Sasikala Thanneeru

Inspirational

4.5  

Sasikala Thanneeru

Inspirational

ఎదగాలి నువ్వు!

ఎదగాలి నువ్వు!

2 mins
423


       ఎదగాలి పాప!

              

ఎందుకో ఈ రోజు ఈ చిన్నకధ గుర్తుకువస్తూ ఉంది.బడిపిల్లల నాన్ డీటెయిల్ మారినప్పుడల్లా వాళ్ళలాగే నాకు కుతూహలం.ప్రతిక్లాస్ బుక్ చదువుతాను.నిజానికి పెద్దవాళ్ళ కథలు మనుషుల్ని విడదీస్తాయి.పసిపిల్లల కథలు లోపలి మనుషులను కలుపుతాయి.

ఇది ఇంగ్లీష్గ్ లో చదివాను.

ఒక రాజుగారికి ఒక చిన్నపాప ఉంటుంది.

పాప అంటే మామూలు పాప కాదుకదా,యువరాణి.అందులో చక్కటి బుగ్గలు,మెరిసేటి కళ్ళు,ఎదుటివారి మీద ఆప్యాయత ఉన్న పాప.రాజుకు లేక లేక కలిగిన సంతానం.ఇప్పుడు ఆ చిట్టి తల్లి చిన్ని కోరికను కోరింది నాన్నను."నాన్నా,నాకు ఆకాశం లో చందమామను తెచ్చి మెడలో వేసుకోవాలి అని ఉంది"అని ముద్దుగా అడిగింది.వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు రాజుగారు.చిట్టి తల్లి కోరిక వివరించాడు.మేధావులు అందరూ తర్జన భర్జన పడ్డారు.అంత పెద్ద గ్రహాన్ని ఇక్కడకు తేవడం,యువరాణి మెడలో ధరింప చేయడం అసాధ్యం అని తేల్చేసారు. తెలివిగల వాళ్ళు తేల్చేసాక ఇక అది జరగని పని కదా.రాజుగారు,అయ్యో ఒక్క చిన్నారి బిడ్డ అడిగిన కోరిక తీర్చలేక పోతినే, అని దిగులుపడ్డారు.

మరి ఆయనను ఎలాగైనా ఆనంద పరిచే బాధ్యత ఆయన ఆరోగ్యం బాగుండేలా చూసుకునే బాధ్యత విదూషకులది.ఆయన మాహారాజుతో"నేను తెస్తాను మహారాజా"అన్నాడు.మేథావులు వలనే కానిది నీ వలన ఏమి అవుతుంది అన్నాడు రాజు.

"లేదు చేస్తాను.ఒక్కసారి యువరాణి గారితో మాట్లాడుతాను "అన్నాడు.సరేనన్నారు రాజుగారు.

యువరాణి ని పిలిపించారు.చిట్టి పాప సింహాసనం మీద నాన్న పక్కన వాలి కూర్చుంది.

"నీకు చందమామ కావాలా తల్లి"అడిగాడు విదూషకుడు.అందరూ కుతూహలంగా చూస్తున్నారు.

"అవును"ముద్దుగా చెప్పింది చిన్నారి.

"సరే చంద్రుడు ఎలా ఉంటాడు"అడిగాడు విదూషకుడు.

"గుండ్రంగా ఉంటాడు.మెరుస్తూ ఉంటాడు తెల్లగా"చెప్పింది.

"ఆకారం ఎంత ఉంటుంది?"అడిగాడు.

"నా కిటికీ పక్కన చెట్టు మీద కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాను.సరిగ్గా నా బొటనవేలు అంత ఉంటాడు"చెప్పింది. పాప కళ్ళలో బోలెడు నమ్మకం.

తరువాత విదూషకుడు కంసాలి వారి చేత యువరాణి బొటన వ్రేలు అంత తెల్లటి వజ్రాన్ని దండ కు వ్రేలాడదీసి యువరాణి మెడలో వేసాడు.పాప చప్పట్లు కొట్టి నవ్వింది.రాజు మురిసిపోయాడు.

         ********

తరువాత సభలో రాజుగారు సందేహం బయట పెట్టారు."ఇప్పుడు రాత్రి ఆకాశం లో చంద్రుడిని చూస్తే పాప తన మెడలోది చందమామ కాదు అనుకొని దిగులు పడుతుంది కదా.ఎలా?"అడిగాడు రాజు.

మేథావులు మళ్లీ తర్జన భర్జన పడ్డారు.

ఎత్తైన గోడలు కడుదాము అన్నారు.

రాత్రిళ్ళు చీకటి లేకుండా చేద్దాము అన్నారు.

యువరాణి కళ్ళకు రాత్రిళ్ళు గంతలు కడుదాము అన్నారు.ఇవేవీ రాజుకు నచ్చలేదు.

మళ్లీ విదూషకుడు నేను ప్రయత్నిస్తాను అన్నాడు.

రాత్రి పాపను రాజుగారితో కలిసి తోట కు తీసుకొని పోయాడు.పైన చందమామ మెరుస్తూ ఉంది.

"యువరాణి చందమామ మీ మెడలోకి వచ్చింది కదా.పైన ఎలా మళ్లీ వచ్చింది ?"అడిగాడు విదూషకుడు.

పకపకా నవ్వింది పాప.

"నా గోరు ఊడిపోతే మళ్లీ వచ్చింది కదా.చందమామ అంతే మళ్లీ వచ్చాడు" మెడలో చందమామను ప్రేమగా నిమిరింది.

రాజు ఆశ్ఛర్యపోయాడు.దీనికా అందరం ఇంత సమస్యగా భావించి తర్జన భర్జన పడింది.

"మహారాజా పిల్లలు జీవితాలు,ఆలోచనలు ఎప్పుడూ సరళంగానే ఉంటాయి.వారు ఈ క్షణం గురించి తప్ప దేని గురించి ఆలోచించరు.మనమే మనం సాధించుకున్న తెలివితో ఏవో ఆలోచనలు చేసి సమస్యను క్లిష్టం చేసుకుంటాము.మనం ఎలా ఉండాలి అనేది వారి దగ్గర నుండి నేర్చుకోవాలి"చెప్పి వెళ్ళిపోయాడు విదూషకుడు.

నిజమే పిల్లలే నిజమైన తెలివిగలవారు,జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకున్నవారు.నిజానికి పెద్ద అయ్యే కొలదీ మనం ఎడగడంలేదు అందరినీ మన ఆలోచనతో దోయిరాం చేసుకొని చిన్నపోతున్నాము.ఇప్పటికైనా వాళ్ళు పెద్దవాళ్లుగా ఎదగడం కాదు,పెద్దలే పిల్లలుగా ఎదగాలి.

"తల్లీ నాకు ఒక్కసారి చందమామ ను ఇస్తావా?ఆడుకుంటాను"అడిగాడు.

"మరి నాకు?"అడిగింది పాప.

"ఇంకొకటి మళ్లీ పూస్తుంది కదా అప్పుడు ఇస్తాను"నవ్వాడు రాజు.

"సరే తీసుకో నాన్నా"నవ్వుతూ మెడలో వేసింది.

ఇప్పుడిక ఇద్దరికీ సంతోషం.

         @@@@

         అనుసృజన:వాయుగుండ్ల శశికళ.


Rate this content
Log in

Similar telugu story from Inspirational