నిష్కల Nishkala

Drama Abstract

4.5  

నిష్కల Nishkala

Drama Abstract

నీ జ్ఞాపకం...

నీ జ్ఞాపకం...

13 mins
556


ఫలక్ నామా రైల్వే స్టేషన్ సెలవులు ,పెళ్లిళ్ల సీజన్ కలిసి రావడం తో జనం తో కిట కిటలాడుతుంది ."ఎక్స్ క్యూస్ మీ అంకుల్ కొంచెం జరుగుతారా " అన్న మాటలకూ బెంచ్ మీద కూర్చుని కునుకు పాట్లు పడుతున్న నరేంద్ర కళ్ళు తెరిచి చూసాడు తనని అంకుల్ అని పిలిచిన సదరు వ్యక్తి కూడా అంకుల్ అనే పిలిచే వయసు లొనే ఉన్నట్టు అతని బట్ట తల , షర్టు బటన్లు ఊడి పోతాయేమో అన్నట్టు ముందుకు వచ్చిన అతని పొట్ట తెలియ చేస్తుంది. మారు మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి కాస్త జరిగి కూర్చుని తన సెల్ ఫోన్ తీసి ఫ్రంట్ కెమెరా లో తనని తాను చూసుకున్నాడు నరేంద్ర. తనకి ఉన్నది అదే బట్ట తల కాకపోతే మిగతా జుట్టు నరేంద్ర కినెరిసింది ఆ పక్క వ్యక్తి కి ఇంకా నలుపు గానే ఉంది అది తేడా అందుకే అన్న మాట తనూ అంకుల్స్ కే అంకుల్ అయ్యాడు అనుకున్నాడు .


ఇంతలో లింగంపల్లి వెళ్ళే ఎం ఎం టీ ఎస్ రావడం తో అతని ఆలోచనలకు బ్రేక్ వేసి అందులో వెళ్ళి కూర్చున్నాడు . పెళ్లిళ్ల సీజన్ అయినా పెద్ద గా రద్దీ లేదు ట్రైన్ లో అనుకున్నాడు . ట్రైన్ స్టేషన్ల దగ్గర ఆగే కొద్దీ జనం పెరుగుతున్నారు . అంతవరకు కిటికీ వైపు చూస్తూ జనాన్ని పట్టించుకోని నరేంద్ర చూపు ఒక అమ్మాయి మీద పడింది పది , పన్నెండేళ్ళు ఉంటాయేమో ఫంక్షన్ల కు ఆ వయసు పిల్లలు ఈ మధ్య వేసుకున్న బట్టలు లాంటివి వేసుకుంది అయితే నరేంద్ర ని ఆకర్షించింది ఆమె వేసుకున్న బట్టలు కాదు తను పెట్టుకున్న బుట్ట కమ్మలు అవి తన మెదడు లో ఎక్కడో నిక్షిప్తమై ఉన్న తీయ్యని జ్ఞాపకాల ను నిద్రలేపాయి. నరేంద్ర అప్రయత్నం గా "అమ్ము...." అని అనుకున్నాడు మనసులో, ఇంతలో తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి లేచి తన బ్యాగ్ తీసుకుని వెళ్లాడు . ఆ అమ్మాయి అది చూసి " అమ్మమ్మ అక్కడ ఖాళీ అయింది నువ్వు వెళ్ళి కూర్చో " అంది అంతవరకు ఆ అమ్మాయి నే గమనిస్తున్న నరేంద్ర ఆ అమ్మాయి వెనక ఇరుక్కుని కూర్చుని తను పిలవగానే లేచినామె వైపు చూసి షాక్ కి గురి అయ్యాడు. " అమర " అన్నాడు అయితే ఈసారి బయటకే అనేసాడు ఎవరికీ వీనపడలేదు ఆమెకు తప్ప.

"నరేంద్ర " అని అంది నరేంద్ర ఎదురు సీట్లోకి వచ్చి కూర్చున్నాక, నరేంద్ర కి ఆశ్చర్యం తో పాటు ఆనందం గా ఉంది . ఇన్నేళ్ల తరువాత అమర ని చూసినందుకు ఇంచు మించు నరేంద్ర పరిస్థితే అమర ది కూడా కాని బయటపడలేదు తన పక్కన , నరేంద్ర పక్కన ఉన్నవాళ్ళని తేరిపారా చూసింది అందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ ఫోన్ల కు అతుక్కుపోయారు తన వాళ్ళు ఎలాగూ దూరం గా ఉన్నారు వాళ్లకు వినపడదు కాబట్టి మాట్లాడవచ్చు అని నిర్థారించుకున్నాక మాట్లాడటం మొదలుపెట్టింది.


" ఎలా ఉన్నావు నరేంద్ర ? ఎన్నాళ్లు అయింది నిన్ను చూసి , ఇక్కడే ఉంటున్నావా? " అని అడిగింది ఆప్యాయం గా . అంతవరకు అమర ని చూసిన ఆనందం లో మాటలు మర్చిపోయిన నరేంద్ర అమర మాట్లాడటం తో ఈ లోకం లోకి వచ్చాడు " బాగున్నాను ఆమ్ము..." కాస్త తడ బడి .." ఆఁ.. అమర " అన్నాడు .


అమర చిన్నగా నవ్వింది ఆ తడ బాటు కి , నరేంద్ర కూడా నవ్వి " నువ్వు ఎలా ఉన్నావు? నేను విజయవాడ లో ఉంటున్నాను ఇక్కడకి పని మీద వచ్చాను . అవును నువ్వు ఉండేది ఇక్కడే నా? ఎంత మంది పిల్లలు ? మీ వారూ ఎలా ఉన్నారు ?" అని అడిగాడు.


అంతవరకు మాములుగా ఉన్న అమర భర్త ప్రస్తావన రాగానే కనుబొమ్మలు రెండు దగ్గరకు చేసి చిరాకు గా ముఖం పెట్టింది అది చూసిన నరేంద్ర కాస్త భయపడి అమర నుదుటి వైపు చూసాడు ' బొట్టు ఉంది ,చేతికి గాజులు ఉన్నాయి కాబట్టి నేను తప్పు గా అడగలేదు ' అని అనుకుని ఏమి మాట్లాడాలో తెలియక మౌనం గా ఉన్నాడు.


" అవును నేను వుండేది ఇక్కడే నాకు ఒక అమ్మాయి ,అబ్బాయి అదిగో ఆ పాప నా మనవరాలు " అంటూ నరేంద్ర ఇందాక చూసిన అమ్మాయి ని చూపించింది . నరేంద్ర అప్పుడు అర్థం అయింది ఆ బుట్ట కమ్మలు ఆ అమ్మాయి దగ్గర ఎందుకు ఉన్నాయో.


" గుర్తు పట్టాను ఎందుకంటే తనూ చెవి కి పెట్టుకున్న కమ్మలు నిన్ను చూడకముందే చూసాను " అన్నాడు .


" నీకు ఇంకా గుర్తు ఉందా ?" అని ఆశ్చర్య పోయింది అమర.


" కొన్ని జ్ఞాపకాలు అంతే పచ్చ బొట్టు శరీరం మీద ఎలా చెరిగిపొదో ఇలాంటి అందమైన జ్ఞాపకాలు కూడా మనసు లో చెరగకుండా అలాగే ఉండిపోతాయి " అన్నాడు ఉత్సాహం గా , చాలా రోజుల తరువాత మనసు విప్పి మాట్లాడే అవకాశం వచ్చింది నరేంద్ర కి.


" కానీ ఏమి చేస్తాం విధి రాత అవి జ్ఞాపకాలు గానే మిగిలిపోయాయి" అంది అమర బాధగా.


నరేంద్ర ఏమి అనలేదు అమర నుండి విడిపోయిన సంఘటన గుర్తు వచ్చింది ఆరోజు అమర ను నిర్ధాక్షణం గా వాళ్ళ నాన్న లాక్కెల్లిన తరువాత ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడే అమర ను చూడటం ఈలోపు అమ్మ అయింది ,అమ్మమ్మ కూడా అయింది కాని నరేంద్ర కు మాత్రం తనూ ప్రేమ గా పిలుచుకునే అమ్ము లాగానే కనిపిస్తుంది.


వయసు లో నాలుగు ఏళ్లు తేడా ఉన్నా స్నేహం లో అలాంటి తేడా చూపించకుండా కలిసి పెరిగారు అంతస్థు ల్లో అంతరం ఉన్నా కుటుంబాల మధ్య ఉన్న స్నేహం వాళ్ళని మరింత దగ్గర చేసింది. నరేంద్ర కుటుంబం సమాజ సేవ కు కట్టుబడి ఉండటం వల్ల ఆస్తులు పెంచు కోకపోయినా కీర్తి ని పెంచుకున్నారు.


అమ్ము అని ముద్దు గా నరేంద్ర పిలిస్తే నారి అంటూ గోము గా పిలిచి అమర ఏడిపించేది .అలా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్నేహం గా ఉన్న వాళ్ళ ఇద్దరి మధ్య వయసు తో పాటు ఆకర్షణ పెరిగి ప్రేమ గా రూపాంతరం చెందింది.


వాళ్ళ స్నేహం ప్రేమ గా ఎప్పుడు మారిందో తెలిలేదు ఇద్దరికీ .అలా ఊళ్ళో చదువు పూర్తి చేసుకుని పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదవాలనే తన నిర్ణయాన్ని చెప్పాడు నరేంద్ర ఆరోజే అర్థం అయింది అమర కు తన మీద ఎంత ప్రేమ ఉందో తన చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న అమర ను దగ్గరకు తీసుకుని కన్నీళ్ళు తుడిచి ప్రతి సెలవులకి వస్తాను అని మాట యిచ్చి బయలుదేరాడు.


అలా సెలవుల కు వచ్చిన ప్రతి సారి ఇద్దరు ఒంటరి గా కలుసుకోవడం మొదలుపెట్టారు అందరి ముందు మాములు గా ఉన్నా ఏకాంతం గా కలుసుకున్నప్పుడు మాత్రం ఎన్నో ఊసులు చెప్పుకునేవారూ ఆ పసి హృదయాలకు రెండు మనసుల మధ్య ప్రేమే గానీ రెండు శరీరాల మధ్య వాంఛ తెలిదు అలా పవిత్రం గా సాగుతున్న వాళ్ళ ప్రేమ కు అమర చదువు ముగింపు పలుకుతుంది అని ఇద్దరు ఊహించలేదు. అలా ఒకసారి వేసవి సెలవుల కు వచ్చిన నరేంద్ర తో అమర " నారి ఈ సంవత్సరం తో నా చదువు అయిపోయింది ఇక్కడ నేను కూడా నీ లాగ పట్నం వచ్చి చదువు కుంటాను " అంది అమర ఉత్సాహం గా.


" పిచ్చి అమ్ము మన ఊర్లో ఆడపిల్ల ను ఇంతవరకు చదివించడమే ఎక్కువ ఇంక నిన్ను పట్నం ఎలా పంపిస్తారు అనుకున్నావ్ " అన్నాడు నరేంద్ర అమర ఉత్సాహాన్ని నీరు గారుస్తూ తల దించుకుని ఏడవసాగింది అమర అనుకోని ఈ పరిణామానికి నరేంద్ర కంగారుపడి అమర తల ఎత్తి కళ్ళు తుడిచాడు " ఎందుకు ఏడుస్తావు ? ఇంకో రెండేళ్ల లో నా చదువు అయిపోతుంది అప్పుడు మళ్ళి మన ఊరు వచ్చేస్తాను " అన్నాడు.


దీనం గా నరేంద్ర వైపు చూసి " అది కాదు నారి మా ఇంట్లో నా పెళ్ళి గురించి అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే విన్నాను అందుకే భయం గా ఉంది " అంది.


" అమ్ము మా నాన్న గారి కి మన ప్రేమ విషయం చెప్పాను పట్టింపులు ఏమి లేవు గనుక స్నేహితుడి కూతురివి కదా సంతోషం గా ఒప్పుకున్నారు కాకపోతే ముందు చదువు శ్రద్ధ గా పూర్తి చేయమన్నారు అందుకే నువ్వు ఏమి భయాలు పెట్టుకోకుండా ఉండు మా నాన్నగారు వచ్చి మీ వాళ్ళ తో మాట్లాడతారు " అన్నాడు నరేంద్ర అనునయం గా.


" నిజం గా నా ? ఓట్టేసి చెప్పు " అంది అమాయకo గా అమర.


అమర అమాయకత్వాన్ని చూసి ముచ్చట గా అనిపించింది నరేంద్ర " అవును ఒట్టు " అన్నాడు నవ్వుతు.


" సరే రేపు పక్క ఊర్లో సంత ఉంది వెళ్దామా ?" అని అడిగింది అమర


"సంత కా ?" అని నీళ్ళు నమిలాడు నరేంద్ర


" నాకు తెలుసు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నువ్వు నాకు ఏమి కొనద్దు ఊరికే నాకు ఏది బాగుంటుందో చెప్పు అదే కొనూక్కుంటాను " అంది అమర


ఎదుటి వాళ్ళ మనసు ను వాళ్ళ పరిస్ధితి ని ఇట్టే అర్థం చేసుకునే గుణం ఉన్న అమర ను ప్రేమించినందుకు గర్వం గా అనిపించింది నరేంద్ర కు.


మరుసటి రోజు సంత లో సరదాగా తిరిగారు అమర,నరేంద్ర . అమర కు తెలియకుండా అమర కు నచ్చిన ఎరుపు రంగు గాజులు కొన్నాడు తనూ చిన్నప్పటి నుండి దాచుకున్న డబ్బు తో.


"నారి ఈ కమ్మలు ఎలా ఉన్నాయి నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం " అంది కమ్మలు తన చెవి దగ్గర పెట్టుకుంటూ.


" బాగున్నాయి " అని తన జేబు లో చూసుకున్నాడు గాజులు కొనడం తో తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి బాధగా అనిపించింది నరేంద్ర ' అయ్యో అమ్ము కి నచ్చిన కమ్మలు కొనలేక పోయానే' అని అనుకున్నాడు.

" నారి ఎందుకు అలా ఉన్నావు చూడు ఈ బుట్ట కమ్మలు ఎంత బాగున్నాయో " అంది సంత నుండి ఊరికి వచ్చే దారిలో తన చెవి కి ఉన్న కమ్మలు తీసి అవి పెట్టుకుని సంత లో కొన్న అద్దం లో చూసుకుని మురిసిపోతుంది.

నరేంద్ర కు మాత్రం దారిలో తమను ఎవరైనా చూస్తారేమో అని భయం వేస్తుంది అందుకే అమర ను దారి పక్కన ఉన్న చెట్టు వెనక్కు తీసుకువెళ్లాడు. అమర కంగారు పడింది ఏమిటి అని అడగబోయేoతలో నరేంద్ర అమర నోటి కి చేయి అడ్డం పెట్టి మరొక చేతితో జేబు లో ఉన్న గాజులు తీశాడు.


" ఈరోజు నీ పుట్టిన రోజు కదా అందుకే చిన్నప్పటి నుండి దాచుకున్న డబ్బు తో ఇది కొన్నాను " అన్నాడు నరేంద్ర చేయి అడ్డం తీస్తూ . అమర కు నోట మాట రాలేదు ఎదో విలువైన వస్తువు ను అపురూపం గా చూసినట్టు తన చేతితో ఆ గాజుల ను తడుముతూ కంట్లో నీళ్ళు తెచ్చుకుంది.


" ఇదిగో నువ్వు ఇప్పుడు ఏడుస్తానంటే నేను వెళ్ళిపోతాను " అన్నాడు నరేంద్ర బుంగమూతి పెట్టి.


ఆ మాట కు కంట్లో నీరు తుడుచుకుని గాజులు వేయమని గాజులు చేతిలో పెట్టి చేతులూ ఎత్తిoది. గాజులు వేస్తున్న నరేంద్ర తన వైపే ఓరగా చూస్తున్న అమర ను చూసి సిగ్గుపడ్డాడు. గాజులు వేసేశాక " హ్యాపీ బర్త్ డే " అన్నాడు మెలికలు తిరుగుతూ " అబ్బో ఇంగ్లీషు " అంటూ బిగ్గరగా నవ్వింది అమర . ఆ మాట కు ఇద్దరు నవ్వుకుంటూ చెట్టు వెనుక నుండి ఊరు వెళ్ళే దారి లోకి వచ్చారు అయితే అక్కడ ఉగ్ర నరసింహుడి రూపం లో ఉన్న అమర తండ్రీ ని చూసి ఇద్దరు అవాక్కయ్యారు .


"నాన్న " అంది అమర చిన్నగా " అవునే నాన్న నే నా పరువు ఇలా బజారుకీడుస్తావా ఇంటికి పద నీ పని చెప్తా " అంటూ అమర చేయి పట్టుకున్నాడు.


" మావయ్య ఇందులో అమర తప్పు ఏమి లేదు నేనే సంతకు తీసుకువెళ్లాను , మేము ఇద్దరమూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం మీరు ఆశీర్వదించి పెళ్ళి జరిపించాలి " అంటూ వేడుకున్నాడు నరేంద్ర.ఒక్క ఉదుటున అమర తండ్రీ చేయి వచ్చి నరేంద్ర చెంప ను తాకింది ఆ హటాత్ పరిణామానికి నివ్వెర పోయాడు నరేంద్ర.


" ఎవర్రా ! నీకు మావయ్య స్నేహితుడి కొడుకు వి కదా అని ఇంటికి రానిస్తే నా కూతురి నే మాయ లో పడేశావ్ ఇందాకే మీ నాన్న కి చెప్పాను ఇప్పుడు నీకు చెప్తున్నా నా కూతురి ని నీ లాంటి ఆస్తి, అంతస్థు లేని వాడికి ఇవ్వను ఇక పైన నా ఇంటి చాయల్లో కనపడితే తాట తీస్తాను " అంటూ కోపం గా అమర ను లాక్కెల్లి పోయాడు అమాయకo గా వాళ్ళ నాన్న చేతిని విదిలించుకుంటు అప్పుడే కొన్న బుట్ట కమ్మలు ఊగుతుంటే కంట్లో నీటితో నిస్సహాయo గా నరేంద్ర ను దీనంగా చూస్తూ వెళ్ళడమే అమర ను అదే చివరి సారి చూడటం నరేంద్ర .ఆపైన అమర తండ్రీ త్వర త్వరగా అమర పెళ్ళి ముహుర్తాలు కూడా పెట్టించేసాడు ఇక చేసేదేమీ లేక అమర నరేంద్ర కు ఉత్తరం రాసింది అది ఒక రోజు ఆలస్యం గా చేరడం నరేంద్ర వచ్చే లోపే అమర పెళ్ళి అయ్యి అత్తారింటికి వెళ్లిపోవడం అలా పెద్దవాళ్ళ మూర్కత్వం ఒక ప్రేమ జంట ని విడదీసింది.


'కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా మళ్ళి మన కథనే రాద్దామా ' అంటూ వస్తున్న రింగ్ టోన్ శబ్దానికి నరేంద్ర గతం నుండి వర్తమానం లోకి వచ్చాడు . ఆ ఫోన్ వచ్చిన వ్యక్తి బ్యాగ్ లో నుండి ఫోన్ తీసి మాట్లాడటం మొదలు పెట్టాడు.


ఈ మధ్య అందరిని అలరిస్తున్న ఆ పాట లోని చరణం తమ పరిస్ధితి కి అనుగుణం గా ఉండటం తో ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు కాసేపు అప్పుడు అర్ధం అయింది నరేంద్ర కు అమర కూడా తన లాగే గతం లోకి వెళ్లింది అని.


" కాలం ఎంత త్వరగా గడిచి పోయిందో అప్పుడే నలబై ఏళ్లు గడిచిపోయాయి " అంటూ తన గాజుల ను తడుముకుంది . అప్పుడు గమనించాడు నరేంద్ర అమర వేసుకున్న గాజులు తనూ బహుమతి గా ఇచ్చినవి అని.


" అవి .. " అంటూ ఆశ్చర్యం గా చూశాడు అమర నవ్వుతు " నీ ఊహ నిజమే నువ్వు ఇచ్చినవే నీ జ్ఞాపకం గా నా దగ్గర దాచుకున్నాను " అంది .


" కాని ఇన్ని సంవత్సరాలు గా అది చెక్కు చెదరకుండా అలానే ఉండటం ఎలా సాధ్యం ?" అన్నాడు ఆనందం గా


" ప్రతి రోజు వేసుకోను సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఆ బుట్ట కమ్మలు , ఈ గాజులు వేసుకుని గుడి కి వెళ్ళి నీ పేరన అర్చన చేయిస్తాను " అంది అమర.

ఆశ్చర్యం గా చూశాడు నరేంద్ర " ఏ రోజు ?" అని అడిగాడు .


" నీ పుట్టినరోజు " అంది అమర . అప్పుడు గుర్తు వచ్చింది నరేంద్ర కు ఈరోజు తన పుట్టినరోజు అని ఇన్ని సంవత్సరాల తరువాత కూడా తన పుట్టిన రోజు గుర్తు పెట్టుకుని తన మంచి గురించి తపన పడుతున్న అమర తన కంటి కి ఎంతో ఎత్తు కు ఎదిగినట్టు అనిపించింది.


" హ్యాపీ బర్త్ డే టూ యు " అంటూ తన దగ్గర ఉన్న పూజారి ఇచ్చిన అరటి పండు ఇచ్చింది అమర నరేంద్ర కు . దానిని కళ్ళకు అద్దుకుని తిన్నాడు.


"నా పుట్టిన రోజు విడి పోయిన వాళ్ళం నీ పుట్టిన రోజు కలిసాము " అంది అమర నిట్టూరుస్తూ.


" నా పుట్టిన రోజు నాకే గుర్తు లేదు కానీ నీకు గుర్తు ఉండడం నిజం గా నా అదృష్టం మనల్ని అభిమానిo చేవాళ్లు ఎక్కడ ఉన్నా మనల్ని మర్చిపోరు అని ఇప్పుడే తెలిసింది " అన్నాడు నరేంద్ర ఇంతలో ఎదో గుర్తు వచ్చింది షర్ట్ , ప్యాంటు జేబులు తడిమాడు పొద్దున్న స్నేహితుడి మనవరాలు ఇచ్చిన చాక్లెట్ చేతికి తగిలింది. అది తీసి అమర కు ఇచ్చాడు .


" నేను ఏమైనా చిన్న పిల్లను అనుకుంటూన్నావా ? అప్పుడు నారింజ మీఠాయి ఇచ్చినట్టు చాక్ లెట్ ఇస్తున్నావ్ , నాకు షుగర్ ఉంది తీపి తినకూడదు " అంది అమర


" ఈ ఒక్క రోజు తీపి తింటే ఏమైపోదు పోనీ ఇద్దరం జీవితం పంచుకోలేక పోయాం కనీసం చాక్ లెట్ అయినా పంచుకుందాం " అన్నాడు నరేంద్ర.


వెంటనే అమర ఆ చాక్ లెట్ తీసుకుని " నేను సగం చేస్తాను " అంటూ ఒక ముక్కను తుంచి నరేంద్ర చేతిలో పెట్టింది.


"చాక్ లెట్ తింటూ " అవును నా వివరాలు అడిగావు గానీ నీ సంగతి చెప్పలేదు మీ ఆవిడా ,పిల్లలు విజయవాడ లో ఉంటారా ? ఎంతమంది పిల్లలు ?" అని అడిగింది అమర.ఆ ప్రశ్న కు నవ్వి చెప్పడం మొదలు పెట్టాడు నరేంద్ర


" నీ పెళ్ళి అయిన తరువాత మళ్ళి నేను ఊరు వెళ్ళలేదు నేను ఊరు రావట్లేదు అని అమ్మ,నాన్న నా దగ్గరికి వచ్చేసారు నాకు ఉద్యోగం వచ్చాక. అన్నయ్య లు ఇద్దరికీ ఉద్యోగాలు , పెళ్ళి లు అయ్యేసరికి నాకు 30 ఏళ్లు వచ్చేసాయి అమ్మ,నాన్న పెళ్ళి చేసుకోమని ఎంత చెప్పినా నాకు పెళ్ళి మీద ధ్యాస రాలేదు. ఒంటరి తనం పోగొట్టుకోడానికి ఒక స్వచ్చంద సంస్థ లో సభ్యుని గా చేరాను వాళ్లు చేసే సేవా కార్యక్రమాల్లో పాలు పంచు కునే వాడిని అప్పుడే తెలిసింది మీనాక్షి గురించి ఆమె చేస్తున్న దాన ధర్మాలు గురించి నిండా పాతికెళ్ళు లేకుండానే ఆమెకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందా ? అనిపించేది కాని ఆమె గురించి నిజం తెలిసాక బాధగా అనిపించింది . ఆమెకు ప్రాణాంతక జబ్బు ఉన్నట్టు ఎక్కువ కాలo బతికే అవకాశం లేక పోవడం తో సుమంగళి గా కన్ను మూయలనే ఆమె చివరి కోరిక ను నెరవెర్చే ఉద్దేశం తో తనని పెళ్ళి చేసుకున్నాను " అంటూ ఆపి గొంతు సరి చేసుకున్నాడు నరేంద్ర.


" అయితే మా పెళ్ళి అయిన నెల రోజులకే తనూ చనిపోయింది భార్య,భర్త లాగా లేక పోయిన మంచి స్నేహితుళ్ళా కలిసి పోయాము అంత త్వరగా వెళ్లిపోతుంది అనుకోలేదు . అమ్మ మరో పెళ్ళి చేసుకోమన్నా ఇంక పెళ్ళి జోలికి వెళ్ళలేదు ఉద్యోగానికి వాలంటఁరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చిన డబ్బు తో ఆశ్రమం కట్టి ఎవరు లేని వాళ్లకు అందులో ఆశ్రయం కల్పించి వాళ్ళ తో పాటే నేను ఉంటున్నాను " అన్నాడు.


కళ్ళు రెప్ప వేయడం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయింది అమర " నా ప్రేమ వల్ల చివరికి నీ జీవితం సుఖ,సంతోషాలు లేకుండానే గడిచిపోయింది . మన ప్రేమ లేక పోయి ఉంటే నీ జీవితం మరో లా వుండేది నన్ను క్షమించు " అంది అమర తల దించుకుంటు.


" అలా అనకు అమర ఎవరికీ ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది ఇందులో నీ ప్రమేయం ఏమి ఉంది నిజానికి నాకు ఒంటరి తనం లో ఊరటని ఇచ్చేది నీతో గడిపిన ఆ క్షణాలే " అన్నాడు నరేంద్ర.


విరక్తి గా నవ్వింది అమర " నువ్వు ఎదో ఆనందం గా ఉన్నావ్ , నీకు నా గురించి చెప్పడం ఇష్టం లేక నా భర్త గురించి దాట వేసాను. కాని అసలు నిజం ఏమిటంటే నేను ,నా భర్త తో విడిపోయి ఇరవై సంవత్సరాలు అయింది " అంది.


ఆశ్చర్యం గా చూశాడు నరేంద్ర "అదేంటి ?" అన్నాడు.


" మా నాన్న పెళ్ళి కొడుకు కి ఆస్తి ఉందా లేదా? అని మాత్రమే చూశాడు మిగతా విషయాలు మర్చిపోయాడు ఫలితం తిరుగుళ్ళ కి ఆస్తి హారతి కర్పూరం లా ఆరిపోయింది పిల్లల మీదా ,నా మీదా చేయి చేసుకున్నా భరించాను కాని తన కన్న తల్లిదండ్రుల ఐన ముసలి వాళ్ళ మీద కూడా అధికారం చూపించే సరికి సహించలేక పోయా అన్నయ్య ప్రోత్సాహం తో సంపాదించిన డిగ్రీ చేత బెట్టుకొని వాళ్ళ నలుగురి బాధ్యత నా మీద వేసుకుని అ రాక్షసుడి ని వదిలివచ్చేసాను .ఉద్యోగం తో పిల్లల ని పెద్ద చేసాను , అత్తా, మామా కొడుకు చేసిన నిర్వాకం తో ఎక్కువ కాలం బ్రతకలేక పోయారు . అలా ఇక్కడే సొంత ఇంటిని సంపాదించి పిల్లల పెళ్ళి లు చేసి బాధ్యత తీర్చుకున్నాను " అంది తనూ పడిన కష్టాలు గుర్తు వచ్చాఏమో కంట్లో నీరు తిరిగాయి అమర కు.


నరేంద్ర చలించి పోయాడు అసలు ఆరోజు తనూ పరీక్షలు ఉన్నాయని పట్నం తిరిగి వెళ్లకుండా ఉంటే ఈరోజు అమ్ము ఇన్ని కష్టాలు పడేది కాదు అనుకున్నాడు.


ఓదార్చడానికి అమర చేతి మీద చేయి వేసి తట్టాడు నరేంద్ర " ఊరుకో అమర అది గతం ఇప్పుడు నీ జీవితం మనవలు, మనవరాళ్ల తో ఎంత బాగుంది ఇంక ఇలాగే ఉంటుంది నువ్వు ఎప్పుడు ఆనందం గా ఉంటావ్ " అన్నాడు .


అమర కళ్ళు తూడుచు కుని తల ఎత్తి పక్కన ఉన్న కిటికీ కి తల ఆనించి ఆలోచించసాగింది. నరేంద్ర అమర మౌనం గా ఉండేసరికి తనూ కూడా మాట్లాడ కుండా పక్కన ఉన్న కిటికీ నుండి బయటకు చూడసాగాడు.

" నారి నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు ఏమి అనుకోవు కదా ?" అని అడిగింది అమర సంశయం గా


" అడుగు " అన్నాడు కుతూహలo గా నరేంద్ర.


"ఆరంభం లో ఎలాగూ మన పెద్ద వాళ్లు విడదీసారు కనీసం చరమాంకం లో అయినా జీవితాన్ని పంచుకుందామా " అని అడిగింది అమర.


ఒక్కసారిగా చెమటలు పట్టాయి నరేంద్ర కు అతని మొహం లో ఆందోళన సృష్టం గా కనిపిస్తుంది అటూ అవును అని చెప్పలేడు ఇటు కాదు అనలేడు కారణం అతని మనసులో దాచుకున్న నిజం రెండు నెలల క్రితం డాక్టర్ మాట్లాడిన మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి " నరేంద్ర గారు మీకు ఎవరు లేరు అంటున్నారు కాబట్టి మీకే చెప్పాల్సి వస్తుంది నేను అనుమాన పడిoదే నిజం అయింది సెకండ్ స్టేజి లో ఉంది కాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు మొదలు పెడితే మంచిది అవయవాలు పని చేస్తున్నప్పుడే మనకు కాన్సర్ కణాలు తగ్గించే అవకాశం ఉంటుంది లేట్ చేస్తే ఒక్కోటి ఫెయిల్ అవ్వడం మొదలు పెడతాయి " అన్నాడు డాక్టర్ .


'జీవితం లో చాలా చూసాను ఇప్పుడు బతికి ఏమి సాధించాలి అదే ఆ డబ్బు పది మంది పేద పిల్లల చదువు కి పనికి వస్తుంది ' అనుకున్నాడు నరేంద్ర అనుకున్నట్టే అప్పటి నుండి ఆశ్రమం బాధ్యతలు వేరొకరికి ఇచ్చేసి తనకు తెలిసిన అనాధ ఆశ్రమాలకు వెళ్ళి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు.


" నారి ఏంటి అంతగా ఆలోచిస్తున్నావ్ ? నీ ఆశయాలకు నేను అడ్డు వస్తానేమో అనుకుంటూ న్నావా ? " అని అడిగింది అమర.


" అమ్ము నన్ను కోపగించు కోకు నీతో జీవితం పంచుకోవడం ఆనందమే కాని ఈ భూమి మీద ఎవరం శాశ్వతం కాదు అందరు ఎదో ఒక రోజు పోవల్సిoదే మనం ఇప్పుడు జీవితం చివరి దశ లో ఉన్నాం ముందుగా ఎవరో ఒకరం వెళ్ళీపోతే మరొకరు మళ్ళి ఒంటరి వాళ్లు అయిపోతారు నువ్వు వెళ్లిపోతే నేను ఒంటరితనం భరించలేను అదే నేను వెళ్లిపోతే నువ్వు ఒంటరి అయిపోతావు అనే ఆలోచనే తట్టుకోలేను . ఇప్పటి వరకు నీ జ్ఞాప కాల తో జీవితం ఎలా వెళ్ళదీసానో అలాగే ఇకపై కూడా గడుపుదాము అనుకుంటున్నాను నేను ఏమి ఆలోచించినా మన మంచి గురించే " అన్నాడు గొంతు లో జీర చెప్పకనే చెప్తుంది ఆ మాట చెప్పడానికి నరేంద్ర ఎంత బాధ పడుతున్నడో.


అమర కు ఏమి చెప్పాలో తెలియలేదు ఎంతో లోతు గా ఆలోచిస్తే గానీ నరేంద్ర ఇలా చెప్పడు అనుకుంది " సరే బలవంతం ఏమి లేదు నీ సంతోషమే నాకు ముఖ్యం " అంది ఇంకా ఎదో చెప్తూ ఉండగానే పక్కన కూర్చున్న వ్యక్తి లేచి బ్యాగ్ పట్టుకుని ముందుకు వెళ్లాడు అప్పుడే అర్థం అయింది ఇద్దరికీ వాళ్లు దిగవలసిన స్టేషన్ వస్తుంది అని , వెంటనే నరేంద్ర అమర తో " అమ్ము నేను నిన్ను ఒకటి అడుగుతాను కాదు అనకుండా ఇస్తావు కదా " అని అడిగాడు .


"తప్ప కుండా ఏంటో అడుగు ?" అంది అమర , " నేను నీకు బహుమతి గా ఇచ్చిన గాజులు ఇస్తావా నీ జ్ఞాపకం గా దాచుకుంటాను " అన్నాడు నరేంద్ర .


" కాని నాకంటూ ఏమైనా ఆనందాన్ని ఇచ్చేది నీ గుర్తు గా నా దగ్గర ఉన్నది ఇది మాత్రమే నువ్వు నిండు నూరేళ్ళు సంతోషం గా జీవించాలి అని ఈ గాజులు వేసుకునే గుడి కి వెళ్ళి దండం పెట్టుకుంటాను నీకు ఇచ్చేస్తే ఎలా " అంది దీనం గా.


" మనుషులే శాశ్వతం కాదు ఇంక ఈ గుర్తులు కూడా నా ! ఇంతవరకు నీ దగ్గర నా గుర్తు గా ఉంది ఇక పై నా దగ్గర నీ గుర్తు గా ఉంటుంది " అన్నాడు .


అయిష్టం గానే తీసి ఇచ్చింది అమర అపురూపం గా వాటిని తీసుకుని జేబు లో పెట్టుకున్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది అమర కు కనీసం నరేంద్ర ఫోన్ నెంబర్ గానీ, అడ్రస్ గానీ తీసుకోలేదు అని అడుగుదాం అనే లోపు స్టేషన్ రావడం అందరు ఒకేసారి నిల్చున్నారు అందరు దిగాక మాట్లాడుదాo అనుకుంది కాని మనవరాలు అప్పుడే వచ్చి " అమ్మమ్మ పద కార్ మన గురించి వెయిట్ చేస్తుంది అంట త్వరగా దిగు " అని తొందరపెట్టింది " ఒక్క క్షణం ఉండు " అంటూ నరేంద్ర కూర్చున్న సీట్ వైపు చూసింది కాని అప్పటికే నరేంద్ర వెళ్ళీపోయాడు.


వెంటనే గబగబా ట్రైన్ దిగింది కాని అతని జాడ ఎక్కడా కనపడలేదు అమర తో వచ్చిన మిగతా వాళ్లు కూడా ట్రైన్ దిగి బయటకు వచ్చి తమ గురించి వచ్చిన కార్ లో కూర్చున్నారు ' నారి నా దగ్గర నీ జ్ఞాపకం గా నువ్వు ఇచ్చిన గాజులు తీసుకు వెళ్ళి పోయావు కదా కాని నువ్వు నీ చేత్తో ఇచ్చిన చాక్ లెట్ కవర్ ఉంది ఇక పై ఇదే నీ జ్ఞాపకం ' అని అనుకుని కంటి నీరు ని తూడుచుకుంది.


Rate this content
Log in

Similar telugu story from Drama