పసిపాప నేర్పిన పాఠం
పసిపాప నేర్పిన పాఠం


* * *
సీతారామయ్య ఓ చిన్నకారు రైతు. మూడెకరాల మాగాణీని సాగుచేసుకుని కుటుంబం పోషించుకునేవాడు. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను రాత్రులు మాత్రమే ఇచ్చేది. ఓ రాత్రి సీతారామయ్య పొలానికి నీరు తోడడానికని మోటరు వేయబోతే విద్యుద్ఘాతం తగిలి అక్కడికక్కడే మరణించాడు.
తండ్రి హఠాన్మరణంతో కుటుంబపు బరువు బాధ్యతలు కొడుకు రాఘవ మీద పడ్డాయి. రాఘవ పన్నెండో తరుగతి పూర్తిచేసి, డిగ్రీలో చేరాలనుకుంటూన్నంతలోనే ఆ విషాద సంఘటన సంభవించింది. తండ్రి అకాల మరణంతో కృంగిపోయిన తల్లి, పెళ్ళీడుకు వచ్చిన అక్క, అనారోగ్యంతో బాధపడే వయసు మళ్ళిన నాన్నమ్మ అతని మీద ఆధారపడియున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యత, మరో పక్క అప్పుల బాధాను!
చదువుకు అంతటితో స్వస్తి చెప్పి వ్యవసాయం చేపట్టక తప్పలేదు రాఘవకు. ఓ ఎకరం నేల అమ్మేసి అప్పులు తీర్చేసాడు. మిగతా భూమిని సాగుచేయనారంభించాడు.
ఐతే ఓ పక్క అలవాటులేని పని, ఇంకో పక్క ప్రకృతి వైపరీత్యాలు. వ్యవసాయం కలసిరాలేదు అతనికి. ఒక ఏడు వర్షాభావం వల్ల పంట పండకపోతే...మరో సంవత్సరం పండిన పంట కాస్తా వరదల పాలయ్యింది. ఇంకో ఏడు నకిలీ విత్తనాల కారణంగా అసలు మొలకలే రాలేదు. కల్తీ కలసిన ఎరువులు, పురుగుల మందు మరో సంవత్సరం పంటనష్టానికి హేతువయ్యాయి. ఐదేళ్ళుగా వ్యవసాయం చేస్తూన్న రాఘవకు ఎంత కష్టించి పనిచేసినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రాను రాను వ్యవసాయం చేయడం గడ్డు ఐపోయింది. మరో పక్క ఋణదాతల వేధింపులు దుర్భరమయ్యాయి.
నిస్సహాయతతో ఉక్కిరిబిక్కిరి ఐపోయాడు రాఘవ. ప్రభుత్వం నుండి కూడా తగు సహాయమేదీ అందకపోవడంతో నిరాశ పేరుకుపోయింది అతనిలో. చివరికి జీవితం పైన విరక్తి చెంది, ఇతర రైతుల లాగే తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
తన గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి బయలుదేరాడు, అందులో పడి చావడానికని.
సముద్రానికి చేరువలో ఓ బెస్తవాడ ఉంది. ఆ వాడ మీదుగా వెళ్తూన్న రాఘవకు ఓ దృశ్యం కనిపించింది.
ఓ మట్టి ఇంటి అరుగు ఎత్తుగా ఉంది. ఆ అరుగు పైన ఓ పసిపాప బోసి మొలతో కష్టం మీద లేచి నిలబడి తప్పటడుగులు వేస్తూ క్రింద పడిపోతోంది. మళ్ళీ పైకి లేచి నవ్వుతూ నడవడానికి ప్రయత్నిస్తోంది. ప్రయత్నించిన ప్రతిసారీ పడిపోతూ ఉన్నా మానడం లేదు. పడ్డప్పుడు దెబ్బ గట్టిగా తగిలితే ఏడుస్తోంది. అలాగని తన ప్రయత్నం విడవడంలేదు! మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది.
రాఘవ ఆగిపోయి, ఆ అపురూప దృశ్యాన్ని చిత్రంగా తిలకిస్తూ ఉండిపోయాడు.
‘పడిపోతుందనీ, దెబ్బ తగులుతుందనీ తెలిసీ...మళ్ళీ మళ్ళీ కష్టపడి ప్రయత్నిస్తోంది పిచ్చిపిల్ల. నడవడానికి ఆ చంటిదానికి అంత ఆత్రుత ఎందుకో!’ అనుకున్నాడు విస్తుపోతూ. అతనికి తెలియకుండానే ఆ పలుకులు బైటకే వెలువడ్డాయి.
"పడిపోద్దని భయపడి ప్రయత్నమే చేయకపోతే ఆ పిల్ల నడక నేర్చుకునేదెలా బాబూ?మనిషికి ఓర్పు, పట్టుదల అలవడేది ఆ వయసు నుంచే కదా!" అన్న పలుకులు వినిపించడంతో ఉలికిపడి చూసాడు రాఘవ.
ఎప్పుడు వచ్చాడో, వల భుజాన వేసుకుని తన పక్కనే నిలుచునియున్న ఓ ముసలి జాలరి కనిపించాడు. అంతవరకు అతన్ని గమనించనేలేదు తాను.
"ఔను, బాబూ! పసివాళ్ళు దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా, లేచి నిలుచోవాలనీ, నడవాలనీ చేసే ప్రయత్నంలో గొప్ప వేదాంతం నిండి ఉంది..." మళ్ళీ అన్నాడతను నవ్వుతూ. "పట్టుదలతో ప్రయత్నించనిదే ఫలం దక్కదు. కష్టాలకు వెరచి పిరికిదనంతో పారిపోతే జీవితంలో ఏదీ సాధించలేం".
అతని పలుకులలో ఏదో సత్యం తొంగిచూస్తూంటే, సాలోచనగా జాలరి ముడతలు పడ్డ వదనం లోకి చూసాడు రాఘవ.
"అంతెందుకూ? సముద్రంలో ఎగసిపడుతూన్న ఆ కెరటాలనే తీసుకో...ఒడ్డుకు చేరుకోవాలని రేయింబవళ్ళు తెగ ఉవ్విళ్ళూరుతూంటాయి. కాని, ఒడ్డుకు చేరుకోకుండానే మధ్యలోనే విరిగి తిరిగి నీటిలో ఒరిగిపోతాయి. అలాగని అవి తమ ప్రయత్నం మానుతున్నాయా? రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తూనే ఉన్నాయి..." మళ్ళీ అన్నాడు ముసలి జాలరి. "మనిషి జీవితమూ అంతే బాబూ! కష్టాలకు వెరచి చతికిలబడిపోతే ఇక ముందుకు సాగే దెలా చెప్పు!... వేదాంతం చెబుతున్నాననుకోకు. నగ్న సత్యమిది!" ముందుకు సాగిపోయాడు జాలరి.
‘నిజమే. పసిపాపల నుండీ, సముద్రపు కెరటాల నుండీ మనిషి నేర్చుకోవలసింది ఎంతో ఉంది!’ అనిపించింది రాఘవకు. హఠాత్తుగా జ్ఞానోదయమైంది అతనికి. ’తీరని కష్టాల మూలంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి నా దారి నేను చూసుకోవాలనుకున్నానే గాని...నన్నే నమ్ముకున్న నా వారి గురించి ఆలోచించలేదు నేను. నాకంటె స్వార్థపరుడు మరొకడు ఉండడు!’ అనుకున్నాడు రాఘవ, తన తప్పు గ్రహిస్తూ.
ఆ పసిపాప నేర్పిన పాఠంతో కొత్తగా ఏర్పడ్డ ఆత్మవిశ్వాసంతో, మనో స్థయిర్యంతో...ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకుని, వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాడు.