పిచ్చి మనసు
పిచ్చి మనసు
పిచ్చి మనసు ఆరాటం..నీ ప్రేమను పొందాలని..!
తపనెంతో చెప్పలేను..నిన్నొకపరి చూడాలని..!
నీ పాదము లభిషేకము..చేయ నీరు తేనెక్కడ..
ఎలా నిన్ను కోరగలను..కన్నీటితొ కడగాలని..!
ఈ చంచలతను ఎలా..కన్నావో తెలియదోయి..
తలచలేను మాటలతో..మాలకట్టి వేయాలని..!
నీ తలపుల సింధువులో..ఓ బిందువు నైతినేమొ..
అడగాలా నీ దయతో..ఈ జలధిని దాటాలని..!
జగమంతా నిండి ఉన్న..నిన్నెలాగ కొలవాలోయ్..
నా కోసం దిగివస్తే..చిన్ని ముద్దు ఇవ్వాలని..!
కలలలోకి వచ్చివెడితె..బాగుండదు చెబుతున్నా..
నా యాతన తెలిసెకదా..శాసించను మాన్పాలని..!
