం నాది. బహుశా ఇక పేస్- బుక్ లో గాని, జీవితం లో గానీ నీకు కనిపించాను. నీ కర్తవ్యమ్ నువ్వు నిర్వర్తించు. నీ ధర్మం నువ్వు నెరవేర్చు. ధర్మో రక్షతి రక్షితః. నిన్ను నమ్ముకున్న వారిని నీ కష్టార్జితంతో పైకి తీసుకురా. మనిషిగా నీ జన్మను సార్ధకం చేసుకో. ముఖ్యంగా నిన్ను నమ్ముకున్న వారి దృష్ఠి లో దోషిగా మిగలకు. నువ్వు ఖర్చుపెట్టుకున్న డబ్బు నాకు తీర్చనవసరం లేదు. గతజన్మలో నీకు రుణపడి ఉన్నాను అనుకుంటా. పాప లకు నా ముద్దులు. ఇంతగా చెప్పినా నీ పద్దతి మార్చుకోకపోతే అది నీ స్వయంకృతాపరాధం. 

సెలవు - చంద్రశేఖరం .''

*****

గంట తరువాత నేను ఎక్కినా బస్సు భద్రాచలం వైపు పరుగు తీస్తోంది. ఇపుడు నా మనసు 'గూడు వదిలిన గువ్వ 'లా హాయిగా ప్రశాంతంగా ఉంది. 


సమాప్తం 


Rate this content
Log in

Similar telugu story from Drama