కన్నీళ్ళింకిన కళ్ళు
కన్నీళ్ళింకిన కళ్ళు
మనసుకు ఓదార్పు కరువైనాక
బతుకుచిత్రం మసక బారినాక
గుండె కఠిన శిలగా మారినాక
ఆ కళ్ళు నిర్జీవమైనాక వెంటాడి
వెంటాడిన జీవిత చక్రం కలలు చేజారినాక
ఓదార్పు కరువైనాక ,ఇక మిగిలేది
శూన్యమేనని తెలిసినాక
ఆ గాజు కళ్ళు కన్నీళ్ళు ఇంకిన కళ్ళు
రాలే ప్రతి కన్నీటి బొట్టుకు
ఓ కధ వుంటుంది ఆ నయనాలు
కార్చే కన్నీరు వెనక ఆగాధమే
గుండె గాయమై, మనసు సంద్రమవుతూ!
కన్నీళ్ళు మనుషులకే కాదు
మాటలే లేని మూగజీవాలకు,
రాగాలు పలికించే రాళ్ళూ,
రప్పలకు వస్తుంటాయి
>మనసుతో చూడగలిగితే
కళ్ళు కలలకే నిలయాలు కాదు
భావాలు పలికించి అనురాగాలు
కురిపిస్తాయి; ఆవే కళ్ళు వేదనలకు
గురైతే దుఖసాగరమై అలసిసొలసి
ఇంకిన కళ్ళుగా మిగిలిపోతాయి
భవసాగరం దాటలంటే
దోసిటతో ఎన్ని కన్నీళ్ళు
మొయ్యాలో! బాధ్యతల
బరువు ఎంత మొయ్యాలో!
బంధాల్లోకి నవ్వుల నజరానా
అందించాలంటే ఎన్ని కాళరాత్రులు
కన్నీళ్ళను అదిమి పట్టాలో !
కాలం కాటేసినా సునామీలా చుట్టేసినా
కనురెప్పల మాటునే కన్నీరును
దాచేసి కన్నీళ్ళు ఇంకిన కళ్ళతో
ఎదుర్కోవాలి మరో రోజుకు సిద్దంగా