రైతువిజయము
రైతువిజయము
రైతు విజయము
(ద్విరదగతి రగడ )
వానలే రాలేదు వరినారు మడిలేదు
దీనతకు సెలవేది? దిగులు తీరనెలేదు
నల్లమబ్బు లెక్కడ? నాశనంబు కలిగెను
పల్లెలో రైతులకు బాధలే మిగిలెను.
ఏరువాక పౌర్ణమి ఏటేట వచ్చునట!
కారుచీకటి బ్రతుకు కష్టాలకు నెలవట!
విత్తుజల్లగ చేత విత్తంబు కరువాయె!
సత్తువను చూపంగ సాహసము లేదాయె!
గొడ్డుగోదకు తిండి కొఱతగా కనబడును
బిడ్డలకు కూడునే పెట్టలేక క్రుంగెను
రైతునోదార్చంగ రాలేరు తోడుగా
నీతి మరచిన నేటి నేత
లకు దీటుగా
కదలి వచ్చిన జనము కరములను కలపండి!
ముదముగా రైతులను ముందుకే నడపండి!
వికృతమౌ చేష్టలను విడువంగ తలచండి!
ప్రకృతిని జయించగా వనరాశి పెంచండి!
పాదపంబుల పెంచంగ వానలిట కురియులే
సాదరంబుగ భువిని సమీరము చుట్టులే!
చల్లనౌ గాలితో చకచకా పయనించు
నల్లనౌ మేఘాలు నయముగా కురిపించు
వానలే పల్లెలో పంటలను పండించ
ప్రాణములు నిల్పి మా భాగ్యములు పొంగించ
రైతు రారాజగుచు రాజ్యము నేలుతాడు.
జాతి కంతటి కతడు జయము కలిగిస్తాడు.//