అంతఃకరణం
అంతఃకరణం


విశాలమైన రోటరీ కమ్యూనిటీ హాల్ ...హలు నిండా జనాలు,వేదిక మీద ఎందరో సభ్యులు కూర్చుని వున్నారు,
వేదిక మీద పెద్ద ఫ్లెక్సీ పైన మహిళా దినోత్సవ సందర్భంగా గౌరవనీయులయిన "సుధ" గారికి సన్మానం అని రాసి ఉంది.
రోటరీ క్లబ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మైక్ లో గంభీరమైన స్వరముతో మాట్లాడుతున్నారు.
"గౌరవనీయులైన సుధ గారు గురించి నేను ఏమి చెప్పగలను !!!
నిలువెత్తు నిజాయితీ ఆమె,
మూసపోసిన మంచితనం ఆమె,
మాట మీద నిలబడే తత్వం ఆమె రక్తం లోనే ఉంటుంది ఏమో,
వృత్తి రీత్యా ఏ ప్రలోభాలకు రాజీ పడని నైజం ఆమె ,
నైతిక విలువలు ను తుంగలో తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రాణానికి మించి వాటికి విలువను ఇచ్చే మనస్తత్వం ఆమెది,
మూడ నమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్న ఎందరో అభాగ్యులకు మంచి సలహాలు అందించి, వారిని సరి అయిన దారిలో పెట్టిన ఆత్మ బంధువు ఆమె,
ఏమని ఎంతని ఆమె గురించి చెప్పను"......
ఆ మాటలు వింటూ ఉంటే నాకు తెలియకుండానే ఒక రకమయిన దర్పం నన్ను ఆవహించింది. కానీ అది ఆయన పొగడడం వల్లనో,ఈ సన్మానం వల్లనో కాదు.
దానికి కారణం నా ఈ 28 ఏళ్ల ఉద్యోగ ప్రయాణం లో కాని,నా 58 ఏళ్ల నా వ్యక్తిగత జీవితం లో కాని నేను నమ్మిన విలువలు కోసం ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురయినా సడలి పోని నా మనోధైర్యాన్ని చూసుకుని ....
హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది ఆ శబ్దానికి ఈ లోకం లోకి వచ్చాను నేను.
గౌరవాధ్యక్షులు నాకు పట్టు షాల్ కప్పి , పుస్పగుచ్ఛం అందించారు. మహిళ ని కదా చీరతో మురిసిపోతాను అనుకున్నారు ఏమో కమిటీ సభ్యులు ఒక సిల్క్ చీర ను కూడా బహూకరించారు. వారి అవివేకానికి మనసులోనే నవ్వుకున్నాను.
సన్మానం అనంతరం కార్ లో ఇంటి కి తిరుగు ముఖం పట్టాను. కార్యక్రమం అయిపోవడం తో మనసు నా కంట వేగాం గా ఇంటికి చేరింది.
అవును మరి ఇంటి దగ్గర సమస్య అలాంటిది. ఈ వయసులో పని మనిషి లేకుండా ఇంటి పని చేసుకోవడం మాటలు ఏమి కాదు ,పైగా నా వ్యక్తిగత జీవితం లోని ఇబ్బందులు ,ఉద్యోగ నిర్వహణలో ప్రతిబింబింన్చ కూడదనీ నా దృఢ సంకల్పం కూడానూ.....
నాకు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
ఎప్పుడూ లాగానే హడావిడి గా ఉండే ఉదయం .వంట ఆవిడ సరోజ వచ్చి అరగంట అయ్యింది ఆమె వంట మొదలెట్టాలి అంటే పనమ్మాయి రావాలి.
ఈ రోజే కాదు ఇప్పటికీ వారం నుంచి ఇదే తతంగం!!!రోజు లేట్ గా వస్తోంది. అప్పుడప్పుడు రావట్లేదు కూడాను.
అందరూ అనుకుంటారు ఆహా వంటకి వంటమనిషి,పనులకు పని మనిషి ,ఈవిడకేమి రాజాల ఉంటుంది అని కానీ ,
అంతమందిని ఒకే తాటి పై ఉంచి పని చేయించలంటే నాకు తల ప్రాణం తోకకి వస్తుంది .
దానికి తోడు కష్టపడే మనస్తత్వం ఉన్న నేను హాయిగా నా పనిని చేసుకోకుండా ఈ అనారోగ్యం కారణం గా వీళ్లతో ఈ బాధలు పడల్సొస్తోంది అని చిరాకు కూడానూ!!!
నాకు చాలా అసహనం గా ఉంది .కుమారి (పని అమ్మాయి)రానే వచ్చింది. వస్తూనే చెప్పటం మొదలెట్టింది.
అమ్మా !!!మీకు చెప్పాను కదమ్మా మా ఇంటాయనకి ఒంట్లో బాగోలేదు అని ఇప్పుడు పెద్ద ఆసుపత్రి కి తీసుకు
వెళ్ళ మన్నారు ఆపరేషన్ చేయాలంట రేపు మా మామ నీ తీసుకుని ఊరు వెలిపోవలమ్మా..
అలా అనేటప్పటికీ నా తల మీద పిడుగు పడినట్టు అయ్యింది. మరి ఎలాగే అని బేలగా అడిగాను నేను.
అమ్మా మీకు ఇష్టమైతే మా ఆడపడుచు అత్త ని, ఈ నెల రోజులు మీకు పనికి పెడతాను , ఆనక మళ్లీ నేను వస్తనమ్మా!!!అని చెప్పి తన పనులు చేసుకో సాగింది.
గత్యంతరం లేక నేను ఒప్పుకున్నాను.
అలా మా ఇంటికి పనికి వచ్చింది కాంతమ్మ....
ఒప్పుకున్న పనులు చక్కగా చెయ్యడం తో పాటు చేతిలో పని అందుకుని చేసేది. కరెక్ట్ గా టైమ్ కి రావడం తో పాటు ఎది ముందు ఏది వెనుక అనే విచక్షణ తో పనులు చక్కగా చేసేది.
అన్నింటికన్నా ముందస్తుగా వంటావిడ సరోజ తో సమన్వ్యం కుదిరింది.
అది నాకు ఎంతో హాయిని ఇచ్చింది.
ఏమిటి అంటే!! కుమారి పని చేసినంత సేపూ వటావిడ సరోజ తో ఒకటే వాదనలు,తగువులు. ఎవరి అహం వారిది .ప్రతీ పనీ ని నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని ఒకలి మీద కు ఒకలు తోసుకొని ఎవరూ చేసే వారు కాదు.ఈ కిష్కింధ లో నేను ఉండ లేక పోయేదాన్ని ఇన్నాళ్లు.
ఈలోగా కుమారి భర్త కి బాగా సుస్తీ చెయ్యడం,ఆపరేషన్ విఫలం అయ్యి పాపం అతను చనిపోవడం లో ఒక నెల కాస్తా ,రెండు నెలలు అయింది.
కాంతమ్మ నిన్న చెప్పింది అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఊరుకు వచ్చేసింది ట కుమారి .ఈ నెల నుంచి పనికి వస్తానని కుమారి అంది ట.
అమ్మా రేపటి నుంచి కుమారి పనిలోకి వచ్చేస్తానని చెప్పింది అమ్మ . అమ్మ మీరే ఏదో ఒకటి చెప్పి నన్ను పనిలోనుంచండమ్మ నాకు ఆసరాగా ఉంటుంది .అని పాపం ఒకటే వాపోయింది కూడా!!!
ఒకరకంగా కాంతం ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా ,,,
కానీ నేను కుమారికి మాట ఇచ్చినందువల్ల ఏం చేయాలో తెలియట్లేదు.
నేను కాంతమ్మ తో "అలా ఎలా కుదురుతుంది కాంతమ్మ!!
నేను తను పని లోకి వచ్చే వరకే నిన్ను పెట్టు కుంటాను అని కుమారి తో చెప్పా కదా !!!
ఇప్పుడు నువ్వు బాగా చేస్తున్నావని ఆ మాట తప్ప లేను కదా"అని అన్నాను.
కానీ మనసులో ఏదో వెలితి మనసుకు నచ్చినట్టు పని చేసే ఆమె నీ వదులు కుంటున్ననేమో అని !!
చెప్పకేమి నాకు కూడా కుమారి రాకపోతే బాగున్ను అనిపిస్తోంది.
ఈ సందిగ్ధం లో ఉండగా వంటావిడ సరోజ మధ్యలో కల్పించుకుని ఎలాగూ ఆమె భర్త పోయాడు కదా !!ఆరు నెలలు ఆమె ముఖం చూడకూడదు అని చెప్పేయండి మేడం. ఇంకేమి ఇబ్బంది ఉండదు అంది పళ్ళు ఇకిలించు కున్టూ!!!
ఆ మాటకి మనసు చివుక్కుమంది .అసలే ఆమె భర్త పోయి పుట్టెడు దుఃఖం లో ఉంది.ఈ వెధవ మూఢాచారాలు తో ఆమెను ఇంకా బాధ పెట్టడం రాక్షసత్వం అవుతుంది.
ఇలా ఆలోచిస్తూ వుండగానే ఏమి చెయ్యమంటారు అమ్మా!!అని దీనంగా కాంతమ్మ అడగడం తో ఏమనాల
ో తెలీక ....
"" చూడు కాంతమ్మా!! ఏదయినా సరే నీకు తోచింది చెప్పు కుని తను రాకుండా చేసుకో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను తనువస్తే మాత్రం పనులో పెట్టు కుంటాను. ఎందుకంటే నేను తనకు మాట ఇచ్చాను""
అన్నాను మనసులో అపరాధ భావనతో!!!
అవును మరి ఒక పక్క కుమారి పరిస్తితి మనసును కష్టపెడుతున్నా ,,తను మళ్ళి పని లోకి వస్తే
పడే ఇబ్బంది తలుచుకుని పలాయన వాదం చేసి, నిర్ణయం కాంతమ్మ మీద కి తోసేసాను.
ఇంకా ఆ ప్రస్తావన అంతటి తో ముగించి ఎవరి పనుల్లో వాళ్ళము లీనమై పోయాము.
ఇప్పుడు ఇంటికి చేరే పాటికి అసలు విషయం తెలుస్తుంది. కాంతమ్మ ,కుమారి న ఎవరు పని కి వాస్తరని.
అమ్మా! ఇంటికి వచ్చాసమమ్మ అని డ్రైవర్ చెప్పడం తో ఆలోచనల నుంచి బయటకు వచ్చి, కార్ దిగి ఇంట్లోకి అడుగు పెట్టాను.
వెళ్లేసరికి కాంతమ్మ వాకలి ఊడుస్తోంది. హమయ్య పనికి కాంతమ్మ వచ్చింది అంటే కుమారి పని మనేయడానికి ఒప్పుకుంది అనమాట.
అలా అనుకోగానే మనసుకు కష్టం గా అనిపించింది.
ఇంతలో చేతిలో పని అపేసి నా దగ్గరకి పరుగు లాంటి నడక తో వచ్చింది కాంతమ్మ...
ఏమిటి కాంతమ్మ అనేలోపే చెప్పడం మొదలు పెట్టింది.
"అమ్మా!!! రేపటి నుంచి కుమారి వస్తుందమ్మా ఈ విషయం చెప్పడానికే వచ్చనామ్మా !!"అంది.
ఏమి కాంతమ్మ!!కుమారి ఒప్పుకో లేదా?అన్నాను నేను.
లేదమ్మా నిన్న ఇంటికి వెళ్ళాక నాకే మనసుకు నచ్చలేదు అమ్మా!!
పాపం ఆమె పెనిమిటి పోయి పట్టుమని నెల రోజులు కూడా అవలేదు నోటి కాడ కూడు కూడ నేను లాక్కుంటే ఎలా బతికేది అమ్మా పాపం అది...
పైగా తను వచ్చే వరకే పని సేస్తానాని దానికి మాట ఇచ్చాను కదా అమ్మా!!!!
ఇప్పుడు తప్పడం ఎంత వరకు సబబు చెప్పండమ్మా!!!
పెద్ద చదువులు చదువుకునీ ,ఉద్దోగం చేసేవాళ్ళు మీరే చెప్పాలి ..
అందుకే నా కూతురు దగ్గరకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అమ్మా!!
ఈ ముసలి ప్రాణానికి ఇంత అన్నం పెడితే చాలు కదా నా కూతురు,అల్లుడు కూలికి పోతే ఆ చంటి దాన్ని కనిపెట్టుకుని ఉంటాను.
అల్లుడు మీద పంతం పట్టి ఇన్నాళ్లు ఆడకి పోలేదమ్మా!!
ఏమి పంతాలమ్మ అవి ,మనకేమాయినా ముద్దేడతాయ సెప్పండి .
మనమే సర్దుకు పోయి వాళ్లకు సహాయం చేయాల ;;
నా పంతం నా కూతురు నే కాకుండా కుమారి కి కూడా ఇబ్బంది అవుతాది అది నాకు ఇట్టం లేదు అమ్మా !!!!!
కుమారి ఇంకా ఇద్దరు పిల్లలు కు పెళ్లి సేయాల, ఆళ్ళ పురుడ్లు, పుణ్యాలు ,సేయాల ఈ పని అవసరం తనకే ఎక్కువ ఉందమ్మా!!""""
అని ఒక్క సెకను ఆగి "నాకు ఈ నెల జీతం డబ్బులు ఇత్తే రేపు పొద్దుగాల బస్సు ఎక్కేత్తాను అమ్మా!!
ఏదో మొహమాటం ముఖంలో కనిపిస్తూ ఉండగా
"ఏదైనా పాత సీర కూడా ఉంటే ఇయ్యండమ్మా !!
వెళ్ళగానే మా కూతురు సేతిలో పెడితే మురిసిపోతది "
అని మళ్ళీ తన పని లో పడిపోయింది.
కాంతమ్మ అన్న మాటలు కు నాకు చెంప పెట్టు అయ్యింది.
"మీరు బాగా చదువు కున్న వాళ్ళు మీరే చెప్పండమ్మా" అని తను అన్న మాట బుర్రలో గింగిరాలు తిరుగుతోంది.
అవును చదువు కున్నాను,ఉద్యోగం కూడా వెలగ పెడుతున్నాను.
ఇన్నాళ్లు,ఇన్నేళ్లు నా జీవితం లో ఏనాడు ఎంతటి పెద్ద విషయాల లోనే ప్రలోభ పడని నేను......నేనేనా .... . అలా పలాయనం చేసే పబ్బం గడుపు కోవాలని అనుకున్నానా!!
నిజంగా కాంతమ్మ నా అంతఃకరణం ని తట్టి లేపింది.
ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షం గా అయినా నేను పెట్టు కున్న నా జీవన విధానం నుంచి సడలకుండా నన్ను కాపాడింది.
అవును......లేక పోతే ఎప్పటికీ అపరాధ భావంతో నలిగిపోయే దాన్ని..
ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం తనది ,చదువు తోటి మాత్రమే ఆ సంస్కారం వస్తుంది అనుకోవడం మన అపోహే అవుతుంది.
అవును!! నా ఇన్ని ఏళ్ల జీవితం లో ఎంతమంది నీ చూసాను.
వంద రూపాయల కి కూడా కక్కుర్తి పడీ తన నిజాయితీ నీ తాకట్టు పెట్టే ప్రభుద్దులు కొందరయితే,
నేను ఒక్కడిని ఆఫీసుకి లేటు గా వెళ్తే ఈ ప్రపంచానికి కొంపలేమి మునిగి పోదులే అని తన వ్యక్తిత్వాన్ని తుంగ లో తొక్కే ఆశాములు కొందరు,
ఎవ్వరూ పని సరిగా చేయనప్పుడు నేను మాత్రం ఎందుకు చెయ్యాలి ? ఆ ......చేస్తే మాత్రం నాకు ఒచ్చే లాభం ఏమిటి అందరి పని నెత్తిన పడటం తప్ప అని అనుకునే అఖండులు కొందరు.
వారికి వీసమెత్తు ఉపయోగమైన లేకపోతే పక్కవారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోని పుణ్యాత్ములు మరి కొందరు.
ఇలాంటి వాళ్ళందరూ పెద్దపెద్ద విద్యావేత్తలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్న వాళ్ళు.
అలా చూసుకుంటే కాంతమ్మ ముందు వాళ్ళంతా పిపీలికా లే అవుతారు.
ఎంత చక్కటి సంస్కారం ఆమెది తన జీవనోపాధిని , అహం ని కూడా పక్కనపెట్టి తను ఇచ్చిన మాట మీద నిలబడగలిగిన ఆమె ఔన్నత్యం కి పాదాభివందనాలు చేయాలనిపించింది నాకు.
సన్మానాల కోసం ,ఎదుటి వాళ్ల పొగడ్తల కోసం చేసే పనులు కన్నా,, అంతఃకరణశుద్ధి తో చేసే చిన్న పనికూడా ఎంతో ఆత్మ సంతృప్తి నీ ఇస్తుందన్న నా నమ్మకం ఆమెను చూసాక ఇంకా బలపడింది.
ఈలోగా పనులు ముగించుకుని జీతం కోసం నా ఎదుట నిలిచిన కాంతమ్మ ,నాకు .... ప్రలోభానికి లోనై పరోక్షంగానైనా నా విధానాలకు గాడి తప్పకుండా చేసిన అంతరంగం లా కనబడింది.
వెంటనే తన జీతంతో పాటు,నా చేతిలో ఉన్న షాలు, సన్మానం లో నాకు ఇచ్చిన సిల్క్ చీర, నా చేతిలో పెట్టిన పుష్ప గుచ్చం ఆమెకు మనస్ఫూర్తిగా సమర్పించాను. నిజానికి ఈ రోజు సన్మానం తనే అందుకోవాలి ,కానీ ఈ ప్రపంచం ఇంకా ఆ స్థాయి కి చేర లేదు .
అవును.... కాంతమ్మ చేసిన ఈ పని నాకు ఎంతో ఉన్నతంగా అనిపించినా !! చాలామందికి చేతకానితనంగా కనిపిస్తుంది ఈ రోజుల్లో !!!!
అందుకే మనసులోనే వేయి ప్రణామాలు చేసుకుని ఆ సన్మానం తనకి జరిపించిన అనుభూతిని పొందాను.
నా అంతకరణన్ని శుద్ధి చేసుకున్న భావంతో మనస్ఫూర్తిగా ఆమెకి వీడ్కోలు పలికాను.