కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు
.కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు
***********************************
సీతానగరం గ్రామం లో రొడ్డయ్య, గౌరమ్మ దంపతులు నివసించేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు బుడ్డేసు. బుడ్డేసు చిన్నప్పటి నుంచి చదువు సంధ్యల మీద ఆసక్తి కనపర్చేవాడు కాదు. ఎప్పుడూ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు. పెద్దయ్యాక కూడా కూలీనాలీ చెయ్యడానికి ఇష్టపెట్టుకోలేదు. తల్లి తండ్రి సంపాదించి తెస్తే, శుభ్రంగా తిని తిరిగేవాడు. కొన్నాళ్ళకు తల్లి తండ్రి ముసలివాళ్లు అయ్యారు.
బుడ్డేసుకు స్థిరం లేకపోవడంతో పిల్లని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పెళ్లి పెడాకులు లేకుండా ఏకాకిగా మిగిలిపోయాడు. కూలి పని చేతకాదాయె. వంట చేసుకోవడం రాదాయె. ఇది తెలిసిన ఇరుగుపొరుగు వారు కొన్నాళ్ళు వారి ఆకలి తీర్చారు.
“ఖాళీగా కూర్చుంటే కడుపెలా నిండుతుంది. కష్టపడి కూలిపని చేసి డబ్బులు సంపాదించి మీ అమ్మా నాన్నని పోషించు” అని ఇరుగు పొరుగు వారు చివాట్లు పెట్టడంతో తెలతెలవారుతూనే పొరుగూరుకి బయలు దేరాడు. కష్టపడటానికి ఇష్టపడక యాచించడానికి సిద్ధపడ్డాడు.
ఇంటింటికి వెళ్లి “అమ్మా ఆకలేస్తోంది. అన్నం తిని నాలుగురోజులైంది కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా.” అని గట్టిగా అరిచాడు. ఓ ఇంటావిడ బయటకు వచ్చి “ చూడ్డానికి పుష్టిగా ఉన్నావు. అడుక్కోకపోతేనేమి కష్టపడి పనిచేసుకోరాదూ!” అని తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది.
మరో ఇంటికి వెళ్ళాడు “అమ్మా అకలేస్తోంది కొంచెం అన్నం ఉంటే పెట్టండి.” అని అరిచాడు. ఆ ఇంటావిడ బయటకు వచ్చి “ఎప్పుడు అడుక్కోవాలో నీకు తెలియదా! తెల్లారేసరికి ఎవరైనా వండుకుని కూర్చుంటారా? మధ్యాహ్నం రా అన్నం పెడతాను.” అని విసుక్కుంటూ చెప్పింది.
అలా ఊరంతా తిరిగాడు. ఒకరిద్దరు పెట్టిన అన్నం తిని కడుపునింపుకున్నాడు. కాసేపు నిద్రపోయి లేచాడు. ఖాళీగా ఏం చేయాలో తోచలేదు. మరలా ఊరంతా తిరిగి యాచించడం మొదలుపెట్టాడు. సరిగ్గా మధ్యాహ్నం రెండుగంటల సమయం, మండే ఎండ, నడిచే దారంతా సెగలు కక్కుతోంది అయినా ఇంటింటికీ వెళ్ళి యాచిస్తున్నాడు.
బుడ్డేసుని చూసిన ఒక పెద్దావిడ "కొత్త బిచ్చ గాడిలా ఉన్నావు పొద్దెరగకుండా యాచిస్తున్నావు.” అని అంది. నాటి నుంచి ఈ సామెత జనబాహుళ్యంలోకి వచ్చింది.
అలా ఏ పనైనా సమయం సందర్భం లేకుండా, వేళా పాళా లేకుండా, అలుపు సొలుపు లేకుండా అదేపనిగా చేసే టప్పుడు... కొత్తగా పెళ్ళైన వారి విషయం లోనూ "కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు" అనే సామెతను వాడుతున్నాం.
( ప్రజా శక్తి చిన్నారిలో 16-8-24 న ప్రచురితమైంది)
