శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

అత్తగారికో ఉత్తరం

అత్తగారికో ఉత్తరం

4 mins
517


          అత్తగారికో ఉత్తరం

        - శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


  కిటికీలోంచి బయట కనిపిస్తున్న మంచు గడ్డల్ని చూస్తూ తదేకంగా ఆలోచిస్తుంది ప్రసూన. 

   

  అమెరికా రావాలని ఎంతగా తహతహలాడిందో ఇప్పుడు ఇండియా వెళ్లిపోవాలని అంతగానూ తొందరపడుతుంది. మనసంతా అత్తగారి మీదే ఉంది. పాపం ఆముసలి వయసెంతగా తల్లడిల్లిందోనని తలంపుకొచ్చేసరికి మనసు మనసులో లేదు. ఒక్కసారైనా అత్తగారితో మనసు విప్పి మాట్లాడుకోవాలని పదేపదే అనిపిస్తుందామెకు. ఆవిడకు వినికిడి శక్తి పూర్తిగా పోయింది ఈమధ్య. అందుకే ఫోన్ చేసి మాట్లాడేకంటే ఒక ఉత్తరం ముక్క రాసి పలకరిస్తే...ఆవిడకు సంతృప్తి...తనకు ప్రాశ్చాత్తాపం తీరుతుందనిపించింది. అనుకున్నదే తడవుగా కాగితంపై కలాన్ని పెట్టింది. 


  గౌరవనీయులైన అత్తయ్య గారికి,

  నమస్కరించి,


  ఎలా వున్నారు...? మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. 

ఇక్కడ నేనూ, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్యా అందరూ కులాసాగానే ఉన్నాం. మీ ముని మనుమడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. 


  అమెరికాకు వచ్చామే గానీ...మీగురించే తలంపు. అసలు ఈవయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేసామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నాస్వార్థం చూసుకున్నందుకు నేనెంతగా మనస్తాపం చెందానో చెప్తే నమ్మరేమో...?


  పెళ్ళైన తోడనే మీదగ్గరకు కోడలుగా వచ్చానే గానీ...చాలా కాలం మీకు నేను, నాకు మీరు విరోధులుగానే ఉన్నాం. అత్తగారిలా హుకుం జారీచేసేవారని నేనూ...కోడలుగా నేను మీకు గౌరవం ఇవ్వడం లేదని మీరూ ఎవరికివారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాడుముఖాలతోనే ఒకే ఇంట్లో గడిపేసాం. నాగురించి మీరూ...మీగురించి నేనూ ఇరుగుపొరుగు వారితో చెప్పుకుని మన ఇంటిపరువు మనమే బజారుకీడ్చుకున్నామేమో...? మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో....మీకోడలు ఇలా అంటుందని మీతో ... ఉన్నవాటికి మరో నాలుగు విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి...మనలో మనకే తెలీని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పోరు పొరుగువారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే ముఖముఖాలు చూసుకోక తప్పేది కాదు. 


   తర్వాత తర్వాత ఆలోచిస్తే తెలిసింది...పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగి కోడలుగా మీఇంటికొచ్చిన కొత్తవాతావరణం....నాలో ఏదో తెలీని సంకుచిత భావంతో అలా ప్రవర్తించానని. అసలే పెళ్ళైన కొత్త. నేను నిద్ర నుంచి లేవడం కొద్దిగా లేటయ్యేది. మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులూ చేసేసుకునేవారు. నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. పైగా మీకు అతి శుభ్రమెక్కువ. నాకు వచ్చీరాని పనులు...వచ్చీరాని వంటలు. ఏ పని చేస్తే ఏమంటారో అనే భయం నాలో పేరుకుపోయింది. నేనేమీ చేయడం లేదని ...కోపంగా ఉన్నారని గంభీరంగా వుండే మీ ముఖం చూస్తే అర్థమైపోయేది. 


   మీరు చెప్పకపోయినా మీ ఆలోచనల్లో నేనూ ఉండేదాన్నని నాకూ అర్థమయ్యింది. ఎప్పుడూ కూడా నువ్వు ఆపని చెయ్...ఈ పని చెయ్ అని నాకెప్పుడూ పురమాయించలేదంటే...అలా చెప్పి చేయించుకోవడం మీకిష్టం లేకనే. చేసేది ఏమైనా ఉంటే చెప్పకుండా చేయాలని, ఆడది ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని ఇలాంటి చాదస్తంలో మీరుండేవారు. 


  రాను రాను...ఒకరికి ఒకరు పనుల్లో సాయం చేసుకుంటూ అలవాటు పడేసరికి..పిల్లవాడు కాస్తా పెళ్లీడుకెదిగిపోయాడు.

మీరు వృద్దాప్యంలోకి, మేము నడి వయసుకీ వచ్చేసాం. నాకొచ్చిన అనుభవంలో....నా కొడుక్కి పెళ్లి చేస్తే నాకోడలు దృష్టిలో అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలని పించింది. అనుకున్నట్టుగానే...మీమనవుడికి పెళ్లి చేసాను. కొడుకూ కోడలూ అమెరికా వెళ్లిపోయారు. నా గురించి కోడలికి గానీ...కోడలు గురించి నాకు గానీ తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. 


   ఈలోపు మీరు జారి కాలు విరక్కొట్టుకోవడంతో ..మీ సేవలకు అంకితం అయిపోయానన్న కృంగుబాటుతో... నా మనుమడిని చూడ్డానికి అమెరికా వెళ్లలేకపోయాననే నిరాశ ఎక్కువైపోయింది. మిమ్మల్ని చూసే దిక్కువరూ కనిపించక ...మాకు మరో మార్గం కనిపించక మా కోరిక తీర్చుకోడానికి...మిమ్మల్ని వృద్దాశ్రమంలో పెట్టేసి...మరీ అమెరికా వచ్చేసాం. మా వీసా గడువు ఆర్నెల్లు వున్నా...మూడ్నేల్లకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపించిస్తుంది.


   అత్తయ్యా...త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాం. నన్నూ..మీ అబ్బాయినీ క్షమించరూ...!!*


                         ఇట్లు

                        మీకోడలు

                        ప్రసూన.

   

    మనసులోని భారాన్ని అక్షరాల్లో పొందపరిచి ఉత్తరాన్ని పూర్తిచేసింది. తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది. అత్తగారితో ఇన్నేళ్లూ గడిపిన సహచర్యం...ఈ మూడు నెలల కాలంలో ఎన్నోసార్లు తిరగతోడుకుంది ప్రసూన.


   వయసు పెరిగేకొలదీ ...జీవితంలో ఎన్నో మలుపులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అత్తగారితో ఆవిధంగా గడిచిపోతే...ఆ తర్వాత మరోలా జీవితంలో విసిగిపోయింది.


     అత్తగారికి ఓపిక పోయి ఒంట్లో సత్తువ లేని వయసొచ్చాకా ఆవిడనెంతగానో రాపాడించడం కూడా గుర్తుకొస్తున్నాయి. తెల్లారితే చాలు ఈముసలావిడ కాఫీ కాఫీ అంటూ తెగ కలవరిస్తూ ఉంటుంది. కొంచెంసేపు పడుకుందామనుకున్నా నిద్రపోనీయదు అని విసుక్కున్న రోజులూ...అన్నం నములడ్డం లేదు...కొంత మెత్తగా చేయమని చెప్పిన మాటకు తానెంతగానో రాద్ధాంతం చేసిన రోజులూ... చెప్పిన మాటలు వినిపించకపోవడంతో పదేపదే చెప్పలేక.. కసురుకున్న రోజులూ... పొరపాటున బట్టల్లో మలమూత్రాలు అయిపోతే...వాటిని పెంటకుప్ప మీద పడేసి ఇల్లంతా ఫినాయిల్ తో కడిగేస్తూ ఆవిడపై తాను చూపించిన ఆగ్రహం అన్నీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇదేనా...ఓ కోడలిగా అత్తగారిపై నేను ఏర్పర్చుకున్న పగ ప్రతీకారం...???

ఇవన్నీ తప్పించుకోడానికే కదా...కొన్నాళ్ళైనా రాజభోగం అనుభవిద్దామని అత్తగారిని వృద్ధాశ్రమానికి అప్పచెప్పి... అక్కడ నుంచి ఈ అమెరికాకు ఎగురుకుంటూ వచ్చేసాను..అనుకుంటూ తనను తాను నిందించుకునే స్థాయికి దిగజారిపోయింది ప్రసూన.


   ఎంతైనా....అనుభవం ప్రతి మనిషికీ పాఠం అవుతుందేమో...? 


   తాను అత్తగారితో గడిపిన జీవితం తన కోడలికి రాకూడదనే...కోడలికి అత్తగా కాకుండా అమ్మగా వుందామనుకున్నా అందమైన ఊహ తనకిప్పుడు ఊగిసలాడుతుంది. 


   తన కోడలు ఎప్పుడైతే తనకు విలువివ్వలేదో...అప్పుడే ఒక నిర్ణయం మనసులో చోటుచేసుకుంది ప్రసూనకు.


   "అత్త అమ్మా కాదు....కోడలు కూతురూ కాదు" 

    

    ఇది నిజమేనేమో...? కోడలికి అమ్మగా వుండే ప్రయత్నంలో తాను చేసిన లోపం మాత్రం తనకు అర్థం కావట్లేదు. చేస్తున్న ప్రతిపనికీ ఏదోరకంగా కోడలు తప్పుపట్టడం తన మనసుకి కష్టంగానే ఉంది. కోడలి ప్రవర్తనతో తనూ సర్దుకుపోలేక అత్తగారికుండే అహంకారమే ఆమె లోనూ తొంగిచూస్తుంది.

   

   కూతురు ఏమాటన్నా కన్నతల్లి సర్దుకుపోగలదు. అలాగే కన్నతల్లి చెప్తేనే ఆకూతురుకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అది వారిద్దరి మధ్యా వుండే పేగు బంధం అలాంటిది. దీన్ని ఎవరూ తప్పుపట్టలేము. కానీ ఈబంధం రక్తంలో వచ్చింది కాదుకదా...తెచ్చిపెట్టుకున్న బంధాల్లో అరమరికలు తక్కువే వుంటాయనిపించింది. 


   అమెరికా వచ్చినప్పటినుంచీ....తనకు జీవితంలో ఎదురవుతున్న మార్పుల్ని ఇట్టే గమనిస్తుంది ప్రసూన. 

  

    ఇక్కడ అన్ని హంగులూ ఉంటాయి. బయట తిరుగుతున్నంత సేపూ కొత్తలోకంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. మళ్లీ ఇంట్లోకి అడుగు పెడితే జైలు జీవితమే. కొడుకూ కోడలు ఆఫీసులకు వెళ్లిపోతూ మనుమడిని కూడా ప్లే స్కూల్లో దింపేస్తారు. ఆసమయమంతా...ఇంట్లో పనిచేసుకుంటూ...వాళ్ళు తిరిగి వచ్చేసరికి...అన్నీ సమకూర్చిపెట్టడం అయిపోతుంది. శని ఆదివారాలు కాస్తా కొడుకూ కోడలూ పార్టీలు షికార్లంటూ తిరుగుతారు. బయటకు వెళ్లాలనిపించి ఎక్కడికైనా తీసుకెళ్లమని కొడుకూ కోడల్ని అడుగుదామని వున్నా... అభిమానం అడ్డొస్తుంది. అదీగాక... చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని తయారు చేసి మనవుడికి పెడుతుంటే...కోడలికి నచ్చడం లేదు. పిల్లాడికి ఏవిపడితే అవి పెట్టేయొద్దని మొహం మీదే చెప్పేసింది. వాడికి స్నానం చేయించినా...ఆటలాడించినా... ముద్దు చేయడం, పెంపకంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. వాటన్నిట్టికీ తల ఆడిస్తూ...చేయాలి. ఎలాంటి పొరపాటు వచ్చినా. ..లేనిపోని భేదాభిప్రాయాలు అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకుంటాయేమోనని భయపడింది. కలిసిన కొద్దిరోజుల్లోనే మనస్పర్థలు మొలకెత్తడానికి చిన్న చిన్న మాటలు చాలనిపించింది. అలాంటి రోజులు ఇకపై చోటుచేసుకోకూడదని ...అక్కడుండి వారికి సేవలు చేసేకంటే....అనారోగ్యంతో మంచం మీదున్న అత్తగారికి సేవ చేసుకోవడంలోనే తృప్తి ఉంటుందని తెలిసొచ్చింది. ఏ మాత్రం కనికరం లేకుండా ఆ స్థితిలో ఉన్న అత్తగారిని వృద్ధాశ్రమంలో అప్పచెప్పి రావడం...క్షమించరాని నేరమే... తనను తాను తప్పుపట్టుకుంటూనే ఉంది ప్రసూన. 


   తన అత్తా కోడలు నడుమ తన జీవితమేమిటో తనకిప్పుడు బాగా అర్థమయ్యింది. అటు అత్తగారికి కోడలుగానూ...ఇటు కోడలికి అత్తగారిగానూ తనవంతు బాధ్యత వహించడానికే తాను పుట్టాననుకుంది. 


  ప్రస్తుతం...తన కొడుకు దగ్గరకంటే... తన అవసరం వయసుడిగిన అత్తగారికే వుందనిపించింది. ఆమెను క్షమించమని తల్చుకుంటూ మనసును సర్దిచెప్పుకుంది ప్రసూన...!!*


         ****     ****   **** 



Rate this content
Log in

Similar telugu story from Inspirational