Kishore Semalla

Inspirational Others

4.2  

Kishore Semalla

Inspirational Others

ఇది మా నాన్న కథ

ఇది మా నాన్న కథ

6 mins
135                    ఇది మా నాన్న కథ      


           ఇది మా నాన్న కథ.. మా నాన్నే నాకు స్ఫూర్తి. మా నాన్నే నాకు ధైర్యం.. అతని ప్రయాణం ఒక చరిత్ర.. తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..

     

          కష్టాల కొలిమిలోంచి సానబెట్టిన కత్తి లా బయటకి వచ్చాడు మా నాన్న.. కొరికలు లేవు, ఆశలు లేవు.. ఆశయం ఒక్కటే ఊపిరిగా చేసుకున్నాడు.. ఎన్నో అడ్డంకులని ఎదిరించాడు.. ఈ మాయా ప్రపంచాన్ని చదివేసాడు.. ఇక్కడ పోరాడి గెలిచినోడికే మర్యాద, గౌరవం దక్కుతుంది.. తన నీడను కూడా నమ్మడం మానేసాడు.. "ఎక్కడ మొదలుపెట్టిన ప్రయాణం అది.. తనని ఏ స్థాయికి వెళ్లిందో మీకు చెప్తాను"..

            

       మా నాన్నగారు శమళ్ల వెంకటరావు.. అలా పిలుచుకునే కన్నా..UTF వెంకటరావు అంటేనే తెలుస్తుంది అందరికి.. ఆయన ఆ సంఘం ద్వారా ఉపాధ్యాయ బృందానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు..ప్రతి ఉపద్యాయుడికి ఆయన ఒక స్పూర్తి..

           రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడు బహుమతిని సొంతం చేసుకున్న వ్యక్తి మా నాన్నగారు... మాజీ ముఖ్యమంత్రి గౌ. శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు..

    

           స్ఫూర్తి పొందాలి అంటే మహనీయుల చరిత్ర చెప్పుకోవాలి.. వాళ్ళ ఒడిదుడుకులు గురించి మాట్లాడాలి.. వాళ్ళు ఎదిరించిన సమస్యలని మీతో పంచుకోవాలి..నాకు తెలిసి ఆ మహానీయులు మన అమ్మ అయినా కావొచ్చు నాన్న అయినా కావొచ్చు..

            మా నాన్న నడిచొచ్చిన దారి ముళ్ళతో, రాళ్లతో నిండినది.. దాన్ని మా కోసం పూల దారిగా మార్చాడు. తన రక్తాన్ని దారబోసాడు.. తన త్యాగమే ఈరోజు మాకు బంగారు బ్రతుకునిచ్చింది.. తను ఎంతోమందికి ఆదర్శం.. కృషి, పట్టుదల, కష్టం ఈ మూడు నాన్న నమ్మే సిద్ధాంతాలు...

            లాక్డౌన్లో నాన్న పక్కనే రోజూ పడుకునే వాడ్ని.. నాన్న రోజు తన చిన్ననాటి జ్ఞాపకాలను నాతో పంచుకునే వాడు.. అవి వింటూనే నిద్ర పోయేవాడ్ని..నాన్న కథని విన్నాక హీరో అంటే నా అభిప్రాయం మారిపోయింది....నిజమైన హీరో మా నాన్న అనిపించింది..


            ఈరోజు ఖరీదైన బట్టలు లేకపోతే కాలేజ్ కి వెళ్ళమని పేచీ పెడుతున్నాం.. వయసొచ్చాక బైక్ లేకపోతే అవమానంగా భావిస్తున్నాం.. కానీ ఆరోజుల్లో మా నాన్న కాలేజ్ కి వేసుకోడానికి ఒకటే జత ఉండేది.. బట్టలు కావాలి అంటే తాత రైల్వే ఖాకి గుడ్డల్ని సైజ్ చేయించుకుని వేసుకునే వాడు..

             బ్.కామ్ చేసి నిరుద్యోగి లా మిగిలిపోయాడు నాన్న కొన్నిరోజులు..ఏం చెయ్యాలో తెలియక తన మావయ్య వైజాగ్ రమ్మంటే పెట్టేపెడ సర్దుకుని వెళ్ళిపోయాడు అక్కడికి...

             ఏదైనా ఉద్యోగం చూడమంటే తీసుకుని వెళ్లి సైకిల్ షాప్ లో కూర్చోబెట్టాడు.. రోజు ఎన్ని సైకిళ్లు అద్దెకు వెళ్తున్నాయి, మళ్ళీ ఎన్ని తిరిగి వస్తున్నాయి, ఎంత వసూలు అవుతుంది అందులో.. ఇది నాన్నకి అప్పగించిన బాధ్యత.. ఇలా చేస్తే రోజుకి ఐదు రూపాయిలు అంటే నెలకి నూట యాబై రూపాయిలు.. ఇది కాదు కదా నాన్న కోరుకున్న జీవితం... ఆలోచించాడు బాగా ఇక్కడే వుంటే ఇలానే కొనసాగాలేమో అనుకుని పేపర్ లో వేరే ఉద్యోగాలు కోసం వెతికాడు..

            అప్పుడే తెలిసింది చందన బ్రదర్స్ లో సేల్స్ మెన్ కావాలి అని.. క్షణం ఆలోచించకుండా బయల్దేరాడు అక్కడికి..

            ఉద్యోగం వచ్చింది.. నెలకి మూడువందలు, రోజు రెండు రూపాయిలు అదనంగా ఇచ్చేవారు.. ఇలా వచ్చిన డబ్బుని మొత్తం మావయ్య చేతిలో పెట్టేసి రోజు ఇస్తున్న ఆ రెండు రూపాయిలని కూడా చాలా జాగ్రత్తగా దాచుకునే వాడు..

            కానీ రాత్రులు నాన్నకి నిద్ర పట్టేది కాదు.. ఇది కాదు కదా నాన్న కోరుకున్న జీవితం..

             ఇదే ఇంట్లో వుంటే పని జరగదు, ఫలితం లేదు అని నిశ్చయించుకున్నాడు.. తన స్నేహితుడు ఐన వేరే వ్యక్తి ని కలిసాడు.. తను వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉంటున్నాడు.. నాన్నని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు.. చాలా పూరిపాక.. వాళ్ళకే సరిపోదు, పైగా నాన్న కూడా వాళ్ళతో కలిసేసరికి కాస్త ఇబ్బంది పడ్డారు ముగ్గురు...

             ఎదురుగా అనలేక వెనకెట్టి మాట్లాడడు వాళ్ళ అన్నయ్య.. అభిమానం చంపుకోలేక నాన్న అక్కడ నుంచి వచ్చేసాడు..

              నాన్న అంటే చాలా మందికి అభిమానం.. అందుకే వేరే రూమ్ లో నలుగురు కలిసి వుండే వారు.. నాన్నని కూడా వాళ్ళతో కలుపుకున్నారు.. పొద్దున్నంత చందన బ్రదర్స్ లో పని చేయడం సాయంత్రం రూమ్ కి వచ్చి ఇక్కడ పనులు చెయ్యడం తోనే గడిచిపోయేది..నాన్న కోరుకున్న జీవితం ఇది కాదు...

           అలా నాన్న పని చేస్తున్న చందన బ్రదర్స్ కి ఆప్తుడు లా వచ్చాడు తన మిత్రుడు.. అనుకోకుండా నాన్న ని అక్కడ చూసి..."ఇది నేను ఊహించలేదు, అందరిలో కల్లా తెలివైన వాడివి.. మంచి భవిష్యత్తు ఉన్నవాడివి... నువ్వెంటి ఇక్కడ ఇలా" అని ఆశ్చర్యపోయాడు..

           పరిస్థితులు చేస్తున్న దాడి వల్ల..ఆత్మాభిమానం చంపుకోలేక ఈ పని చేస్తున్నా అని చెప్పాడు నాన్న..

           మించిపోయింది ఏమి లేదు.. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు..నీ స్థాయి వేరే అని ఆరోజు తను ఇచ్చిన సలహా నాన్న జీవితాన్నే మార్చేసింది..


           "వెళ్లి టీచర్ ట్రైనింగ్ కి సన్నదమవ్వు. నీ ప్రతిభ కి పని చెప్పు. ఇది కాదు నువ్వు, నీ గమ్యం అటువైపు వుంది.. దారితప్పి వచ్చావు.. మళ్ళీ వెనక్కి పరిగెత్తు, ఈసారి తప్పు చెయ్యకు.. కష్టం ఏదైనా దాన్ని నెట్టుకుంటూ ముందుకు కదులు" అని చెప్పి నాన్నలో స్పూర్తి ని నింపాడు అతను..

          "ఇప్పటివరకు సాధించింది ఏంటి???ఇన్ని రోజులు ఇక్కడ ఏం ఫలితం పొందాను???" ఇలాంటి ప్రశ్నలు నాన్నను వెంటాడాయి...మించిపోయింది ఏమి లేదు.. ఆగిపోయిన నీ ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టు. కసిగా పరిగెత్తు, వెనక్కి తిరిగి చూడకు అనుకుని వైజాగ్ వదిలి ఊరికి వచ్చేసాడు..

             చేస్తున్న పని మానేసి వచ్చేస్తే ఇంట్లో కోపాలు సహజం.. కానీ నాన్న వాటిని లెక్కచెయ్యలేదు..సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు..

              ఆరోజు నుంచి కొత్త అధ్యయనం మొదలుపెట్టాడు.. అలుపెరుగని యోధుడు లా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం గమ్యం దిశగా పరుగుని కొనసాగించాడు..

               కానీ నాన్నకి అప్పుడే అదనపు భారం భుజాన పడింది.. పెళ్లి చేసేసారు.. కానీ నాన్న తన ప్రయాణం మాత్రం ఆపలేదు.. ఒక ఏడాదికి అన్నయ్య కూడా పుట్టేసాడు.. ఒక పక్క అన్నయ్య కి పాలడబ్బాలకు, హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలి.. ఇంకో పక్క చదువుకోడానికి, పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి.. అన్నిటికి తాత మీద ఆధారపడటం నాన్నకి నచ్చేది కాదు...అప్పుడే నాన్నకి వచ్చిన ఆలోచన ట్యూషన్.

               1993 లో కంచిలి లో పాఠశాల తరువాత మళ్ళీ అంత మంది విద్యార్థులు కనపడేది ఆ ట్యూషన్ లోనే.. పదేళ్లు ఏకధాటిగా తిరుగులేకుండా నడిచిన ఒకే ఒక ట్యూషన్ అది.. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలిగి వాళ్ళని ర్యాంక్ లు దిశగా తయారు చేసేవారు.. అంతటి చరిత్ర ఉంది ఆ ట్యూషన్ కి..

                ట్యూషన్ నడుపుతూ ఇంటిని, చదువుని చూసుకునేవారు.. అప్పుడే వచ్చింది ఉత్తరం ఇంటికి, ట్రైనింగ్ కి రమ్మని.. అన్నయ్య మొఖం చూసి నాన్న ట్రైనింగ్ కి బయల్దేరాడు..

                రెండేళ్లు ఇంటికి దూరంగా బ్రతికారు.. చదువు తప్ప వేరే ఇంకేం ఆలోచనలేదు.. అక్కడ రోజుకి రెండు పూటలే తిండి పెడతారు.. మధ్యలో ఆకలి వేసినా నాన్న పస్తులు ఉండేవాడు... ఆకలికోసం అటుకులు నానబెట్టి పంచదార కలుపుకుని తినేవాడు... కొన్నాలకు ఆకలిని కూడా చంపుకున్నాడు...చూస్తూ వుండగానే రెండేళ్లు అట్లా గడిచిపోయాయి..

                ఇప్పుడు ఎదురు చూసేది DSC ప్రకటన కోసం.. ఎప్పడు వస్తుందా??? అని ఎదురుచూస్తున్నారు అందరూ.. యధావిధిగా ట్యూషన్ లు ఐతే కొనసాగుతున్నాయి.. వచ్చిన డబ్బులు సరిపోవు.. ఇంతలో నేను కూడా పుట్టేసాను, ఉన్న కష్టాలు చాలవు అన్నట్టు.. ఇద్దరి పిల్లలని చూసుకోవాలి, మిగతా సమయం లో చదువుకోవాలి.. అన్ని కష్టాల్లో కూడా భవిష్యత్తు గురించి మర్చిపోలేదు నాన్న... టీచర్ అవ్వాలని వైజాగ్ వదిలి వచ్చాడు నాన్న...అయ్యేవరకు నిద్రపోడు.. అతని మొండిపట్టుదలే మాకు వచ్చింది.. పని మొదలుపెడితే పూర్తి చెయ్యాలి.. నిర్లక్ష్యం అస్సలు సహించరు.. అదే మాకు అలవాటు గా మారింది..

               రానే వచ్చింది DSC ప్రకటన.. అందరూ పుస్తకాలతో కుస్తీలు పట్టడం మొదలుపెట్టారు.. కుటుంబం కూడా సహకరిస్తోంది అందరికి.. మా బాధ్యతలని అమ్మ చూసుకుంటోంది, నాన్నకి ఇబ్బంది కలగకూడదని..

              రోజు రాత్రి ఏ టైం అయ్యేదో తెలీదు పడుకునేటప్పటికి..కంటినిండా కునుకు ఉండేది కాదు.. కానీ అలసిపోలేదు, ఆగిపోలేదు..

              "ఏరోజైన కష్టం అనిపిస్తే వెనకటి రోజులు గుర్తుకు చేసుకునే వారు.. ఎక్కడ మొదలుపెట్టిన ప్రయాణం ఇది, వెనకడుగు వేయకూడదు అనుకునేవారు... "

             "ఆంజనేయుడుకి తన శక్తి తనకి తెలియదు అంట, రాముడు చెప్పేంత వరకు..." నాన్న శక్తి ని రాముడి రూపం లో వచ్చి ఆరోజు తన స్నేహితుడు చెప్పాక నాన్న ఆగిందే లేదు.. పరిగెడుతూనే వున్నాడు..

              పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. నాన్నకి ఇంట్లో ఉంటే పని కాదు అని అర్ధం అయ్యింది.. తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసుకుని, తన స్నేహితుడితో పరీక్ష కేంద్రం కి దగ్గరలో వున్న గది అద్దెకు తీసుకున్నారు ఇద్దరు.. రాత్రి పగలు తేడా తెలియకుండా చదువుకున్నారు...

                నాన్న అనుకున్న DSC పరీక్ష రానే వచ్చింది.. పరీక్ష రాసాక నాన్న కళ్ళలో ఒక ఆనందం అంట.. నాన్న ఆరోజు నిశ్చయించుకున్నాడు తను టీచర్ అయిపోయాడని..నవ్వుతూ ఇంటికి వచ్చేసాడు..

               కష్టం ఎప్పుడు వృధా కాదు.. చేసే పనిలో కష్టముందని వెనకడుగు వేస్తే రాబోయే ఫలితాన్ని ఎలా ఆస్వాదిస్తావ్.. నమ్మకం, ఆత్మవిశ్వాసం ఈ రెండు ఎప్పుడు మనతోనే ఉంటాయి...వాటిని వదలకూడదు.. అవే మనల్ని లక్ష్యం వైపు తీసుకువెళ్తాయి..

              ఫలితాలు వచ్చే రోజు అది.. నాన్న ఎవరికి కూడా తన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వలేదు.. తానే స్వయంగా చూసుకున్నాడు.. నెంబర్ వుంది.. అంతే ఒక్కసారి తను నడిచిన దారిని గుర్తు చేసుకున్నాడు..ఇప్పుడు అదే ముళ్ల దారి బంగారు పూత వేసినట్టు కనిపిస్తుంది.. ఆ కష్టాలన్నీ దేవుళ్ళ రూపం లో వరమిస్తున్నాయి.. చేయుతనిచ్చిన సన్నిహితుడు చుట్టం అయ్యాడు.. పాస్ అయిన సందర్బం నేను చూడకపోయినా మా నాన్న చెప్తుంటే తన కళ్ళలో కనిపించింది ఆ ఆనందం..


               ఇది కదా నాన్న కోరుకున్న జీవితం.. ఎక్కడ మొదలుపెట్టాడు ఎక్కడికి చేరుకున్నాడు.. అది మొదలు నాన్న ఆపలేదు తన పరుగు... ఒరియా టీచర్ గా తన ఉద్యోగాన్ని ఆరంభించి చేసిన ఎనిమిది ఏలల్లోనే 'ఉత్తమ ఉపాధ్యాయుడు' గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.. ఆ తదుపరి సంవత్సరం లోనే 'ఉత్తమ పరిగణకుడు' గా మరల కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు..

               అయినా అవి ఎందుకో నాన్నకి సరిపోలేదు. మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు.. ఒరియా టీచర్ నుంచి హిందీ టీచర్ గా ప్రమోషన్ పొందాడు.. ఐనా నాన్నకి అది కూడా సరిపోలేదు.. తనని ఇంత స్థాయి కి తీసుకువచ్చిన ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసారు..చాలా మందికి మార్గదర్శి గా నిలిచారు..

               ఇరవై నాలుగేళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో తొమ్మిది PG లు చేసారు.. ఆయన ఉపాద్యాయ వృత్తి కోసం చేస్తున్న సేవని చూసి.. ఆ వృత్తి పైన తనకున్న మమకారం చూసి "రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయయూనిగా" పురస్కారాన్ని అందించారు.. నాన్న ఇంకా ఆపలేదు తన పరుగు..ఇప్పటికి చదువుతూనే వున్నారు...

               ఇది మా నాన్న కథ... ఎందరో విద్యార్థులని గొప్పవాళ్ళు గా తయారు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించారు మా నాన్నగారు ఎప్పుడూ నాకు స్పూర్తే...

                మిమ్మల్ని ప్రేమ గా చూసుకుంటున్న మీ తల్లిదండ్రులని వెళ్లి అడగండి ఒకసారి.. వాళ్ళ ప్రయాణం ఎక్కడ మొదలయ్యింది, ఏ స్థాయి కి తీసుకుని వెళ్ళింది.. స్పూర్తి పొందడానికి వాళ్ళ కన్నా మంచి ఉదాహరణ నేను ఇవ్వలేను..

   

               ప్రతి తండ్రి ఒక యోధుడే..ఒక్కడే యుద్ధం చేస్తాడు.. ఒక స్మస్థానం నిర్మిస్తాడు.. కుటుంబం బరువు మోస్తాడు, పిల్లల భవిష్యత్తు నిర్మిస్తాడు.. నాకు తెలిసిన ఆలెగ్జాండర్ మా నాన్నే.. పడిపోయిన ప్రతిసారి ఉప్పొంగే కెరటం మా నాన్న.. అందుకే నాన్నే నాకు స్పూర్తి అన్నింట్లో....


                                      


             

               

           

            Rate this content
Log in

Similar telugu story from Inspirational