అమ్మతనం
అమ్మతనం
నా కడుపులో ఇంకొక ప్రాణం ఊపిరి పోసుకుంది అని తెలిసినప్పటి నుంచి...నా ప్రాణమే నువ్వై పోయావు.
నీలో కదలికలు మొదలైనప్పుడే, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయింది. నువ్వు కాళ్ళతో తంతుంటే వచ్చిన కన్నీరు... నా ఆనందానికి సాక్షాలు!
నా శ్వాస నీవై పోయి, ఈ ఉచ్ఛ్వాస - నిచ్వాసలు నన్ను నీతో కలిపి ఊయలలు ఊపుతూ, లాలి పాడుతున్నాయి.
భరించలేని నా ప్రసవ వేదన, నిన్ను చూడాలి అనే ఆశ ముందు చిన్నదై పోయింది. నువ్వు ఏడుస్తున్నావు అనే బాధ అన్నిటికంటే పెద్దది ఐపోయింది.
నా చనుబాలు నీ నోటికి అందించి... అమ్మతనాన్ని నేను రుచి చూసాను. నీ తప్పటడుగులు చూసి మురిసిపోతూనే, నీకు చెయ్యి అందించి మంచి - చెడులు నేర్పించాను.
మన బంధానికి ఉన్న బలం, నీ భవిష్యత్తుకి భారంగా మారద్దని, నీ బలహీనతలు తెలుసుకొని బలగం పెంచుకోవాలి అనే నిన్ను ప్రపంచానికి అనుగుణంగా పెంచాను.
కానీ కాలంతో పాటు నా అంచనాలు, నీ ఆలోచనలు మారుతూ వచ్చాయి.
అమ్మ నేర్పిన సంస్కారం అమ్మ దగ్గరే ఆగిపోతుంది. నువ్వు దిద్దుకున్న వ్యక్తిత్వం నిన్నే మార్చేస్తుంది.
నువ్వు నేర్చుకున్న జ్ఞానం ప్రపంచానికి ఉపయోగ పడుతుందా! నిన్న నిరుపయోగం చేస్తుందా! అని తేల్చుకొనేలోపే... నీ అజ్ఞానం నీకు ముసుగేస్తోంది.
అమ్మని చూస్తూ పెరిగిన నీకు, ఆడతనంలో... అమ్మతనం కనిపించకుండా పోతుంది. తొడపుట్టినదాన్ని కాచుకునే నువ్వు, నీ సుఖం కోసం తోటి ఆడపిల్లని కాంక్షిస్తున్నావు. ఇది పాపం రా!
మనిషిగా రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావా!? నిన్ను పెంచడంలో అమ్మగా నేను ఓడిపోతున్నానా!?
తప్పు ఎక్కడ జరుగుతుంది??
ఈ ప్రశ్న, నువ్వు నేర్చుకున్న జ్ఞానానికి నీ విజ్ఞతకే వదిలేస్తున్న...!
ఒక్కటి గుర్తుపెట్టుకో కన్నా!!!
సృషించగలిగిన అమ్మకి... ప్రేమించగలిగే అమ్మాయికి... రక్షించగలిగే శక్తికి... అంతం చేయగలిగే తెగింపు కూడా ఉంటుంది.
!!!జాగ్రత్త!!!
- ఇది ఒక అమ్మ మాట...!
