వస్తున్నావా...
వస్తున్నావా...
వీరభద్ర హౌసింగ్ సొసైటీ సిటీ కి మధ్యలో ఉన్నా,హైద్రాబాద్ లో ఉన్నవాళ్లు ఉండే ఏరియా ఇలానే ఉంటుందంట..వృత్తిరీత్యా ట్రాన్స్ఫఫర్ అయి,ప్రశాంతమైన అద్దె ఇల్లు వెతుకుటుంటే,ఆఫీసులో ఓ పెద్దాయన ఈ పేరు చెప్పాడు.
పేరుకి తగ్గట్టే భద్రత ఉంది.కానీ దానికోసం ఓ సెక్యురిటి ఏర్పాట్లు లేవు..ఎవరింటి దగ్గర వాళ్లే తగిన భద్రత తో ఉన్నారు..రోడ్ మీద ఓ పదడుగుల వరకూ చప్టా రాజసంగా కబ్జా చేసేసింది.అయినా మూడు కార్లు ఒకేసారి వెళ్ళేదారి ఉంది..
రాజువెడలే రవితేజములదరగా అన్నట్టు అనిపించింది మొదటిరోజు.మనింట్లో ఎం జరుగుతుందో అని,గుల్మోహర్ చెట్ల కొమ్మల సందులోంచి సూర్యకిరణాలు కూడా భయం భయంగా తొంగి చూసేంతగా,ప్రతి ఇల్లు సేఫ్టీ లాక్ వేసి ఉంది.
కిటికీ అద్దాలు ఎప్పుడో రాజులకాలం నాటి అద్వితీయ చెక్కుళ్ళు తో పెయింట్ వెయ్యబడి ఉన్నాయి...గేట్ ని మా ఆవిడ ఒక్కత్తే గారంటీ తెరవలేదు.చచ్చింది గొర్రె!ఈ దెబ్బకి వారానికి పది ఉపవాసాలు మానేస్తుంది అని సంబరపడ్డాడు వైభవ్.
బాహుబలి లో తమన్నా కూడా ఇంతే ఉంది..అలా అని యుద్ధం మానేసిందా అని రుజువు చేయడానికి అన్నట్టు కుడిచేత్తో ఇనుప గేట్ ని చాలా పొగరుగా గెంటింది.ఎడమ చేత్తో కుదరలేదు మరి.గ్రాఫిక్స్ అబ్బ సొమ్మే మరి,ఊరికే రావు..
ఇల్లు ఇంద్రభవనానికి దగ్గర పోలిక ఉన్నట్టు ఉంది.భార్యకి నచ్చితే బెర్ముడా ట్రయాంగిల్ కూడా తన పని మర్చిపోతుంది.రాత్రే సామాను మొత్తం సద్దేసుకుంది.
పొద్దున్న హోటల్ నుంచి తెస్తాను.నోట్లో మాట ఉండగానే ఇడ్లీ పప్పు నానబోసేను,అయిదు గంటలకి గ్రైండర్ లో వేస్తే ఎనిమిదింటికి విజయవాడ బాబాయ్ హోటల్ ఇడ్లీ మీ ప్లేట్ లో ఉంటుంది అంది హిమజ.
హౌసింగ్ సొసైటీ లో ఏడు అవుతున్నా జనాలు బయటకు రాలేదు.ఈలోపు మా పిల్లలు మాత్రం రోడ్డు మీద పడ్డారు..ఏడున్నర అవుతుంది.స్కూల్ కి తయారవకుండా,ఆటలకు పోయేరు చూడండి కంప్లైంట్ తో నిద్ర లేపింది భర్తని.
అబ్బా ఇదేమైనా పాతబస్తీ రోడ్డా..పో..పోయి హాయిగా నడుచుకుంటా పిల్చుకో!రోడ్డంతా నీదే..ముసుగుతన్నేడు
వైభవ్.
ఓయ్!వస్తున్నారా! లేదా!స్కూల్ టైం అవుతుంటే ఇపుడు ఆటలు ఏంట్రా...పొలంలో ఉన్నాను అన్నట్టు రంకె వేసింది హిమజ అని కాలనీ మొత్తం బయటకు వచ్చేరు.
కొత్తగా వచ్చేరా!?ఏమైందమ్మా...ఓ పెద్దాయన పరుగులాంటి నడకలో పోర్టికో నుంచి గేట్ దాటి వచ్చేడు.
విషయం మర్చిపోయి,అబ్బా!గున్నమావిడి వాసన అంటూ గుండెల నిండా గాలి పీల్చుకున్నారు..
బాబాయ్ గారూ!మీ మావిడి చెట్టు పూత బొత్తిగా రాలిపోతుంది.కొంచెం వేపనూనెలో,పసుపు వేసి మొదట్లో పొయ్యండి అంది హిమజ.
రెండూ ఈ సమయాన వాడివి కావు,పైగా పసుపు మొక్కలకు పోస్తారమ్మా!?తెలుసుకుందాం అనే అడిగేడు ఆయన
ఇది ఇందుకు వాడతారు అని నాకు తెలీదండి.కానీ వేపనూనె మంచిది.పైగా ఇపుడు పూతతో ఉంది అంటే ముత్తైదువ అన్నట్టు లేదూ!?పసుపు వేస్తే మాత్రం నష్టం ఏముంటుంది బాబాయ్! గారూ ఎగిరిపోయింది..
ఆ!ఎం చేసినా మంచి మనసుతో చేస్తే..మంచి మాత్రమే జరుగుతుంది.అంటుంటే రాయి చేతికి తగిలింది..అమ్మా!ఒరేయ్!రండి చెప్తా మీ సంగతి అంటూ తానూ చిన్న రాయి తీసింది,పిల్లలపైకి విసిరింది కూడా...అమ్మా..
.లూజర్ అమ్మా లూజర్...ఎగురుకుంటూ హిమజ చుట్టూ తిరుగుతున్నారు పిల్లలిద్దరూ..
రేయ్!అమ్మ లూజర్ ఎందుకు అవుతుందిరా కోపంగానే ఆడిగేరు పెద్దాయన
మేము విసిరిన రాయి అమ్మ చేతికి తగిలింది తాతయ్యా,అమ్మ విసిరిన రాయి ఏటో పోయింది..మాకు తగల్లేదుగా...లూజర్..లూజర్..
అయితే అయ్యనులే కానీ,పదండర్రా..స్కూల్ టైం అవుతుంది..చిన్నపిల్ల అయిపోయి బ్రతిమాలింది..అప్పటిదాకా పైనుంచి చూస్తున్న పిన్నిగారు గేట్ దాటి వస్తుంటే.అత్తయ్యగారో!పొద్దున్నే కుక్కలు తిరుగుతాయి..చూసుకోండి కోడలు బెదరకొట్టింది.
ఏ ఊరమ్మా మీది!?అడిగింది ఇష్టంగా
సత్తెనపల్లి పిన్నిగారూ!మా ఆయన బ్యాంకులో పని చేస్తారు.
ఇక్కడికి దగ్గరే..అక్కడ మా చిన్నమ్మాయి రెండో కూతుర్ని ఇచ్చేము.
నోకియా రింగుతుంది..దాని నోరు నొక్కి మీ మనవరాలు ఏ స్ట్రీట్ లో ఉంటారు పిన్నీ అడిగింది.మళ్ళీ నోకియా రింగింది.ఏంటండీ!మాట్లాడుతుంటే..
పళ్ళు రాలతాయి..పిల్లల కి ఆలస్యం అవుతుంది ఒకటి,పొయ్యి మీద కుక్కర్ అయిదు సార్లు పిలిచింది.అవతల పొయ్యి ఇడ్లీని మాడ్చేసింది
ఇక్కడున్నట్టు రావాలి.లేదంటే మొదటి రోజే బాజా...అన్ని ముఖ్య కేంద్రాల్లో ప్రదర్శింపబడును ఫోన్ పెట్టేసినట్టు తెలుస్తోంది హిమజ మొహంలో చిరాకు,భయం,కోపానికి..
వెళ్లమ్మా !పొద్దున్నే పనులుంటాయి..సందాల కాసేపు కూర్చుందాం రా !మర్చిపోవద్దు నవ్వింది పెద్దావిడ
ఓ బాబాయిగారు!కిందకి దిగండి.మొజాయిక్ మీద నడిస్తే కాళ్ళనొప్పులు ఇంకా ఎక్కువవుతాయి..పది గంటలకు పార్కు బాగు చేస్తున్నాను ఓ చెయ్యి వేద్దురు...వస్తారా!?మేడ మీద వాకింగ్ చేస్తున్న ఒకాయన్ని పలకరిస్తూ ,సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయింది.
ఏవిటి!అన్నయ్యా..పొద్దున్నే అల్లరి.ఆ పిల్లకి ఏమైనా స్క్రూ లూజా..తెలిసినట్టు మాట్లాడుతోంది..మేడమీద అతను పలకరించేడు తమ్ముడు ఉరఫ్ బాబాయ్ ని.
కొత్తగా వచ్చేరట..మంచిదిలా ఉంది.సరే!పదిగంటలకు వస్తున్నావా!?అడిగేడు అన్నయ్యని.
పోరా లూజ్ కి లూజ్ సరిపోయింది.వాకింగ్ మొదలుపెట్టేడు
ఏమిటి రాఘవ సర్..పదింటికి ఏమిటి విశేషం పాల పేకెట్ల బాచ్ ఓ పదిమందిదాకా ఉంటారు.అందులో ఒకాయన అడిగేడు.
పార్క్ బాగుచేసుకుంటే బావుంటుందని ఆ కొత్తమ్మాయి అంటుంటే మా అన్నయ్య లూజ్ అంటున్నాడు..మీరు వస్తారేమిటి !ఊ అనే సమాధానాన్ని వినాలనుకుని అడిగేడు.
ఎపుడూ కొరస్ గా ఆడిగేరు
పదింటికీ..!ఇవ్వాళే...ఆయనలో ఉత్సాహం అలా చెప్పించింది.
నలుగురు మాట్లాడకుండా వెళ్లిపోయేరు.ఇద్దరు తప్పకుండా వచ్చేసి,రాఘవ ఇంట్లో కూర్చున్నారు.
ఇంతలో ఫోన్ రింగయింది..బాబాయ్!టిఫిన్ ఇక్కడ చేద్దురుగాని వచ్చేయండి
ఎవరూ!అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అడిగేడు
పొద్దున్న మీతోమాట్లాడేను కదా!నా పేరు హిమజ బాబాయ్...రండి తొందరగా...
ఆ..ఆ..పదండిరా!పార్కుకి బయలుదేరేరు.
ఆ సొసైటీ లో మూడే సందులు..అటు ఇటు పదేసి ఇల్లు.చుట్టూ కాంపౌండ్ గోడ..ప్రతి ఇంటికి రెండువైపులా ఓ మామిడి,అగ్గిపూల చెట్టు..ఉగాదేమో!కోయళ్లు సందడి చేస్తున్నాయి..కొన్నింటి ముందు గులాబీలు,ఇతర పూలు ఇపుడే తలంటు పోసుకున్నాయి.అందుకే ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.ఆరింటికల్లా వాకింగ్ చేసి ఎనిమిది అయ్యేవరకూ పడుకుంటారు అంతా!అందరూ ప్రభుత్వ జీతగాళ్ళు అందుకే టెన్షన్ లేని పని సమయాలతో హాయిగా ఉందనిపించింది.
పొద్దున్నే ఎనిమిదింటి వాతావరణం ఈ మధ్య కాలంలో బయట చూడలేదు.ఇపుడు ఈ హడావిడి.ఏదో!పెళ్ళిలా ఉంది ఈ సందడి.పార్కుకు వచ్చేసేరు.
టీ కేన్,హాట్ బాక్స్ లో ఉప్మా,పెసరట్టు వాసనలు గుప్పుమన్నాయి..తినేసి పని చేద్దామా!?పని చేసేకా తిందామా అడిగింది హిమజ.అప్పటికే వంట అయిన ఓ డజను ఆడంగులు పోగయ్యారు..రుచి చూసే పనిలో ఉన్నారు.
తినేసే...మూకుమ్మడి సమాధానం
టిఫిన్లు కానిచ్చేరు..కర్రకి కట్టిన కొబ్బరీను చీపుర్లు సిద్ధంగా ఉన్నాయి..పార్కు మొత్తం తుడవడానికి అందరికీ కలిపి గంట పట్టింది..
వస్తున్నారా !?మమ్మల్ని తయారుచేసుకోమంటారా..
అన్న అరుపుకి భయపడ్డట్టు ఆటో ఆగింది.ఖాళీ గిన్నెలు ఎక్కించుకుని,పుదీనా నిమ్మ వాసనల నీళ్ళు నోరు ఊరిస్తున్నాయి..
రేవు ఇంకో అయిదు ప్లేట్లు పెంచండి.ఈ కేన్ మా ఇటిదగ్గర పెడతాను రేపు తీసుకెళ్లండి..మర్చిపోకుండా సమయానికి వస్తారుకదూ...అర్థర్ అయినా ఆర్ద్రత ఉంది..
వస్తాం అక్కా!గాబరా పడకు...నవ్వుకుంటూ వెళ్లిపోయేరు.
ఎందుకీ అనవసరపు ఖర్చు!?రాఘవ హిమజని అడిగేడు.
తెలీదు బాబాయ్!కానీ మీకు నచ్చిందా లేదా!?ఇంకాస్త చనువుగా అడిగింది..
బంగారంలా ఉంది.కానీ పిల్లలు చిన్నవాళ్ళు..చదువులకు బోలెడు ఖర్చు అవుతుంది..డబ్బుని జాగ్రత్త చేయాలి..పొదుపు నేర్చుకో!?నవ్వేరు
ఎవరికైనా పెడితే వేస్ట్ కాదు బాబాయ్...ఇవ్వాళ రోజూ కన్నా బావుంది అని,రేపు మీరు నాతో చెప్పకుంటే ఇవన్నీ మానేస్తాను...తానూ నవ్వింది.
అంతా మొహాలు చూసుకున్నారు.మేము ఎంతెంత ఇవ్వాలో చెప్పు..ఇకనుంచి వారానికోసారి చాలు అన్నారు ఆడాళ్లు కూడా..
ఇదివరకు ఇలానే వారానికి ఒకసారి శుభ్రం చేసుకునేవారా...అడిగింది హిమజ
అబ్బే!మున్సిపాలిటీ ఉంది కదా!అది వాళ్ళ పని.
కొత్తల్లోనే వారానికి ఒకసారి శుభ్రం అనిపిస్తే...పోను పోను రోజూ వస్తే బావుంటుంది అని తప్పకుండా అనిపిస్తుంది.
అందరితో కలిసి ఉండడం ఆరోగ్యం..మొహం ఇలా పెట్టుకుని మనపాటికి మనం వాకింగ్ చేసుకుంటే ఉపయోగం ఉండదు.నాలుగు కబుర్లలో పని చెమట చిందించాలి...టిఫిన్ పెద్ద విషయమా!?నేనయితే పార్కు ఉన్నప్రతిచోట ఇలానే చేసేను..అలానే రోజూ వస్తాను కూడా...మీకు ఇష్టమయితేనే రండి..మంగమ్మా!ఇందులో టిఫిన్ ఉంది.పిల్లలకి పట్టుకెళ్లు..ఓ చిన్న బాక్స్ చూపిస్తూ అంది.
అంతా నిమ్మనీళ్లు తాగాక,మరింత ఫ్రెష్ అయినట్టు అనిపించింది..అంతా నాగరాజు గారి వంక చూసి నవ్వేరు.
అతిధి తింటేనే కానీ అన్నం ముట్టడు ఆయన. ఈ సొసైటీ లో ఎవ్వరూ బయటివాళ్ళూ తినడానికి రారని,పనోళ్ళు వేడి వేడిగా ఉంటే తప్ప ఏమీ పట్టుకు వెళ్ళరని తెలుసుకుని,వారి డ్రైవర్ కి రోజూ టిఫిన్,భోజనం పెట్టిస్తుంటే..చెవులు కొరుక్కునేవాళ్ళు..ఇవ్వాళ అందరిలో మార్పుకి ఆనందం,ఒకప్పటి పరాభవం పారిపోయినట్టు అనిపించి,హాయిగా ఉంది.
నా చీపురు పట్టికెళ్ళిపోనా!?ఇక్కడే ఉంచొచ్చా...హిమజని హాస్యమాడేరు రాజుగారూ..అంతా శృతి కలిపేరు నవ్వుకి...అయితే రేపు మళ్ళీ కలుద్దాం..
ఈ కధ అలా నడిచింది.దానితో పాటూ మీరూ ఎప్పుడు వస్తారూ...!?
