జనారణ్యంలో ఓ పాఠకుడు
జనారణ్యంలో ఓ పాఠకుడు


నీ బ్యాగ్ చెక్ చేయాలి క్రిందకు దిగు అని ధీరజ్ బైక్ ఆపాడు డ్యూటీ లో ఉన్న పోలీసు అధికారి.
బండికి సబంధించిన అన్ని కాగితాలూ అతని ఐడెంటిటీ కార్డు చూశాక అతని బ్యాగ్ కూడా చెక్ చేశాడు.
అతని బ్యాగులో ఏదో గుప్త నిధుల సమాచారం దొరికినట్లు తన పై అధికారిని పిలిచి చూపించాడు.
ఆ పోలీసు ఉన్నతాధికారి పేరు ప్రవీణ్. ధీరజ్ ఓ నెల రోజుల పాటు ప్రతీ సాయంత్రం పోలీసు స్టేషన్కి వచ్చి సంతకం చేయాలని చెప్పాడు.
ఎందుకని ప్రశ్నించిన ధీరజ్ ని చూసి ప్రవీణ్ కి కోపం వచ్చింది.నువ్వు ఒక సంఘ విద్రోహ శక్తి అని అనుమానం వచ్చిందని అందుకే ఓ నెల రోజులు అతడిని అబ్సర్వ్ చేయాలని అన్నాడు.
సార్ ఇది ఒక స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్ర.దానిని చూసి నన్ను అనుమానించిన మీకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అని నవ్వుకున్నాడు ధీరజ్.ఆయన చెప్పిన దానికి సరేనని తన పుస్తకాన్ని తిరిగి తీసుకున్నాడు.
భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని రూమ్ వైపు బండి నడిపాడు ధీరజ్.
డ్యూటీ ముగించుకొని ప్రవీణ్ కూడా ఇంటికి చేరుకున్నాడు.
నాన్నా వచ్చే ఇండిపెండెన్స్ డేకి నేను ఒక వ్యాసం వ్రాయాలి.కొంచెం వ్రాసి పెట్టవూ అని అడిగాడు ప్రవీణ్ కొడుకు విజయ్.
ఎవరి గురించి చిట్టి తండ్రీ వ్యాసం అని అడిగాడు ప్రవీణ్.
భగత్ సింగ్ అని బదులిచ్చాడు విజయ్.
ప్రవీణ్ మరుసటి రోజు సాయంత్రం కోసం ఎదురు చూడసాగాడు.