జైసల్మీరు కోటలో..
జైసల్మీరు కోటలో..
ఆ రోజు ఎందుకో కోటను విడవబుద్ధి కాలేదు. UNESCO భారత దేశ వారసత్వ సంపదగా గుర్తించిన రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరు కోటల్లో జైసల్మీర్ కోట కూడా ఒకటి.
ప్రజలు నివాసముండే అతి అరుదైన కోట అది. స్వర్ణ నగరిగా పిలువబడే జైసల్మీర్ కి వెళ్ళిన వాళ్ళు చూసే ప్రదేశాల్లో కోట కూడా ఒకటి.
శైవ, వైష్ణవ, జైన ఆలయాలతో ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం. అలనాటి శిల్ప నైపుణ్యం ఉట్టి పడే శిల్పాలు. ఎత్తైన కొండ ప్రాంతం మీద కోటను నిర్మించిన విధానం. ఇవన్నీ ఒక ఎత్తు. వ్యూ పాయింట్ ఒక ఎత్తు.
ఒకటికి రెండు సార్లు కోట మొత్తం చూసి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను.
కోట పైన వ్యూ పాయింట్ లో కూర్చుని ఊరు మొత్తం చూడడం ఒక గొప్ప అనుభూతి. అన్నీ ఒకటే రంగులో ఉండే కట్టడాలు. సూర్యకాంతి పడినప్పుడు బంగారు రంగులో మెరుస్తాయి. ఇప్పటికీ అది స్వర్ణ నగరమే అనుకునేట్లు చేస్తాయి.
