దేవుడి పన్నాగం
దేవుడి పన్నాగం
దేవుడు తయారు చేసిన మనుషులతో ఆడుకునే హక్కు దేవుడుకు ఉంది.సంబంధిత దరఖాస్తులో( అదీ ఆయన సృష్టే కదా) ఈ ఆడించే విషయమై ,మన అంగీకారం అవసరం లేకుండా ఆయనే టిక్కు కొట్టేసుకున్నారు.
రాజదూత్ బండిలా,పంచభూత్ పథకాన్ని సృష్టించి ,నింగీ నేలా నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు అని పాడుకునేలా చేసి,ఆ భ్రమలో ఉంచేసి,ఫ్రీగా ఇచ్చే అలవాటు చేసిన దేవుడు,ఆడాళ్లు కొప్పు,మగాళ్ల కాలర్ పట్టుకుని మొక్కుబడులు చెల్లించేలా ముక్కుపిండి వసూలు చేస్తూ...మనిషిని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్నాడు..
ఈ అంశంలో అర్ధనారీశ్వరులూ ఉన్నారు.వారికి నమస్కారం..
దేవుడ్ని ,ఆయన స్రుష్టించే విధానాన్ని చూసి ఏదోటి నేర్చుకోవాలి..అదీ చీమ కోరికల కాకుండా ,కొంచెం కొత్తగా కోరుకోవాలి అనుకున్న మనం,భస్మాసురహస్తం అంతంలేని వెర్షన్ ని సృష్టించుకుని...నాకు నేనే రాజు మంత్రి అనుకున్నాం గానీ,అదే మన ఖర్మకి బాజాబజంత్రీ అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం..
స్మార్టుఫోన్ సృష్టి మనది కాదు..మనలోని కొలువై ఉన్న దేవుడిది.ఎంత గింజుకున్నా మనిషి ,మనిషిపై పట్టు సాధించలేడు..ఇంక జంతువుల మీద అసలే కుదరదు.కొరొనా ఎబోలా తదితరాలు ఎన్ని కబేళాలు సృష్టించాయో రెండేళ్లలో చూసేము..చెట్లు చేమలు నరికేస్తూ..తరతరాలకు ఆకాశహర్మ్యాల సృష్టి చేస్తున్నా అని విర్రవీగీతే!!ఓ మాటు ఆగి ఆలోచించు మిత్రమా! చెయ్యి కడగడానికి నీళ్లు లేక కాగితాన్ని వాడుతున్నాము..
ఆయనకి ఎవరి ఆట ఎలా కట్టించాలో బాహా తెలుసు. సర్పయాగానికి చెవి కమ్మలు కారణమయినట్టు,మన యాగానికి నీలంపళ్ళు నల్లగా మెరుస్తున్నాయి అవే చెవులకి.. తోలు బట్టలు తీసి, టెక్నాలజీ బట్టలు వేసుకు తిరుగుతున్న యమకింకరులు స్మార్టుఫోన్లు..
వీళ్ళు అపుడెపుడో తొంభై,వంద...మాట్టాడితే మొన్న పద్మశ్రీ అందుకున్న మామ్మగారిలాగా వందాపదో,
ఇరవయ్యో వచ్చేవరకూ కూడా మనదరిదాఫులకు వచ్చేవారు కాదు..అది అంతా విష్ణుమాయ.అంటే!ఆయన మనల్ని కాచుకున్నాడు అని అర్థం..అంటే!మన ముందువాళ్ళు మనసుతో ఆయన్ని అంతలా నమ్ముకున్నారని అర్థం.
ఇపుడు ముప్పై పద్మశ్రీ,నలభై పద్మభూషణ్,యాభై పద్మవిభూషణ్...పరమ వీర చక్ర ఎందుకు ఇస్తారో మనందరికి తెలుసు..ఈ బోర్డర్ లోపల బడాయి వేషాలు తప్ప కుదురుగా బతికిబట్టకట్టే పనులేం చేయడం లేదు మనం.అందుకే ఈ అవార్డులు తొందరగా మనల్ని వరిస్తున్నాయి...
ఈ మనది అనుకునే దేవుడి సృష్టి వల్ల లాభం ఎంతో,నష్టం అంతకు మించి.ముందు అనుకున్నట్టు భస్మాసురుడు ట్రూ కాపీ ఇది.వాడేవాడి నెత్తినీ,వాడి ద్వారా వాడి సమాచారాన్ని ఎక్కడెక్కడికో చేరవేస్తూ ఎవరెవరితోనో కలిపి అందరి నెత్తిన ఏక కాలంలో బతుకుల్ని బూడిద చేస్తోంది.ఇందులో మనం ఇరికించిన కాగితాల వ్యవహారాలకు ఈ ఖర్మ అంతా..
రాముడు,వానర సమూహం ఆధార్ కార్థులు,పుట్టినతారీకుల ధ్రువపత్రాలతో రాలేదు.అట్ఠా వచ్చి వారి పని చక్కబెట్టుకు వెళ్లిపోయారు..ఈలోపు బ్యాంకులు సృష్టించుకుని అప్పుల పాలు అవ్వలేదు.వ్యవసాయం వీడి రియల్ ఎస్టేట్ బాట పట్టలేదు.క్రెడిట్,డెబిట్ కార్డుల్ని ఫంక్షన్ పాయకానాల్లో గోకలేదు..పన్నులు ఎగ్గొట్టలేదు.అసలు ఇంకొకడిని చూసి ఏడ్చింది లేదు,ఉన్నా హద్దు మేరకు లేదా ఏదో అవతార సృష్టికి.మనం కాయాన్ని వదిలి కాగితాన్ని నమ్మడం మొదలెట్టేమ్..మనమే మన బతుక్కి చుక్క పెట్టేమ్.
పోల్చుకు చచ్చిపోయే గుణం ఉన్న మనిషి,అబ్బే!అంతకు మించి అని తెచ్చుకున్న ఈ ఫోన్ ,లంకాదహానంలో అంజిసారువాడి తోకలా మనకు బాగా ఉపకరిస్తుంది అనడంలో అతిశయం లేదు..ఆయన అవతారపురుషుడు కాబట్టి తోకకు ఎం కాలేదు..కానీ మన తోకలు ఓ పది పదిహేనేళ్లుగా బాగా అంటుకున్నాయి.ఏ అవతారం మనల్ని రక్షిస్తుందో చూడాలి! రా రా నాయనా అని చేతులెత్తి వేడాలి...
