కవియంటే
కవియంటే
హృదిపొంగే శాంతిపూల..తరువేనోయ్ కవియంటే..!
విప్లవించు అగ్గిపూల..కలమేనోయ్ కవియంటే..!
ప్రక్రియ అది ఏదైనా..విశ్వశ్రేయమే కావ్యం..
పలకరించు నిత్యస్నేహ..వనమేనోయ్ కవియంటే..!
కల్మషాలు కాల్చివేయు..ధనమేతన అక్షరాలు..
మౌనకాంతి వరదసాక్షి..వాక్కేనోయ్ కవియంటే..!
నవజీవన రాగాలకు..సరిగమలను నేర్పునులే..
ప్రేమపూల వెన్నెలింటి..స్వరమేనోయ్ కవియంటే..!
తలపులన్ని సిరాచేసి..ఊపిరూదు ప్రాణాలకు..
త్యాగనిధిగ మిగిలిపోవు..రాజేనోయ్ కవియంటే..!
ప్రతిమనసున మానవతా..బీజాలను చల్లేనా..
సమభావం పండించే..ప్రభువేనోయ్ కవియంటే..!
