Venkata Rama Seshu Nandagiri

Inspirational

5  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

ముందడుగు (స్నేహితురాలికి లేఖ)

ముందడుగు (స్నేహితురాలికి లేఖ)

2 mins
433


ప్రియమైన పద్మా,

చాలా రోజులైంది కదూ, ఇలా పలకరించుకొని! ఫోన్లు ఉండగా ఈ ఉత్తరాల గోలేమిటా, అనుకుంటున్నావా!

ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెప్పాలనుకున్న విషయం తప్న మిగిలిన విషయాలెన్నో మాట్లాడేస్తాం. ఫోన్ పెట్టేశాక 'అయ్యో, అసలు విషయం చెప్పనే లేదు. మరోసారి మాట్లాడినప్పుడు చెప్పాలి' అనుకోవడం, మర్చిపోవడం. రోజులలా గడిచి పోవడం. అందుకే ఈసారి నీతో నా మనసులోని విషయాలను పంచుకోవడానికి ఉత్తరమే రాయాలని నిర్ణయించుకున్నా.

ఇన్నేళ్ళుగా మూగబోయిన నా మనసుకి ఎందుకో నీతో అన్ని విషయాలు పంచుకోవాలని అనిపించింది. దానికి కారణం , నా బీరువా సర్దుతూండగా, ఏనాడో మన డిగ్రీ ఆఖరి సంవత్సరం లో తీసుకున్న గ్రూప్ ఫోటో కనిపించింది. అందరినీ చూసేసరికి నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మన స్నేహం, కబుర్లు, అన్నీ గుర్తుకు వచ్చాయి.

ఎన్నేళ్ళైంది మనం కలిసి? ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతున్న నాకు దేనికీ సమయముండదు. ఆఖరికి అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా కుదరదు.

పిల్లలు పెరుగుతున్నారు. అవసరాలు పెరుగుతున్నాయి. అందులో ఆడపిల్ల ఉందంటే.దాని ఖర్చులు దానివి. దానికి తగ్గట్టు జీతాలు పెరగవే.

గవర్నమెంట్ ఉద్యోగం పేరుతో ఆయనకి ఈ ఊరినుండి కదిలేందుకు లేదు. బాధ్యతల సుడిగుండంలో నుంచి బైట పడేదీ లేదు.

నేనే ఇంక ఏదైనా చేస్తే బాగుండును అని అనుకుంటున్నాను. కాస్త ఆదాయం వచ్చే పనేదైనా చేద్దామని ఆలోచిస్తున్నా. మనం పదవ తరగతి తర్వాత సరదాగా నేర్చుకున్న కుట్టుపనిని ఉపయోగించుకుందామని ఉంది. ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత కూడా నేను నేర్చుకున్నా. ఇంట్లో మాఅమ్మాయికి, అత్తయ్యకి, నాకు నేనే కుట్టుకుంటున్నా.

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కుదిరేది కాదు. ఇప్పుడు వాళ్ళూ పెద్దవాళ్ళయ్యారు. మధ్యాహ్నం ఖాళీగానే ఉంటున్నా. అందుకే కుట్టుపని మొదలుపెడదామని ఉంది. 


పద్మా! గుర్తుందా, మనం కుట్లు నేర్చుకొనేటప్పుడు జాకెట్ కటింగ్ నేర్పారు. అప్పుడు నీకు నేను, నాకు నువ్వు కుట్టుకున్నాం. ఇప్పుడది సరిపోక పోయినా, నాటి గుర్తుగా ఇప్పటికీ నా దగ్గర ఉంది.

అంతేకాదు పద్మా , ఈ మధ్యనే ఆన్లైన్లో చూసి కొన్ని కొత్త రకాలు అంటే జాకెట్లు మాత్రమే కాక, చూడీదార్లు అవీ కూడా నేర్చుకున్నా. మా అమ్మాయికి కుడుతున్నాను. అవి మాఅమ్మాయి వేసుకుని కాలేజ్ కి వెళ్తోంది. తన ఫ్రెండ్స్ కి నచ్చి వాళ్ళుకూడా అడుగుతున్నారట, వాళ్ళకి కుడతానేమో అడగమని.

అందుకే, ఇంట్లోనే ఉండి నా వీలుని బట్టి చేయగలిగే పని కదా అని చేద్దామనే నిర్ణయించుకున్నాను.

మా అత్తయ్య మామయ్యలకి సమయానికన్నీ అమర్చేస్తే చాలు. నేను ఉద్యోగం చేస్తానన్నా వాళ్ళకి అభ్యంతరం ఉండదు. అయినా ఇన్నేళ్ళ తర్వాత బైటికి వెళ్ళి ఉద్యోగం చేయడమంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేననుకున్నదే నయమనిపిస్తోంది.

ఇంక మావారి విషయానికొస్తే నమో నారాయణ! ఆయన ఉద్యోగం ఏమిటో, ఆయనేమిటో. నేనింట్లో ఉంటున్నానో లేదో, ఏంచేస్తున్నానో అసలు పట్టదు. అప్పటికీ అన్నీ విడమర్చి చెప్పి ఆయన ఉద్దేశ్యం అడిగితే, 'నాకివేం తెలియవు. ఎలా బాగుందనుకుంటే అలాగే చెయ్యి' అన్నారు.

మా పిల్లల్నడుగుదామంటే, 'ఏంటమ్మా , ఇంకా చిన్నపిల్లలా. అందర్నీ అడిగి చేస్తానంటావ్! ఆమాత్రం నిర్ణయం నీకు.నువ్వు తీసుకోలేవా' అంటారు.

అందుకే, నా.స్వంత నిర్ణయంతో, నేను నా కుటుంబ శ్రేయస్సు కోసం ముందడుగు వేద్దామనుకుంటున్నాను. అమ్మానాన్నలు, నేనేంచేసినా నాకు అండగా ఉంటారన్న నమ్మకం నాకుంది.

నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి కాబట్టి నేను చేసే పని మంచిది గా భావించి అభినందిస్తావని మనసారా నమ్ముతున్నాను.

ఉంటామరి. సాయంత్రం టీ పెట్టాలి. వీలైనపుడు నీవు కూడా ఉత్తరం రాస్తావని అనుకుంటున్నాను.

వీలుకుదిరినప్పుడు జవాబిస్తావు కదూ.

నీ ఉత్త‌రం కోసం ఎదరుచూసే,…

   

                    

                 నీ స్నేహితురాలు   

                                                            రమ్య



Rate this content
Log in

Similar telugu story from Inspirational