శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.7  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

బానిస కాదు

బానిస కాదు

3 mins
402



              "బానిస కాదు"

             -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

             

    రంజని...పెళ్ళై అత్తారింటికి వచ్చింది. భర్తతో కలిసి ఆ ఇంట్లో అడుగు పెట్టిన మొదలు తన జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. 


  పెళ్లంటే...తన భర్తతోనే జీవితం అనుకుంది గానీ.. ఇంత మంది మనుషుల మధ్య తను బంధీ అయి ఉంటుందని మాత్రం అసలు అనుకోలేదు. 


   భర్తతో కలిసి చనువుగా ఉండటానికి కూడా లేకుండా...తన చుట్టూ అత్తగారు, మావగారు, ఇంకా పెళ్లి కాని మరిది, ఒక ఆడపడుచు వున్నారు. అందరి మధ్యా అణిగిమణిగి ఉండాల్సిందే. 


  తెల్లారింది మొదలు తలుపులు తీసి...గుమ్మలో వేసిన పాలపేకెట్లు తీయడం దగ్గర నుంచి రాత్రి తలుపులు మూయడం వరకూ అన్నీ తను చూడాల్సిందే.


  "అమ్మా రంజనీ...ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురామ్మా" అంటూ మొదట్లో ఎంతో ప్రేమగా పిలిచిన అత్తగారు...రాను రాను "ఏమ్మా రంజనీ...నా మొహాన్న ఓ కప్పు కాఫీ చుక్కయినా పోస్తావా లేదా"... అంటూ దీర్గాలు తీయడం మొదలు పెట్టింది. 


  "అమ్మా రంజనీ...నాకు రాగిజావ ఇవ్వలేదమ్మా"... అంటూ మావగారు.


  "రంజనీ...నా లంచ్ బాక్స్ రెడి చేసావా"...? భర్త గారి హడావిడి.


  "వదినా నాకు టిఫిన్ పెట్టండి" అంటూ మరిది.


  " వదినా నా జుట్టుకు హెన్నా పెట్టు" అంటూ ఆడపడుచు.


   ఇలా ఒకరోజు కాదు...ప్రతి రోజూ ఎవరికి ఏం కావాల్సినా రంజనీకి పనులు పురమాయించి చేయించుకోవడం ఇంటిల్లి పాదికి అలవాటై పోయింది. అందరికీ అన్నీ అందించి.... మిగిలిన పనులన్నీ చక్కబెట్టేసరికి...అలసిపోయేది రంజని. 


   రెండేళ్లు తిరిగాయి...తాను తల్లి కాబోతుందన్న వార్త అందరూ సంతోషించినా....ఎవరూ పనులు చెప్పడం మానలేదు. ఓపిక లేకపోయినా...ఓర్పుతో చేస్తున్న భార్య మీద కొద్దిగా జాలిసింది మురళీకి. అయినా...ఆ విషయాన్ని భార్యముందు ఎప్పుడూ కనబర్చలేదు. ఆ ఇంట్లో వాళ్ళు తనకెవరూ పరాయి వారు కాదు కాబట్టి. తల్లిదండ్రుల విషయంలో కాకపోయినా...తమ్ముడు, చెల్లెలు అయినా తమపనులు తాము చేసుకుంటే బాగుండుననుకున్నాడు. 


  ఆరవనెల వచ్చినా...మనిషిలో నిండుదనం రాలేదు. చెకప్ చేసే డాక్టర్ కడుపులో బిడ్డ ఎదగడానికి సరైన ఆహారం తింటూ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో...మురళీ బాగా ఆలోచించాడు. భార్య ఇంకా ఇక్కడే ఉంటే...డాక్టరు సలహాను పాటించడం కష్టమని...భార్యను పుట్టింట్లో దింపేసి వచ్చాడు. అక్కడికీ తల్లి మొత్తుకుంటూనే ఉంది. అలా ఎలా దింపేసి వస్తావు...? "ఏడవ నెల వచ్చాకా...మీ అత్తగారువాళ్ళూ వచ్చి స్వీట్స్ ఇచ్చి తీసుకెళ్లాలి" అంటూ.


   "ఇప్పుడవన్నీ అంత ముఖ్యమా అమ్మా....తన ఆరోగ్యం కంటే.  పుట్టే బిడ్డ గురించైనా నేనీ నిర్ణయం తీసుకోవడం తప్పు పట్టకమ్మా"  అంటూ తల్లి చాదస్తాన్ని కొట్టిపడేశాడు మురళి. 


   నెలలు నిండాయి..పండంటి బిడ్డను కన్నాది రంజని. పిల్లాడికి మూడవ నెల రాగానే బిడ్డతో కోడల్ని తమ ఇంటికి తీసుకొచ్చేశారు అత్తగారు. మళ్లీ రంజనీకి తప్పలేదు...ఒక పక్క పిల్లాడిని చూసుకుంటూనే ఇంటిపనులు చక్కబెట్టడం మరికాస్త బాధ్యత పెరిగింది. సమయానికి పిల్లాడికి పాలు పట్టడానికి, నిద్రపుచ్చడానికి వీలు చిక్కేది కాదు రంజనికి. 


  తల్లిగా మారకా కన్నబిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నందు బాధగానే వుంది . తనకున్న సహనం ఓర్పూ అన్నీ ఏమైపోయాయో అర్థం కాలేదు. తాను పుట్టింట్లో ఎంతో అల్లారుముద్దుగా పెరిగి...ఇంజనీరింగ్ చేసి...పెళ్లిచేసుకున్నందుకు అత్తింట్లో ఇలా బానిస బ్రతుకు బతకడం తల్చుకుంటుంటే...ఇప్పుడేడుపొస్తుంది రంజనికి. 

భార్య మనసును అర్థం చేసుకున్నాడు మురళి. 


  నిజమే...ఇంతకాలం తల్లిదండ్రుల్ని వదలెళ్లలేక... తనకొచ్చిన ట్రాన్స్ఫర్ని తప్పించుకున్నాడు. కనీసం తోడబుట్టిన చెల్లెలు కూడా తన భార్యకు ఎలాంటి సహాయం చేయకుండా...తన లోకంలో తానుండటం బాధ కలిగించింది. భార్య చదువుకున్నందుకు పెళ్ళైన కొత్తలోనే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ చేయించకపోవడం నా తప్పే అనుకున్నాడు. ఇప్పుడు బిడ్డపుట్టాకా...తండ్రిగా తనకు తన కుటుంబం మీద మరికాస్త శ్రద్ధ తీసుకోవాలనుకున్నాడు. భార్యకున్న ఎన్నో టాలెంట్స్ వెలుగుచూడకుండా...ఇంటికే బానిసైపోతూ అంతరించి పోకూడదు అనుకున్నాడు. 


   బాగా ఆలోచించుకుని...ఎలాగైతే ప్రయత్నించి...కాకినాడ నుంచి విశాఖపట్నానికి ట్రాన్ఫర్ చేయించుకున్నాడు. అక్కడే ఒక స్కూల్ కి దగ్గర్లో ఇల్లు అద్దెకు దొరికేలా ప్రయత్నించాడు. 


   ట్రాన్ఫర్ అయిన విషయం తల్లితో చెప్పాడు. 

   "మీకు దూరంగా వెళ్లిపోవాలనే ఉద్దేశ్యం కాదు గానీ...ప్రస్తుతం మీకు తమ్ముడు, చెల్లి తోడుగానే వున్నారు. మీలోనూ ఇంకా ఓపిక సన్నగిల్లలేదు. వాళ్ళ పెళ్లిళ్లు అయ్యాకా...మీరు మాదగ్గరకు ఎప్పుడైనా రావచ్చు...వెళ్లొచ్చు. లేదంటే పూర్తిగా మా దగ్గరకు వచ్చి ఉండిపోయినా మాకు సంతోషమే. "


  "నన్ను నమ్మి వచ్చినందుకు నా భార్య విషయంలో నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికొచ్చాను. మా పెళ్ళై రంజని ఈ ఇంటికొచ్చినప్పటి నుంచీ చూస్తూనే వున్నాను. ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు. పైగా బాబు పెంపకం కూడా చూసుకోవాలి. తనకు చదువుతో పాటూ ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. అవన్నీ మరుగున ఉంచేస్తూ...భార్య అంటే బానిస అనుకునే సగటు మగాడిలా నేనుండలేనమ్మా. ఇంటికొచ్చిన కోడల్ని ఆ ఇంట్లో వాళ్ళెవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా...భర్తగా భార్యని ప్రతి మగాడు అర్థం చేసుకున్నప్పుడే...ఆమె జీవితానికి న్యాయం చేసినట్టు. రంజనీకీ మంచి చదువుతో పాటూ తనకున్న టాలెంట్స్ లో అబాకస్ నేర్పించడంలో చాలా ప్రావీణ్యం ఉంది. బాబుని చూసుకుంటూ...అక్కడ స్కూల్లో పార్ట్ టైం చేస్తూ స్టూడెంట్స్ కి చెప్పడానికి టీచర్ పోస్ట్ కూడా చూసాను" అంటూ చెప్తున్న కొడుకు మాటలు విని ఏమీ మాట్లాలేకపోయారు తల్లిదండ్రులు. 


   భుజంపై పిల్లాడిని జోకొడుతూ...అప్పుడే అటుగా వచ్చిన రంజని భర్త మాటలు వింది. 

   

  భార్య అంటే బానిస కాదని...తనతో ఉద్యోగాన్ని కూడా చేయిస్తానని ...కన్నతల్లికి చెప్తున్న తీరుకి ఎంతో గర్వంగా చూసింది...భర్త మురళీని రంజని....!!*


   


   


   

   .


   


   


   


   


  


   





Rate this content
Log in

Similar telugu story from Inspirational