PVV Satyanarayana

Inspirational

4  

PVV Satyanarayana

Inspirational

కప్పు కాఫీ

కప్పు కాఫీ

7 mins
100


సాయంకాలం. విశాఖ బీచ్ రద్దీగా ఉంది. వేసవి తాపానికి రోజంతా ఇబ్బందిపడ్డ జనం, సముద్రపు గాలికి సేదదీరేందుకని బీచ్ బాట పట్టడంతో సందడిగా ఉంది అక్కడ.

   గుంపులకు కాస్త దూరంగా కూర్చుని, ఇసుకలో పరుగులుదీస్తూ ఆడుకుంటూన్న చిన్నపిల్లలనూ...ఉరకలు వేస్తూన్న సాగర కెరటాలనూ...వీక్షిస్తూ, మేనికి హాయి గొలుపుతూన్న చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నాను నేను.

     అదే సమయంలో - యువజంట ఒకటి నా దగ్గరకు వచ్చింది.

     "హలో సార్! నేను గుర్తున్నానా?" అంటూ పలుకరించాడు అతను.

     అతని వదనంలోకి పరీక్షగా చూసాను నేను...నాకంటే చిన్నవాడు అతను. ముప్పై లోపు. మీడియం బిల్ట్. వంకీల జుత్తు. ఫేడెడ్ జీన్స్ మీద లైట్ బ్లూ కలర్ చారల టీ షర్ట్ తొడుక్కున్నాడు.

     అతన్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. కాని, ఎక్కడ చూసానో ఓ పట్టాన గుర్తుకు రావడంలేదు.

     నా ముఖ కవళికలను గమనించి మళ్ళీ అతనే అన్నాడు నవ్వుతూ - "మరచిపోయారా? ఐదేళ్ళ క్రితం...కైలాసగిరి...కప్పు కాఫీ..."

     చటుక్కున నా బుర్రలో బల్బ్ వెలిగింది. "ఓఁ, మీరా...!?" అన్నాను ఆశ్చర్యంతో.

     "ఔన్సార్. నేనే! కృష్ణారావును" అన్నాడు, అదే నవ్వుతో. "బాగున్నారా?" పరామర్శించాను.

     తల ఊపాడు అతను. "ఈమె నా భార్య హేమలత. ఈ పాప నా కూతురు సుప్రజ" అంటూ భార్యను, ఆమె చంకనున్న పాపను పరిచయం చేసాడు.

     పొందికగా చేతులు జోడించి నమస్కరించింది అతని భార్య. తెల్లగా, నాజూకుగా ఉంది. ఛుడీదార్, కుర్తాలో అతనికంటె పొడవుగా కనిపిస్తోంది. ఆమె చంకనున్న రెండేళ్ళ పాప ముద్దుగా ఉంది.

     "మీరెలా ఉన్నారు, సార్?" అంటూ అడిగాడు అతను, నా ఎదుట ఇసుకలో చతికిలబడుతూ.

     ఆమె కూడా అతని పక్కనే కూర్చుంది. ఇసుకలోకి దిగడానికి ఉరుకుతూన్న పాపను ఆపడానికి ప్రయత్నిస్తోంది.

     కృష్ణారావును చూస్తూంటే సంతోషంగానే కనిపించాడు. నాకు తెలియకుండానే చిన్న నిట్టూర్పు ఒకటి నాలోనే అణగిపోయింది. అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం రేగింది నాలో.

     సంభాషణ ఎలా మొదలుపెడదామా అని ఆలోచిస్తూండగానే, "కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం, గురూగారూ!" అన్నాడతను లేస్తూ.

     అతని వివరాలు తెలుసుకోవడానికి అదే అదను అనిపించి, "పదండి" అన్నాను పైకి లేస్తూ. ముగ్గురమూ బీచ్ ఒడ్డున ఉన్న ’సీ సైడ్ రెస్టారెంట్’ వైపు నడిచాము. కృష్ణారావు ఏదో చెబుతున్నాడు. నేను అన్యమనస్కంగానే ’ఊఁ’ కొడుతూ ఇసుకలో అడుగులు వేస్తున్నాను. కారణం - నా మనసు గతజల సేతు బంధనం ఆరంభించింది.....

#

     ఐదేళ్ళ క్రితపు సంఘటన అది.....

     శీతాకాలపు ఉదయం చల్లగా ఉంది. కైలాసగిరి పైన నడుస్తూంటే చలిచలిగా ఉంది. కొండ దిగువనుంచి సముద్రుడి ఘోష సన్నగా వినవస్తోంది. వాతావరణం మనసుకు ఆహ్లాదకరంగా ఉంది.

   కొండ అంచున నిలుచుని క్రిందికి చూసాను. సముద్రం లేతనీలపు వర్ణంలో...పసిపాప వదనంలా...ప్రశాంతంగా కనిపించింది. పరిసరాలు నిర్మానుష్యంగా, శాంత-గంభీరంగా ఉన్నాయి. కొండపైన కొలువైయున్న శివపార్వతులు చిద్విలాసంగా వీక్షిస్తున్నారు.

     సాలోచనగా అడుగులు వేస్తూన్న నేను, నా చూపులు ఓ చోట పడడంతో హఠాత్తుగా ఆగిపోయాను.

     కొద్ది గజాల దూరంలో ఓ యువకుడు కొండ అంచున నిలుచుని ఉన్నాడు. అతని వీపు నావైపు ఉంది.

    అతని ఉద్దేశ్యమేమిటో బోధపడలేదు నాకు. అది కొండ చిట్టచివరి అంచు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్రింద పడిపోవడం తథ్యం. అంత ఎత్తు నుండి పడ్డవారెవరూ బతికి బట్ట కట్టరు. క్రింద అంతా రాళ్ళ గుట్ట.

     గబగబా అతని వైపు నడిచాను నేను. ముందుకు దుమకబోతున్న అతని చేయి పట్టుకుని ఆపాను.

     ఉలికిపడి వెనక్కి తిరిగిచూసాడు అతను.

     "సారీ, బ్రదర్! సిగరెట్ ఉందా?" అడిగాను తాపీగా.

     అతని వదనంలో రంగులు మారాయి. "సిగరెట్ కోసం..." కోపంగా ఏదో అనబోయాడు.

     "ప్రొద్దుట్నుంచీ స్మోక్ చేయక నాలుక పీక్కుపోతోంది, బ్రదర్! అనుకోకుండా నువ్విక్కడ కనిపిస్తేనూ...నీ దగ్గర సిగరెట్ దొరుకుతుందేమోననీ..." శాంతంగా అన్నాను.

     "నాకు స్మోకింగ్ అలవాటులేదు" అన్నాడు విసుగ్గా.

     "అద్సరే, క్రిందకు తొంగిచూస్తున్నావు...ఏదైనా పడిపోయిందా? అదే...మెళ్ళోంచి ఏ గొలుసో...లేక, వ్రేలి ఉంగరమో..."

     "అదేం కాదు. ఇక్కణ్ణుంచి ఉరకబోతున్నాను" విసుగ్గా అన్నాడు.

     "ఎందుకూ?!" ఆశ్చర్యం వ్యక్తపరచాను.

     "చావడానికి!" విసురుగా జవాబిచ్చాడు.

     నవ్వాను. "ప్రొద్దుటే నీ హాట్ జోక్స్ తో కూల్ బ్రీజ్ ని వేడెక్కించకు, బ్రదర్!"

     "జోక్ కాదు, మేన్! నేను నిజంగానే ఆత్మహత్య చేసుకోబోతున్నాను" అన్నాడు దృఢ స్వరంతో.

     "రియల్లీ..? వాట్ ఎ సర్ప్రైజ్!" ఆశ్చర్యంగా అన్నాను.

     "ఏం?" తెల్లబోయి చూసాడు.

     "నేనూ అందుకే వచ్చాన్లే. చావులో నాకు కంపెనీ దొరికినందుకు మహదానందంగా ఉంది" అన్నాను.

     నమ్మలేనట్టు చూసాడు.

     "ఔను, బ్రదర్! ఆత్మహత్య చేసుకోవాలనే కష్టపడి ప్రొద్దుటే కొండెక్కి వచ్చాను. ఏ పాయింట్ అయితే అనుకూలంగా ఉంటుందా అని చూస్తూంటే...నువ్వు కనిపించావు. నీ దగ్గర సిగరెట్ దొరికితే చివరి దమ్ము పీల్చి దుమికేయాలనుకున్నాను" వివరించాను. నోరు వెళ్ళబెట్టాడు.

     ఆ కుర్రాడి వంక పరీక్షగా చూసాను...ఎర్లీ ట్వెంటీస్ లో ఉంటాడు. నాకంటే నాలుగైదేళ్ళు చిన్నవాడు. సన్నగా ఉన్నాడు. కర్లీ హెయిర్.

     "చావాలని నిశ్చయించుకున్నాక ఇంకా ఆలస్యమెందుకూ? ఇద్దరమూ ఒకరి చేయి ఒకరం పట్టుకుని జతగా దూకేద్దాం" అన్నాను. చిన్నగా తల ఊపి సన్నధుడయ్యాడు.

     "వన్ మినిట్. పోయేముందు ఓసారి అక్కడ ఉన్న శివపార్వతులకు బై చెప్పి వద్దాం, పద" అన్నాను మళ్ళీ. తటపటాయిస్తూనే నన్ను అనుసరించాడు.

     ఇద్దరమూ శివపార్వతుల విగ్రహం వద్దకు వెళ్ళి కళ్ళు మూసుకుని చేతులు జోడించాము.

     "ఇక పద, సుబ్బారావ్!" అన్నాను, అక్కణ్ణుంచి కదులుతూ.

     "నా పేరు సుబ్బారావు కాదు, కృష్ణారావు" అన్నాడు.

     "చచ్చేవాడికి ఏ పేరైతేనేంలే! పద" అన్నాను.

     నాలుగు అడుగులు వేసాక ఆగిపోయాను. ’మళ్ళీ ఏమిటన్నట్టు’ నా ముఖంలోకి చూసాడు.

     "ఆఖరుసారిగా కాఫీ త్రాగాలని ఉంది నాకు" అన్నాను.

     చికాకుగా చూసాడు. "చచ్చేముందు ఈ గొంతెమ్మ కోర్కెలేమిటో?" అన్నాడు విసురుగా.

     "అదే...ఎలాగూ చావబోతున్నాం కదా! చివరిసారిగా ఆ చిరు కోర్కె తీర్చుకోవాలని..."

     "ఐతే నువ్వెళ్ళు. నా చావేదో నేను చస్తాను" అంటూ ముందుకు కదలబోయాడు.

     "ఆఁ...ఆగు, బ్రదర్! ఇద్దరమూ జంటగా చావాలనుకున్నాము. ఇప్పుడు నువ్వు వంటరిగా చస్తాననడం ఏం న్యాయం చెప్పు!" దారికి అడ్డు పడ్డాను. "నీకో విషయం తెలుసా? చివరి కోర్కె - అది ఎంత చిన్నదైనా సరే - తీర్చుకోకుండా చచ్చిపోతే దయ్యాలవుతారట!" భయంగా చూసాడు.

     "మనo పది నిముషాలు ఆలస్యంగా వెళ్ళడం వల్ల యముడికి కలిగే నష్టం ఏమీ ఉండదు గాని...పద. ఈపాటికి కొండ దిగువను మొబైల్ కాఫీ వ్యాన్ వచ్చుంటుంది. ఓ కప్పు కాఫీ త్రాగి వద్దాం. అప్పుడు రెట్టించిన ఉత్తేజంతో యమలోకానికి బంగీ జంప్ చేయవచ్చును" అంటూ చనువుగా అతని చేయి పట్టుకుని లాక్కుపోయాను.

     ఆ సమయానికి రోజూ కైలాసగిరి దగ్గరకు మొబైల్ కాఫీ వ్యాన్ ఒకటి వస్తుంటుంది - మోర్నింగ్ వాకర్స్ యొక్క అవసరాలను తీర్చడానికి.

     వ్యాన్ కి చేరువలో స్టూల్స్ పైన కూర్చుని కాఫీ సిప్ చేయనారంభించాము కృష్ణారావు, నేనూను.

     కృష్ణారావును మాటల్లోకి దించాను. అంత పిన్న వయసులో ఆత్మహత్యకు పూనుకోవలసినంత కష్టం అతనికి ఏమి వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం రేగింది నాలో. అదే అడిగాను.

     "నువ్వూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావుగా? ఎందుకు చావాలనుకుంటున్నావో ముందుగా నువ్వే చెప్పు" అన్నాడు అతను.

     ’కుర్రాడు గడుసు పిండమే!’ అనుకున్నాను. "సరే, చెబుతాను, విను..." అంటూ ’నా కారణాలను’ చెప్పాను...

    ’నేను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. మూడేళ్ళు కలసి తిరిగాం. ఎన్నో వెన్నెల రాత్రులు రామకృష్జ్ణా బీచ్ లో ఒకరి ఒళ్ళో ఒకరం తల పెట్టుకుని స్వీట్ నథింగ్స్ చెప్పుకున్నాం. నేను ప్రపోజ్ చేసినపుడల్లా ఏదో కారణం చెప్పి ఎప్పటికప్పుడే వాయిదా వేస్తూ వచ్చేది. నిన్న రాత్రి అన్నగారితో కలసి నా గదికి వచ్చి తన పెళ్ళి శుభలేఖను నా చేతిలో పెట్టింది. నేను షాక్ తినడంతో, ’సారీ, డియర్! ఓ ఎన్నారై సంబంధం తెచ్చారు మావాళ్ళు. వరుడు యు.ఎస్. లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. డాలర్స్ లో సంపాదిస్తున్నాడు. సొంత అపార్ట్మెంటు, ఓడలాంటి కారు ఉన్నాయట...నీకు వచ్చే ముష్టి ముప్పై వేల జీతంతో ఏం సుఖపడతాం చెప్పు? అందుకే బుద్ధిగా పెద్దల మాట వినాలని ఓకే చెప్పేసాను. నా పెళ్ళికి రావడం మరచిపోకేం?’ అంది తాపీగా.

     నోటమ్మట మాటరాక శిలాప్రతిమలా చూస్తూ నిలుచుండిపోయిన నాకు ’బై’ చెప్పి కూల్ గా నడచి వెళ్ళిపోయింది హృదయం లేని నా ప్రియురాలు. ఆ ఘాతాన్ని తట్టుకోలేక చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాను...’

     నా కథనం ఆలకించి ఆశ్చర్యంగా చూసాడు కృష్ణారావు. "నిన్ను అంత ఘోరంగా వంచించిన ఆ పిల్లను ఎక్స్ పోజ్ చేయాలిగాని, నువ్వు చస్తానంటావేమిటీ?" అన్నాడు కోపంగా.

     నవ్వాను నేను. "నిజమైన ప్రేమ ద్వేషానికి తావివ్వదు. పగలూ, ప్రతీకారాలూ కోరుకోదు" అన్నాను.

     ఓ క్షణం మా మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది.

     "నా మాట సరే. నీ సంగతేమిటో చెప్పు మరి" అన్నాను.

     కృష్ణారావు గొంతుక సవరించుకున్నాడు. "ఆర్నెల్ల క్రితం మా ఆఫీసులో కొత్తగా చేరింది ఆ అమ్మాయి. తొలిచూపులోనే ఆమె పైన మనసు పారేసుకున్నాను. ఆమెతో స్నేహం చేసాను. ఓసారి నేను తెగించి ’ఐ లవ్ యూ!’ చెప్పాను ఆమెకు. నవ్వేసి ఊరుకుంది. నన్ను ఎంకరేజూ చేయలేదు, డిస్కరేజూ చేయలేదు. ఆడపిల్ల కనుక పైకి తేలడంలేదు అనుకున్నాను..." ఆగాడు అతను.

     "చెప్పు, బ్రదర్! ఆ తరువాత ఏమయింది? సస్పెన్స్ తో చంపకు నన్ను" అన్నాను ఉత్కంఠతో.

     "ఇందులో సస్పెన్స్ ఏమీ లేదు..." అంటూ చెప్పుకు వచ్చాడు అతను...’నిన్న ఆఫీసు క్యాంటీన్లో కలుసుకున్నప్పుడు చెప్పింది ఆ పిల్ల - మా నాన్న నాకు పెళ్ళి సంబంధం చూసాడు అని’.

     ’మరి మన సంగతో?’ అనడిగాడు కృష్ణారావు.

     ’మన సంగతేమిటీ?’ అంటూ అమాయకపు వదనంతో అడిగిందామె.

     ’నువ్వు నన్ను ప్రేమించడంలేదూ?" సూటిగా అడిగాడు అతను.

     ’అంత పెద్ద మాట ఎందుకు గాని...నువ్వంటే నాకు ఇష్టమని మాత్రం చెప్పగలను’ అంది.

     ’అందుకే మనం పెళ్ళి చేసుకుందాం’ అన్నాడతను ఉద్వేగంతో.

     ’సారీ, కృష్ణారావు గారూ! పెద్దలను ఎదిరించే సాహసం నాకు లేదు. నన్ను మరచిపొండి’ అనేసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది...

     "ఆ పరాభవాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను," చేతిలోని ఖాళీ కప్పును ఆవేశంతో నేలకేసి కొట్టాడు అతను.

     "ప్చ్! మనిద్దరమూ ఒకే పడవలోని ప్రయాణీకులమన్నమాట!" అన్నాను సానుభూతిగా.

     మళ్ళీ మా మధ్య నిశ్శబ్దం అలముకుంది. ఎవరికి వాళ్ళం మా మా ఆలోచనల్లో మునిగిపోవడమే అందుక్కారణం...కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా లేచి నిలుచున్నాడు కృష్ణారావు. "నేను వెళ్తున్నాను" అన్నాడు.

     "ఎక్కడికీ?" అడిగాను అనాలోచితంగా. "ఇంటికి" అన్నాడు.

    "అదేమిటీ? మనం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాంగా?" విస్తుపాటుతో అడిగాను.

    కస్సుమని లేచాడు. "ప్రేమిస్తోందన్న నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని ఎవరో పిరికిదానికోసం నేనెందుకు చావాలి? ఐనా, నీకు జరిగిన పరాభవం ముందు నాది నథింగ్. అందుకే చావాలనుకున్న నా ఆలోచనను ఉపసంహరించుకుంటున్నాను. లోకంలో ఇక ఆడపిల్లలే లేరా ఏమిటీ

పెళ్ళి చేసుకోవడానికి!" అన్నాడు విసురుగా. "బై!"

    "దిసీజ్ చీటింగ్! నాకు కంపెనీ ఇవ్వడానికి ఒప్పుకుని...ఇప్పుడు నా చావేదో నన్ను చావమంటున్నావా!" ప్రొటెస్ట్ చేసాను నేను. "సారీ!" అంటూ మిస్చివస్ స్మైల్ ఒకటి ఇచ్చి వడివడిగా అడుగులు వేసుకుంటూ నిష్క్రమించాడు కృష్ణారావు.

    విరగబడి నవ్వాలనిపించింది నాకు...నా ప్రయత్నం ఫలించింది. చావాలనుకున్న అతని నిర్ణయాన్ని కబుర్లతో, కట్టుకథలతో, కాలయాపనతో వీగిపోయేలా చేయగలిగాను. బ్రతుకు పైన మళ్ళీ ఆశ చిగురించేలా చేసాను.

     మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకని కైలాసగిరి ఎక్కిన నాకు కృష్ణారావు ఆత్మహత్యకు పూనుకోవడం కనిపించింది. సిగరెట్ వంకతో అతన్ని ఆపి, ‘కప్పు కాఫీ’ అంటూ కొండ దింపి కబుర్లతో కాలయాపన చేసాను. అప్పటికప్పుడు తోచిన కథ ఏదో అల్లి ’నా కథ’ గా చెప్పి మా మధ్య అఫినిటీని పెంచాను. చివరకు ఆత్మహత్య నుండి అతని తలపులను మళ్ళించి మనసు మార్చుకునేలా చేసాను.

     తీవ్ర నైరాశ్యంతో ఆత్మహత్యకు పూనుకున్న వ్యక్తిని ఆ ఆలోచన నుండి ఓ క్షణం మళ్ళించగలిగితే...ఆచరణను పది నిముషాలు వాయిదా వేయించగలిగితే...బ్రతుకు పైన ఆశ చిగురించి మళ్ళీ జనజీవనం లోకి జారిపోతాడన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవారిలో నేనొకణ్ణి.

     ఓసారి ఆస్ట్రేలియాకి చెందిన ’డాన్ రిచీవి’ అన్న వ్యక్తి గురించి చదవడం జరిగింది నేను. ’చావే శరణ్యం!’ అనుకున్న 160 మందిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి కాపాడాడట అతను. ఓ నొటోరియస్ సూయిసైడ్ పాయింట్ వద్ద నిఘా వేసి, ఆత్మహత్యకు ఉపక్రమించేవారిని ఏదో వంకతో కబుర్లలోకి దింపి, వేడి వేడి టీ ఆఫర్ చేసి, కావాలంటే బీర్ కూడా పోసి, వారిలో ఆలోచనలను రేకెత్తించి ఇంటిముఖం పట్టించేవాడట. హౌ గ్రేట్!...అప్పట్నుంచీ అడపాదడపా ఆత్మహత్య కేసులు తారసపడినపుడల్లా నా వంతుగా నేనూ అదే ఫార్ములాను అవలబిస్తూ కాపాడడం అలవరచుకున్నాను...

      కృష్ణారావు వెళ్ళిన వైపే చూస్తూ ఓ ప్రాణాన్ని కాపాడగలిగానన్న సంతృప్తితో గాఢ నిశ్వనం ఒకటి విడచి ఇంటిముఖం పట్టాను నేను.

#

     ఐదేళ్ళ తరువాత మళ్ళీ కృష్ణారావును అలా కుటుంబంతో చూడడం మిక్కిలి సంతోషం కలిగించింది నాకు. కాఫీ త్రాగుతూంటే అన్నాడు కృష్ణారావు - "ఆ రోజు నేను ఇంటికి వెళ్ళానే కాని, ఎవరో చేసిన వంచనకు మీరు అనవసరంగా బలయిపోతున్నారే అని బాధపడుతూనే ఉన్నాను. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకెంతో ఆనందంగా ఉంది, గురూగారూ!"

    నవ్వాను నేను. "ఆనాడు నాగురించి నేను నీకు చెప్పిన కథ కేవలం కల్పితం. ఆత్మహత్య నుంచి నీ ఆలోచనలను మళ్ళించడానికే కట్టుకథతో కాలయాపన చేసాను" అన్నాను. "నాకు అప్పటికే వివాహమయి మూడేళ్ళయింది. అనుకూలవతి ఐన భార్య, ముద్దులొలికే చిన్నారీ ఉన్నారు".

     ఆశ్చర్యంగా చూసాడు అతను. "నిజమే, గురూగారూ! ఆ రోజు మీరు నా ఆలోచనలను దారి మళ్ళించి ఉండకపోతే...జీవితంలో ఏం కోల్పోయేవాణ్ణో ఆలోచించినపుడల్లా నా ఒళ్ళు గగుర్పొడవడమే కాదు, మీ పట్ల కృతజ్ఞతాభావం కూడా ఇనుమడిస్తూంటుంది నాకు" అన్నాడు. "మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? హేమలత ఎవరో కాదు, ఆనాడు నేను ప్రేమించిన అమ్మాయే!"

     అది నేను ఎదురుచూడని ట్విస్ట్! "హౌ ఇంటరెస్టింగ్!" అన్నాను విస్తుపాటుతో.

     "ఔను, గురూగారూ! ఆమె తండ్రి తెచ్చిన సంబంధం నాదేనన్న సంగతి పెళ్ళిచూపుల వరకు తెలియదు మాకు" నవ్వుతూ భార్య వంక చూసాడు అతను. ఆమె నునుసిగ్గుతో మందహాసం చేసింది.

    వివాహం తరువాత కృష్ణారావుకు విజయవాడ బదిలీ అయిందట. ఆర్నెల్లకు భార్యకూ అక్కడే పోస్టింగ్ వచ్చిందట. ఏడాది క్రితం అతనికి ఆఫీసరుగా ప్రమోషన్ కూడా వచ్చిందట. నేను మనస్పూర్తిగా అభినందిస్తూంటే, "ఇదంతా మీ చలవే, గురూగారూ!" అన్నాడు ఆర్ద్రమైన కనులతో. అత్తగారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి రెండు రోజుల క్రితం విశాఖకు వచ్చారట వాళ్ళు. మర్నాడు తిరిగి వెళ్ళిపోతున్నారట.

     ఓ గంట తరువాత ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకుంటూంటే...నా మది అవ్యక్తమైన ఆనందంతో నిండిపోయింది.

##########

                 (పాతికేళ్ళలో 160 ఆత్మహత్యలను అరికట్టగలిగిన ’డాన్ రిచీవి’ ఎనిమిదేళ్ళ క్రితం క్యాన్సర్ తో మరణించాడు. అతనికి ఈ కథ అంకితం - రచయిత)


Rate this content
Log in

Similar telugu story from Inspirational