Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


నేరం దూరం

నేరం దూరం

2 mins 334 2 mins 334


   

       నేరం - దూరం (కరోనా కథ)

       -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

   

   కరోనా ఇప్పట్లో అంతమయ్యేది కాదేమో...?

   రోజురోజుకీ సమస్య తీవ్రంగా పయనిస్తోంది. 

   ఏ నిమిషం ఎవరికి కబళిస్తుందో తెలీని అయోమయంలో వున్నారు ప్రజలంతా. ఏమిటీ దుస్థితి..? కలికాలంలో ఇలాంటి దుర్భర జీవితాలు గడుపుతారని అనుకున్నాను గానీ...నేను బ్రతికుండగా మాత్రం చూస్తాననుకోలేదు. ఇలా రావడానికి ఇంకా నలభై యాభై ఏళ్ళు పట్టచ్చనే నిర్లక్ష్య ఆలోచనలో ఉండేవాడిని. కానీ వాస్తవం కళ్ళముందు కనిపిస్తుంటే...ఇంకా ముందు ముందు నేటి యువత ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలో...? భవిష్యత్తును తల్చుకుంటుంటే...భయమేస్తుంది. 


  భయం నాగురించి కాదు. కాటికి కాళ్ళు చాపుకున్న నేను ఈరోజు కాకపోతే రేపైనా పోయేవాడినే. జీవితాన్ని అనుభవించిన వాడిని. కష్టసుఖాలు తెలిసినవాడిని కాబట్టే... ఒక్కోసారి ఇంకా చావు రావడం లేదేంటాని ఎదురుచూస్తున్న వాడిని కూడా. కుటుంబంలో కలతలు ఉంటే మనసుని పిప్పిచేస్తూ ఉంటాయి. భార్యను కోల్పోయి ఐదేళ్లు కావొస్తుంది. ఎంతైనా జీవితాన్ని పంచుకున్న తోడు దూరమైతే... అదోరకమైన వైరాగ్యం ఆవహించకమానదు. అందుకే నాకు ప్రాణం ఏ రూపంగా పోయినా ఆనందంగా వదిలేస్తాను


   నేను ఆలోచించేదల్లా నా పిల్లలు మనమలు గురించే...

   వాళ్ళు నన్ను తండ్రిగా గుర్తించకపోయినా...వారు నారక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు. పెద్దోడు విదేశానికి వెళ్లడం వల్ల కొడుకు ఒక ప్రాంతంలోనూ ...కోడలు ఒక ప్రాంతంలోనూ ఉంటూ ఉద్యోగాలు వెలగపెడుతున్నారు. ఈ కరోనా పుణ్యమాని కొడుకు కోడలు ఒకే గూటికి చేరినా...వారిద్దరి మధ్యా పిల్లల మధ్యా కూడా కనీస దూరం పాటిస్తున్నారంట. ఇక్కడ తమ్ముడికి ఫోన్ చేసి... నాక్కూడా ఫోన్ చేసి మరీ మరీ చెప్పాడు. 


   " నాన్నా...దయచేసి మీరు బయటకు వెళ్ళకండి. ఈ వయసులో కరోనా మీకు వ్యాపించిందంటే...తట్టుకోవడం మీవల్ల కాదు" అంటూ హెచ్చరించాడు.

   

   నేను తేలిగ్గా తీసిపారేసాను." నాకేం పర్లేదురా. ముందు ముందు మీరెంతో జీవితాన్ని గడపాల్సినవాళ్ళు. నాకు రోజులు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి? మీ ఆరోగ్యాల్ని జాగ్రత్తగా చూసుకోండి" వాళ్ళు బాగుండాలనే తలంపుతో చెప్పాను.


   రెండు రోజులు గడిచాయి...మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి నామంచాన్ని మార్చారు. అక్కడైతే నాకు అన్ని విధాలా బాగుంటుందని. సూర్యకాంతి కూడా తగిలి 'డి విటమిన్' వస్తుందంట. నాలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందంట. అసలే ముసలివాడిని. పైగా షుగర్ ఉన్నవాడిని. కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుగా ఉంటాయంట. అందుకే ముందు జాగ్రత్తగా నన్ను దూరంగా పెట్టారు. నావాళ్ళ భయానికి నాలో నేనే నవ్వుకున్నాను. అసలే నా బాధ్యత వారి మీదుండటంతో కోడలు నాకొడుకు మీద చిర్రుబుర్రులాడుతూనే ఉంటుంది. వారిమధ్య కలహాలు నావల్లే వస్తున్నాయేమో. తనువు చాలిద్దామని చూస్తున్నా...ఈముసలి ప్రాణానికి ఇంకా ఆయుషు పోస్తూనే వున్నాడు ఆదేవుడు. మనుషుల్లోకి కొత్తగా వచ్చిన ఈ కరోనా బంధాల్ని కూడా దూరం చేస్తుంది అనిపించింది. 


   మంచంపై పడుకుని కిటికీలోంచి బయటకు చూస్తున్నాను. రోడ్డు కూడలి ఇంటిముందే ఉండటం వల్ల జంక్షన్లో కట్టబడివున్న గాంధీగారి బొమ్మ వైపు అప్రయత్నంగా కళ్ళు తిప్పాను. అరె...అక్కడ రామూ ఏం చేస్తున్నాడు...? ఒకనిమిషం నాకేమీ అర్థం కాలేదు. కళ్లపై చేతులు పెట్టి ఆ ఎండలోకి చూస్తున్నాను. మనుమడు మాత్రం అక్కడ ఏదో చేశాడని స్పష్టమయింది. నేను తేరుకునేలోపే...రివ్వున పరిగెట్టుకుని వచ్చాడు. 


   "ఒరేయ్...గాంధీ గారి బొమ్మ దగ్గరకు వెళ్లి నువ్వు చేసిన పనేమిటి..? నువ్వక్కడకు వెళ్లి ఏదో చేశావు. కానీ ఏం చేశావన్నది అర్థం కాలేదు.  శాంతంగా మందలించబోతున్న నా నోటిని టక్కున మూసేసాడు . 


   "తాతయ్యా...గాంధీ గారి జీవిత కథలెన్నో నాకూ చెప్తూ వచ్చావు. అందులో గాంధీగారు చెప్పిన అంటరానితనం నేరం అనే విషయం గురించి కూడా నాకు చెప్పావు. అమ్మా నాన్నా నిన్నెందుకు కిందనున్న ఈ రూమ్ లో పెట్టారో మాట్లాడుకుంటుంటే విన్నాను. నన్ను కూడా నీ దగ్గరకు వెళ్ళొద్దని చెప్పారు. అసలేంటీ తాతయ్యా....బయట వాళ్ళతో పాటూ ఇంట్లో ఇంట్లోనే మనుషుల మధ్య కూడా ఈ అంటరానితనం వచ్చేస్తే...పాపం గాంధీ తాత ఏమనుకుంటారు ? ఇదంతా చూస్తూ ఎలా తట్టుకోగలరు...? అందుకే గాంధీతాత చూడకూడదని నల్లటి గుడ్డతో కళ్ళకు గంతలు కట్టేసాను. ఈ కరోనా బూచి అంతమైపోయి... ఎప్పుడైతే మనమధ్య దూరాలు పోయి...మళ్లీ మనం చేయీ చేయీ కలుపుకుంటామో అప్పుడే గాంధీ తాత కళ్ళకు కట్టిన గంతలు విప్పుతాను". అంటూ పదేళ్ల మనుమడు రామూ చెప్తుంటే....అలా చూస్తూ ఉండిపోయాను.

   

   కబళించే కరోనా గురించి అంతగా అవగాహన లేని ఆ లేతమనసుకి ఇప్పుడు పాటిస్తున్న సామాజిక దూరం కూడా అంటరానితనమే కదానే  ఉద్దేశ్యంతో ... జాతిపితయైన గాంధీ గారిపై అమితమైన గౌరవం, భక్తీ ఉన్నందుకు... వాడు చేసిన పనికి నాకళ్ళు చెమర్చాయి...!!*


          Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Inspirational