మర్మం
మర్మం
ఏ గొంతు వెనుక ఏ మాట దాగుందో.
ఏ మనసులో ఏ అంతర్యమో.
ఏ చేతిలో ఏ మాయ ఉందో.
ఏ పాదం ఎటువైపుకో.
ఎవరికి తెలియదు.
ఎంత ఆలోచించినా అంతుపట్టదు.
ఒక్కోసారి నిజమో అబద్ధమో అనిపిస్తుంది.
అప్పుడే సులువైనది కఠినమైపోతుంది.
ఎదలోతుల్లో భారమైపోతుంది,
బరువైపోతుంది ఒక్కోసారి.
చిమ్మచీకట్లో చిక్కుముడుల దారులు,
కనిపిస్తాయో.. మాయమైపోతాయో తెలియదు.
ఆ గొంతులో మాట బయటపడుతుందా?
ఆ మనసులోని మాట తెలిసిపోతుందా?
ఆ చేతిలోని మాయ బయటపడుతుందా?
ఆ అడుగు వేసే దారి అర్థమవుతుందా?
నవ్వుల వెనుక నాటకాలెన్నో,
మాటల వెనుక మర్మాలెన్నో.
మనవాళ్లనుకున్న మనుషుల్లోనే,
మనకు తెలియని కోణాలెన్నో.
నమ్మాలంటే మనసు ఒప్పుకోదు,
నమ్మకపోతే బంధం నిలవదు.
నిజం ఏదో తేల్చుకోలేక,
మనసు మౌనంగా కుమిలిపోతుంది.
కాలం ఎన్నో రంగులు చూపిస్తుంది,
మనిషి అసలు రూపాన్ని బయటపెడుతుంది.
ముసుగులు తొలగిన ఆ క్షణాన,
నిజం మన కళ్ల ముందే నిలుస్తుంది.
మనిషిని చదవడం అంత సులువు కాదు,
మనసులోని మర్మాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు.
ఎవరి లోతు ఎంతుందో కాలమే చెప్పాలి,
ఎవరి నిజం ఏమిటో జీవితమే తేల్చాలి.
