వెర్రితనం
వెర్రితనం
ప్రేమగ నువు ఉండడమే..ప్రేమించడం వెర్రితనం..!
పంచేస్తూ పోవడమే..ఆశించడం వెర్రితనం..!
ఎవరిక్కడ ఉంటారట..ఏం పట్టుకు పోతారట..
తెలివితోటి బ్రతకడమే..సాధించడం వెర్రితనం..!
మరణించే దెవ్వరటా..మనసు పిట్ట ఎగరడమే..
తిరిగితిరిగి పుట్టడమే..శోధించడం వెర్రితనం..!
నీ హృదిలో నిశ్చలమౌ..దీపమొకటి చూశావా..
చిరునవ్వై వెలగడమే..నేర్పించడం వెర్రితనం..!
ఎవరినోయి ప్రశ్నిస్తావ్..జవాబెవరు ఇస్తారట..
మౌనంలో మునగడమే..కలహించడం వెర్రితనం..!
నేనెవరో నీవెవరో..ఎంత గొప్ప నాటకమోయ్..
ఒక సాక్షిగ మిగలడమే..బాధించడం వెర్రితనం..!
