ఏరు ముందా ఏకాశి ముందా
ఏరు ముందా ఏకాశి ముందా
ఏరు ముందా ఏకాశి ముందా
********************************
గోస్తనీ నది ఒడ్డున చామలాపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పెద్ద రామాలయం ఉంది. ఉగాది సందర్భంగా రామాలయాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు.
రంగు రంగుల రంగవల్లికలతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ఉన్న చిన్నా పెద్దా అందరూ ముస్తాబై పూజా సామగ్రి పట్టుకుని ఆలయానికి చేరుకున్నారు.
అమ్మాయిలు లంగా ఓణీ ల్లోనూ అబ్బాయిలు పంచెకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది ఉత్సవానికి నిండుదనాన్ని ఇచ్చారు. రాముల వారికి పూజలు చేసారు.
అనంతరం గ్రామ పురోహితులు సాంబ శివరావు పంతులుగారు పంచాంగ శ్రవణం గావించారు. మకర సంక్రాంతి పురుష లక్షణం, నవనాయకుల ఫలాలు, మూఢాలు, గ్రహణాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు చెప్పారు. అందరూ శ్రద్ధగా ఆలకించారు.
ఒక్కొక్కరూ పేరు బలాలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడే ఉన్న తొంబై ఏళ్ల అప్పడు “అయ్యా పంతులు గోరూ ఏరు ముందా? ఏకాశి ముందా? అని అడిగాడు.
“ఈ ఏడాది మేఘాదిపతి గురుడు కావున మూడు కుంచాల వాన పడుతుంది అందుచేత ఏరే ముందు అవుతుంది అప్పడూ.” అన్నారు పంతులు గారు.
గడచిన మూడేళ్లుగా పంటలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు పంతులు గారు చెప్పిన మాట ఎంతో సంతోషాన్ని కలిగించింది కానీ అక్కడే ఉన్న యువతరానికి ఇది అర్థం కాలేదు.
“మాకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పండి పంతులుగారు” అన్నారు వారు.
“సాధారణంగా జూన్ నెలలో ఋతుపవనాల రాకతో తొలకరి ప్రారంభమౌతుంది. వర్షాలు బాగా కురిస్తే ఏర్లు గెడ్డలు ఏకమవుతాయి. చెరువులు నిండుతాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.
ఈ గ్రామం లో గడచిన మూడేళ్లలో జూన్ నెలలో వర్షాలు పడిన దాఖలాలు లేవు. జూలై నెల అంటే అషాడ మాసం. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, దీనినే తొలి ఏకాదశి లేదా తొలి ఏకాశి అని అంటాము.
ఏరు ముందు అంటే వర్షాలు పడతాయని ఏరు పారుతుందని పంటలు బాగా పండుతాయని అర్థం.
ఏకాశి ముందు అంటే తొలి ఏకాశి వరకు వర్షాలు పడవని, కరువు తప్పదని అర్థం.
అంతేకాదు ఏరు అంటే నాగలి. వర్షాలు పడి నాగలి కదులుతుందా? లేదా సరైన వర్షాలు లేక, పంటలు పండక రోజూ ఏకాశి ఉపోసమేనా? అనే అర్థం కూడా వస్తుంది.
ఏరు ముందా ఏకాశి ముందా అంటే ఇదేనని వివరించారు పంతులుగారు. తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇళ్ళకు చేరుకున్నారు గ్రామస్తులు. పూర్వం పెద్దవారు లోకోక్తులను కూడా చమత్కారంగా అడిగేవారు అనడానికి ఇదొక ఉదాహరణ.
(సిరిమల్లె అంతర్జాల పత్రికలో ఆగష్టు 2024 లో ప్రచురితమైంది)
