శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

ఆతిధ్యం ఖరీదు

ఆతిధ్యం ఖరీదు

2 mins
394


         ఆతిధ్యం ఖరీదు

        -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


    ఇది కొన్నేళ్ళక్రితం మాట. ఓ సిటీని చూడాలంటే... హోటల్స్ లో ఉండి డబ్బును జల్సాగా ఖర్చు చేసే జీతగాణ్ణి కాదు నేను. ఉన్నదాంట్లో పొదుపుగా చేసుకునే వాడిని. నాలుగు డబ్బులు మిగలాలంటే హొటల్లో దిగకుండా స్నేహితుడింట్లో దిగితే... ఖర్చులు కలిసివస్తాయనే ఆలోచనతో నేనూ నాభార్యా బయలుదేరాం...!

   

  హైదరాబాద్ సిటీ...!

  నాకంతా కొత్తప్రదేశం...

  ఆ ఇంటి నెంబర్ అవునో కాదో మరోసారి చూసాకా ...ఆటోవాడికి డబ్బులిచ్చి పంపేసి... పెట్టే బెడ్డింగుతో ఆఇంటి తలుపు తట్టాం.


  ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. వాడే వచ్చి తలుపుతీసాడు. వాడి వెనుగ్గా వాడి భార్య. ఎప్పుడో ఒకప్పుడు వస్తామని ఇదివరకు చెప్పాను గానీ...మేమింత హఠాత్తుగా వస్తామని వారు ఊహించలేదనుకుంటాను. ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని..తెరుకుంటూ...మమ్మల్ని సాదరంగా లోనికి ఆహ్వానించారు.


  మారాక వలన వారిలో కలిగిన భావం నేను గ్రహించకపోలేదు. గుమ్మం పక్కగా చెప్పులు విడుస్తూ... "మరేం లేదురా... నిన్ను చూడాలనిపించి అనుకోకుండా ప్రయాణమై వచ్చేసాము" అంటూ చెప్తుంటే...వాడు పైకి నవ్వుతున్నా...వాడి కళ్ళలో నాకు ఆందోళన కనిపిస్తూనే ఉంది. వాడి ప్రేమాప్యాతలు ఎలాంటివో నాకు తెలుసు కాబట్టి....అవేమీ నేనంతగా పట్టించుకోలేదు.


  మామర్యాదల కోసం వాడి భార్య లోపల సతమతమతున్నట్టుంది...


  ఆతర్వాత అందరం కలిసి బాగా కాలక్షేపం చేసాము. చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి.


  నాభార్య అయితే ఇంకా వుందామంది. ప్రభాకర్ వాడి భార్యా కూడా ఇంకో రెండురోజులు ఉండమని పట్టుబట్టారు. 


  అయినా నేను ససేమిరా అన్నాను.

  వారిద్దరి పిల్లల చేతుల్లో చెరొక ఐదొందలూ పెడుతుంటే... నేచేస్తున్న పనికి అడ్డుకున్నారు ఆదంపతులిద్దరూ. ఎలాగో వారిచేతుల్లో కుక్కి శెలవు తీసుకుని బయటపడ్డాం.


  వద్దంటున్నా...ప్రభాకర్ స్టేషన్ వరకూ వచ్చి సాగనంపాడు.


  ట్రైన్ కదిలించి...

   

  "ఎలా ఉంది ఈహైద్రాబాదు సిటీ"? అడిగాను భార్యను.

   

  "నాకైతే ఇంకా వుందామనిపించింది. అయినా వారెంతగా ఉండమని చెప్పినా మీరెందుకు బయలుదేరతమని చెప్పారో నాకర్థం కాలేదు" అంది.


  నా భార్యమాటకు కోపమొచ్చినా అర్థమయ్యేలా మందలించాను. "చూడు...ఇలాంటి సిటీలో ఇంటికి చుట్టాలొచ్చి ఒకరోజు ఉన్నారంటే...చాలీ చాలని జీతగాళ్లకు ఒక యుగం గడిచినట్టే. ప్రభాకర్ కూడా ఆకోవకు చెందిన వాడే. నాకంటే కూడా సంపాదనలో చిన్నవాడే". 


  "వాడింట్లో వున్నప్పుడు...నేనే డబ్బులు ఖర్చు చేద్దామన్నా వాడసలు ఊరుకోడు. మనిద్దరికీ ఈరెండు రోజులూ ఏలోటూ రాకుండా తిండి పెట్టాడంటే...వాడంతో ఇంతో అప్పుచేసి ఉంటాడని నాకు తెలుసు. అందుకే వాడి పిల్లలిద్దరి చేతుల్లో డబ్బులు పెట్టాను".   

   

   "పిల్లలకిలా డబ్బులిచ్చి...ఇంటికొచ్చిన ప్రతిఒక్కరూ వెళ్లిపోయేటప్పుడు తమకు డబ్బులిస్తారని ఎదురుచూసేలా పిల్లల్ని పాడుచేయకు" అంటూ ప్రభాకర్ కోప్పడ్డాడు.


  "నిజానికి పిల్లల్ని పాడుచేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఈరెండు రోజులూ వాడు మనకిచ్చిన ఆతిధ్యానికి ఖరీదు కట్టడం తప్పే అయినా...నాకంతకన్నా ఏం చేయాలో తోచలేదు". నాభార్యతో చెప్పేసి...బరువు దించేసుకున్నాను.


  ఇప్పుడాలోచిస్తుంటే...ఆనాడు నేను చేసింది సరైనదే అనిపిస్తూ ఉంటుంది....!!*


   


   

   


   


  


  

   


Rate this content
Log in

Similar telugu story from Inspirational