తెగులు పట్టిన తెలుగు
తెగులు పట్టిన తెలుగు
అవును,మీరు సరిగ్గానే చదివారు,
తెగులు పంటలకు కదా! వచ్చేది?
అవును, పంటలకొచ్చే తెగులు కనిపిస్తుంది,
మనుషులకు...మనసులకు వచ్చే తెగులు కనిపించదు,
ఇంగ్లీషు చదివితే ఉద్యోగాలొస్తాయా?
హవ్వ...నవ్విపోదురు గాక!
మన రాష్ట్రంలో జనాభా ఐదు కోట్లు,
ఉన్న ఉద్యోగాలు పది లక్షలు,
మిగిలిన నాలుగు కోట్ల తొంభై లక్షల మందికి,
భాష అవసరం లేదని మీరు ఘోషిస్తారా?
మాతృభాష లో మాధ్యమం ఉండదా..!
ఇలాంటి దారుణం భూమిపై ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా?
ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఐదు భాషలు అనర్గళముగా మాట్లాడగలడు,
చాయ్ వాలా చక్కగా...చమత్కారించగలడు,
ముచ్చటగా మూడు భాషలు మాట్లాడగలడు,
పట్టుమని పదిరోజులుంటే... పరాయి భాష నేర్చుకోగలం,
నేర్చుకోవడం అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది,
అవకాశవాదాన్ని బట్టి ఉండదు,
ఏ పాఠశాలలో చదివి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రచించారు?
ఏ మాధ్యమంలో చదివి నోబుల్ బహుమతి సాధించారు?
భాష జీవనది లాంటిది, పిల్ల కాలువల్లాంటి కొత్త పదాలను తనలో కలుపు కొంటూ సాగిపోతుంది,
ఒక్కోసారి చదివిన చదువుకు... చేసే ఉద్యోగానికి సంబందం ఉండదు,
రాబోయే ఎన్నికల్లో నాయకులు ఇంగ్లీషు లోనే ఓట్లు అడుక్కుంటారా?
కరపత్రాలు కూడా ఆంగ్లంలో ముద్రిస్తారా?
కార్పొరేట్ పాఠశాలలో పిల్లలు పుస్తకాలలోని పదాలు మింగడం పరీక్షల్లో కక్కడం,
ఇదేగా మీరనుకుంటున్న ఇంగ్లీషు మీడియం,
ఏ మాధ్యమం లో చదినా అందరికీ ఉద్యోగాలు రావు,
తెలంగాణలో తెలుగు భాష కున్న ప్రాధాన్యత ఇక్కడేది?
ప్రక్క రాష్ట్రం లో ఉర్దూకున్న గౌరవం ఇక్కడ తెలుగు భాషకేదీ?
యం.ఎ తెలుగు చదవని,తెలుగు పండితుడు కాని నేను... కవితలు, పద్యాలు రాసినట్లే,
ఆంగ్ల మాధ్యమం చదవనివారు కూడా అవసరాన్ని బట్టి ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించగలరు,
అభ్యసన స్థాయిని నిర్ణయించేది అభిరుచులు,వైఖరులు,ప్రజ్ఞాలబ్ది,
అంతే గానీ మనం పొందే రాజకీయ లబ్ది కాదు
వెయ్యేళ్ల తెలుగు భాషకు ఒక్క వేటుతో తెగులు పట్టుట ఖాయం,
మాతృభాష మృత భాషల సరసన చేరిపోయి చేయనున్నది గాయం.