21".ప్రజా నాయకుడు"
21".ప్రజా నాయకుడు"


ప్రజా నాయకుడు
- శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
డమ్.. డమ్ అంటూ డప్పుల మోత...!
ఆ మోత పిలుపుకు ...పెద్దలు పిల్లలు కాస్త వెనక ముందు అన్నట్టు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
డప్పుల మోత మోగుతూనే ఉంది...
మన నలభై ఒకటో వార్డు అమ్మలకు, అయ్యలకు మా విన్నపం. ఈరోజు రాత్రి ఏడు గంటలకు వీధి సివార్న ఉన్న మర్రి చెట్టు కాడ రాబోయే ఎలచ్చన్ల గురించి మన సత్యం మాస్టారు, కొంతమంది పెద్దలు పెట్టే మీటింగ్ కు మీరంతా రావాలండోయ్..." అంటూ దండోరా వేస్తూ ముందుకు సాగాడు డప్పు సాయిగాడు.
"ఇదేమిడ్డూరం బాబూ! సత్యం మాస్టర్ ని మనం నామినేషన్ వేయమంటే వేయనన్నారు. ఆయనే మీటింగ్ పెట్టడం ఏంటి...?" ఒక కుర్రాడు అనుమానం వ్యక్తపరిచాడు ఓ పెద్దాయనతో.
"అదేంటో ఈ రాత్రికి తెలుస్తుంది కదా. ఈ లోపు నీకు కంగారెందుకు రా" అంటూ భుజం తట్టారు ఆ పెద్దాయన.
రాత్రి ఏడు గంటలు అయింది...!
వీధి చివరన మర్రి చెట్టు కాడ సీరియల్ సీట్ల లైట్లతో ఆకర్షణీయంగా ఉంది. మైక్ లో పాటల మోత హోరెత్తి పోతుంది.
ఆ ప్రదేశమంతా ఆ వార్డు ప్రజలు చోటు చేసుకున్నారు.
ఇంతలో నలుగురు పెద్దలతో సత్యం మాస్టారు అక్కడకు వచ్చేసరికి ప్రశాంతంగా మారిపోయింది ఆ ఆవరణం.
వాళ్లు స్టేజి మీద ఎక్కి కుర్చీల్లో ఆశీనులయ్యాకా... "ఇప్పుడు మన సత్యం మాస్టారు రాబోయే ఎలక్షన్ల గురించి ఎవరికి ఓటు వేస్తే బావుంటుందో ముందుగా చెబుతారు" అంటూ మైకులో అనౌన్స్ చేసాడు ఓ యువకుడు. సత్యం మాస్టారు లేచి నుంచుని గొంతు సవరించుకున్నారు.
"ఈ వార్డు ప్రజలకు నా ధన్యవాదాలు...! ఎందుకంటే వార్డు కౌన్సిలర్ గా నన్ను పోటీ చేయమని కొంతమంది పెద్దలు ప్రోత్సహించారు. అయితే రాజకీయాలంటే బొత్తిగా కిట్టదు నాకు. అయినా ఆ విషయం మీ అందరికీ తెలియ చెప్పాలనే నా ఉద్దేశ్యం. మన ఓటు చాలా పవిత్రమైనదని మీకు కూడా తెలుసు. ఇది ఎందుకు
గుర్తు చేయాల్సి వచ్చిందంటే మనం ఎన్నుకో బోయే నాయకుడు మనకందరకూ అందుబాటులో ఉండి మన కష్టనష్టాలు తెలుసుకోవాలి. వాటి పరిష్కారం కోసం నడుం బిగించి వార్డు అభివృద్ధికి కంకణం కట్టుకున్న వాడై ఉండాలని నా ఉద్దేశ్యం. అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే మన ఓటు కు పవిత్రత చేకూరేది."
"అందుకే ఇప్పుడు మనం గమనించాల్సింది ఈ ఎన్నికల రంగంలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? వాళ్ల మంచిచెడ్డలు ఏమిటి? అని ఆలోచించాలి."
"గతం ఎలక్షన్స్ లో లాగే ఈసారి కూడా పాత అభ్యర్థులే అయిన రాజారావు, సుబ్బారావులే నుంచున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళను బట్టి ఈసారి ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే బావుంటుందో... సులభంగా తెలుసుకోవచ్చు. వాళ్ళిద్దరూ మన వార్డు కోసం ఏమి చేశారో గమనిస్తే...
" పోయినసారి రాజారావు సుబ్బారావు మీద అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఈ వార్డు కౌన్సిలర్ అయ్యారు. అయితే తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకుండా మనకందరకూ తీరని ద్రోహమే చేశారనడంలో సందేహం లేదు. వరదలొచ్చినా, తుపానులొచ్చినా, కష్టమొచ్చినా ప్రజల మొర ఆలోచించకుండా మనిషి జాడే లేకుండా పోయేవాడు. కానీ సుబ్బారావు అలా కాదే...
ఎలక్షన్ లో ఓడిపోయిన నిరంతరం వార్డు అభివృద్ధి కోసం కృషి చేశాడు ఓ సామాన్య కార్యకర్తగా. అటువంటి వ్యక్తి చేతిలో మన ఓట్లను ధార పోసి కౌన్సిలర్ గా చేస్తే మన సమస్యలు గట్టెక్కుతాయి అనే నమ్మకం నాకుంది. కాబట్టి.. నేను మరికొందరు పెద్దలు కలసి పోటీలో ఓ అభ్యర్థి అయినా సుబ్బారావునే బలపరుస్తున్నాము. మీరు కూడా సరైన నిర్ణయం తీసుకుని మాతో ఏకీభవిస్తే సుబ్బారావు ఈ వార్డు కౌన్సిలర్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే సరైన నిర్ణయం చేసుకొని ఓటు చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ ఉపన్యాసం ముగించారు సత్యం మాస్టారు.
ఆ తర్వాత...
ప్రజా బలం తో అవార్డు కౌన్సిలర్ గా సుబ్బారావు అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఎలక్షన్స్ లో.
ఇప్పుడు ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తే సహకరించేది కౌన్సిలర్ సుబ్బారావు కాదు. ఎలక్షన్స్ లో ఓడిపోయిన మాజీ కౌన్సిలర్ రాజారావే.
ఇదీ నేటి రాజకీయం...!!*