24.వ్యసనం
24.వ్యసనం


"పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి నాన్నా..."? పదేళ్ల శ్రీజ తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగింది...తన తండ్రిని.
కూతురు అంత చక్కటి విషయాన్ని అడిగేసరికి...ఎంతో ముచ్చటేసింది ఆకాష్ కి.
కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని..."పర్యావరణ పరిరక్షణ అంటే మన చుట్టుపక్కల వాతావరణాన్ని కాపాడుకోవాలి అని అర్థం.
ఎలా కాపాడుకోవాలి నాన్నా...? మనమేమైనా హాని చేస్తున్నామా ...? అమాయకంగా అడిగింది శ్రీజ.
"చెప్తానురా...నీకంతా అర్థమయ్యేలా చెప్తాను. సరేనా..."! కూతురి ఆతృతకు...నవ్వుతూ ఇలా చెప్పుకొచ్చాడు ఆకాష్..
"పర్యావరణ కాలుష్యం మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని లేకుండా చేయాలంటే మన చేతుల్లోనే ఉంది. మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతుందన్న మాట.
ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గంచాలి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని కూడా తగ్గించాలి.
నీకు తెలుసా ? ప్లాస్టిక్స్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు... మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది,
మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే ప్రాణ వాయువు. మనం చేసే పనుల వల్ల కాలుష్యం ఎంతో జరుగుతోంది. దీని వల్ల రోజూ కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి. భూమి వేడెక్కటం కూడా మనం చేసే పనుల వలనే.
ఇదంతా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే...
ఇంటి ముందు ఎవరికి వాళ్ళు చెట్లు పెంచుకోవాలి.
మన ఇంట్లో వుండే చెత్తను కాల్చకుండా రోడ్డు పక్కన వుండే చెత్త కుండీలో పడేయాలి.
అలాగే ప్లాస్టిక్ ని వాడ్డం మానేసి...మనం ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మనతో ఒక సంచి తీసుకెళ్లాలి. మంచి నీరు కూడా ఇంట్లో నుండి తీసుకెళ్లాలి. అప్పుడే ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం మానేస్తాం కదా.
ఇంధనం వాడకాన్ని తగ్గించాలంటే...మనం వెళ్లాల్సిన చోటు దగ్గరే అయితే నడచి వెళ్లాలి. మన ఆరోగ్యానికి కూడా మంచిది, కాలుష్యం తగ్గుతుంది.
శబ్దం వల్ల, గాలి వల్ల, నీటి వల్ల ఇలా ఎన్నో రకాల వల్ల కూడా మన చక్కటి వాతావరణంలో కాలుష్యం ఏర్పర్చుకుంటుంన్నామన్న మాట...అంటూ కూతురికి విడమర్చి అర్థమయ్యేలా చెప్తుంటే....స్కూల్లో చెప్పబోయే డిబేట్ కాంపిటీషన్ కి రాసుకుంటుంది శ్రీజ.
కూతురికి అర్థమయ్యేలా ఆకాష్ అలా చెప్తుంటే....వారినే చూస్తూ కూర్చుంది భూమిక.
చెప్పడం అయిపోవడంతో....జేబులోనికి చేయి పోనిచ్చాడు ఆకాష్.
నాన్నా...ఇంకో చిన్న డౌటుంది. అడగనా...? అడిగింది శ్రీజ.
అడుగమ్మా....ఇంకా ఏమర్ధం కాలేదు...? అనునయంగా అడిగాడు.
"కాలుష్యం అరికడితే...మన పరిసరాల్ని రక్షించుకోవచ్చు అని చక్కగా చెప్పారు కదా...ఇవన్నీ తెలిసి మీరెందుకు మరి గాలిని కాలుష్యం చేస్తున్నారు....? ఇది మీ ఆరోగ్యాన్నే కాదు....అమ్మకీ, నాకూ చుట్టుపక్కల ఎవరికైనా హాని కలిగించేదే కదా.....అంటూ తండ్రి చేతిలో ఉన్న సిగరెట్టును తీసుకుని...చెత్తబుట్టలో పడేసింది శ్రీజ.
కూతురు చేసిన ఆ చేష్టకి నిర్ఘాంతపోయాడు ఆకాష్.
తాను చేయలేని పని కూతురు శ్రీజ చేసినందుకు.... ఆనందంతో చప్పట్లు చరిచింది భూమిక.
అప్పుడే టీవీలో ఓ ప్రకటన....
ఈ నగరానికి ఏమయ్యింది...? ఒక వైపు పొగ, మరో వైపు నుసి. ఎవరూ నోరు మెదపరేంటి...? అంటూ...
ఇంతకాలంగా తప్పు చేసినందుకు కూతురు ఎదుట తల తలదించుకున్నాడు. నిజమే....తన వ్యసనాన్ని ఈరోజు నుంచే ఖననం చేయాలి గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆకాష్.....!!*
*** *** ***