Sasi Thanneeru

Drama

5.0  

Sasi Thanneeru

Drama

ఫస్ట్ క్లాస్ నువ్వు ఎక్కడ?

ఫస్ట్ క్లాస్ నువ్వు ఎక్కడ?

4 mins
34.9K


#eachforequals

        


మొదటిరోజు డిగ్రీ ఎం.పి.సి లో క్లాస్ రూమ్ కి వెళుతూ ఉన్నాను.ఎదురుగా రాధ.నాతో క్లాస్ కి వస్తూ ఉంది."నీకు సీట్ వచ్చిందా?పో,ఇంక హాయిగా ఇద్దరం చదువుకోవచ్చు"

"ఇద్దరమేనా?" పెద్దగా అడిగాను.

"అవును,ఆడపిల్లల్లో మనకు ఇద్దరికే వచ్చింది.అబ్బాయిలలో చాలా మందికి రాలేదు. కొందరు ఇంజినీరింగ్ కి వెళ్లిపోయారు"చెప్పింది.

రాధ వాళ్ళ నాన్నగారు బోస్ సార్.ఇక్కడే ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్.మా నాన్నగారు మా సినిమాహల్ పుణ్యమా అని అందరికీ తెలుసు.పెద్దవాళ్ళు గురించి కాదు కానీ ఎం. పి.సి అమ్మాయిలు అంటే కొంచెం గౌరవంగానే ఉండేది.ఏవో చిన్న జోక్స్ వెనుక వేసుకుంటారేమో.ఏమైతేనేమి పోయిన ఏడాది ఎం.పి.సి లో ఒక్క ఆడ పిల్ల ఉంటే ఈ ఏడాది మేము ఇద్దరికి పెంచాము.ఇక మార్క్స్ సంగతి చూడాలి.


ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.కోటలో ఇంటర్ పూర్తి చేసుకొని భువన వాళ్ళు కూడా ఇప్పుడు డిగ్రీ చేరారు.నా పాత బ్యాచ్ వచ్చేసింది.క్లాస్ లలో కలవకపోయినా అన్నానికి అందరం కలుస్తాము.ముఖ్యముగా భువన ఇడ్లీ తెస్తే బాక్స్ ఇచ్చేసేది.తమిళ్ వాళ్ళు.వాళ్ళ అమ్మ ఉప్పుడు బియ్యం తో ఇడ్లీ చేసేది.నాకు ఇష్టం అని పంపేది. ఇక కామెంట్స్,జోక్స్,సినిమాలు,అందరి ఇళ్లకు వెళ్లడం,అప్పుడప్పుడూ చదవడం అంతే.


క్లాస్ కి వెళ్లి కూర్చున్నాను.మొదటి బెంచ్ నాకు ,రాధ కు వదిలేసి మిగతా క్లాస్ అంతా కూర్చుంటారు.జూనియర్ ఇంటర్ ఫ్రెండ్స్ గుర్తుకు వచ్చారు.పద్మ, ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ కూతురు.రిషీ వాలీ లో చదివి వచ్చింది.గ్రీటింగ్స్ చక్కగా చేసి మాకు ఇచ్చేది.తనను చూసి నేను రకరకాలుగా గ్రీటింగ్స్ చేయడం హాబీ చేసుకున్నాను.నేను లెటర్ కానీ గ్రీటింగ్ కానీ పంపితే అది తీసుకున్న వాళ్ళు పడేయకుండా దాచుకునేవాళ్ళు.కావలిలో మా పెదనాన్నగారు బొంతల బాల వెంకట సుబ్బయ్యగారు ,గ్రీటింగ్ ఏడాది అంతా ిిఇనపపెట్టి పైన ఉంచి "ఆ అమ్మాయి ఎంత హృదయపూర్వకంగా మన మంచి జరగాలి అని ఆశిస్తూ పంపింది.దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాలి"అనేవారు.

1986 కాలం చాలా మారింది.ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు.కాకపోతే చదువే చాలా కష్టం గా ఉంది.

ఇంకా చుట్టూ చూస్తూ ఉన్నాను.ఓ.వి.పి.

జూనియర్ ఇంటర్ మొదటి ఇంగ్లీష్ క్లాస్ గుర్తుకు వచ్చింది.మిల్ట్ న్ సార్"ది లాస్ట్ డాలర్"పాఠం చెప్పారు."ఎవరైనా ఇప్పుడే ఇక్కడకు వచ్చి సొంతంగా నేరేట్ చేస్తారా?"అడిగారు. ఇంగ్లీష్ లో అదీ స్టేజ్ ఎక్కి చెప్పాలి.అందరూ మౌనంగా తలలు వంచుకొని ఉన్నారు.

నేను చెపుతాను.లేచి వెళ్లి చెప్పాను.భయం ఇంకా తెలీదు.

అప్పటికి మిగిలిన వాళ్లలో చలనం వచ్చింది.ఓ.వి.పి,గోపి,పద్మ చెప్పారు అక్కడ నుండే. స్టేజ్ మీదకు రామని చెప్పారు.సార్ నన్నే మెచ్చుకున్నారు.వాళ్ళ భార్య నాకు హై స్కూల్ లో సైన్స్ టీచర్.నేను ఆమెకు పేవరేట్ స్టూడెంట్.ఇప్పుడు సార్ కి కూడా.


డిగ్రీ క్లాస్ లో చుట్టూ చూస్తూ ఉన్నాను.ఒక్కొక్కరినీ చూస్తే ఒక్కో జ్ఞాపకం.జూనియర్ ఇంటర్ మార్క్స్ దెబ్బకు భయపడి సీనియర్ ఇంటర్ లో చదువులో మునిగిపోయాను కానీ వీళ్ళు అందరూ ఇంతగా నా మనసులోకి ఎలా వచ్చేసారో!

పాత వాళ్ళను చూసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంది.ఫెయిల్ అయిన వాళ్ళ గురించి బాధ పడ్డాను.

మాథ్స్ కి శ్రీనివాసులు రెడ్డి గారే. ఎందుకో కొందరి టీచింగ్ మనకు చాలా సూట్ అవుతుంది.ఎంత పెద్ద లెక్క అయినా ఆయన వివరించడం లో తమాషా ఉంటుంది. ఏముంది ఎల్.హెచ్.ఎస్ తీసుకోండి.నాలుగు ఈస్ క్వాల్ట్ లు కింద పెట్టి ఆర్.హెచ్.ఎస్ వ్రాయండి అంతే,అనేవారు.మధ్యలోదే కదా అసలు కష్టం అని అందరం నవ్వేసే వాళ్ళం.కానీ ఏమి ఇచ్చారు,ఏమి చూపాలి,అనేది మొదట చూడటం,లాజికల్ థింకింగ్ అలాగే అలవాటు అయిపోయింది.గ్యారెంటీ ఈ సారి మాథ్స్ లో సెంట్ కొట్టేస్తాను.

         *********

మా నాన్న మాత్రం అప్పుడప్పుడూ ఇంజినీరింగ్ కి చదువుతున్నావా?అని అడిగేవారు.ఊ కొట్టేదాన్ని. ఇక్కడ డిగ్రీ చదవడానికి టైమ్ ఏది!గాలిలో ఉట్లు కట్టడం నాకు రాదు.చేతిలో దేవుడు ఏ పని పడితే దానిని సిన్సియర్ గా చెయ్యడమే.అసలే చిరంజీవి,సుమన్,అర్జున్,ఇంకా డబ్బింగ్ సినిమాలు అందులో హాల్ మాదే కాబట్టి ఎన్ని సార్లు అయినా చూస్తూఉండటమే.ఇవి కాకుండా మా నెల్లూరు పిన్ని ఎన్ని పుస్తకాలు తెప్పిస్తే అన్నీ,వనితా జ్యోతి,ఆంధ్ర జ్యోతి,స్వాతి,ఆంధ్ర ప్రభ,వైపులా,చతుర, ఇక శ్రీలక్ష్మి ఇచ్చిన లైబ్రరీ కార్డు తో తెచ్చిన నవలలు వీటి మధ్యలో డిగ్రీ పుస్తకాలు,ఇంకా ఇంజినీరింగ్ ఎక్కడ చదివేది?పిన్ని వాళ్ళ పిల్లలను,బావ పిల్లలను ఆడిస్తూ ఉంటే వాళ్లకు వచ్చిన వంటలు,కుట్లు,అల్లికలు,టైలరింగ్ నాకు నేర్పేవాళ్ళు.

ఎప్పుడైనా కాలేజ్ కి వెళ్లక నోట్స్ వ్రాయక పోయినా ఫర్లేదు.రాధా చక్కగా నా కోసం వ్రాసి పెడుతుంది.ఇక నా నోట్స్ వ్రాయకుండా చదివేయ్యడమే.గైడ్ లు ఎక్కువగా లాంగ్వేజ్ కి కొనేవాళ్ళం.అందరూ బూన్ కొంటె నేను టానిక్ కొనేదాన్ని.వ్రాయడం మాత్రం అన్నింటిలో చూసి సొంతంగా వ్రాసేదాన్ని.

రఫ్ నోట్స్ లు లేవు.పాత నోట్స్ లు ఖాళీ పేపర్స్ కుట్టి వాడుకోవడమే.

మాథ్స్ ఇబ్బంది లేదు కానీ ఫిజిక్స్ ఎవ్వరికీ పెద్దగా రావడం లేదు.అలాగే కష్టపడే వాళ్ళం. ఏడాది ఎంతలోకి అయిపోయిందో!

మొదటి డిగ్రీ పరీక్షలు,దానితోనే ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ వ్రాసేసాను.

డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి.నేను పాస్.హమ్మయ్య అనుకున్నాను.అడిగి చూస్తే క్లాస్ లో చాలా మంది ఫెయిల్. పాస్ అయినవాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.

రాధ కూడా ఫెయిల్. మార్క్స్ లిస్ట్ లోకి ఆత్రంగా చూసాము.అందరూ ఫీజిక్స్ లో ఫెయిల్. రాధ కూడా.ఫిజిక్స్ సార్ కూతురు,అయితే ఏమిటి,నో చీటింగ్.అందరూ కష్టపడి మునుగుతూ తేలుతూ స్వయం కష్టం తో పాస్ అవ్వాల్సిందే.ఆ కష్టం లొనే సబ్జెక్ట్ బాగా వచ్చేస్తుంది.రాధ ఏడుస్తూ కంగ్రాట్స్ శశి అని చెప్పింది.నా వాళ్ళు ఫెయిల్ అవడం అనేది నాకు భరించలేని విషయం.అందులో ఉండేది ఇద్దరమే క్లాస్ లో అమ్మాయిలం.మార్జ్స్ లిస్ట్ చూసుకున్నాను.ఫిజిక్స్ లో పాస్ కంటే నాలుగు మార్క్స్ ఎక్కువ.ఏదో ఒకటి.పాస్ అయిపోయాము.

చక్రవర్తి వచ్చి చెప్పాడు"శశి క్లాస్ లో నలుగురికి సెంట్ మాథ్స్ లో.నీకు జస్ట్ మిస్ .నీకు వచ్చి ఉంటే మేము ఇంకా ఆనందపడే వాళ్ళం" ఎక్జడక్కడి కబుర్లు నాకు మోసుకొని వచ్చి చెపుతూ ఉంటాడు.చుట్టు ఉన్న అబ్బాయిలు కూడా కంగ్రాట్స్ చెప్పారు."నీకేమి శశి నువ్వు క్లవర్" చెప్పారు.

అప్పుడు చూసాను మాథ్స్ మార్క్స్.96.నాలుగు తక్కువ సెంట్ కి.బాధగా అనిపించింది.కానీ ఇందరు నా మార్క్స్ పట్టించుకొని నా బాధ పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది.

ముందు ఈ మార్క్స్ నాన్న కు చూపించాలి.

అసలే ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ లో మాథ్స్ తొమ్మిది మార్క్స్ వచ్చాయి అని కోపంగా ఉన్నాడు.అయినా ఆయన కోపం తగ్గించడం నాకు తెలుసు.ఆ రోజే చపాతీ,బొంబాయి చట్నీ చేసాను.హాయిగా తినేసారు. నాకు చపాతీ,నాన్న అభేదం.ఒకటి చూస్తే ఇంకొకరు గుర్తుకువస్తారు.అందులో నేను చపాతీలు బాగా పొరలు వచ్చేటట్లు చేస్తాను.అమ్మ ఎలాగో నేను అల్లేవి చూసి సంతోషం.ఎవరైనా పెళ్లికి శశిని పంపించు,పెళ్లికూతురుకు జాడ వేసి రెడీ చేస్తుంది అని అడిగితే పొంగిపోతుంది,నా కూతురు అని.మా శశి కుదురుగా కూర్చొని చదవదు,చదివితే దానికే ఫస్ట్ క్లాస్ అంటుంది.ఎంత మంది దగ్గర విన్నానో ఈ కామెంట్.నాకు మార్క్స్ తెచ్చుకోవడం కష్టం కానీ మనుషులను ఎలా సంతోషపెట్టాలో తెలుసు.

      *********

"నాన్నా 96 మాథ్స్ లో చూడు"

చూసారు.మెల్లిగా నవ్వు వచ్చింది.

"అందరూ ఫెయిల్ తెలుసా?"

"సరే పో.అమ్మ అన్నం కలిపి పెడుతూ ఉంది"చెప్పారు.

హమ్మయ్య ఇప్పటికి నాన్న కోపం పోయినట్లే,కాకుంటే దానితోనే నా ఇంజినీరింగ్ ఆశ కూడా వదిలేసారు.అక్క ఎం.బి.బి.ఎస్ కల పోయింది.నా ఇంజినీరింగ్ కల పోయింది.దీనిలో అన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఆయనను సంతోష పెట్టాలి. పాపం ఆ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ నమ్ముకున్న అబ్బాయిలు అందరికీ డిగ్రీ మొత్తం అరియర్స్ పడిపోయింది.తిక్క కుదిరింది పో! 

ఏదో అనుకున్నాను కానీ అలా ఇంజినీరింగ్ కోసం ఎదురు చూసి డింకీ కొట్టిన అబ్బాయి నా జీవితంలోకి వస్తాడని అప్పుడు తెలీదు.

ఇప్పుడిక రెండేళ్లు గడవాలి బండి పరీక్షల్లో ఫల్టీ కొట్టకుండా!ఫస్ట్ క్లాస్ నువ్వెక్కడ తల్లీ?కొంచెం నా దగ్గరకు వచ్చేయి.

         @@@@@Rate this content
Log in

Similar telugu story from Drama