జగద్గురువు
జగద్గురువు
ఎంతెంతో ఇవ్వకనే..ఇచ్చువాడు జగద్గురువు..!
చైతన్యపు వాహినిగా..నిలుపువాడు జగద్గురువు..!
కన్నులలో కనులుకలిపి..నవ్వేనా కలిసినపుడు..
తలపులన్ని మాయచేయు..చూపువాడు జగద్గురువు..!
చేతిలోన చేయికలిపి..వెన్నుతట్టి ప్రోత్సహించు..
గుణములెల్ల రాల్చివేయు..వెలుగువాడు జగద్గురువు..!
అన్నితెలిసి తెలియనట్లు..మామూలుగ ఉంటాడే..
మాటాడుచు మౌనములో..నిలచువాడు జగద్గురువు..!
సకలలోక సంరక్షణ..జరిపించే యజ్ఞకర్త..
కర్మముక్తి ప్రసాదించ..కదులువాడు జగద్గురువు..!
ఇక్కడ ఇప్పుడు ఉన్నది..స్వర్గమనుచు నిరూపించు..
ఆనందపు మూలముతో..కలుపువాడు జగద్గురువు..!
