అక్షరాలతో
అక్షరాలతో
ఆకాశానికి నిచ్చెనవేస్తే..వేయవచ్చురా అక్షరాలతో..!
మనసులమధ్యన ప్రేమకు వంతెన..కట్టవచ్చురా అక్షరాలతో..!
మౌనపువెన్నెల నీ తోడుంటే..పరిమళించునోయ్ భావాలన్నీ..
గొడవలు పెట్టే సరిహద్దులనే..చెరపవచ్చురా అక్షరాలతో..!
సహనం మించిన సంపదలేదని..తెలిసిన వాడికి చెప్పాలేమిటి..
విషాన్ని కూడా అమృతధారగా..మార్చవచ్చురా
అక్షరాలతో..!
పాత్రకు న్యాయం చేసే పనిలో..ఉండటమేనోయ్ మనిషికి ధర్మం..
శాంతిని నిలిపే రాజకీయమే..చేయవచ్చురా అక్షరాలతో..!
రంగులు ఏడూ కలిసున్నాయని..తెలుపే చాటెనె పరిశోధనలో..
మతమేదైనా అభిమతాలను..కలుపవచ్చురా అక్షరాలతో..!
బాధలు కాల్చే జ్వాలగమిగిలిన..కలమే చూడూ గజలై పొంగును..
చక్కని చక్కెరపొంగలి నిత్యం..పంచవచ్చురా అక్షరాలతో.
