శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

ఆకుపచ్చని జ్ఞాపకాలు

ఆకుపచ్చని జ్ఞాపకాలు

2 mins
345


        'ఆకుపచ్చని జ్ఞాపకాలు'

        -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


  "అమ్మా...ఈ ఫొటోలో ఉన్నవాళ్లంతా ఎవరెవరు..."?

   

  ఫోటో ఆల్బమ్లో ఎక్కడ దొరికిందో గానీ...దాన్ని తీసుకెళ్లి వాళ్ళమ్మ సుమతికి చూపిస్తూ అడిగాడు పదేళ్ల శ్రవణ్.

   

  ఆ ఫోటో చూస్తూనే...గతంలోకి వెళ్ళిపోయింది సుమతి.


  అత్తయ్య వేసవి సెలవులకు పిల్లలతో పాటూ మాఊరు వచ్చినప్పుడు ఎంత సందడిగా ఉండేదో కదా...! 

   

   అత్తయ్య పిల్లలూ, నేనూ అక్కా కలిసి ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళమో. ఎన్ని కథలు చెప్పుకునేవాళ్ళమో. మా కంటే వాళ్ళపిల్లలు చిన్నవాళ్ళు కావడంతో...ఏడిపిస్తూ కూడా ఆనందించేవాళ్ళం. నానమ్మ తాతయ్య టీవీ చూస్తుంటే... మా పిల్లలమంతా కిందే దొర్లుతూ టీవీ చూసేవాళ్ళం. అదిగో అదే సమయంలో నాన్న వచ్చి క్లిక్ మనిపించిన ఫోటో అది...సుమతికి ఆనాటి తీపి జ్ఞాపకం కళ్ళముందు కదలాడింది ఆ ఫోటో చూడగానే.


  "అమ్మా వీళ్ళెవరెవరో చెప్పమంటే చెప్పవేంటి..."? తల్లి సుమతిని కుదుపుతూ ఈలోకంలోకి తెచ్చాడు శ్రవణ్.


  "ఆ..ఆ...చెబుతాను రా. ఇదిగో ఈ దుప్పట్లో ఉన్నవాళ్లేమో నేనూ మీ పెద్దమ్మా. ఆ బాబులిద్దరూ ఎవరనుకుంటున్నావు...? మద్రాసులో ఉన్న రవి బాబాయి ఒకడు, బెంగుళూరులో ఉన్న తేజా బాబాయ్ ఒకడు. మా పక్కనున్న ఆ బుడతడు ఎవరనుకుంటున్నావు...? ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉండి ఇంజినీరింగ్ చదువుతూ అప్పుడప్పుడు మనింటికి వచ్చే కిరణ్ బాబాయే వీడు. ఈ పెద్దవాళ్ళిద్దర్నీ నవ్వెప్పుడూ చూడలేదులే. ఈయనేమో మా తాతయ్య. ఈవిడేమో మా నానమ్మ" అంటూ ఆ ఫోటోలోని వారి గురించి ఎంతో విపులంగా కొడుక్కి చెప్పింది సుమతి.


  తల్లి ఆఫోటో గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగానూ వింతగానూ విన్నాడు శ్రవణ్. అందుకేనేమో ఆఫోటో మనసులోనే నిలిచిపోయింది. అలాంటి ఫోటో ఈ పదేళ్ల వయసులో తను తీయించుకున్నది ఒక్కటీ లేదు. ఏ ఫోటో చూసినా తాను ఒక్కడే వున్నాడు... నీకెవరూ లేరన్నట్టు వెక్కిరిస్తూ. రాను రాను శ్రవణ్ మనసులో ఏదో వెలితి చోటుచేసుకుంటూ రావడంతో చాలా దిగులుగా తయారయ్యాడు.


  "ఎందుకురా శ్రవణ్ ...ఎంతో చలాకీగా వుండేవాడివి. రోజురోజుకీ ఎందుకిలా తయారవుతున్నావు..."? దిగాలుగా ఉంటున్న కొడుకును దగ్గరకు తీసుకుంటూ అడిగాడు తండ్రి శ్రీధర్.


  తండ్రి ఆదరింపు కొడుకులో చలనం తీసుకురాలేదు. తండ్రి చేతిని విడిపించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.


  కొడుకు ప్రవర్తనకు విస్మయంగా చూసాడు భార్య వైపు.


  "ఏమోనండీ నాకూ అదే అర్థం కావడం లేదు. స్కూల్ కి వెళ్తున్నన్ని రోజులూ చక్కగా ఉండేవాడు. ఇదిగో ఈకరోనా కమ్ముకురావడంతో ఆన్లైన్ క్లాసులు వచ్చాయి. దానితో తోటి పిల్లలతో సంబంధాలు పోయాయి. ఒంటరితనంతో ఏమీ తోచక అస్తమానూ ఈమధ్య ఫోటో ఆల్బమ్స్ చూస్తూ కూర్చుంటున్నాడు. అన్నట్టు మా తాతయ్య నానమ్మలతో ఉన్న నా చిన్నప్పటి ఫోటో వాడికి నచ్చిందో ఏమో...దాన్ని మాత్రం అదే లోకం చూస్తున్నాడీమధ్య" అంటూ తాను కొడుకు విషయంలో గుర్తించినది భర్తకు చెప్పింది సుమతి.


  నిజంగానే...ఆఫోటోని పక్కన పెట్టుకుని పడుకుని ఉన్న కొడుకుని చూసి జాలేసింది శ్రీధర్ కి. కొడుకు తలపై రాస్తూ..."ఏంటమ్మా అమ్మ చిన్నప్పటి ఫోటో నీకింతగా నచ్చిందా"? అన్నాడు .


  "అవును. నాకూ ఇలా అందరితో ఫోటో తీయించుకోవాలని ఉంది. అసలు మనం ఎందుకెళ్ళం... నానమ్మా తాతయ్యల దగ్గరకు...? అక్కడకు వెళ్తే...అత్తా, వాళ్ళ పిల్లలు కూడా సెలవులకు వస్తారు. నేనూ అందరితో కలిపి ఇలా చక్కగా ఫోటో తీయించుకోవచ్చు" అంటూ అలిగి కూర్చున్నాడు.


  వాడు బంధుప్రీతి కోసం ఎంతగా అల్లాడిపోతున్నాడో అర్థమయ్యింది ఆ తండ్రికి. 


  భార్య సుమతి వైపు కొరకొరా చూసాడు. "చూసావా ఈ చిట్టితండ్రి మనసెంతగా విలవిల్లాడుతుందో...? ఆడదానికి ఆడదే శత్రువుగా ఉండటం వల్లే... కలిసి ఉండాల్సిన కుటుంబాల్లో దూరాలు పెరిగిపోయాయి.


   అటు మీ వదినకు నువ్వంటే పడదు గనుక మీ పుట్టింటికి నువ్వెళ్లడం మానేశావు. ఇటు అత్తమామలు నీకవసరం లేదు. నాకున్న ఒక్కగానొక్క చెల్లినీ కూడా నువ్వు చేరదీయవు. ఎప్పుడైనా కలిసి సరదాగా మాట్లాడుకుంటేనే కదా ఒకరింటికి ఒకరు రాకపోకలుంటాయి. అలాంటి అనుభవాలు, అనుభూతులూ మన శ్రవణ్ కి కాకుండా చేసావు. ఇప్పుడు చూడు...అందరూ ఉండి కూడా తనకెవరూ బంధువులు లేరన్నట్టు ఎలా ఫీలవుతున్నాడో" అన్నాడు కోపంగా శ్రీధర్.


  భర్త మాటలు సుమతిలో చిన్న కదలికను తీసుకొచ్చినట్టున్నాయి....


  "నన్ను క్షమించండి. వాడి దిగులుని పోగొట్టాలంటే మీరే ఏదో ఒకటి చేయండి" అంది ప్రశ్చాతాపంగా.


   అదే అవకాశంగా...తన చెల్లెలుకి ఫోన్ చేసాడు. "నువ్వూ, బావగారు, పిల్లలు కలిసి అమ్మా వాళ్ళ దగ్గరకు వస్తే...మేమూ కార్లో బయలుదేరి అదే సమయానికి మనూరు వస్తాం" అంటూ. 


   అనుకున్నట్టుగానే స్వగ్రామంలో అందరూ చానాళ్లకు కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. పిల్లయితే మూకుమ్మడిగా చేరి ఒకటే ఆటలు. 


   శ్రవణ్ వాడత్తయ్య పిల్లలతోనూ...తాతయ్యా నానమ్మలతో ఉండగా వాడికి తెలియకుండానే ఫోటోని క్లిక్ మనిపించాడు శ్రీధర్.


  బాల్యంలో తీయించుకునే ఇలాంటి ఫొటోలే కదా...ఎవరికైనా ఎన్నటికీ గుర్తుండిపోయే మధురమైన ఆకుపచ్చని జ్ఞాపకాలు...!!*


   




  


Rate this content
Log in

Similar telugu story from Inspirational