నిష్కల Nishkala

Inspirational Children Stories

4.4  

నిష్కల Nishkala

Inspirational Children Stories

నివాళి

నివాళి

4 mins
426


అశోక్ కి అంతా గంధరగోళం గా ఉంది ఇల్లంతా ఏడుపుల తో భయానక వాతావరణం ఆ చిన్ని మనసు ని ఆందోళన కు గురి చేస్తుంది . బందువులు అందరు ఒకొక్కరు వస్తున్నారు మునుపటి లా తనని పలకరించటం లేదు మగవాళ్ళు అందరు తన తాతయ్య దగ్గరికి , కొంత మంది ఆడవాళ్లు బిగ్గరగా ఏడుస్తున్న అశోక్ నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నారు మరికొందరు మౌనం గా గోడకు అనుకుని ఉన్న అశోక్ తల్లి కి దగ్గర కూర్చున్నారు భుజం మీద చేయి వేసి ఓదారుస్తూన్నారు.

ఇంతలో అక్కడ ఉన్న ఉయ్యాలో తన చెల్లి కేరింతలు వినపడ్డాయి కానీ ఎప్పటి లా అశోక్ అక్కడికి పరిగెత్తికుని వెళ్ళలేదు 'చెల్లి కి ఏమి తెలిదు ' అనుకున్నాడు కానీ నిజానికి తనకు కూడా అందరు ఎందుకు అలా ఉన్నారో తెలిదు ' అబ్బా నాన్న వస్తే బాగుంటుంది అప్పుడు అందరు మాములు అయిపోతారు ' అనుకుని గోడ పై ఉన్న ఫోటో వంక చూసాడు నాన్న మొన్న వెళ్ళే ముందు వారం తీయిoచుకున్న ఫోటో అందులో నాన్న ,తనూ,చెల్లి,అమ్మ ఉన్నారు . ఆ పక్కన మరో ఫోటో చూసాడు అశోక్, అందులో నాన్న మాత్రమే ఉన్నాడు తనకి ఇష్టమైన ఆర్మీ యూనిఫామ్ లో 'అవి నేను కూడా వేసుకోవచ్చా నాన్న' అని చాలా సార్లు అడిగాడు అశోక్ వాళ్ళ నాన్న ని " నువ్వు బాగా చదువుకుంటే ఇలాంటి యూనిఫార్మ్ వేసుకోవచ్చు" అని వాళ్ళ నాన్న చెప్పిన మాట విని శ్రద్ధగా చదువుకునే వాడు .

రోజు ఆ ఫోటో చూసినా ఏమి అనిపించని అశోక్ కి ఈరోజు ఎందుకో వాళ్ళ నాన్న ఆ ఫోటో లో నుండి చూస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నం గా నాన్న వెళ్ళబోయే ముందు రోజు నాన్న తనతో చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి .

"నాన్న నువ్వు రేపు వెళ్ళీపోతావా?" అని అడిగాడు బాధగా దానికి అశోక్ తండ్రీ " అవును నాన్న వెళ్లాలి కదా మరి " అన్నాడు. " నాన్న నువ్వు ఎందుకు ఎప్పుడు అంత దూరం వెళ్తావు ఆ...!బంటి వాళ్ళ నాన్న లాగా ఇక్కడే ఉండచ్చు గా చక్కగా వాళ్ళ నాన్న వాడికి రాత్రి అయ్యేసరికి బోలెడు కథలు చెప్తాడు వాడిని ప్రతి సండే బయటికి తీసుకువెళ్తాడు నువ్వు మాత్రం ఎప్పుడో వస్తావు ఇప్పుడు చెల్లి కూడా ఉంది , నువ్వు ఉండిపోవచ్చు కదా నాన్న " అన్నాడు అమాయకo గా.

అశోక్ తండ్రీ నవ్వి తన అరచేతిలో ఉన్న జెండా కాగితాన్ని అశోక్ చొక్కా కు పెట్టి పిన్ను పెట్టాడు వెంటనే అంతకు ముందు తన తండ్రీ తనకి నేర్పించిన సెల్యూట్ ని చేసి చూపించాడు అశోక్ . కొడుకు ని చూసి మురిసిపోతూ " అశోక్ ఇప్పుడు నువ్వు పెద్ద వాడివి అవుతున్నావు కాబట్టి చెప్తున్నా నువ్వు ఇప్పుడు స్కూల్ కి చక్కగా వెళ్తున్నావు అన్నా, బంటి వాళ్ళ నాన్న ఆఫీస్ కి వెళ్తున్నాడు అన్నా , మీరు అందరు సరదాగా ఆడుకుంటున్నారు అన్నా దానికి కారణం నేను అక్కడ ఉండడం నేను అక్కడ ఉంటేనే మీరు అందరు ఇక్కడ సంతోషం గా ఎలాంటి భయం లేకుండా ఉంటారు అర్ధం అయ్యిందా నేను లేనప్పుడు అమ్మ ని, చెల్లి ని , నాన్నమ్మ, తాతయ్య ని నువ్వే చూసుకోవాలి నా తరువాత నువ్వే ఈ ఇంటికి పెద్ద వాడివి " అన్నాడు .

అశోక్ కళ్లలో మెరుపు ఆ పసి మనసు కు ఏమి అర్ధం అయిందో తెలీదు కానీ వెంటనే " అంటే నువ్వు రియల్ హీరో నా..? నాన్న " అని అడిగాడు ఆత్రం గా . అశోక్ తండ్రీ ఆ ప్రశ్న కి చిన్నగా నవ్వాడు మళ్ళి అశోక్ " అవును నాన్న మా టీచర్ చెప్పింది అందరికి మంచి చేసేవాళ్లు రియల్ హీరోస్ అని అయితే రేపు నేను మా స్కూల్ లో చెప్తాను మా నాన్న రియల్ హీరో అని " అంటూ గెంతులు వేసాడు అది విని నవ్వుతు అశోక్ తల నిమిరి అక్కడ నుండి వెళ్లిపోయాడు తండ్రీ.

బయట హార్న్ శబ్దానికి అశోక్ ఆలోచనల నుండి బయట పడ్డాడు బయట ఎదో బండి ఆగిన శబ్దం వెంటనే అశోక్ ఆనందం గా అనుకున్నాడు ' హమ్మయ్య నాన్న వచ్చేసాడు ' అని పరిగెత్తుకుని బయటకు వెళ్లాడు కానీ తనూ అనుకున్నట్టు నాన్న రాలేదు నాన్న వేసుకునే యూనిఫార్మ్ లాంటివి వేసుకున్న కొంత మంది వచ్చారు వాళ్లు ఒక పెద్ద పెట్టె ను దించుతున్నారు . అశోక్ తాతయ్య , నాన్నమ్మ, తల్లి అందరు బయటకు వచ్చారు . పెట్టె ను కిందకు దించి ఇంటి ముందు పెట్టారు అంతే అప్పటి వరకు మౌనం గా ఉన్న తల్లి తనని పట్టుకుని ఉన్న ఆడవారి ని విడిపించుకుని ఆ పెట్టె దగ్గరికి పరిగెత్తి గుండెల విసేలా ఏడవడం మొదలు పెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన అశోక్ బిక్క చచ్చిపోయాడు భయం భయం గా అడుగులు వేసి ఆ పెట్టె దగ్గరికి వచ్చి చూసాడు ఆవాక్కయ్యాడు ఆ పెట్టె లో తన తండ్రీ అలానే చూస్తు ఉండిపోయాడు ఇప్పుడిప్పుడే చావు పుట్టుకల గురించి కాస్త అవగాహన వస్తుంది ఆ పసి వాడికి. అశోక్ నాన్నమ్మ కూడా పెట్టె దగ్గరికి వచ్చి శోకాలు పెడుతూ ఏడుస్తుంది .

అశోక్ అక్కడే కూలబడిపోయాడు 'అంటే నాన్న చచ్చిపోయాడా' అనుకున్నాడు మళ్ళి తన తండ్రీ వైపు దీనం గా చూస్తూన్నాడు ఎదో మూలన చిన్న ఆశ తన తండ్రీ కళ్ళు తెరిచి చూస్తాడేమో అని , కానీ అలా జరగలేదు . అశోక్ కంటి నుండి కన్నీళ్ళు రావడం మొదలు అయ్యాయి మరి ' నాన్న ఎప్పటికీ కనిపించడా? తనతో ఆడుకోడా? తనకి బొమ్మలు ఎవరు కొనిస్తారు? చెల్లి ని ఎవరు ఎత్తుకుంటారు ?' ఎన్నో ప్రశ్నలు ఆ చిన్ని మెదడు లో . తన తండ్రీ పై కప్పిన జెండా ను చూశాడు ఎదో గుర్తు వచ్చింది. వెంటనే ఇంటి లోకి పరిగెత్తాడు అశోక్ అయితే అక్కడ ఉన్న వాళ్లు అశోక్ ని పట్టించుకునే స్థితి లో లేరు.

చేతి పిడికిలి మూసి బయటకు వచ్చాడు అశోక్ మెల్లగా తండ్రీ దగ్గరికి వెళ్లాడు. వంగి తండ్రీ నుదుటి పై ముద్దు పెట్టాడు అందరు అశోక్ ని చూస్తున్నారు జాలి గా . పిడికిలి తెరిచాడు అందులో రెప రెప లాడుతున్న జెండా తన తండ్రీ తనకి చివరగా ఇచ్చిన కానుక అది తన తండ్రీ చేతిలో పెట్టాడు , ఆ పైన చేయి వేసి " నాన్న! నేను అమ్మ ను, చెల్లి ని, నాన్నమ్మ ను, తాతయ్య ను బాగా చూసుకుంటాను , అంతే కాదు నేను పెద్ద అయ్యాక నీ లాగే అవుతాను నాన్న " అంటూ తండ్రీ తనకు నేర్పిన సెల్యూట్ చేసాడు . ఆ దృశ్యం అక్కడ ఉన్న వారిని అందరిని కలచివేసింది.

******** జై హింద్*******


Rate this content
Log in

Similar telugu story from Inspirational