వారసత్వం లేని రైతన్నలు
వారసత్వం లేని రైతన్నలు
నేలపై చిందే స్వేద బిందువుల సేద్యం
బ్రతుకు మెతుకుల పండుగగా నిలిస్తే
మట్టిలో కలిసిన విత్తనం మరో జన్మ చూస్తే
రైతు చిరునవ్వులు దళారులు నిర్వీర్యం చేసిరి..
పొలానికి తూకం వేసిన ధాన్యం పిండితే
దొర లాంటి కర్షకవీరుడి లాంటి జీవితం
దొడ్లో పశువుల్లా సంతలో బేరం కుదిర్చితే
చిరునవ్వుల ధాన్యలక్ష్మి కన్యాశుల్కమై వెళ్లిపోయే..
పచ్చ నోట్ల ప్రమాణాలతో నేలతల్లి ఎండిపోతే
నేల కడుపు పండించే నాగలి బతుకు ఏడుస్తుంది
కాడి ఎద్దుల గంటలో నరకపు తలుపులు తెరిస్తే
వైతరణి నదిలో తనువు మునకలు వేస్తుంది..
రైతన్న వాగ్దానపు జల్లులలో తడిసిపోతూ
అమ్ముకునే పంటకు గిట్టుబాటు కనిపించకపోతే
చేతి కంటిన సిరా చుక్క దారి చూపకపోతే
ప్రజాస్వామ్యపు జెండా ప్రశ్నలగా మిగిలిపోయే...
అమావాస్యపు చీకటి భయం ఛీ కొడుతుంది
అర్ధరాత్రి తడిసి పొలమంతా ఏడుస్తుంది
తెల్లారితే బ్రతుకు పంట పశువుల మేత అయినట్లు
నీటి మీద రాతల్లా రైతు బతుకు రాలిపోతుంటే..
మట్టి చేతులు అలిసిపోయి జీవిస్తూ
వారసత్వం దొరక్క కుమిలిపోతున్నాయి
నేల బురదలో తొయ్యడం కష్టంగా భావించి
పిల్లలకు వ్యవసాయాన్ని దూరం చేస్తున్న రైతన్నలు..
