Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


సంస్కారం

సంస్కారం

2 mins 304 2 mins 304

           

              

              సంస్కారం

           -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   "ఒరేయ్ రమేష్....నేను హైదరాబాద్ వచ్చి నీదగ్గర ఓ పది రోజులు వుందామనుకుంటున్నాను. నాలుగురోజుల్లో బయలు దేరతాను. రైల్వే స్టేషన్ కొస్తావు కదూ" పెద్ద కొడుక్కి ఫోన్ చేసి అడిగాడు రాఘవయ్య.


   తండ్రి మాటలు వినేసరికి...గతుక్కుమన్నాడు కొడుకు.


   అమ్మో...ఈ ఊరు చివరనుంచి స్టేషన్ కెళ్ళి తీసుకురావడం నావల్ల కాదనుకున్నాడు. ఆయన వస్తే భార్య రుసరుసలు కూడా వినాల్సి వస్తుందని తెగ కంగారు పడిపోయాడు రమేష్. అసమయానికి అలాగే నాన్నా అన్నాడు గానీ...ఆరోజు వచ్చినప్పుడు ఆలోచించచ్చులే అనుకున్నాడు.


    కొడుకు మాట్లాడిన ముక్తసరి మాటలు నచ్చలేదు రాఘవయ్యకు. అయినా...ఏదో పనుల్లో ఉన్నాడేమోనని సరిపెట్టుకున్నాడు. 


    తనకున్న ఇద్దరి కొడుకుల్నీ బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని ఆశించినా... పెద్దవాడికి మాత్రమే చదువబ్బింది. వాడి చదువుకు తగ్గా బ్యాంక్ ఉద్యోగమూ వచ్చింది. మేనేజరుగా ప్రమోషనొచ్చి హైదరాబాద్ లో ఉంటున్నాడు. కోడలు కూడా చదువుకుంది కాబట్టి...టీచర్ గా ఏదో స్కూల్లో చేస్తుంది. పిల్లలు హైస్కూలు చదువులు చదువుతున్నారు. మనుమల్ని చూసి వద్దామనిపించి ఈ ప్రయాణం పెట్టుకున్నాడు. 


   చిన్నవాడైన సతీష్ కు చదువబ్బలేదు. కనీసం పది వరకూ కూడా చదవలేదు. రాఘవయ్య సలహాతో ఊళ్ళోనే చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ఊర్లో ఎవరికి యే కష్టమొచ్చినా ముందుంటాడు. భర్తకు తగ్గట్టే వాడి భార్య కూడా సహకరించడంతో అందరికీ ఆప్తులయ్యారు.


   హైదరాబాద్ కి ప్రయాణం అవుతుంటే స్టేషన్ వరకూ దింపి ట్రైన్ కదిలేవరకూ కదలనేలేదు. జాగ్రత్త నాన్నా అంటూ పదిసార్లు చెప్పాడు. నాపై వాడికున్న ప్రేమకు ముచ్చటేసింది.


           ***    ***   ***


    ట్రైన్ హైదరాబాద్ స్టేషన్ లో ఆగింది గానీ...కొడుకు వచ్చిన జాడ కనిపించ లేదు రాఘవయ్యకు.

    

   ఐదునిమిషాలు బోగీ దగ్గరే నీరీక్షించి చూస్తుండగా ఫోను చేసాడు. 


   "ఏరా రమేష్ ఎక్కడున్నావు...? వచ్చాడనుకుని ఆతృతగా అడిగారు.


   " లేదు నాన్నా... నేను రావడం అవ్వలేదు. స్టేషన్ బయటకు వెళ్లి నుంచుని ఎక్కడ ఉన్నారో గుర్తు చెప్తే...క్యాబ్ బుక్ చేస్తాను. అక్కడికి క్యాబ్ వస్తుంది. అందులో ఎక్కి వచ్చేయండి. తిన్నగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు" అంటూ ఏదో చెప్తున్నాడు. 


   రాఘవయ్యకు ఆ ఊరు కొత్తయినా... కొడుకు చెప్పినట్టు చేయక తప్పలేదు. ఎలాగైతే ఇల్లు చేరాడు. తాతయ్యా అంటూ మనుమలు చుట్టిముట్టినా...కోడలు ముక్తసరిగా "బాగున్నారా" అని మాత్రం అడిగింది.


   "ఏంటి నాన్నా...ఈమధ్యే కదా మిమ్మల్ని కలిసాం. ఇంతలోనే ఇంతదూరం రాకపోతే ఏమయ్యింది. ఈ వయసులో మీకు ప్రయాణాలు కూడా అంత మంచివి కాదు." తన క్షేమం కోరి చెబుతున్నట్టుగా అన్నా... విసుగు ధ్వనిస్తూనే ఉంది కొడుకు మాటల్లో.


   "ఏం లేదురా... అందర్నీ మరోసారి చూడాలనిపించి వచ్చేసాను" అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు చిన్నపిల్లాడిలా.


   వారం రోజులు పోయాకా... ఆదివారం రావడంతో... 


    "ఒరేయ్ రమేష్...ఈరోజు నీకు సెలవే కాబట్టి...మీ అత్తయ్య ఇంటికి తీసుకెళ్తే దాన్ని కూడా ఓసారి చూసినట్టు ఉంటుంది" ఎంతో కోరికగా అడిగారు చెల్లెల్ని చూద్దామని.


   అంతే...రమేష్ తండ్రిపై అంతెత్తు లేచాడు.

   "చూడు నాన్నా...ఇదేమీ చిన్న ఊరు కాదు. నిన్ను ఎక్కడికి పడితే అక్కడకు తీసుకెళ్లాడానికి. నాకున్న ఈ ఒక్క ఆదివారం విశ్రాంతిగా వుండాలనుకుంటాను. మీకు ఇక్కడ ఏమీ తోచనప్పుడు మన ఊర్లోనే ఉండొచ్చు కదా. ఇక్కడకొచ్చి నన్ను చంపకపోతే. అంతగా మీకు చూడాలనిపిస్తే వీడియో కాల్ చేస్తాను. అందులో చూసి మాట్లాడేయండి" అంటూ ఫోన్ చేసి ఇచ్చాడు. అందులోనే తృప్తి పడ్డారు రాఘవయ్య.


   అనుకున్నట్టుగానే పదిరోజుల్లో తిరుగు ప్రయాణం అయ్యారు రాఘవయ్య. ఏమనుకున్నాడో ఏమో...తండ్రిని స్టేషన్ కొచ్చి బండి ఎక్కించాడు రమేష్. ఆ సిటీలో జాగ్రత్తగా ఉండమని పది జాగ్రత్తలు చెప్పారు కొడుక్కి.


          ****    ****   ****


   ట్రైన్ దిగిన తండ్రిని చూస్తూ...ప్రేమగా వెళ్లి చేతిలోని బ్యాగ్ ని అందుకున్నాడు సతీష్. 

    

  "ప్రయాణం బాగా జరిగిందా నాన్నా" తనను పలకరించిన చిన్నకొడుకు మాటల్లో ఎంతో ఆప్యాయత కనిపించింది రాఘవయ్యకు. పోయిన ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. నవ్వుతూ భుజం తట్టారు... 


   "మీరు లేని ఈపది రోజులూ ఇల్లంతా చిన్నబోయింది మావయ్య గారూ" ఇంటికి చేరగానే కోడలు మంచినీళ్ల గ్లాసును అందిస్తూ అంది.


   రాఘవయ్య చిరునవ్వు నవ్వారు.."వచ్చేసాను కదమ్మా" అంటూ.


   రాఘవయ్య కొడుకులిద్దరి గురించీ అదేపనిగా ఆలోచిస్తున్నారు ఈమధ్య.  


   చదువుతో పాటూ సంస్కారం వస్తుందంటారు. కానీ ఆ సంస్కారం బాగా చదువుకున్న పెద్దవాడిలో ఏకోసాన్నా కనిపించలేదు. చదువుకోలేని చిన్నవాడిలోనే కనిపించింది ఎంతో పెద్ద సంస్కారం రాఘవయ్యకు....!!*


          ****      ****    ****

  


Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Inspirational