అంతర్శుఖమలనం
అంతర్శుఖమలనం
నాలో
ఎవరో నడుస్తుంటారు.
అడుగుల శబ్దం నాదే,
దారి మాత్రం నాది కాదు..
అక్కడ
ప్రతి నిశ్శబ్దం
తన గొంతు కోసుకుని
రక్తంతో మాట్లాడుతుంది.
నేను
నన్ను వెతికే ప్రతి సారి
మరొక “నేను”
కనిపిస్తుంటుంది..
నన్ను నేను చూసుకున్న ప్రతిసారి
నా ముఖం మారదు,
కానీ
నా అంతర్ముఖం మారిపోతుంది..
ఎంత లోపలికి వెళ్తే
అంత అపరిచితంగా మారుతున్నాను.
బహుశా
మనిషి తనకు తాను పరాయి ఏమో?
ఒక ఆలోచన
మరో ఆలోచన గొంతు నులిమి
సత్యమై కూర్చుంటుంది.
రేపటికి అదే సత్యం
శవంలా చల్లబడిపోతుంది.
నా లోపల
కాలం గడియారంలా కదలదు—
పగిలిన అద్దంలా చెల్లాచెదురవుతుంది.
ప్రతి ముక్కలో
వేరువేరు “నేను”లు కనిపిస్తారు.
ఏది అసలైనదో తెలుసుకునేలోపే
ఒక యుగం గడుస్తుంది..
చివరికి—
నాలోనే మునిగిపోయిన నేను,
తీరానికొచ్చింది శరీరమే అని గ్రహించాను.
అంతర్ముఖం చివర
ఎలాంటి జ్ఞానం లేదు..
నన్ను నేను కోల్పోయిన
ఒక నిశ్శబ్దం మాత్రమే ఉంది..
