Varun Ravalakollu

Romance

4.8  

Varun Ravalakollu

Romance

అమీ తుమా కి భాలో భాషి

అమీ తుమా కి భాలో భాషి

12 mins
716


కొంతమంది మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతే, మరి కొందరు గుణపాఠాలుగా మిగిలిపోతారు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే అబ్బాయి నా జీవితం లో ఎలా మారాడో ఇప్పుడే చెప్పలేను గాని అతడి పరిచయం ఎలా జరిగిందో చెప్తాను.

నేను ఒక టిపికల్ IT employee ని. ఈ రంగం లో లేని వాళ్లకి ఇదొక అందమైన అద్దాల మేడలా అనిపిస్తే ఇందులో ఉన్న నా లాంటి వాళ్లకి ఇక్కడ పని చేయడం ఒక పీడలా అనిపిస్తుంది.(మేడ పీడ.. అడ్డెడ్డెడ్డే రాస్కో రా సాంబ). ఒకర్ని ఒక చీకటి గుహలో బంధిస్తే ప్రాణం ఎలా విలవిల్లాడుతుందో అంత కంటే ఎక్కువ బాధ పడుతున్న నాకు ఓ రోజు పున్నమి చంద్రుడు లాంటి ఒక అందమైన అబ్బాయి కనిపించాడు. (మాంచి మెలోడీ ఒకటి background లో వేసుకోండి).

పోలికకి తగ్గట్టే చందమామలా తెల్లగా ఉంటాడు, మరీ ఎక్కువ చేసి చెప్పట్లేదు కానీ, ఆరడుగుల అందగాడు, చూడడానికి హీరోలా ఉంటాడు, చందమామ తో పోల్చా కాబట్టి మీకు ఒక సందేహం వచ్చి ఉండచ్చు, చందమామ కి లాగే మచ్చ కూడా ఉందేమో అని. ఆలా అనుకుంటే, మీరు సరిగ్గా ఊహించినట్టే, తనకి కూడా మచ్చ ఉంది.. అదే బొట్టు పచ్చ(ప్రాస కోసం పచ్చ బొట్టు ని తిరగేసా లెండి). అది కూడా ఒకటి రెండు కాదు మూడు tattoos.  

అంత అందంగా ఉండే అతన్ని ఏ అమ్మాయి చుసినా ఇట్టే పడిపోతుంది. అందులోనూ ఆరోజు నవ్వుతు కనిపించాడు. అంతే, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటి వరకు IT జాబ్ మీద ఉన్న చిరాకు మొత్తం ఒక్కసారిగా పోయింది. మళ్ళీ అతను ఎప్పుడు కనిపిస్తాడా అనే తపన, కనపడతాడో లేదో అనే ఆందోళనో ఏమో తెలీదు కానీ, నాకు నేనే కొత్తగా, ప్రపంచమంతా వింతగా, మనసంతా హాయిగా అనిపించాయి. (ఊహల్లో తేలిపోయే పాత పాట ఒకటి RR లో మోగింది)

ఒకప్పుడు ఆఫీస్ అంటే భయం, మా మేనేజర్ గాడు ఎప్పుడు ఎదో ఒకటి అంటూ ఉంటాడు అని. కానీ ఇప్పుడు ఆఫీస్ అంటే కొత్త ఉత్తేజం, ఉత్సాహం మళ్ళీ అతన్ని చూడచ్చు అని.

మరుసటి రోజే మళ్ళీ హీరో గారి దర్శనం జరిగింది. ఎందుకో హీరో గారు మా opposite వింగ్ లో ఉన్నాడు. ఎంక్వయిరీ చేస్తే తెలిసింది ఏంటంటే, తాను అక్కడే వర్క్ చేస్తాడు అని. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో ఆ క్షణం లో అర్థం కాలేదు. అదే క్షణం లో నా ఆనందం కాస్తా రెట్టింపు అయింది. ఇప్పుడు ఆఫీస్ లో నాకు నచ్చేది మూడే విషయాలు: ఒకటి లంచ్ బ్రేక్, రెండు మార్నింగ్ టీ బ్రేక్, మూడు ఈవెనింగ్ టీ బ్రేక్. ఎందుకంటే బయటికి వెళ్ళినపుడు తనని చూడొచ్చు అనే ఆశ. నా అదృష్టాన్ని బట్టి ఆ 3 బ్రేక్స్ లో ఎప్పుడైనా కనపడచ్చు. అదృష్టం నెత్తి మీద కూర్చుంటే, ఆఫీస్ అయిపోయాక cab ఏరియా లో కూడా కనపడచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నెలసరి జీతం తో పాటు బోనస్ వచ్చినట్టు.

అతన్ని చుస్తే నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలీనంతగా మైమరిచిపోతానేమో, అందుకే ఈ మధ్య మతి మెరుపు కూడా వచ్చింది అని అందరూ అంటుంటే, ఇందుకేనేమో అని క్లారిటీ వచ్చింది.

లేకపోతే రేపు ఆఫీస్ ఉందని కూడా మర్చిపోయి ఇంకా నేను మేలుకొని ఉన్నా. అతని గురించి ఆలోచిస్తూనే ఉన్నా.. కంటి మీద కునుకు వస్తే గా.. ఇంకాసేపు ఇలానే మేలుకుంటే, ఆ అబ్బాయి కాకుండా మా మేనేజర్ నా కలలోకి వచ్చే లా ఉన్నాడు. మరి నేను విశ్రాంతి తీసుకుంటాను.

చూసిన వెంటనే ప్రేమ పుడుతుందో లేదో తెలీదు కానీ, ఆకర్షణ మాత్రం పుడుతుంది. అందులోనూ మన ఊహాల్ని పోగేసి ఒక బొమ్మ గీసి రంగులు అద్ది ప్రాణం పోస్తే ఎలాంటి రూపం మన కన్నుల ముంగిట నిలుస్తుందో, అచ్చం అలాగే ఒకరు మన ముందుకి వస్తే ఖచ్చితంగా ఆకర్షణ పుడుతుంది. అది మానవ నైజం. కానీ నా విషయంలో చూసిన వెంటనే ఆకర్షణ పుట్టలేదు. నేను బాధలో ఉన్నప్పుడు అతని చిరునవ్వు చూసి ముగ్ధురాలిని అయ్యాను. ఆ నవ్వు చూస్తే, నా frustration కాస్తా relief గా మారింది. ఇది అభిమానమా?? లేక ఆకర్షణ?? ఏదో తెలీదు గానీ ఆ స్వచ్ఛమైన నవ్వు వెనక దాగిన చిరునామా ఎలా అయినా తెలుసుకోవాలని నేను ఒక చిన్నపాటి అన్వేషణ మొదలు పెట్టాను.

ఈ అన్వేషణ లో భాగంగా, ముందుగా నేను నాతో close గా ఉండే colleague తో విషయం చెప్పా. మన opposite ప్రాజెక్ట్ లో ఉన్న అబ్బాయి మీద నాకు క్రష్ అని. ఇక ఇలాంటి విషయాలు కాంతి కంటే వేగంగా, ఒకరి నుంచి ఇంకొకరికి, ఆ ఇంకొకరి నుంచి మరొకరికి.. ఆ మరొకరి నుంచి వేరొకరికి తెలిసిపోతాయి. ఇలా స్టాలిన్ సినిమా లో లాగా ఈ వార్త దాదాపు మా ప్రాజెక్ట్ లో ఉన్న అందరికి తెలిసిపోయింది. అంత ఈజీ గా ఎలా తెలిసింది అనే దాని గురించి పెద్దగా ఆలోచించకర్లేదు, ఆఫీస్ లో సగం time ఇలాంటి సొల్లుకే సరిపోతుంది కాబట్టి.

ఏదైతేనేం, అందరికి తెలిసింది. ఇలా తెలియడం వల్ల లాభాలు ఉన్నాయి అనుకున్నా కానీ వాటితో వచ్చే నష్టాలు మాత్రం అప్పుడు గ్రహించలేకపోయాను. సరే జరిగేది జరగనీ, at least తన పేరు కనుక్కోవాలి అని అందరికీ చెప్పేసాను.

అలా చెప్పానో లేదో, ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ఐడియాల్లో ఒక మంచి ఐడియా ఏంటంటే, సాయంత్రం క్యాబ్ ఏరియాకి వెళ్లి తను ఏ క్యాబ్ ఎక్కితే ఆ క్యాబ్ నంబరు చూసి, క్యాబ్ ఏరియా లో ఉన్న క్యాబ్ లిస్టులో తన పేరు చూసి, మన ఆఫీస్ పోర్టల్ లో అతని పేరు search చేస్తే details మొత్తం తెలుసుకోవచ్చు అని.

ఐడియా ఏదో బాగానే ఉందని అనుకున్నా. ఆరోజు సాయంత్రం క్యాబ్ దగ్గర, నేను నా ఫ్రెండ్ wait చేస్తూ ఉండగా, ఆ అబ్బాయి కూడా రానే వచ్చాడు. అవకాశం దొరికింది కదా అని అతన్ని చూస్తూ ఉన్నాం. ఈసారి ఆ అబ్బాయి మమ్మల్ని చూసాడు. అతను నన్ను గమనించడం ఇదే మొదటిసారి. ఒక్క క్షణం భయం వేసింది, గుండె వేగం పెరిగింది. నాకు తానెంతో స్పెషల్ కావచ్చు, కానీ అతనికి నేనొక regular అమ్మాయిని. అది గ్రహించిన తర్వాత, నేను కాస్త ఊపిరి పీల్చుకున్నా. కానీ తన పేరు తెలుసుకొనే ప్రయత్నం మాత్రం ఆపలేదు.

ఈ తొక్కలో క్యాబ్ కూడా ఎంతసేపటికీ రాదే. దరిద్రం నాతో salsa చేస్తుంది అనుకుంటా, నా క్యాబ్ వచ్చేసింది. అదేంటో ప్రతి రోజు అతని క్యాబ్ వచ్చి వెళ్తుంది. అతను వెళ్లే వరకు అతన్నే చూస్తూ గడిపేదాన్ని, ఈరోజు మంచి ఐడియా తో వస్తే, ఖర్మ కాలి నా క్యాబ్ ముందు వచ్చింది. ఇది ఎలా ఉందంటే: గొడుగు తెస్తే వాన పడదు, గొడుగు లేని రోజు వాన ఆగదు అన్నట్టు. మన టైం బాగలేక పోతే మనం ఎన్ని ఐడియాలు వేసినా ఇలా నీరు కారిపోవాల్సిందే. అయనా నిరాశ పడకుండా, మరుసటి రోజు పేరు కనుక్కోవచ్చు అనే రెట్టింపు నమ్మకంతో ఇంటికి క్యాబ్ లో బయలుదేరాను. జీవితం మొత్తం నమ్మకం తో బ్రతకాల్సిందే. రేపు అనే ఉదయం కోసం నేడు అస్తమించాల్సిందే. మరి నేను ఇంటికి వెళ్తున్నా. రేపు ఆఫీస్ టైం లో మాట్లాడుకుందాం. 

మొన్నటి దాకా ఎవరో కూడా తెలియని వాళ్ళని నిన్న చూసి ఈరోజు ఫోన్ నెంబర్ అడిగేసి చాటింగ్ లు డేటింగ్ లు ఫైటింగ్ లు కూడా చేసేస్తున్న ఈ కాలం లో నేనేమో అతన్ని చూసి ఆకర్షణ కి లోనయ్యి, అది అభిమానమే అనే నిర్ధారణ కి వచ్చి, ఎలాగైనా పేరు తెలుసుకోవాలని అనుకున్నప్పటికి 4 వారాలు గడిచిపోయాయి. పేరు తెలీనప్పుడు ప్రతి రోజు అతను క్యాబ్ ఎక్కే వరకు అక్కడే ఉండేదానిని. ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటే కాలం కలిసి రావట్లేదు. అనుకుంటాం గాని దేనికైనా టైం రావాలి అనేది అందుకే. టైం బాగలేకపోతే అరటి పండు తిన్నా పళ్ళు విరుగుతాయి.

నాకు ఈ క్యాబ్ ఐడియా ఇచ్చిన ఫ్రెండ్, నన్ను చూసి కాంచన మూవీ లో లారెన్స్ లాగా: తెలిసిపోయిందా!! అని అడిగాడు. ఏంటి తెలిసేది నా బొంద, తన క్యాబ్ రాలేదు అని చెప్పా. అధైర్యపడకు అని నన్ను మళ్ళీ ప్రోత్సహించాడు. తర్వాత మేము కాఫీ తాగడానికి వెళ్ళినపుడు, ఏక్కడినుంచో ఊడి పడ్డట్టు, ఆ అబ్బాయి కూడా అదే కెఫిటీరియాలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నా గుండె జారి గల్లంతయ్యింది. ఏంటి చూసిన ప్రతిసారి ఇలానే అవ్వుద్దా అని మీకు సందేహం రావచ్చు, కానీ ఈ చిన్ని గుండె కి feelings ఎక్కువ logics తక్కువ. అయినా మీకు కూడా మీ జీవితంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే, అప్పుడు realise అవుతారు. నెను చెప్పేది నూటికి నూరు పాళ్లు కరెక్టే అని. ఇక మీకు తెలీనిది ఏముంది, ఒకరి crush ఎదురు పడితే, వాళ్ళకి ఎలా ఉన్నా, పక్కనున్న ఫ్రెండ్స్ కి మాత్రం భలే సరదా. ఆట పట్టించడానికి అదే కరెక్ట్ టైం. అలానే నా ఫ్రెండ్స్ కూడా ఆ అబ్బాయి ని చూసి: is that the guy.. yes(ఇంగ్లీష్).. అతనేనా(తెలుగు).. వహి హై క్యా (హిందీ)..అవన్ అలగరిక(తమిళ)..కేయ్ కూఞ్చవే (కిలికి, ఈ భాష కూడా వదల్లేదు :p) ఇలా అన్ని భాషల్లో ఒకటే గుసగుసలు. అప్పుడే తెలిసింది గుసగుసలకి బాషతో పని లేదు అని. ఏదో బాహుబలి సినిమా ని అన్ని భాషల వారు ఆదరించినట్టు.

ఇంకో ఫ్రెండ్ తన వంతు ప్రయత్నం చేసింది, ID కార్డ్ అయినా చూసి పేరు తెలుసుకుందామని. అది పొట్టిది. మా వాడి height కి తేలిపోయింది. సరే ఇక ఇందులో కొత్తేముంది అని అనుకున్నా.మళ్ళీ సాయంత్రం అయింది, ఎప్పటి లాగే రొటీన్ గా క్యాబ్ కోసం చూస్తున్నా. అతడి కోసం కూడా. కానీ ఇప్పుడు రొటీన్ కి భిన్నంగా, ఆ అబ్బాయి కనపడలేదు. ఎంతసేపు చూసినా రాలేదు. ఇక మెదడు వేగంగా ఆలోచించడం మొదలు పెట్టింది. కెఫిటీరియా లో కనిపించాడు. పోనీ మధ్యలో వెళ్ళిపోయాడా?? ఎందుకు రాలేదు?? ఏం జరగలేదు కదా అనే భయం కూడా మొదలైంది. ఇలా రకరకాల ఎమోషన్స్ ఒక్కసారిగా మదిలో మెదిలాయి. చివరిదాకా చూసాను. ఆఖరికి నిరాశే మిగిలింది.

మరుసటి రోజు ఆఫీస్ కి రాగానేే మంజు అనే ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి, నిన్న మీ హీరో క్యాబ్ లో వెళ్ళలేదు కదా అని అనింది. అవును నీకెలా తెలుసు అని ఆతృతగా అడిగా. అప్పుడు చెప్పింది, అతను బైక్ లో వెళ్ళిపోయాడు అని. కొత్త బైక్ అని, Royal Enfield అని కూడా చెప్పింది. అది విన్నాక నా పరిస్థితే అస్సలు బాగాలేదు. కానీ ఏమీ చేయలేము. ఆ క్యాబ్ ఐడియా ఇక గోవిందా గోవింద. ఇక ఇతర ప్లాన్ ఏదైనా వేసి పేరు తెలుసుకోవాలి అని దృఢ సంకల్పంతో ఉన్నా.

ఒక కన్ను నా సిస్టం మీద, ఇంకో కన్ను opposite wing మీద పెట్టి ఎదో వర్క్ చేస్కుంటూ ఉన్న. మంజు వచ్చి, "నేను వాటర్ తాగడానికి pantry కి వెళ్లినపుడు అదే టైం లో అక్కడ మీ హీరో కూడా ఉన్నాడు. నేను తనని చూస్తుండగా, అతను కూడా నన్ను చూసాడే. నన్ను చూసి ఒక నవ్వు కూడా నవ్వాడే" అని అంది. ఇంతలో ఈ మాటలు విన్న మిగతా ఫ్రెండ్స్, పగలపడి నవ్వుతూ "Line వేస్తుంది నువ్వైతే, అతను connect అయింది మంజు కి " అని అనేశారు. ఇక అంత జరిగాక, నేను ఎలా ఊరుకునేది, మనసులో బాధ తన్నుకొచ్చేసింది. మరి నేను ఇంత బాధ లో మీకు నా కథ ఎలా చెప్పేది. కాస్త కూల్ అయ్యాక మాట్లాడుకుందాం. 

కొన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఏదైతే ఉందో, అది మనకు 'ఇంకా తెలియదు' అనే బాధ కన్నా 'ఒకవేళ తెలిస్తే ఏమై ఉండచ్చు' అనే ఉత్సాహాన్ని.. ఊహని..కలిగిస్తుంది. అలాంటి ఊహాగానాల్లో నాకు కొన్ని పేర్లు తోచాయి. అందులో కొన్ని పేర్లు ఆనంద్ (ఓ మంచి కాఫీ లాంటి అబ్బాయి)?? అరవింద్?? అరుణ్ (చాలా normal పేరు), మహేష్ ( ఈ పేరు లో వైబ్రేషన్స్ ఉంటాయి)?? పవన్ (powerful)?? రామ్ (ఒక మంచి బాలుడు)?? రాహుల్(నామ్ తో సునాహి హోగా)?. ఇలా ఊహల్లో తేలుతున్న టైంలో నా ఫ్రెండ్ ఫోన్ లో మోగిన ringtone జర్నీ సినిమా లో పాట "నీ పేరే తెలియదు గా, నిను పిలువగా లేను కదా" అంటూ నన్ను తట్టి లేపింది. నాకున్న ఒక అలవాటు ఏంటంటే, చుట్టు పక్కల ఎవరు ఏమనుకున్నా సరే, పాట పాడుకుంటూ మైండ్ ని రిఫ్రెష్ చేస్కోవడం. నేను ఆనందంగా ఉండడం ఇష్టం లేదేమో, నా colleagues మొదలు పెట్టారు "పేరు తెలుసుకోవాలి అని ఇంత ఆరాట పడుతున్నావ్, పేరు తెలిస్తే ఏం చేస్తావ్ చెప్పు.. మాట్లాడతావా?? నీకు అంత ధైర్యం ఉందా??..లేదు", "అయినా పేరు తెలిసిపోతే, ఇప్పుడు నిరీక్షణ లో ఉన్న interest తెలిసాక ఉండదు" అని ఎవరి అభిప్రాయాలు వారు చెప్తూ వచ్చారు. వాళ్ళు చెప్పేవి ఒక చెవిలో వెళ్లి ఇంకో చెవి నుంచి బయటికి వెళ్తున్నాయ్. కానీ నా బుర్ర లో ఈ పాట, మనసులో ఆ అబ్బాయి. ఇంకేం వినబడట్లేదు. ఏదో తెలీని నమ్మకం, sixth సెన్సో seventh సెన్సో అంటారు కదా.. అదే. పేరు తెలుస్తుంది అనే గట్టి నమ్మకం.


దేవుడా!! ప్లీజ్ ఒక్కసారి పేరు తెలిసేలా చెయ్ చాలు. ఎన్ని ప్లాన్లు వేసినా, అన్ని ఫెయిల్ అయ్యాయి. మరి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నా, నేను నడిచే దారిలో ఎవరిదో ID కార్డ్ పడి ఉంది. వెళ్లి తీసుకొని చూసా, అంతే, నోట మాట రాలేదు. చేతులు కాళ్ళు కదలట్లేదు. చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయా. చూస్తే అందులో ఆ అబ్బాయి ఫోటో. (Damnnnnn...) నాకు ఆ అబ్బాయి పేరు తెలిసిపోయింది. నాకు తెలిసిపోయిందోచ్....

ఇన్ని రోజులు ఎంత ప్రయత్నించినా తెలీని పేరు ఇంత easy గా తెలిసిపోతుంది అని కల్లో కూడా అనుకోలేదు. కార్డ్ మీద పేరు "Bishwas" అని ఉంది. ఎన్ని పేర్లు అనుకున్నానో, చివరికి ఇదా అతడి పేరు. కానీ ఆ పేరు నాకు అంత నచ్చలేదు. కాదు కాదు.. అతడికి ఆ పేరు set అవ్వలేదు అని అనిపించింది. సరే ఇక మన హీరో గారి పేరు సంగతి పక్కన పెడితే, ఈ కార్డ్ తనకి ఎలా రిటర్న్ చేయాలి?? నేరుగా నేనే వెళ్లి ఇస్తే బాగుంటదా?? అని ఆలోచించా. చివరికి గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి కి ఇచ్చేస్తే, వాళ్లే ఇచ్చేస్తారు అనుకొని, ఫుల్ నేమ్ ఇంకోసారి చూసుకొని, సెక్యురిటి గార్డ్స్ చేతిలో ID కార్డ్ పెట్టి నా డెస్క్ దగ్గరకు వెళ్లిపోయా.

పేరు తెలిసిన ఆనందంలో, ఇక ఆఫీస్ communicator లో తన పేరు search చేయగానే, అతడి mail ID, పని చేసే ప్రాజెక్ట్, తన ఫోన్ నెంబర్, ఇంకా చాలా details వచ్చేసాయి. ఇక నా ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఇన్ని వారాలు ఎవరి పేరు తెలుసుకోవాలని ఆరాట పడ్డానో, అది ఇంత సులువుగా నెరవేరుతుంది అని అనుకోలేదు. నిజానికి పేరు అంతగా నచ్చలేదు. అప్పుడు ఒక quotation గుర్తు కి వచ్చింది. "More the expectations, more the disappointment".

మనం ఎంత ఊహించుకుంటామో, అది మన ఊహ కి దగ్గరగా లేకపోతే అంత బాధ పడతాం. అయినా పేరు లో ఏముంది చెప్పండి, మనకు మనిషి నచ్చితే తర్వాత అన్ని నచ్చుతాయి. మరి నేను ఇంత ఆనందం లో ఉంటే మీకు కథ ఎలా చెప్పేది?? రేపు మాట్లాడుకుందాం. అదేంటి నిన్న బాధలో ఉన్నావ్, కథ చెప్పలేను అన్నావ్, ఇవ్వాళ సంతోషం లో ఉన్నావ్, అయినా చెప్పలేను అంటున్నావు.. ఏంటిది?? నిజమే, నేను నిన్న చెప్పినట్టు, ఈ చిన్ని గుండె కి emotions ఏ కానీ logics ఉండవు. మనిషికి అతిగా ఆనందం వచ్చినా, అతిగా బాధ వచ్చినా తట్టుకోలేడు.

మొత్తానికి మన హీరో పేరు, నెంబర్ తెలిసిపోయాయి. వెంటనే అతని నెంబర్ ని ఫోన్ లో crush అని ఫీడ్ చేసుకున్నా. Whatsapp ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయగానే, అతని అకౌంట్ నా whatsapp లో చూపించింది. వెంటనే DP కూడా save చేసుకున్నా. అలాగే FB లో తన ఫోన్ నెంబర్ సెర్చ్ చేశా, వెంటనే అతని అకౌంట్ open అయింది. FB లో తన ప్రొఫైల్ చూసా, తన ఇష్టాలు, అయిష్టాలు ఏంటో చాలానే తెలిసాయి. మొత్తానికి తనెంటో తెలిసింది. తను కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ అబ్బాయి. అయినా పేరు ని బట్టే తెలిసిపోతుంది, బెంగాలీ వాళ్ళు 'వి' కి బదులు గా 'బి' ని వాడతారు అందుకే విశ్వాస్ కాస్తా బిశ్వాస్ అయింది.

FB లో ప్రొఫైల్ చూసినపుడు తెలిసింది. అతడికి నొప్పి అంటే ఇష్టం అని, ఆ నొప్పి ని తను డబ్బులు ఇచ్చి మరీ tattoos ద్వారా కొనుక్కుంటాడు అని. తనలో ఈ విషయం నాకు నచ్చలేదు, బహుశా అతడి మీద నాకున్న అభిమానం వల్ల కావచ్చు. మనకు నచ్చిన వాళ్ళు నొప్పితో బాధ పడ్తుంటే, మనం ఊరుకోగలమా. మీరు నమ్మినా నమ్మకపోయినా, అమ్మాయిలు చాలా సున్నితమైన మనసు కలవాళ్ళు.

ఆరోజు సాయంత్రం ఆఫీస్ లో పెద్దగా పని లేకపోయేసరికి, అలా బయటికి వచ్చాను. నడుస్తున్న టైం లో ఎవరో పిలిచినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసా. హీరో గారి దర్శనం జరిగింది. పోకిరి సినిమా లో లాగా నా వీపు కి అతడి చూపులు గుచ్చుకున్నాయేమో. ఈసారి హీరో గారు అతని ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డుకి అవతల దమ్ము కొడుతున్నాడు. నేను ఒక్కసారి గా షాక్. అందరూ అనుకుంటారు అమ్మాయిలకు దమ్ము కొట్టే అబ్బాయిలంటే యిష్టం ఉండదు అని. ఇప్పటి వరకు నేనూ అదే కోవ కి చెందిన అమ్మాయినే. కానీ మొదటిసారి ఒకరు దమ్ము కొడుతుంటే, ఇంకా చూడాలి అనిపించింది.

మరుసటి రోజు ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా అందరం ఈ "పొగ తాగుట హానికరం" గురించి బాతాకాని వేశాం. ఒక ఫ్రెండ్ "ఛీ" అని, మరొక ఫ్రెండ్ "పొగ తాగుతున్నాడు అంటే మందు అలవాటు కూడా ఉండే ఉంటుంది" అని అంది. ఇంకో ఫ్రెండ్ సూటిగా అడిగింది "నీకు అతని మీద ఇంకా ఇష్టం ఉందా" అని. నేను కూడా సుత్తి లేకుండా చెప్పా "సిగరెట్ అలవాటు ఉందని, ఇన్ని రోజులు పెంచుకున్న ఇష్టం పోదు అని". అంతెందుకు, మన colleagues లో కొంత మంది ఇలానే సిగరేట్ తాగుతారు, కొంత మంది మందు కొడతారు. అంత మాత్రాన చెడ్డ వారు అయిపోరు. దేని విలువ దానిదే. అభిమానం అంటే, మనం ఇష్టపడే వ్యక్తి లో కొన్ని లక్షణాలు మనకు నచ్చకపోవచ్చు, కానీ వాటి వల్ల అభిమానం మాత్రం అణువంత కూడా తగ్గకూడదు. మనం అభిమానించే వారు ఏదైనా గొప్ప పని చేస్తే, మనం ఎలా గర్వంగా చెప్పుకుంటామో, అలానే వారు తప్పు చేసినపుడు, అడిగే హక్కు కూడా ఆ అభిమానికి మాత్రమే ఉంటుంది. సిగరెట్ తాగడం తప్పు అని నేను అనట్లేదు, కానీ తాగి ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటారు అనే బాధ తప్ప". ఏంటో ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసా. అవి విన్నాక, నాకంటే మీకే కాస్త విశ్రాంతి అవసరం.

సోషల్ మీడియా వచ్చాక ఎవరికి ఏం ఇష్టం, ఏం ఇష్టం లేదు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి విషయాలు చాలా సులభంగా తెలిసిపోతున్నాయి. అదే విధంగా ఇపుడు నాకు ఇష్టమైమ అబ్బాయి గురించి చాలా వరకు నేను తెలుసుకున్నా. ఫోన్ నెంబర్ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు తనతో పరిచయం ఎలా పెంచుకోవాలి.. అసలు ఎక్కడ మొదలు పెట్టాలి?? నాకు ఆ అబ్బాయి స్పెషల్ కావచ్చు, అసలు ఆ అబ్బాయికి నేను ఎవర్ని? తనతో మాట్లాడాలి అని ఒక అమ్మాయి ఇంత తపన పడుతుందని అతను ఊహించి కూడా ఉండడు అని నేను అనుకుంటున్నా. అయినా direct గా message చేస్తే అతను ఏమనుకుంటాడో అని చిన్న భయం కూడా.

ఇక తన గురించి నా ఫ్రెండ్స్ కూడా తెలుసు, ఇక వాళ్ళ హంగామా చూడాలి!! అతను కనపడితే చాలు ఒకటే గుసగుసలు, అతడికి అనుమానం వచ్చేలా గమనించడం, అతన్ని చూసి నవ్వడం, ఇలా ఒకటేంటి, చాలానే చేశారు. బిశ్వాస్ కి కూడా ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటది అని నా అభిప్రాయం. తన గురించి మేము ఎదో మాట్లాడుకుంటున్నాం అని, తన మీద నిఘా పెట్టాం అని. అయినా సరే నేను చూడడం ఆపలేదు, మా వాళ్ళ గుసగుసలు ఆపట్లేదు.

అదే రోజు మధ్యాహ్నం work లో కాస్త లేట్ అయింది. అందరూ లంచ్ చేసి తిరిగి వస్తున్న టైం లో నేను లంచ్ కి వెళ్దాం అని బయల్దేరా. ఇప్పటికే లేట్ అయింది అని, ID కార్డ్ చేతిలో పట్టుకొని చకచకా వెళ్లి లిఫ్ట్ దగ్గర wait చేస్తున్నా. అన్ని lift లూ full గా నిండి ఉన్నాయి. లిఫ్ట్ లోపలికి వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, బయటికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. సరే ఏదొక లిఫ్ట్ లో ఎక్కిస్తే సరి అని లిఫ్ట్ లో కి వెళ్తుండగా, బయటికి వచ్చే వాళ్ళ తోపులాట లో ఒకడు నన్ను గట్టిగా ఢీ కొట్టాడు. నా ID కార్డ్ చేతిలో నుంచి జారి కింద పడిపోయింది. ఎవడ్రా వీడు అని కోపంగా చూసా, ఎవరో కాదు, నా హీరో. వెంటనే sorry చెప్పి, కింద పడిన ID కార్డ్ తీసి నాకిచ్చి, మళ్ళీ ఒకసారి sorry చెప్పి వెళ్ళిపోయాడు. ID కార్డ్ నా చేతికి ఇచ్చేప్పుడు మాత్రం నా పేరు చూసేసాడని నా గట్టి నమ్మకం. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. నా కోపం కాస్తా నవ్వుగా మారింది. నా ఆకలి కూడా తీరిపోయింది.

ఇలాగే ఇంకో రోజు లంచ్ టైం లో తను కనపడినప్పుడు, నేను తనని దొంగ చూపులు చూసా. ఇలా నా దొంగ చూపులు కాస్త ఎకువ్వే అయ్యాయి. కనిపించిన ప్రతి సారి, చూడడానికి ప్రయత్నించడం, కొన్ని సార్లు నేను తిరికి చూసే లోపే, అతడు నన్ను గమనిస్తూ ఉండడం చాలా సార్లు జరిగాయి. అలా జరిగినపుడు కొన్ని సార్లు నాకు భయమేసేది కూడా. నేను చూసేపుడు చాలా సార్లే దొరికేసాను. అతనికి ఇపుడు full clarity వచ్చి ఉంటది, నాకు వాడంటే interest అని.

అప్పటినుంచి ఆచి తూచి చూడటం మొదలు పెట్టాను కానీ చూడడం ఆపలేదు. తను బెంగాలీ అని తెలిసినప్పటి నుంచి బెంగాలీల గురించి చిన్నపాటి రీసెర్చ్ కూడా చేసా. బెంగాలీ బాష నేర్చుకుందాం అని కూడా ప్రయత్నించా, కానీ అది అంత easy కాదు. కానీ "సినిమా చూపిస్తా మామా" సినిమా పుణ్యమా అని ఒక్క బెంగాలీ వాక్యం అయితే నేర్చుకున్నా. అదే "అమీ తుమా కి భాలో భాషి" అని, అంటే తెలుగు లో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని అర్థం. కానీ ఈ మాట అతనికి చెప్పే ధైర్యం ఆ టైం లో నాకు లేదు. కానీ అలానే ఉండిపోలేం కదా అనే ధైర్యం కూడా. ఇలాంటి confusion లో నేను మీకు కథ clarity తో చెప్పలేను.

"అమీ తుమా కి భాలో భాషి" పలుకుతుంటే ఎంత బాగుందో కానీ అతడికి చెప్పే ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పటికి పేరు, నంబర్ తెలిసి కొన్నీ నెలలే గడిచిపోయాయి, కానీ ఏం లాభం. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఇష్టపడడం మొదలు పెట్టాను, ఎలా పేరు కనిపెట్టాను, ఆ పేరు కోసం ఎన్ని తంటాలు పడ్డాను. ఇవన్నీ తనకి నేరుగా చెప్తే ఎలా feel అవుతాడా అని. నా ఫ్రెండ్స్ నన్ను చాలా సార్లు encourage చేశారు, కనీసం తనకి నా లాంటి అభిమాని ఒకరు ఉంది అని అతను తెలుసుకోవాలి కదా అని.


ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి తననే చూస్తుంది అంటే ఆనందం గా ఫీల్ అవుతారు, కానీ పైకి ఏమి తెలినట్టు నటిస్తారు. కానీ నా విషయం లో తను ఏం అనుకుంటున్నాడో నాకు తెలియదు. తనకి ఈ విషయం చెప్తే, సంతోష పడ్తాడా అనే సందేహం. కానీ ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి అని decide అయ్యా.

అందరికీ వెలుగునివ్వాలి అని పొద్దున్నే వచ్చే సూర్యుడీవే నువ్వైతే, పొద్దస్తమానం సూర్యుడి చుట్టూ తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు లాంటి అలసిపోని అమ్మాయిని నేనవుతా.


లోతెంతో కొలవలేకపోయినా అందరినీ ఆకట్టుకునే సముద్రమే నువ్వైతే,

24*7 సపోర్ట్ లా నిన్నే మానిటర్ చేసే ఒడ్డుని నేనవుతా.


అందని ద్రాక్షలా ఉన్న నీ స్నేహం అందకపోయినా,

అందనంత ఎత్తులో చందమామలా నువ్వున్నా,

నువు నా కంటికి కనిపించినంత కాలం నేను అందంగా ఈ జీవితం గడిపేస్తా, అని తనకి చెప్పాలని ఉంది.


కానీ ఇవన్నీ చెప్పాలంటే ఒకటే దారి. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని అతనికి message చేయడమే. ప్రతి రోజు casual గా whatsapp లో అతని DP చూసే నాకు ఈరోజు అతనికి message టైప్ చేస్తుంటే చేతులు చిన్నగా వొణుకుతున్నాయి. ఏదో తెలీని భయం. ఏదైతే అది అయింది అని, ఇలా ఎన్ని రోజులు ఆలోచిస్తూనే కూర్చుంటాం అని, నేను చెప్పాలి అనుకున్న ఒకే ఒక్క లైన్ టైప్ చేసి సెండ్ బటన్ నొక్కేసి, గట్టిగా ఊపిరి పీల్చుకున్నా.


***************************


అక్కడ బిశ్వాస్ ఫోన్ "టుయ్ టుయ్" అని మోగింది


New message from Mithila-My Crush:

"Ami thumaki bhalo bhaashi"

 

బిశ్వాస్ మొహం లో చిరునవ్వు.



Rate this content
Log in

Similar telugu story from Romance