ఉద్యోగం
ఉద్యోగం
ఉద్యోగం ఎంత దూరం?
మెల్లిగా క్రిందకు వేలాడేసిన కాళ్ళు తీసి సీట్ మీద పెట్టి కిటికీ కి వీపు ఆనించి కూర్చున్నాను.తొమ్మిదోనెల వచ్చినాకా ఇలా కూర్చోవడం కూడా కష్టం గా ఉంది.ఎదురుగా అమ్మా,నాన్న మాట్లాడుకుంటూ ఉన్నారు.పక్కన వేరే అతను ఎవరో!నా సీట్ చివర ఈయన సర్దుకొని కూర్చున్నాడు."బెర్త్ పైకి పెట్టేదా?పడుకుంటావా?"అడిగాడు ఈయన."వద్దులే ఒకేసారి తిని పడుకుంటాను.ఆ పుస్తకం ఇవ్వు.కాసేపు చదువుకుంటాను"పుస్తకం తీసుకున్నాను.కూర్చుని చడవలేకున్నాను.కానీ చదవాలి.లేకుంటే వీళ్ళ కష్టం అంతా వృధాగా పోతుంది.ఇరవై రోజులు క్రితం వచ్చింది ఈ ఉద్యోగ పరీక్షకు హాల్ టికెట్.మొదటి ఉద్యోగ పోటీ పరీక్ష.హైదరాబాద్ కు వెళ్లి వ్రాయాలి.ఒక రాత్రి పోనూ,ఒక రాత్రి రాను రెండు రోజులు ప్రయాణం.మెరిట్ మీద ఉద్యోగం కాబట్టి వ్రాయాలి అంటారు అమ్మా,నాన్న.ఇటు చూస్తే నాకు తొమ్మిదో నెల పెడుతూ ఉంది.మొదటి కాన్పు. డాక్టర్ ని అడిగి,అత్తగారింట్లో ఒప్పించి ఇప్పుడు నలుగురం ప్రయాణం చేస్తున్నాము. కూర్చోలేక పోతున్నాను.నిలబడి కాసేపు చదువుతూ ఉన్నాను."అవును లోపల బాబు చాలా సేపు నుండి కదలడం లేదే!"ఆలోచన రానే కూడదు.వస్తే దిగులు.ఎనిమిది వరకు బాగా తిరుగుతున్నాడు.తొమ్మిది పెట్టినాక తక్కువగా తిరుగుతున్నాడు.అవును పాప?బాబా?ఎవరైతే ఏమి తిరిగితే చాలు.పొట్ట మీద నిమురుకుంటూ ఉన్నాను.కొద్దిగా కదలకూడదా, అని మనసులో అనుకుంటూ ఉన్నాను."ఏమమ్మాయి,కొంచెం జిలేబి తింటావా?పుట్టేవాడు తియ్యగా ఉంటాడు"నాన్న అడిగాడు.నవ్వేసాను.ఎదురుగా ఉండే అతను "ఇందాక నుండి చూస్తున్నాను.ఆ అమ్మాయిని చదువుకొనివ్వండి.ఊరికే మాట్లాడిస్తూ ఉన్నారు".నేను నవ్వి చెప్పాను"ఫర్లేదు అండి పక్కన నాన్న ఉంటే బాగా వ్రాస్తాను".ఆమెను వ్రాయనిస్తే వ్రాస్తుంది లెండి,అన్నాడు ఈయన.వీళ్ళ నమ్మకాలు నిజం చెయ్యాలి.అసలు ఉద్యోగాలు వెయ్యడం లేదు.ఉద్యోగం లేకుండానే తల్లి తండ్రులు అయిపోతున్నాను.దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు.నిజమే అన్నట్లు లోపల చిన్నగా తన్నాడు బాబు."నీ కోసమేరా కష్టపడేది"నవ్వుకున్నాను.ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర కీయీస్ హైస్కూల్ కి వెళ్ళాము సెంటర్ అక్కడే. వెళ్లి వ్రాసాను.బాగా వ్రాసాను అనిపించింది.వెంటనే తిరుగు ప్రయాణం.పదిరోజులకే పాప పుట్టడం.ఇక మంచే జరుగుతుంది.ఉద్యోగం కూడా వచేస్తుందిలే అమ్మా,పాప చెపుతునట్లే అనిపించింది. @@@@