పట్టుదల
పట్టుదల


ముక్కాలి పీట మీద తలవంచుకొని కూర్చొని ఉన్నాడు రాజేష్. ఆ అబ్బాయి కళ్ళ నిండుగా నీళ్ళు. చాలా ఉదాసీనంగా ఉన్నాడు.
పాకలోంచి బైటికొచ్చిన ఎర్రమ్మ "రాజాబాబూ, ఆణ్ణే కూకున్నావేటి? కూడెడతాన్రా." అని పిలిచింది.
రాజేష్ కి వెళ్ళాలని, ఆవిడ పెట్టింది తినాలని లేదు. తను ఒంటరివాడు. ఈరోజు తనకెవరూ లేరు. వారం క్రితంవరకు అమ్మా నాన్నలతో కలిసి ఆనందంగా ఉండేవాడు. మంచి స్కూల్లో ఏడవ తరగతి చదివేవాడు. తమ జీవితాలు ఒక్కరోజులో తారుమారైపోయాయి.
నాన్నది రొయ్యల వ్యాపారం. బాగా నడుస్తూన్న సమయంలో ఇంకోఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారాన్ని పెంచారు. ఏడాదిపాటు చాలా బాగా సాగింది. ఒక్కసారిగా కరోనా వలన లాక్డౌన్ విధించడంతో, ఎంత ప్రయత్నించినా రవాణా జరగలేదు. రొయ్యలన్నీ పాడైపోయి తీవ్ర నష్టం కలిగింది. లాభాలు పంచుకున్న స్నేహితులు మోసం చేసి నష్టాన్ని అతనిపై రుద్దారు. దాంతో ఉన్న ఆస్తులన్నీ వేలంలో పోయి కట్టుబట్టలతో మిగిలారు.
ఈ ఆలోచనలలో సతమతమౌతున్న రాజేష్ ని ఎర్రమ్మ "బాబూ, ఒణ్ణం తినకుంటే ఎట్టా? మీ యమ్మ లాగా నేనెట్లేను, గానీ నాకున్నదేదో ఎడతా ఇంద బాబూ." అంటూ కంచంలో కలుపుకొచ్చిన అన్నం పెట్టడానికి ప్రయత్నించింది.
విసురుగా చేతిని తోసేయబోయాడు. కానీ అమ్మ మాట జ్ఞాపకమొచ్చింది. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని. మారు మాట్లాడకుండా కంచం తీసుకొని తినేశాడు.
"బాబూ, బాదపడమాక. మీ యమ్మ , అదే నా అన్న బిడ్డ బాగా సదూకొని పట్నం బాబుని సేస్కుంది. ఆ బాబుకు అమ్మా నాన్నలు లేకపాయె. మీ అయ్యకి మంచి రోజులొచ్చి యాపారం బానే సాగింది. అదేందో కరొన ఆనీ మాయదారి జబ్బుతో అది కాస్త మూలబడి నట్టపోయారు. మీ ఆమ్మ , అయ్య నట్టాన్ని తట్కోనేక పానాలు తీస్కొన్నారని, తెలిసి పట్నమెల్తున్న నా అన్న , వదినె కూడా పెమాదంలో పేనాలు పోగొట్కున్నారు. నాను సూత్తే పల్లెటూరి దాయిని. నూ దిగులు పడమాక. నీ డబ్బు యాడికీ పోదు. నూ మారాజు లా సదూకుంటవ్." అని ఓదార్చింది.
ఆమె వాక్కు ఫలమో, అమ్మా నాన్నల మంచితనమో, తన అదృష్టమో కానీ కొంత ఆస్తి కోర్టు ద్వారా తనకు దక్కింది. కోర్టులో వాయిదాలు జరిగిన తర్వాత లాయర్ గారి పుణ్యమా అని కేసును పట్టుపట్టి గెలిపించారు. అనాధ అయిన రాజేష్ అన్యాయం అయిపోకూడదని, కొంత సొమ్ము ఇప్పించారు కోర్టు వారు. ఆస్తికి లాయర్ గారిని గార్డియన్ గా పెట్టి స్కూల్ లో వేశారు. రాజేష్ తనను ఆనెల రోజులు ఎంతో చక్కగా చూసుకున్న ఎర్రమ్మను మర్చిపోలేదు. అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను పలకరించే వాడు.
కొన్నేళ్ళు గడిచాయి. రాజేష్ పట్టుదలగా ఎం.బి.ఎ చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అతను ప్రయోజకుడు కావడంతో ఆస్తి అతని చేతికొచ్చింది. రాజేష్ తన నెమ్మదితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. లాయర్ గారు అతని సమర్ధతను గుర్తించి అల్లుణ్ణి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. అమ్మాయి, అబ్బాయి పరస్పరం నచ్చుకోవడం తో అనతికాలంలోనే వివాహంకూడా జరిగి చక్కగా స్థిరపడ్డాడు.
---సమాప్తం---