ఎవరు - 1
ఎవరు - 1
1. అరగరాగాఅలీ అనే ఒక అతను అప్పుడే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ముందు బయట టాయిలెట్ పోసుకుంటూ, ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక గెడ్డం వాడు ఒక బ్యాగ్ వేసుకుని, మనిషి లాగే రెండు చక్రాల రిక్షా దిగి అతని బ్యాగ్ కూడా అలీ బ్యాగ్ పక్కన పెడతాడు.
అతని మొహం కన్నా జుట్టు ఎక్కువ ఉండటం వల్ల, అతను చూడటానికి వింతగా కనిపించాడు అలీకి.
ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి అతను బ్యాగ్ తీస్కుని స్టేషన్ వైపు పరిగెడతాడు. అతను ఎందుకు ఆలా పరిగెడుతున్నాడో అర్థం కాక అలీ జిప్ పెట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ బ్యాగ్ అతనిది కాదు అని చూసుకుని అలీ ఆ గెడ్డం వాడి వెనకాల పరిగెడతాడు.
అలీ: “ఏయ్…. ఏయ్.. అది నా బ్యాగ్”. గెడ్డం అతను ఇంకా వేగంగా స్టేషన్ లోకి పరిగెడతాడు.
అలీ: “దొంగ.. దొంగ” అని అరుచుకుంటూ స్టేషన్ లోకి వెళ్తాడు. అక్కడ ఆగి ఉన్న అతన్ని చూసి “ఏంటి బ్యాగ్ కొట్టేసి పారిపోతున్నావ్?”
“బ్యాగ్ ఆ..?”
అలీ: “ఆ.. అదే సంచి, అది నాది.”
సంచిని చూసుకుని గెడ్డం అతను “రైలు వెళ్లి పోతుంది అనే తొందరలో చూసుకోలేదు, అంత మాత్రానికే దొంగ అంటారా?”
“అగావు కదా అని వదిలేసా, లేకపోతే కేసు పెట్టేవాడిని ..”
“నా సంచి ఏది?”
అలీ: “అది అక్కడే ఉంది.”
గెడ్డం అతను ఒక చూపు చూసి, పరిగెట్టుకుంటూ వెళ్లి కాసేపటికి మళ్ళీ తన సంచితో స్టేషన్ లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు.
అక్కడే రిలాక్స్డ్ గా కూర్చున అలీ, “ఎందుకు ఊరికే ఆ పరుగు, ఎప్పుడు రైలు ఎక్కలేదా?”
గెడ్డం అతను ఆయాసపడుతూ తల “ఎక్కలేదు” అన్నట్లుగా ఊపుతాడు.
ఆ స్టేషన్ లో ఎవరూ ఉండకపోయేసరికి అలీ ఊరికే ఉండక మళ్ళీ గెడ్డం అతనితో “నీ పేరు ఏంటి?”
“నరేంద్ర”
“అంతేనా”
“నరేంద్ర రాయుడు”
అలీ: “ఉన్న కులమే”
నా పేరు “మొహమ్మద్ అలీ షా”
గెడ్డం అతను మౌనంగా ఉంటాడు. అతనికి దూరంగా బలిష్టంగా కింద పంచె కట్టుకుని, పైన నల్లని దుప్పటి వేసుకుని, మొలలో కత్తి లాంటి వస్తువు పెట్టుకుని, చెట్టు వెనకాల ఉన్న ఒక అతను కనిపిస్తాడు. అతను అప్పుడపుడు తొంగి చూడటంతో నరేంద్రకి భయం వేస్తుంది.
“ప్రతి దాన్ని చూసి భయపడకు, అతను మామూలు మనిషే. అంతగా భయం వేస్తే అటు వైపు చూడకు” అని మనసులో అనుకొని వేరే వైపు తిరిగి కూర్చుంటాడు.
అలీ అది చూసి “మాట్లాడుతుంటే ఆటు తిరుగుతావెంటి? మంచి మర్యాద ఉండాలి కదా!”
నరేంద్ర నుండి మళ్ళీ సమాధానము ఉండదు. అంతలో రైలు వస్తుంది. అది ఆగి ఆగగానే నరేంద్ర రైలు ఎక్కేస్తాడు. ట్రైన్ కదులుతుంటే కిటికీకి ఉన్న ఇనుపకడ్డీని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు.
బొగ్గు ట్రైన్ పెద్దగా కూత పెడుతూ, దట్టమైన పొగ వదుల్తూ ముందుకు కదులుతుంది. మెట్టలు, మెరకలు దాటుకుంటూ కొండలు కోనలలోకి ప్రవేశిస్తుంది. ట్రైన్ లేటు అవటంతో సాయంత్రం రావాల్సిన ట్రైన్ పున్నమి రాత్రి వేల భైరవకోనలో అర్థరాత్రి ఆగుతుంది.
నరేంద్ర ట్రైన్ దిగుతాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ స్టేషన్ లో అటు ఇటు చూస్తూ ఉండగా అతనికి ఆ ముసుగు వేస్కున అతను కనబడతాడు. వెంటనే తన సంచి తీసుకుని బయటకు వచ్చి కంగారుగా చూస్తుండగా అతనికి ఒక జట్కా బండి అతను కనిపిస్తాడు.
అతని దగ్గరకు వెళ్లి “భూపతి రాజు గారి ఎస్టేట్ కి వస్తావా?”
“అక్కడికా, ఎవరు నువ్వు?”
“అది వెళ్తూ చెబుతాను. ముందు వెళదామా?”
“ఇరవై రూపాయలు ఇస్తావా?”
“ఇరవయా?”
“పది మైళ్ళు పోవాల. భైరవ కోన, పిడుగు పొంత, ఆ తరువాత భూపతి ఎస్టేట్స్. అయినా భూపతిగారి ఇంటికి కాబట్టి వస్తాన్న, లేకపోతే”
“సరే.. పద”
జట్కా బండి అడవి ప్రాంతంలో నుండి వెళ్తూ ఉంటుంది, అప్పటి వరుకు తోడు ఉన్న చంద్రుడికి దట్టమైన చెట్లు వీడ్కోలు చెబుతాయి. బండి కోన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. నరేంద్ర అప్పుడపుడు వెనక ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. అంతలో ఒక కార్ వేగంగా వెళ్తూ జట్కా బండి కుడి వైపు ఉన్న చక్రాన్ని ఢీ కొడుతుంది. జట్కా బండి ఎడమ వైపుకి తిరగబడి కొండ దిగువలోకి పడి, దొర్లుతూ ఉండగా నరేంద్ర బండిలో నుంచి బయట పడతాడు. కానీ తలకి చెట్టు తగలటం వల్ల సృహ కోల్పోతాడు.
అలా ఢీ కొట్టి వెళుతున్న కారులో భూపతి రాజు, అతని వొళ్ళు అంత చెమటలు, కళ్ళలో బెదురు, కాళ్ళు చేతుల్లో వణుకు. కొండ కొనలో ఉండే మలుపులో కూడా వేగం తగ్గకుండా పొనిస్తున్న భూపతి రాజు కార్ మీద ఏదో పెద్ద వింత ఆకృతి దూకినట్టుగా ఫీల్ అవుతాడు. దాని భయంకరమైన చెయ్యి ల
ోపలికి చీల్చుకుని వస్తున్నది అనిపించి కారు స్టీరింగ్ వేగంగా తిప్పటంతో అదుపు తప్పి కారు కొండ చివరకు స్కిడ్ అవుతూ వెళ్లి, అక్కడ ఉన్న రాయికి తగిలి బోల్తా పడుతుండగా, భూపతి రాజు ఎగిరి ఆ రాయి చివరగా, కొండ అంచున ఉన్న ఎండిపోయిన పొడుగాటి చెట్టు మీద పడి జారుతునప్పుడు తన మెడకి ఉన్న షాలువా కొమ్మకి చిక్కుకుంటుంది. ఆ షాలువా అతనికి మెడకి బిగుసుకుని ఊరిలా ఏర్పడి, అతని బాడీ లోయలోకి వేలాడుతుంది. తిరగపడిన కారు బోల్తా పడి, ఆ అదునుకు అందులో ఒక అద్దం వచ్చి వేలాడుతున్న భూపతిరాజు మెడను తెగ్గొడుతుంది. అతని దేహంతో పాటు అతని కారు కూడా లోయలో పడిపోతుంది. అతని తల మాత్రం చెట్టుకు వేలాడ్తూ ఉంటుంది.
సూర్యకాంతికి మెలకువ వచ్చిన నరేంద్ర, మెల్లగా లేచి పైకి వస్తాడు. జనాలు పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. అందులో ఒక అతను నరేంద్ర దగ్గరికి వచ్చి “ఏమైంది బాబు” అంటూ తన దగ్గర ఉన్న తుండు మీద నీళ్లు పోసి నరేంద్ర తలకి చుడతాడు.
“జట్కా బండి బోల్తా పడింది తాత, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు?”
“భూపతి రాజు గారు చనిపోయారు, అది చూడటానికే వెళ్తున్నారు. నేనూ వెళుతున్న.”
“భూపతి రాజు గారా! నన్ను కూడా తీస్కుని వెళ్ళు తాత.”
మేము అక్కడికి వెళ్తుండగా, మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. నేను(నరేంద్ర), తాత ఆయన చనిపోయిన చోటికి చేరుకున్నాము, అక్కడికి వెళ్లి చెట్టుకి వేలాడుతున్న ఆ దృశ్యం చూడగానే తాత కుప్ప కూలిపోయాడు. అక్కడికి చేరుకున్న చాలా మంది కూడా బాధ కన్నా ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అతని సబార్డినేట్ తో “ఏంటయ్యా ఈ జనం? వాళ్ళు ఎవరు వింతగా ఉన్నారు?”
“వాళ్ళు అడివి జాతి వాళ్ళు సార్.”
ఆ వైపు చూసిన నాకు ఆ జాతి మరీ వింతగా అనిపించారు. అందరిదీ ఒకే వేషధారణ. వాళ్ల చేతిలో వేటాడే ఆయుధాలు. అందరూ “సేపమ్..సేపమ్” అంటూ ఏదో గుసగుసలాడుతున్నారు.
“రోడ్ మీద టైరు గుర్తులు చూస్తే, కారు ఒక లైన్లో వెళ్లినట్టు లేదు సార్”
“తాగి డ్రైవ్ చేసి ఉంటాడు”
“సార్..మాట పొదుపు! అది భూపతి రాజు. మనం ఆయన జనం మధ్యలో ఉన్నాం.”
“సరే, అంత రాత్రి ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు?”
“ఇంకా ఆ వివరాలు తెలియలేదు, కానీ ఇది యాక్సిడెంట్ కాదు సర్. భూపతి రాజు గారిని ఎవరో వెంబడించారు.”
“ఎదురుగుండా గాని, వెనక గాని ఎదైనా వాహనం వచినట్టు గాని, తరిమినట్టు గాని మనకి ఆధారాలు దొరికాయా? ”
“లేదు సార్.”
“మరి యాక్సిడెంట్ కాక ఏంటి?”
“ఆ టైర్ గుర్తులు ఐదు మైళ్ళ దూరం నుండి ఉన్నాయి, బండి ప్రాబ్లెమ్ లో ఉంటె, అంత దూరం పాడైన బండిని నడపక్కర్లేదు, పక్కన ఎక్కడో ముందే ఆగిపోవచ్చు. దేని గురించో ఆయన భయపడుతూనో లేదా ఏదో కంగారులోనో ఉండి ఉండాలి.”
ఆ ఇన్స్పెక్టర్ టైర్ గుర్తులును కిందకు వంగి పరిశీలనగా చూస్తున్నాడు. నేను కారు ఒకటి వేగంగా వెళ్తుండటం చూసాను అని చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేదు.
“ఇంత ఘోరంగా యాక్సిడెంట్ అయ్యిందంటే ఆయన అతి వేగంగా వచ్చి ఉండాలి. యాభై ఏళ్ళ వయస్సు ఉన్న రాజుగారు అర్థరాత్రి అంత వేగంగా ఎందుకు వెళ్ళాడు? ఎప్పుడూ ఉండే డ్రైవర్ ఎందుకు లేడు? ఇంతకీ ఆయన కారు వివరాలు ఏమన్నా తెలుసా?”
“ఓల్డ్స్ కారు సార్. ఇంతకు ముందు చూసాను. కంబషన్ ఇంజిన్ కూడా. ఖరీదైన కారు.”
“సరే, వివరాలు అన్ని జాగ్రత్తగా సేకరించండి. మనం రిపోర్ట్ టౌన్ కి పంపాలి. మాట రానివ్వద్దు. అలాగే బాడీని లోయలో నుండి తీయటానికి మనుషులని పురమాయించండి. ముందు ఆ తల అక్కడ నుండి తీయండి.”
వెంటనే ఒక మెరుపు గట్టిగా మెరిసింది. అందరితో పాటు నేనూ ఉలికిపడ్డాను. దాని వెంబడే ఒక పిడుగు చెట్టు మీద పడి, ఆ చెట్టు దానితో పాటు తల మంటల్లో చిక్కుకున్నాయి. అది చూసి మేము వెనక్కి జరిగితే, ఆ అడవి జాతి మాత్రం బెదరలేదు. అందులో ఒక అతను మోకరిల్లి “అమ్మ డోరా అగ్గి” అని అరిచాడు. మిగతా వారు కుడా మోకరిల్లి “అమ్మ డోరా అగ్గి” అని అరవటం మొదలు పెట్టారు. ఒక్కసారిగా అందరూ ఆయుధాల్ని ఒకదానితో మరోదాన్ని కొడుతూ, “అరగరాగా” అంటూ ఎక ధోరణితో శబ్దం చేస్తుంటే అక్కడ ఉన్న ఊరు జనం అందరూ భయంతో వెనక్కి నడిచారు.
పోలీస్ సబార్డినేట్ “సార్, ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వివరాలు తర్వాత సేకరించుకోవాల్సిందే.” అంటూ ఆఫీసర్ని వెనక్కి లాగుతున్నాడు.
ఆ అడివి జాతి కళ్ళలో కంగారు, “అరగరాగా” అనే అరుపులో ఆవేశం, ఆయుధాల చప్పుడులో ఆక్రోశం.
తాత: “బాబు పదా, వెళ్లిపోదాం.”
నేను వెళ్తుంటే ఆ అరుపులు మరింత పెరిగాయి “అరగరాగా, అరగరాగా , అరగరాగా , అరగరాగా , అరగరాగా ...... ”
* * *