PVV Satyanarayana

Inspirational

4  

PVV Satyanarayana

Inspirational

మి…టూ…

మి…టూ…

7 mins
74



***

     శోభాయమానంగా అలంకరింపబడ్డ శోభనపు గది…అది విరజిమ్ముతున్న సౌరభాలను ఆస్వాదించుతూ, తన జీవితాన్ని నూతన వెలుగులతో నింపడానికి వస్తూన్న నవవధువుకు ఆహ్వానం పలికేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు రేవంత్. గుమ్మం దగ్గర ఏ చిన్న అలికిడి అయినా ఆమె వచ్చిందేమోనన్న ఆశ!

     ‘శ్వేత ఫాస్ట్ గాళ్. పాలగ్లాసుకు బదులు బీరు బాటిల్ తో శోభనపుగది ప్రవేశం చేయదుగదా!’ అన్న చిలిపి తలంపు మొలకెత్తడంతో చిన్నగా ఉలికిపడి, ‘అమ్మో!’ అనుకున్నాడు.

     అతను మధురోహలలో తేలియాడుతుండగానే, గదిలో అడుగు పెట్టింది శ్వేత చేతిలో గ్లాసుతో.

     ఆమెను చూసి రెప్పవేయడం మరచిపోయాడు రేవంత్… శ్వేత అందగత్తె. ఫెయిర్ గా, స్లిమ్ గా, పొడవుగా…మల్లెతీగలా…బాబ్డ్ హెయిర్ తో – బార్బీ బొమ్మలా ఉంటుంది. నాభి క్రిందనుండి కట్టిన పాము కుబుసంలాంటి తెల్లచీర, మిసమిసలాడే ఆమె మేనిలావణ్యంతో పోటీ పడుతోంది. బిగుతుగా ఉన్న బ్లౌజ్, పిటపిటలాడే ఆమె యవ్వనానికి అద్దం పడుతోంది. చేతులకు పెట్టుకున్న మెహందీ మనోహరంగా ఉంది. ఆమె పూసుకున్న అత్తరు సువాసనలు, మేని సుగంధాలతో మిళితమై మత్తెక్కిస్తున్నాయి.

     ఆమె చేతిలోని గ్లాసును అందుకోబోయాడు.

     “ముందు మురిపాలు. ఆ తరువాతే పాలైనా, ఆపాలయినాను” అందామె నునుసిగ్గుతో. “అయినా, ఇవి పాలు కాదు. కిక్ ఇస్తుందని కోక్ తీసుకొచ్చాను”.

     తెల్లబోయాడు. అంతలోనే తేరుకుని ఆమె బుగ్గలు అందుకున్నాడు. ‘కెవ్వు’ మందామె…

ఉలికిపడి కళ్ళు తెరచాడు రేవంత్. తన గదిలో బెడ్ మీద ఉన్నాడు. మంచం పక్కను, బుగ్గ మీద చేత్తో రుద్దుకుంటూ బుంగమూతితో అతన్నే చూస్తోంది దుర్గ. పనమ్మాయి.

     “ఏంటి, రేవంత్ బాబూ! వంగుని దుప్పటి సర్దుతుంటే, నా ముఖం పట్టుకుని బుగ్గ కొరికేసావు?” అంది చిరుకోపంతో.

     బిత్తరపోయాడు రేవంత్. ‘తాను కౌగలించుకున్నది శ్వేతను కాదా? దుర్గనా? అంటే, అదంతా కలేనా!?...’ గొప్ప నిరుత్సాహానికి గురయ్యాడు.

     “సారీ, దుర్గా! ఏదో…కల…వస్తేనూ…” అన్నాడు ఎపాలజెటిక్ గా. కిసుక్కున నవ్విందామె.

ఆమె కేకను ఆలకించి పరుగెత్తుకువచ్చారు రేవంత్ తల్లి మహాలక్ష్మి, తండ్రి ఈశ్వర్రావు, నాన్నమ్మ జానకమ్మాను. “ఏమిటే, ఏమయింది? ఎందుకలా అరచావ్?” ఆత్రుతగా అడిగింది మహాలక్ష్మి.

“నీ కొడుకు దాన్ని ఏమైనా గోకాడేమో!” అంది జానకమ్మ మెల్లగా.

దుర్గ ఎక్కడ చెప్పేస్తుందోనని భయం భయంగా చూసాడు రేవంత్.

 “గది తుడుస్తుంటే బొద్దింక ఒకటి ఎగిరొచ్చి నా మీద పడిందండి” అంది దుర్గ.

‘హమ్మయ్య!’ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

“ఓసి అంతేనా! ఏ బల్లో పిల్లో మీద పడితే భయపడాలిగాని, ఆఫ్టరాల్ బొద్దింకకే గుండెలు అదిరేలా అరవాలా!” అన్నాడు ఈశ్వర్రావు. జానకమ్మకు మాత్రం ఏదో అనుమానంగానే ఉంది. ఎర్రగా కందిన దుర్గ బుగ్గ, ఆమె వాలకం, మాటల్లో తడబాటు, మనవడి బిత్తరచూపులు – కంటికి కనిపించని వర్చ్యువల్ రియాలిటీని దేన్నో చూపిస్తున్నాయి ఆమెకు.

“గది త్వరగా తుడిచేసి క్రిందకు రా, అంట్లు తోమాలి” అని దుర్గతో చెప్పి గుమ్మం వైపు నడచింది మహాలక్ష్మి. “ఈసారి ఏ బల్లో మీద పడగలదు, జాగ్రత్త!” అన్నాడు ఈశ్వర్రావు.

“అమ్మగారూ! రేవంత్ బాబుకు త్వరగా పెళ్ళిచేసేయండమ్మా!” అని దుర్గ అనడంతో, ఆగి ఆశ్చర్యంతో చూసింది మహాలక్ష్మి. “అహఁ, నిద్రలో ఏదో కలవరిస్తుంటేనూ…” అంది దుర్గ.

“ఏం, మేము చేయమన్నామా?” అంది జానకమ్మ నిష్టూరంగా.

“మావాడు ‘ఊఁ’ అనాలే కాని, నా మేనకోడలు పల్లవి సిద్ధంగా లేదూ?” అన్నాడు ఈశ్వర్రావు.

మహాలక్ష్మి భర్త వంక మిర్రిచూసింది. “నా కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీరు. పల్లెటూరి పిల్లను చేసుకోవలసిన కర్మ వాడికేమిటి!” అంది.

“ఏం, పల్లెటూరి పిల్లలు ఆడపిల్లలు కాదా? ఆ మాటకొస్తే, నేను చేసుకోలేదూ?” అన్నాడు ఈశ్వర్రావు.

“నా కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీరు, మీరు ఎ.జి. ఆఫీసులో గుమాస్తాను…” చురుగ్గా చూసింది ఆమె. “నా బంగారు తండ్రి ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు”.

“సినిమా మమ్మీలా మాట్లాడకు. ఆనక వాడు కోరుకున్నది దక్కకపోతే దేవదాసు అయిపోగలడు!” వెటకారంగా అన్నాడు అతను.

“మీరు మాత్రం? బొమ్మరిల్లు ఫాదర్ లా పోజుకొట్టడంలేదూ?” అంది మహాలక్ష్మి. “మీ చెల్లెలి కూతురుగదా అని…స్కూలుకు వెళ్ళడానికి భయపడి చదువుకు అర్ధాంతరంగా స్వస్తి చెప్పిన ఆ పిరికిపిల్లను చేసుకోవాలని వాణ్ణి శాసించడంలేదూ?”. వారి గొడవతో, లేచి వాష్ రూమ్ లో దూరాడు రేవంత్.

ఇరవయ్ ఆరేళ్ళ రేవంత్ హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఓ ఎమ్మెన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా నెలకు లక్షరూపాయల జీతం అందుకుంటున్నాడు…అతని మేనత్త కూతురు పల్లవి అతనికంటె నాలుగేళ్ళు చిన్నది. కాటుక దిద్దిన చారెడేసి కన్నులతో చూడ ముచ్చటగా ఉంటుంది. లంగా, ఓణీలతో సింపుల్ గా ఉంటుంది. పొరుగూళ్ళో పదవ తరగతి చదువుతున్నది కాస్తా, హఠాత్తుగా వెళ్ళడం మానేసింది. తరువాత ఇంటి నుండే ప్రైవేటుగా కట్టి టెన్త్ పాసయింది. గ్రామంలోని చిన్న పిల్లలకు, వయోజనులకు ఉచితంగా చదువు చెబుతుంటుంది. తండ్రిది వ్యవసాయం. బావంటె పల్లవికి ఇష్టం.

ఇకపోతే, రేవంత్ కి మరదలంటే ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. ‘పల్లవి పిరికిది. పొరుగూరు వెళ్ళి చదువుకోవడానికి భయపడి చదువు మానేసింది. పుట్టి బుద్ధెరిగాక అ పల్లెటూరు తప్ప బయటి ప్రపంచం చూసి ఎరగదు. పట్టణపు జీవితంలో ఇమడలేదు…’ – ఇదీ పల్లవి గురించి మహాలక్ష్మి యొక్క చులకన భావన.

కొడుకు అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడుతాడని మహాలక్ష్మి తరచు అనడంతో, రేవంత్ తనకు తెలియకుండానే అలాంటి యువతి కోసం అన్వేషణ ఆరంభించాడు. అతని అన్వేషణ ఓ రోజు ఆఫీసు కఫెటేరియాలో అంతమయింది. అదే కంపెనీలో ఆ మధ్యనే కొత్తగా చేరిన శ్వేత, రేవంత్ ని ఆకట్టుకుంది. … ఇంచుమించు అతని వయసే ఉంటుంది ఆమెకు. అందంగా ఉంటుంది. మోడర్న్ దుస్తులను ధరిస్తుంది. అనర్గళంగా మాట్లాడడమేకాక, బోల్డ్ గా కనిపిస్తుంది.

అంతకుమునుపు లంచ్ తన సీట్లోనే తినేవాడు రేవంత్. ఇప్పుడు శ్వేతను చూదడం కోసమే రోజూ లంచ్ బాక్స్ తీసుకుని క్యాంటీనుకు వెళుతున్నాడు. శ్వేత, ఆమె స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. వారికి చేరువలో మరో టేబుల్ వద్ద కూర్చుంటాడు అతను. రేవంత్ ని గమనిస్తున్న శ్వేత స్నేహితురాళ్ళు, “గురుడికి నువ్వు తెగ నచ్చేసినట్టున్నావే, శ్వేతా! ఎప్పుడూ క్యాంటీన్ ముఖం చూడనివాడు, ఇప్పుడు నీ ముఖం చూడ్డానికే రోజూ వస్తున్నాడు” అని నవ్వారు.

రేవంత్ ని ఏడిపించాలని నిర్ణయించుకున్న శ్వేత, అతన్ని చూసి చిరునవ్వు నవ్వేది. అతను కంగారుగా చూపులు మరల్చుకోవడం చూసి నవ్వుకునేది. ఓసారి తానే, “హాయ్!” అంటూ పలుకరించింది అతన్ని. “హ…హాయ్…” అన్నాడు తడబాటుతో. “నా బాకీ ఎప్పుడు తీరుస్తారు?” అడిగింది కొంటెగా.

“మీ బాకీయా! ఏ…ఏమిటది?” తెల్లబోయాడతను.

“ఐస్ క్రీమ్ ని చప్పరించినట్టు, నా అందాన్ని జుర్రేసుకుంటున్నారుగా!”

“ఆఁ…అబ్బేఁ, అదేం లేదే!” అంటూ అతను కంగారుగా అక్కణ్ణుంచి జారుకుంటుంటే, వస్తూన్న నవ్వును బలవంతంగా ఆపుకుంది.

మరో రోజున – అనుకోకుండా ఆఫీసు లిఫ్టులో తారసపడ్డారు ఇద్దరూ. వేరెవరూ లేరు అందులో. “హాయ్!” అంటూ పలుకరించిందామె. తన ఫ్లోర్ లో దిగిపోతూ, “మనం పెళ్ళిచేసుకుందామా?” అనేసి, కిసుక్కున నవ్వింది. ఎదురుచూడని ఆ సంఘటనతో రేవంత్ మనసు ఆ రోజంతా పనిమీద లగ్నం కాలేదు. గాలిలో ఉయ్యాలలూగింది. దాని పర్యవసానమే – శ్వేతతో అతని రంగుల కల!!.....

#

ప్రపంచంలో హఠాత్తుగా ‘#మి…టూ…’ హవా రేగింది. చూస్తుండగానే అది తుఫానుగా మారి, సామాజిక మాధ్యమాల సాయంతో సునామీ అయింది.

‘#మి…టూ…’ – ‘నేను సైతం!’

అమెరికన్ మూవీ మొగల్ హార్వీ వెయిన్ స్టైన్ తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ నటి చేసిన ఆరోపణ దానికి శ్రీకారం చుట్టింది. తామూ ఆ కామాంధుడి బాధితులమేనంటూ మరికొందరు యువతులు ముందుకు రావడం జరిగింది. వారిలో యాష్లీ జుడ్, రోజ్ మెక్ గ్రోవన్, గ్వైనెత్ పాట్రో, రీజ్ విదర్ స్పూన్ వంటి ప్రముఖ హాలీవుడ్ తారలు ఉండడం విశేషం.

హార్వీ ఒక్కడే కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ (సీనియర్) – పదవిలో ఉన్నప్పుడే కాక, పదవీవిరమణానంతరం చక్రాల కుర్చీకి పరిమితమయ్యాక కూడా – ఏదో ఒక సందర్భంలో కావాలనే తమను అనుచితంగా, అసభ్యకరంగా తాకేవాడంటూ కొందరు మహిళలు ఆరోపించడము, అతగాడు క్షమాపణలు తెలుపుకోవడమూ జరిగాయి.

ఏ ఉద్యమానికైనా తొలి అడుగు ముఖ్యం. ఒక మహిళ ధైర్యంగా ముందుకురావడంతో, అన్నేళ్ళూ తమకు జరిగిన అత్యాచారాలను లోలోపలే అణచుకుని నిశ్శబ్దంగా బాధపడుతున్న ఎందరో వనితలు ముందుకు వచ్చి పురుషుల వల్ల తమకు జరిగిన పరాభవాలను, అవమానాలను బహిరంగంగా పంచుకోవడం జరిగింది. మహిళల పైన అత్యాచారపు ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిలో ఎందరో సెలెబ్రైటీస్ ఉండడం శోచనీయం! నటుడు కెవిన్ స్పేసీ, పాప్ సింగర్ నిక్ కార్టర్, పాప్యులర్ కమెడియన్ లూయీస్ వంటి పలు ఫిల్మ్ పర్శనాలిటీస్… మీడియాకి చెందిన బిల్ బోర్డ్ మ్యాగజీన్ ఎక్జిక్యూటివ్ స్టిఫెన్ బ్లాక్ వెల్, అమెజాన్ ఎక్జిక్యూటివ్ రాయ్ ప్రైస్, న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ గ్లెన్ త్రష్ మున్నగువారు, బ్రిటిష్ డిఫెన్స్ సెక్రెటరీ మైఖేల్ ఫాలన్ వంటి పొలిటీషియన్స్, ఊబర్ సి.ఇ.ఒ. ట్రావిస్ కలనిక్, స్పోర్ట్ స్ ఫీల్డ్ కీ చెందిన పలువురు ప్రముఖుల పేర్లూ బహిర్గతం కావడం విశేషం. ఆ ఆరోపణల నేపథ్యంలో కొందరు తమ పదవులను కోల్పోవడం జరిగింది.

చిత్రసీమలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ ఓ బహిరంగ రహస్యం. నటి కావాలన్న ఆశతో, ఆశయంతో వచ్చిన ఎందరో యువతులు ఆ క్యాస్టింగ్ కౌచ్ కి బలయిపోవడం, ఆ బాధను గుండెల్లోనే దాచుకుని కుమిలిపోవడం కద్దు. ‘#మి…టూ…’ ఉద్యమంతో దేశ, విదేశీయ వనితలు ఎందరో తమ తమ చేదు అనుభవాలను పంచుకోవడం జరిగింది. కొందరు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు… వారిని అందుకు ప్రేరేపించినది హాలీవుడ్ గాయని, నటి అలైస్సా మిలానో. కామాంధుల అత్యాచారాలకు బలైన మహిళలు తమ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ‘హ్యాష్ ట్యాగ్’ (#) తో ఐడెంటిఫై చేసుకోవలసిందిగా, ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చిందామె. అనూహ్యస్పందనతో ఇరవై నాలుగు గంటల్లోనే లక్షలకొద్ది బాధితురాళ్ళు బైటపదడంతో యావత్ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అలైస్సా మిలానోని అభినందించారంతా. ఐతే, ఆ క్రెడిట్ తనది కాదనీ, పదేళ్ళక్రితమే నల్లజాతీయురాలు, సోషియల్ వర్కరూనైన తరానా బర్క్ దాన్ని ఆరంభించినట్లూ తెలిపిందామె.

ఓ పసిపిల్ల –ఎదుగుతున్న తన దేహంతో తన సవతి తండ్రి ఎలాంటి నికృష్టపు చేష్టలు చేస్తున్నాడో, తరానా బర్క్ కి చెప్పుకుని వాపోయింది. ఆ పిల్ల యొక్క దయనీయమైన గాధ ‘#మి…టూ…’ ఉద్యమానికి నాంది పలికింది. పురుషుల అత్యాచారాలకు బలైన నల్లజాతి పేదబాలికల సంక్షేమార్థం 2006 లో తరానా బర్క్ హార్లెమ్ లో ‘#మి టూ’ ఉద్యమాన్ని ఆరంభించింది. అలైస్సా మిలానో యొక్క హ్యాష్ ట్యాగ్ సలహాతో అదిప్పుడు వెలుగులోకి వచ్చి ప్రపంచంలో గొప్ప సంచలనం సృష్టించింది…..

#

రేవంత్ పనిచేసే కంపెనీ యానివర్శరీ సెలెబ్రేషన్స్ ఓ స్టార్ హోటల్లో జరుగుతున్నాయి. స్టాఫంతా వినోదాలతో సందడిచేస్తున్నారు. డ్యాన్స్ ఫ్లోర్ మీద కొందరు మ్యూజిక్ కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. వారిలో శ్వేత కూడా ఉంది. శ్వేత ముంబై గాళ్. మోడర్న్ కల్చర్ కి అలవాటుపడింది. అప్పుడప్పుడు ఆమె పబ్ కి వెళుతుందనీ, బీరును నీరులా త్రాగేస్తుందనీ లోగడ ఆమె స్నేహితురాళ్ళ కబుర్లద్వారా గ్రహించాడు రేవంత్. ఇప్పుడు ఆమె వెస్టర్న్ డ్యాన్స్ చేస్తుంటే కళ్ళప్పగించి చూసాడు.

అనంతరం బఫే ఆరంభమయింది. అందరూ ప్లేట్లతో ఎగబడ్డారు. రేవంత్ వడ్డించుకుని వచ్చేసరికి శ్వేత కనిపించలేదు. ప్లేట్ పట్టుకుని ఒక్కో మెతుకే కతుకుతూ ఆమెకోసం వెదికాడు. ఓ గదిలో కబుర్లు చెప్పుకుంటూ, ఛలోక్తులు ఆడుకుంటూ స్నేహితురాళ్ళతో కలసి డిన్నర్ చేస్తోంది శ్వేత. మంచినీటి స్థానంలో బీరు బాటిల్స్ ఉన్నాయి. గుమ్మం పక్కనే ఆగిపోయాడు రేవంత్.

“ఈ మధ్య ‘#మి…టూ…’ హవా ప్రపంచమంతా వీస్తోంది. మీ అభిప్రాయమేమిటే?” అనడిగింది ఓ యువతి.

“పురుషులందు పుణ్యపురుషులు అరుదయా…అని తెల్లమవుతోంది” అని ఒకామె జవాబు ఇవ్వడంతో, ఫక్కుమన్నారంతా.

“అన్నట్టు, శ్వేతా! పీజీలో ప్రొఫెసర్ ఎవడో నిన్ను మోలెస్ట్ చేయబోయాడనీ, సహకరించకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడనీ ఓసారి చెప్పావుకదూ? నువ్వు కూడా ‘#మి…టూ…’ మూవ్మెంటులో పాల్గొని ఆ రాస్కెల్ని ఎక్స్ పోజ్ చేయకూడదూ?” అంది ఒకామె.

“అమ్మో! వాణ్ణి ఎక్స్ పోజ్ చేయడం మాట దేవుడెరుగు, ముందు నేను నవ్వులపాలవుతాను” భయంగా అంది శ్వేత. ఆశ్చర్యంతో ముఖాలు చూసుకున్నారంతా. “నీలాంటి బోల్డ్ గాళే ఇలా భయపడితే ఎలాగే?”

“బోల్డా, నా బొందా! నా పేరెంట్ స్ కి తెలిసిందంటే, నన్ను పెళ్ళిచేసుకోవడానికి ఎవరూ ముందుకు రారంటూ నన్ను ఉతికి ఆరేస్తారు” అంది శ్వేత.

‘ఈమె బోల్డ్ నెస్ వెనుక ఇంత బేలతనముందా!?’ అనుకుని తెల్లబోయాడు రేవంత్.

రెండు రోజుల తరువాత –

రాత్రి టీవీలో ‘#మి…టూ…’ ప్రోగ్రామ్ లో మహిళలు కొందరు ఒక్కొక్కరుగా తమ తమ చేదు అనుభవాలను పంచుకుంటుంటే, ఈశ్వర్రావు కుటుంబం కుతూహలంతో తిలకిస్తోంది.

“అందుకే అన్నారు, అందమైన ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అని!” అంది జానకమ్మ. “అది ప్రాసకోసం ప్రాకులాట లేవే. దేవుణ్ణి అంటే కళ్ళు పోతాయి” అన్నాడు ఈశ్వర్రావు.

మహాలక్ష్మి, రేవంత్ నవ్వారు. అంతలో తెరముందుకు వచ్చిన అమ్మాయిని చూసి ఉలికిపడ్డారంతా. ఆమె ఎవరో కాదు – ఈశ్వర్రావు చెల్లెలి కూతురు పల్లవి!

‘నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఖోఖో ఆడేదాన్ని. మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఏదో ఒక వంకతో నా శరీరాన్ని ఎక్కడెక్కడో తాకేవాడు. ఒళ్ళంతా తడిమేవాడు. అతని కూతురు, నేను స్నేహితురాళ్ళమని కూడా ఆలోచించేవాడు కాదు. అతని చర్యలు నాకు కంపరమెక్కించేవి. ఇంట్లో చెప్పడానికి భయపడి, నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేకా క్లాసురూములో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. స్కూలుకు వెళ్ళడానికి భయంవేసేది. తరచు స్కూలు ఎగ్గొట్టేస్తుంటే, ప్రిన్సిపాల్ నన్ను పిలిచి బాగా తిట్టారు. పరీక్షకు కూర్చోనివ్వనని వార్నింగిచ్చారు…

‘ఓసారి ఏకంగా నన్ను ముద్దుపెట్టుకోబోయాడు ఆ టీచర్. దాంతో ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పుకుని ఏడ్చాను. ఫలితంగా నా చదువుకు ఫుల్ స్టాప్ పడింది! ఫిర్యాదుచేస్తే మన పరువే పోతుందంటూ, నన్ను స్కూలు మానిపించేసారు నా తల్లిదండ్రులు. ఆ తరువాత నేను ఇంటినుండే ప్రైవేటుగా పరీక్షకు కట్టి టెన్త్ పాసయినా, కాలేజ్ కి పంపడానికి మావాళ్ళు ఒప్పుకోలేదు…’ పల్లవి చెప్పుకుపోతుంటే, ఆ గదిలో భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది.

‘…పెళ్ళి కావలసిన ఆడపిల్ల టీవీలో కనిపించి తనపైన జరిగిన అత్యాచారం గురించి బట్టబయలుచేసుకుంటే…పెళ్ళిసంబంధాలు రావని నన్ను వారించబోయారంతా. కాని, ఎందరో యువతులు, వివాహిత స్త్రీలు నిస్సంకోచంగా ముందుకు వచ్చి ఉద్యమానికి బలం చేకూర్చుతుంటే…స్వార్థంతో పిరికిదానిలా ఇంట్లో కూర్చోవడం నావల్ల కాలేదు. ఇప్పటికీ నేను బైటపడి ఆ ముష్కరుడి అకృత్యాలను సమాజానికి చాటకపోతే, నాలాంటి అమ్మాయిలు ఎందరికో అన్యాయం చేసినదాననవుతాను….’

“హవ్వఁ, ఎంతకు బరితెగించింది!” అంది మహాలక్ష్మి, పల్లవి మీద అక్కసుతో.

“ఇంతవరకు ‘అయ్యో,పాపం!’ అన్నావు. మన పిల్ల ఇన్నేళ్ళుగా తన గుండెల్లో గూడుకట్టుకున్న బాధను బైటపెట్టుకుంటుంటే బరితెగించినదానిలా కనిపిస్తోందా నీకు?” అన్నాడు ఈశ్వర్రావు తీక్ష్ణంగా. జానకమ్మ కోడలి వంక కోపంగా చూస్తూ మూతి త్రిప్పుకుంది.

పల్లవి పలుకులు రేవంత్ ని కలచివేసాయి. అంతవరకు, ఆమె చదువు మానేసినందుకు చిన్నచూపు ఉండేది. ఇప్పుడు నిజం తెలియడంతో నిర్ఘాంతపోయాడు. జాలివేసింది. నిర్భయంగా ముందుకు వచ్చి టీవీ కెమేరాల సాక్షిగా తన అనుభవాన్ని పంచుకున్న మరదలి తెగువ అతన్ని ఆకట్టుకుంది.

శ్వేత గుర్తుకు వచ్చింది అతనికి. ఆ సోకాల్డ్ మోడర్న్ గాళ్ స్వార్థంతో భయంతో తన రహస్యాన్ని తనలోనే దాచుకుంది. పల్లెటూరి పిల్ల, పిరికిది అని ఎద్దేవాచేయబడ్డ పల్లవి ధైర్యంగా ‘#మి…టూ…’ అంటూ ముందుకువచ్చింది. ఆమె నిజాయితీ అతనికి నచ్చింది. ‘జోహార్లు, పల్లవీ!’ అనుకున్నాడు మనస్ఫూర్తిగా.

“అమ్మా! నేను పల్లవిని పెళ్ళిచేసుకుంటాను. తాంబూలాలు పుచ్చుకోవడానికి మంచిరోజు చూడండి” అనేసి, మరోమాటకు ఆస్కారం లేకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయిన రేవంత్ పలుకులకు మహాలక్ష్మి అవాక్కయితే…ఈశ్వర్రావు, జానకమ్మలు ఆశ్చర్యానందాలతో ముఖాలు చూసుకున్నారు.

                                                                                (Written in the year 2018 during the '#Me Too..' movement)


Rate this content
Log in

Similar telugu story from Inspirational