26.ఓ తండ్రి కోరిక
26.ఓ తండ్రి కోరిక


"అతని భయమదే.......ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందేమోనని. నెల తప్పిన వెంటనే భార్యకు అబార్షన్ చేయిస్తానన్నాడు. కానీ మళ్లీ ఏమనుకున్నాడో ఏమో...ఎక్కడో ఆశపుట్టి...ఆ ప్రయత్నం చేయలేదు .
భూమిక పురిటి నొప్పులు పడుతుంది.
ఆకాష్ పుట్టే బిడ్డకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు...మూడవసారి కూడా ఆడపిల్లే పుడితే అనే శంక వదిలేసాడు. ఈసారి తప్పకుండా మగపిల్లాడే పుడతాడన్న నమ్మకంతో వున్నాడు.
ఆ ఎదురుచూపుల్లో....
భూమిక ప్రసవించినట్టుంది....'కేర్' మంటూ అప్పుడే భూమి మీదకొచ్చిన పసిబిడ్డ ఏడుపు.
"ఆడపిల్ల"...తలుపు తోసుకుంటూ బయటకొచ్చి చెప్పింది నర్స్.
ఆమాట వింటూనే తుళ్ళిపడ్డాడు ఆకాష్. ఆశ అడియాశ అయినందుకు అతని భయం మళ్లీ మొదలయ్యింది....
నీరుగారిపోయిన భర్తను చూస్తుంటే...తనకు పుట్టిన బిడ్డ ను చూసి అంతగా ఆనందించలేకపోయింది. భర్తకు ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు భూమికకు...!
* * *
అనారోగ్యం పాలై...ఆసుపత్రిలో పడున్నాడు ఆకాష్. వచ్చిన వ్యాధి ప్రాణాంతకం కావడంతో....బ్రతికి బయటపడతాడన్న నమ్మకం చెప్పలేకపోయారు డాక్టర్లు.
తనకు తెలుసు...తాను బ్రతికి బయటపడలేడని. చచ్చాక...తన తలకొరివి పెట్టడానికైనా ఒక కొడుకు ఉండాలని ఎంతో ఆశ పడ్డాడు. అలాంటి సమయం దగ్గరపడింది. కొడుకంటూ లేకపోవడం వల్ల...తనకు జరిగే దహన సంస్కరణలు సరిగా జరగవనే...ఆనాటి నుంచి ఈనాటి వరకూ అతనిలో భయం మరింత రాజుకుంది.
" కొడుకులు లేకపోతే ఏమయ్యింది...? అల్లుళ్లు ఆ పని చేయడానికి పూనుకోవచ్చు".... అని చెప్పారెవరో...
పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేయడంతో... తాను ప్రాణం విడిచేలోపు అల్లుళ్ళ దగ్గర నుంచి మాట తీసుకుందామనుకున్నాడు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా...తల కొరివి పెట్టకపోతారా అనే ఆశతో.
మావగారు ఆమాటెక్కడ తమని అడుతారోనని.... ముందుగానే పక్కకు తప్పుకున్నారు . తమ తల్లి దండ్రులు బ్రతికుండగా...మరొకరికి తలకొరివి పెట్టకూడదన్న మూఢ సాంప్రదాయంతో.
ఇదంతా తెలుసుకున్న మూడవ కూతురైన శ్రీజ...అతని భయాన్ని పోగొట్టి ...కోరికను తీర్చడానికి ...తండ్రి చేతిలో చేయి వేస్తూ ఇలా చెప్పింది.
" చూడండి నాన్నా...! మీకు తల కొరివి పెట్టడానికి ఎవరినీ అడగాల్సిన పనిలేదు. నేను పుట్టేముందు మగపిల్లాడు అయితే బాగుండునని ఎంతో ఎదురుచూసారని అమ్మ చెప్పింది. ఆడపిల్లగా పుట్టడంతో....ఇలాంటిరోజున కొడుకు లేకపోతాడని ఎన్నాళ్ళుగానో భయపడుతున్నారని కూడా చెప్పింది. నా స్థానంలో మీకు లేకుండా పోయిన కొడుకుని... నేనే అనుకోండి. ఎవరెవరినో అడిగేకంటే...నాతండ్రికి తలకొరివి పెట్టే హక్కు నేనే తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి" అంటూ కూతురుగా....ధైర్యాన్ని నూరిపోసింది.
కూతురు కొడుకుగా చేయాల్సిన పని చేస్తానని మాట ఇవ్వడంతో...అతని భయం పోయి తృప్తిగా ప్రాణాలు విడిచాడు ఆకాష్....!!*
*** *** ***