Varun Ravalakollu

Drama Romance Thriller

4.6  

Varun Ravalakollu

Drama Romance Thriller

లవ్ ఇన్స్టిట్యూట్ ( పార్ట్ -1 )

లవ్ ఇన్స్టిట్యూట్ ( పార్ట్ -1 )

5 mins
982


ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం, డిల్లీ. డిల్లీ నుండి హైదారాబాద్ బయలుదేరి వెళ్ళే జెట్ ఏర్వేస్ విమానం మరికొద్దిసేపట్లో టేకాఫ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఫ్లయిట్లోకి ప్రవేశిస్తున్నాడు డాక్టర్ శేఖర్. నెమ్మదిగా కదుల్తున్నాడు. ఆరడుగులు ఎత్తు ఉండే అతడి అనువణువునా డాక్టర్లకి సహజంగా ఉండే హుందాతనం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. సూటిగా, కసిగా ఉన్న ఆ కళ్ళు ఎవరిమిదో అతడికి గల కోపాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కోపంగా, చిరాగ్గా ఉన్న అతడి ముఖం గమనిస్తే, అతడనుకున్న పని జరగలేదనే వియాన్ని తెలియజేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, గంభీరంగా ఉన్న అతడి ఆహార్యాన్ని గమనించిన ఎవరూ కూడా కనీసం అతడిని పలకరించటానికి కూడా సాహసం చేయలేరు.

“హలో సర్, వెల్కమ్!”

ఫ్లయిట్లోకి ప్రవేశించిన శేఖర్ని చిరునవ్వుతో విష్ చేసింది ఎయిర్ హోస్టెస్. అందమైన ఆమె రూపానికి తగ్గట్టే ఉంది ఆమె స్వరం. వృత్తి ధర్మాన్ని అనుసరించి నవ్వినా, ఆమె నవ్వు ఆమె అందాన్ని పెంచిందనే చెప్పాలి. సాధారణంగా అయితే స్త్రీ అందాన్ని ఆస్వాదించే అలవాటు ఉన్న శేఖర్, ఆమె పలకరింపుకు స్పందించేవాడే. కానీ తన సహజ స్వభావాన్ని కూడా విస్మరించి పలకరించటం కాదు గదా, కనీసం పట్టించుకొనైనా పట్టించుకోకుండా ముందుకు సాగాడు. వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ని అలాగే ఒళ్ళో పెట్టుకుని వెనక్కు వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఫ్లయిట్ టేకాఫ్ అయింది. మేఘాలని చీల్చుకుంటూ హైదరాబాద్ వైపు దూసుకుపోతుంది. అంతకంటే వేగంగా శేఖర్ మస్థిష్కంలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. వర్తమానాన్ని విడిచి గతంలోకి మళ్ళాయి. ఉదయం నుండి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి.

***

ఉదయం సరిగ్గా ఏడు గంటలకు డిల్లీలో ఫ్లయిట్ దిగాడు శేఖర్. ఎనిమిది గంటలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇది అతడి ఎనిమిదేళ్ళ కల. ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇదే విషయమై ఎన్నో పరిశోదనలు చేశారు. మరెన్నో ప్రయోగాలు నిర్వహించారు. అందరూ థీరిటికల్ గా ప్రూవ్ చేయగలిగారే కానీ, ఎవరూ కూడా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేకపోయారు. శేఖర్ మాత్రం జంతువుల మీద ప్రయోగం చేసి 100 పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించి భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే విస్మయ పరిచాడు. ఇక చేయాల్సిందల్లా మనుషుల మీద కూడా పరీక్షించి సురక్షితమే అని నిర్దారించటమే. కాని ఇండియాలో మనుషుల మీద ఔషద పరీక్షలు జరిపే ముందు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది. దాని కొరకే డిల్లీ వచ్చాడు శేఖర్. దీన్ని అప్రూవ్ చేయించుకుని ఫర్ధర్ స్టేజ్ లో కూడా శేఖర్ విజయం సాధిస్తే, ప్రపంచ వైద్య చరిత్రలోనే పెను సంచలనమవుతుంది.

వాతావరణ కారణాల వల్ల హైదరాబాద్ లో ఫ్లయిట్ గంటన్నర ఆలస్యంగా బయల్దేరటంతో అప్పటికే చాలా లేటైంది. వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఫ్లయిట్ ఎక్కినప్పుడు సెల్ ఫ్లయిట్ మోడ్ లో పెట్టింది గుర్తుకు వచ్చి తీసి మీటింగ్ మోడ్ లోకి మార్చాడు. అలా మీటింగ్ మోడ్ లోకి మార్చి సెల్ని జేబులో పెట్టుకున్నాడో లేదో ఇంతలో వైబ్రెటైంది. ఇప్పుడేవర్రా అనుకుంటూ చిట్లించిన ముఖంతో విసుగ్గా సెల్ తీసి చూశాడు. ఐ‌.ఎస్‌.డి కాల్ వస్తుంది. పేరు చూసిన తరువాత చిట్లించిన ముఖం కాస్తా చిరునవ్వు చిమ్మింది. ఆటండ్ చేసి,

“హలో డాక్టర్ ఫిలిప్స్! హౌ డూ యు డూ?” చలాకీగా అన్నాడు. డాక్టర్ ఫిలిప్స్ అమెరికన్ యూనివర్సిటీలో రసాయనిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. అంతే కాదు అక్కడే ప్రముఖ ఔషద తయారీ కంపెనీలో సైంటిస్టు కూడా. శేఖర్ రిసర్చ్ చేస్తున్న దాని మీదే తనూ రిసర్చ్ చేస్తున్నాడు. శేఖర్ తో మంచి పరిచయముంది.

“ఆబ్సల్యూట్లీ ఫైన్”

“నేను మీరు పంపిన థీసిస్ ని చదివాను. రియల్లీ, ఐ వస్ వండర్డ్. యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. కంగ్రాచులేషన్స్”

“హో, థాంక్యూ వెరీ మచ్”

“మేము ఎంతో కాలం నుండి ప్రయత్నిస్తున్నా మాకు సాధ్యం కానిది మీకు సాధ్యమైంది. మీ థీసిస్ ని మా ఎం‌.డి కి చూపిస్తే, హి వస్ సొ ఎగ్జైటెడ్ అండ్ విల్లింగ్ టు పే యు”

“హేయ్ కమాన్ మ్యాన్” అపనమ్మకంగా తోసిపుచ్చాడు శేఖర్.

“నో నో, లిసెన్. ఐ యామ్ నాట్ జోకింగ్. ఇందులో మా స్వార్దం కూడా ఉంది. ఇదే విషయమై మేము కూడా పరిశోదన చేస్తున్న విషయం మీకు తెలిసిందేగా. కానీ మేం అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాం. నెక్స్ట్ మంత్ కల్లా రిజల్ట్స్ చూపించకపోతే మా రిసర్చ్ కి స్పాన్సర్ చేస్తున్న వెంచర్ క్యాప్టలిస్టులు సూట్ ఫైల్ చేస్తామంటున్నారు. డబ్బు గురించి మాకు వర్రీ లేదు. ఇది మా కంపెనీ ప్రేస్టేజికి సంబంధించిన విషయం. అందుకే ఇప్పటికే ఆలస్యమైందని తెలిసి కూడా, ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవటం ఇష్టం లేక మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం. మీరడిగినంత పే చేయటానికి సిద్ధంగా ఉన్నాం”

“నేను డబ్బు కోసం ఈ రిసర్చ్ చేయడం లేదు”

“ఆఫ్ కోర్స్, ఐ నో. ఇట్స్ నాట్ ఎబౌట్ మనీ, ఇట్స్ ఎబౌట్ నేమ్ అండ్ ఫేమ్. దాని కొరకే మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు గనుక మీ రిసర్చ్ ని అమెరికాలో కంటిన్యూ చేస్తే, యు కెన్ గెట్ వరల్డ్ వైడ్ రెప్యుటేషన్. పైగా అమెరికన్ సర్టిఫైడ్ ట్రీట్మెంట్ అని ముద్ర పడితే ఇక దానికి ప్రపంచంలో ఎక్కడా తిరుగుండదు”

“సారీ డాక్టర్, ఐ వాంట్ మై ప్రాడక్ట్ టు బి ఇండియన్ మేడ్. మోరోవర్ నా రిసర్చ్ చివరి దశకు వచ్చింది. మనుషుల మీద పరీక్షించటానికి అప్రూవల్ కోసం ఇప్పుడే డిల్లీ వచ్చా. సొ, ఐ కాంట్ హెల్ప్ యు”

“వాట్...! మీరప్పుడే మనుషుల మీద పరీక్షించటానికి సిద్దపడుతున్నారా?” ఆశ్చర్యంగా అడుగుతాడు ఫిలిప్స్.

“యెస్. ఎందుకలా అడుగుతున్నారు?”

“కానీ మిష్టర్ శేఖర్, మీరు ఫార్ములెట్ చేసిన ఫార్ములా హ్యూమన్ బాడి రెసిస్ట్ చేయగలదంటారా? సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయిగా? అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారు”

“నో నో మీరనుకుంటున్నట్టు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఏం రావు. తప్పకుండా హ్యూమన్ బాడి నా ఫార్ములాని తట్టుకోగలదు. నాకా నమ్మకం ఉంది. నేను దీని కోసం ఎనిమిదేళ్ళుగా రిసర్చ్ చేస్తున్నాను. ఎటువంటి భయం లేదు. మోరోవర్ ఐ లైక్ టేకింగ్ రిస్క్స్”

“ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ మిష్టర్ శేఖర్. ఎనివే విష్ యు అల్ ద బెస్ట్. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. యాస్ ఐ టోల్డ్ యు బిఫోర్, యు ఆర్ బ్రైనీ, వి ఆర్ వెల్థీ. మీరు మా కంపెనీలో పనిచేయటం గొప్ప గౌరవంగా భావిస్తాం. యు కన్ కం ఎట్ ఎనీ టైమ్. వి ఆల్వేస్ వెల్ కమ్ యు”

“థాంక్యూ” ఫోన్ పెట్టేశాడు శేఖర్. ఫోన్ సంభాషణ ముగిసేలోపు ఎయిర్ పోర్ట్ బయటికొచ్చేశాడు. తనని పికప్ చేసుకోవటానికి రావాల్సిన వాడి కోసం కళ్ళు వెతుకుతుండగానే, వచ్చి ఎదురుగా నిలబడ్డాడు కార్ డ్రైవరు. బ్యాగ్ కోసం అతడు చేయి చాచటం, శేఖర్ అందివ్వటం రెండూ క్షణకాలంలోనే జరిగిపోయాయి. డ్రైవరు ముందు నడుస్తుంటే శేఖర్ అనుసరిస్తున్నాడు. మనసులో మాత్రం ఫిలిప్స్ అన్న మాటలు అలజడి సృష్టిస్తున్నాయి. అప్రూవల్ కోసం వెళ్తున్నప్పుడు తన ఫార్ములాని మనుషులు తట్టుకోలేరూ, సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయని ఫిలిప్స్ అనటం రుచించలేదు శేఖర్ కి. శకునం బాలేదనుకున్నాడు. కానీ ఇలాంటివి పట్టించుకోకూడదంటూ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. కారులో కూర్చున్నాడు. “సర్, డైరెక్టర్ గారు మిమ్మల్ని సి‌.డి‌.ఎస్‌.సి‌.ఓ కి బదులు గెస్ట్ హౌస్ కి తీసుకురమ్మన్నారు” డ్రైవింగ్ సీట్ అలంకరిస్తూ చెప్పాడు డ్రైవరు. అక్కడికే పోనీ అన్నట్టు సైగ చేశాడు శేఖర్. కార్ వేగంగా కదిలింది. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి అందులో తను ఇవ్వాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాలూకు ప్రివ్యూ చూడ్డంలో మునిగిపోయాడు శేఖర్.

దాదాపు ముప్పావు గంట ప్రయాణం తరువాత డైరెక్టర్ కంట్రోలర్ జనరల్ గెస్ట్ హౌస్ చేరుకుంది శేఖర్ కార్. అపాయింట్మెంట్ టైమ్ కన్నా ఐదు నిమిషాలు లేటుగా, అంటే 8:05 నిమిషాలకు చేరుకున్నాడు. అప్పటికి డైరెక్టర్ అక్కడికి రాకపోవటంతో శేఖర్కి పెద్ద నష్టమేం జరగలేదు. నేరుగా మీటింగ్ హాల్కి వెళ్ళి డి‌.సి‌.జి వచ్చేలోపల అంతా సిద్ధం చేసి ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సరిగ్గా పది నిమిషాల తరువాత డి‌.సి‌.జితో పాటు నలుగురు ఆఫీసర్స్ వచ్చి కూర్చున్నారు. వెంటనే లైట్స్ ఆఫ్ చేయించి ప్రొజెక్టర్ ఆన్ చేసి చెప్పటం ప్రారంభించాడు శేఖర్.

“గుడ్ మార్నింగ్ జెంటిల్ మెన్. ఐ యామ్ గ్లాడ్ టు బి హియర్. నా రిసర్చ్ గురించి మీకందరికి తెలిసే ఉంటుంది. కానీ క్లుప్తంగా మరొక్కసారి వివరిస్తా. నేను చూపించబోయే ఈ వీడియో చూస్తే నా రిసర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలిసిపోతుంది” అంటూ పి‌పి‌టి స్లయిడ్ ఓపెన్ చేశాడు. మొదటి స్లయిడ్లోనే శేఖర్ ప్రజెంటేషన్ కోసమని తయారు చేసిన యానిమేషన్ వీడియో ఉంది. దాన్ని ప్లే చేశాడు.

ఆ వీడియోలో ఒకతను ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్కి వస్తే, డాక్టర్లు అతడిని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. తలుపేసి కంప్యూటర్లో అతడి డీసీజ్ తాలూకు ఇన్ఫర్మేషన్, ఇవ్వాల్సిన మెడిసిన్ తాలూకు వివరాలు టైప్ చేసి బటన్ ప్రెస్ చేయగానే, రూమ్ లోపల ఏర్పాటు చేసిన పైపుల ద్వారా ఒక విధమైన పొగ రావటం ప్రారంభిస్తుంది. కొద్దిసేపైన తరువాత, పొగ రావటం ఆగిపోయాక, డాక్టర్లు లోపలి వ్యక్తిని బయటకి తెచ్చి పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో అతడి డీసీజ్ క్యూరైనట్టు తేలింది. అక్కడితో ఆ యానిమేషన్ వీడియో పూర్తియింది.

“చూశారుగా జెంటిల్ మెన్. ఇదే నా రిసర్చ్. పేషెంట్ని ఫిజికల్గా టచ్ చేయకుండా కేవలం వాళ్ళు పీల్చే ఆక్సిజన్ ద్వారా వాళ్ళ శరీరంలోకి మెడిసిన్ని పంపి, వాళ్ళ డీసీజెస్ క్యూర్ చేయొచ్చు. మనిషిలోని రక్తం ఆక్సిజన్ని వివిధ శరీరభాగాలకి క్యారి చేస్తుందని మనకి తెలిసిందే. మనం రోగిని గ్లాస్ రూంలోకి పంపినప్పుడు, అతని శరీరంలో ఏ ఆర్గాన్ డీసీజ్ వల్ల అఫెక్ట్ అయిందో తెలుసుకుని, దానికి తగ్గ మెడిసెన్ని నేను తయారు చేసిన ఫార్ములాతో కలిపి పేషెంట్ శరీరంలోకి స్మోక్ రూపంలో పంపిస్తే, అది ఆక్సిజన్ కణాలతో మిక్స్ అయ్యి డైరెక్ట్గా అఫెక్ట్ అయిన ఆర్గాన్ మీద పని చేస్తుంది. సొ, మనకి వెంటనే రిసల్ట్స్ వస్తాయి” అంటూ పి‌పి‌టి స్లయిడ్ మార్చాడు. ఈసారి స్క్రీన్ మీద కొన్ని కొండ గుహలు ప్రత్యక్షమయ్యాయి. వింటున్నవారు ఆసక్తిని కోల్పోలేదు. శేఖర్ కొనసాగించాడు.

***


Rate this content
Log in

Similar telugu story from Drama