శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

అనుకోని ఆతిధ్యం

అనుకోని ఆతిధ్యం

2 mins
307


           అనుకోని ఆతిధ్యం

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


 భోరున వర్షం...!

 ఇంటికి అతిథులు వస్తున్నారు.

 అనుకోకుండా మావారి స్నేహితుడు తన భార్యతో 

కాకినాడ నుంచి హైదరాబాద్ కార్లో వెళ్తూ ...వర్షం ఎక్కువుగా కురుస్తూ ఉండటంతో ఈరాత్రికి మీ ఇంటిదగ్గర ఆగి ఉదయం బయలుదేరతాం అంటూ నాభర్తకు ఫోన్ చేసి చెప్పడంతో నాగుండెల్లో రాయిపడ్డట్టు అయ్యింది. 


  మేము విజయవాడలో ఉండటం వల్ల ఇంటికి వస్తూపోయే అతిధులు ఎక్కువే అయినా...నేనెప్పుడూ వంటచేయడానికి తడబడలేదు. బంగాళాదుంపలు తప్ప, ఫ్రిడ్జ్ లో ఎలాంటి కాయగూరలు కనబడలేదు. ఈ వర్షం వల్ల బయటకు పంపంచి తెప్పించడానికి కూడా అవ్వక వారిద్దరికీ రాత్రికి ఏం వండి పెట్టాలో అర్థం కాలేదు. 


  వారికి సంతృప్తిగా భోజనం పెట్టాలి. ఇప్పుడెలా...? నాలో ఒకటే కంగారు. 


  "ఇదిగో ముందే చెప్తున్నా. అందరూ వండుకున్నట్టే గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, సాంబారు, టమాటా ములక్కాడ అంటూ రొటీన్ కూరలు చేసి వాళ్లకు బోర్ కొట్టించకు. ఏదైనా స్పెషల్ గా గుర్తుపెట్టుకునేట్టు ఒక్క కూరైనా చేసావంటే నీవిచ్చే ఆథిద్యాన్ని జీవితంలో మర్చిపోలేరు. అలాంటిదేదైనా చేసిపెట్టు" అంటూ నన్ను చిన్నగా మందలించారు నాభర్త.


  "మహానుభావా...మీరు అవన్నీ చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా లేను. ఇంట్లో కాయగూరలేమీ లేవు. మీరేగా ఉదయం తెమ్మని చెప్తే రేపు తెస్తాలేవే అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు వాళ్ళకి నేనేం వండిపెట్టాలో తెలీటం లేదు. పోనీ... ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసి, బంగాళదుంప వేపుడు, రసం , పెరుగుతో వడ్డించేయనా..?" మావారిని అడిగాను. 


  "నీ మొహం. ఈరోజు శనివారం మాట మర్చిపోయావా...? ఆమ్లెట్లవీ ఎలా తింటారని...? ఒక పనిచేయి...ఆ బంగాళదుంప వేపుడుతో పాటూ...నువ్వు అప్పుడప్పుడు పెట్టే అల్లం పులుసు పెట్టు" అంటూ చిన్న సలహా పడేసారు.


   నిజమే...ఆయన చెప్పినట్టు అల్లంపులుసు చేస్తే మంచిదనిపించింది. ఈ వర్షాకాలంలో స్పెషల్ గా వుండి వేడి వేడి అన్నంలో కారం కారంగా నోటికి ఎంతో రుచిగా ముద్ద దిగిపోయే అల్లం పులుసు పెడితే బాగుంటుందనిపించింది. తల్చుకోగానే నాకూ నోరూరింది. ఈ చల్లటి వాతావరణంలో ఒంటికి వేడి కూడా పుట్టి....దగ్గు, జలుబు, కఫాలు వంటివుంటే అన్నీ మటుమాయమైపోతాయి కూడా. 


  అనుకున్నదే తడవుగా అల్లం పులుసుతో పాటూ కరకరలాడే బంగాళదుంప వేపుడు, గుమ్మడి వడియాలు చేసి పెరుగన్నంలో నంచుకోడానికి ఉసిరికాయ ఊరగాయ కూడా సీసాలోంచి తీసి సిద్ధం చేసి హమ్మయ్య అనుకున్నాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు అనుకోకుండా అతిధులొస్తున్నారంటే ఎవరైనా ఇలాగే కంగారు పడతారేమో కదానిపించింది.


   అతిధులు రానే వచ్చారు. కుశలప్రశ్నలు అయ్యాకా వ్యాష్రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయివచ్చారు.


   మంచి ఆకలి మీద ఉన్నారేమో...అన్నం వడ్డిస్తాను అనగానే డైనింగ్ హాల్లోకొచ్చి కూర్చున్నారు. నలుగురం ఒకేసారి భోజనాల దగ్గర కూర్చున్నాం. ఏమీ మొకమాటం లేకుండా అల్లం పులుసు మళ్లీ మళ్లీ వేసుకుంటూ గుమ్మడి వడియాలు, బంగాళదుంప వేపుడు నంజుకుంటూ తృప్తిగా తిన్నారు.

   

  "చెల్లెమ్మా ఈ అల్లం పులుసు తింటుంటే చేపముక్కలు లేకపోయినా చేపలపులుసు తిన్నంత రుచిగా ఉందమ్మా" అంటూ మెచ్చుకుని...పులుసు ఎలా చేసారో అడిగి తెలుసుకోవే" అంటూ వాళ్ళావిడతో అంటుంటే ముసిముసిగా నవ్వుకున్నాను. 

   

   "అవునండీ...నేనూ అదే అనుకున్నాను. పులుసు చాలా బాగుంది. ఎలా పెట్టారో మాకూ చెప్తారా" అన్నారావిడ.


  "అయ్యో...ఇది పెద్ద కష్టమేమీ కాదు . తప్పకుండా చెప్తాను" అంటూ అల్లం పులుసు చేసే విధానం చెప్పేసాను. 


  "అయితే ఈసారి నేనూ ప్రయత్నిస్తాను." అన్నారావిడ.


  వర్ధం తగ్గడంతో మర్నాడు ఉదయమే ప్రయాణమై హైదరాబాద్ వెళ్లిపోయారు. వారం రోజులు తిరక్కుండా మావారికి ఆ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పిందేమిటంటే...నేను చెప్పిన అల్లం పులుసుని వాళ్ళావిడతో పెట్టించుకున్నారంట. చాలా బాగా వచ్చిందంట. మా ఇంటికొచ్చి భోజనం చేసినందుకు మంచి రెసిపీ తెలుసుకున్నామని ఆనందంగా చెప్తూ నాకు థాంక్స్ చెప్పమన్నారంట.


   దానితో మావారికి నేను లోకువైపోయాను. 

  "చూసావా...ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మాంసాహారాలు, శాఖాహారాలు ఎక్కువెక్కువ చేసేయనవసరం లేదు. నీకు బాగా వచ్చిన స్పెషల్ ఐటమ్ ఒక్కటి చేసినా వారికి గుర్తుండిపోయేలా వండమని ఎప్పుడూ అంటూనే ఉంటాను. ఈసారి ఎలాగైతే విన్నావు కాబట్టి... నీ అల్లం పులుసు ఎంతగా పేరు మోసిందో చూడు" అన్నారు. 


   నాభర్త మాటనిజమైనందుకు...."అవునండీ...రుచీ పచీ లేకుండా ఎన్నో రకాల కూరలు చేసేకంటే ...ఒక కూరతోనైనా రుచికరంగా పెడితే అదే పంచామృతంగా తింటారని ఈఅనుకోని అతిథుల్ని చూసాక అర్థమయ్యింది" అంటూ నేనూ తృప్తి పడ్డాను.*


 

  


Rate this content
Log in

Similar telugu story from Inspirational