జంబాల కోరు పిందె
జంబాల కోరు పిందె
జంబాలకోరు పిందె
*****************************
అమ్మపాలెం శివారు కొండల్లో పల్లపుదుంగాడ అనే గిరిజన గ్రామం ఉండేది. ఎటువంటి రవాణా సౌకర్యాలు లేని ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే కాలికి పని చెప్పాల్సిందే. ఆ గ్రామంలో వీర్రాజు నివసిస్తూ ఉండేవాడు. వీర్రాజుకి చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని, దర్జాగా జీవించాలని, నాయకుడిగా ఎదగాలని కలలు కనేవాడు. యుక్త వయసు నుంచి మీసాలు పెంచి, వీరుడిలా పైకి తిప్పేవాడు. ఇంట్లో ఇబ్బందులు ఎన్ని ఉన్నా, దాచుకున్న డబ్బులతో పట్నం నుంచి ఖరీదైన సంపెంగ నూనె తెప్పించి, మీసాలకు రాసుకుని, చలువ బట్టలు ధరించి దర్జాగా వీధిలో తిరిగేవాడు. తనగురించి తాను గొప్పలు చెప్పుకునేవాడు. ఆ ఊళ్ళో వాళ్లు అందరూ మీసాల వీర్రాజు అని పిలవడం మొదలు పెట్టాడు. ఆ గ్రామంలో కాస్త తెలివైన వాడు, శుభ్రమైన బట్టలు కట్టుకుని హుందాగా ఉండేవాడు కాబట్టి అతడిని గ్రామస్తులందరూ కలసి గ్రామ పెద్దగా నిర్ణయించారు. దాంతో పనీ పాట మానేసి ఊరి మీద తిరగడం అందరి సమస్యలు తెలుసుకోవడం మొదలు పెట్టాడు.
ఇది చూసిన ముసలి వాళ్ళు “వీర్రాజూ ‘తడి తక్కువ తమాషా ఎక్కువ’ అంటే ఇదే. నీకు 'మింగడానికి మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె ఎందుకు?” అని అడిగేవారు.
“తాతా నేను తిన్నానో, ఆకలితో ఉన్నానో లోకానికి తెలియదు. కానీ నేను హుందాగా, ఉండబట్టి నన్ను గ్రామస్తులంతా నాయకుడుగా గుర్తించారు.
నేను ఇలాంటి జీవితం కోసం కలలు కన్నాను. అన్నం లేకపోయినా పరవాలేదు. అందరిలో గొప్పగా ఉండాలి, అందరూ నన్ను గుర్తించాలి. మీగడ పెరుగులు లేక పోయినా పరవాలేదు మీసాలకు సంపెంగ నూనె రాయాలి. ఆస్తి లేక పోయినా పరవాలేదు అప్పుచేసైనా పప్పు కూడు తినాలి. ఎవరేమనుకున్నా ఇదే నా జీవన విధానం తాతా.” అంటూ ముందుకు కదిలాడు వీర్రాజు.
*జంబాలుకోరు పిందె* అంటారు ఈవిధమైన మనస్తత్వం గలవాణ్ణి.
తనకు తిండికి కూడా గతి లేకున్నా పైకి మహా ఆర్భాటంగా కనిపించే ప్రయత్నం చేసే గిరీశం బోటి వాళ్లను అనే వెటకారపు మాట ఇది.
సంపెంగ నూనె ధర ఎక్కువ. తిండి గింజలు కొనుక్కో లేక పోయినా డాబుగా బట్టలు ధరించడం, గొప్పలు చెప్పుకోవడం, ఏదో పెద్ద ఆకాశంలో నుంచి ఊడి పడ్డట్టు ఫోజులు ఇవ్వడం చేసే వ్యక్తుల విషయం లో తడి తక్కువ తమాషా ఎక్కువ లేదా మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అనే జాతీయం వాడుతారు.
(ప్రజాశక్తి చిన్నారి లో 8-8-2024 న ప్రచురితమైంది)
