స్ఫూర్తి (నాకిష్టమైన కథ)
స్ఫూర్తి (నాకిష్టమైన కథ)


రామచంద్రం మాస్టారు మధ్యాహ్న భోజనం తరువాత విశ్రాంతి గా పడక కుర్చీలో కూర్చుని కనులు మూసుకున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. ఆయన భార్య జానకి వచ్చి ఫోన్ అందించారు.
"హలో" అనగానే అవతలి నుండి " నమస్తే మాస్టారూ, నేను సూర్య ని మాట్లాడుతున్నాను. బాగున్నారా మాస్టారూ. అమ్మగారు ఎలా ఉన్నారు." గౌరవాభిమానాలను మేళవించి అడుగుతున్నాడు పూర్వ విద్యార్థి సూర్య.
"మేం బాగున్నాంరా. నువ్వెలా ఉన్నావు. అమ్మాయి, మనవడు బాగున్నారా." ఆప్యాయంగా అడిగారు మాస్టారు.
"బాగున్నాం మాస్టారు. మీమనవడి మొదటి పుట్టిన రోజు అనాథాశ్రమం లో చేద్దామని అనుకుంటున్నాం. మీరేమంటారు మాస్టారూ." అడిగాడు సూర్య.
"చాలా మంచి ఆలోచన. అలాగే చేయండి.మంచి నిర్ణయం" అన్నారు ఆనందంగా.
"మేం ఏం మంచి పనులు చేసినా దానికి స్ఫూర్తి, ప్రేరణ మీరే కదా మాస్టారూ. మీరు మా అందరినీ ఆదుకొని, చదివించి, తీర్చిదిద్దబట్టి మేం ఈనాడు ఉన్నత స్థితిలో ఉన్నాం. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం" అన్నాడు గాద్గదికంగా.
"ఊర్కో సూర్యా, అంతా మీ అందరి కృషి, అదృష్టం. నాదేముంది." అన్నారు మాస్టారు.
"మాస్టారూ, ఆ రోజు మీరు తప్పక అమ్మ గారిని తీసుకుని రావాలి. మీ ఆశీస్సులు వాడికి తప్పక కావాలి." అన్నాడు సూర్య.
"అలాగే, తప్పకుండా వస్తాం, సరేనా." అన్నారు మాస్టారు నవ్వుతూ.
"థేంక్యూ మాస్టారూ, థేంక్యూ. మరి ఉంటాను
మాస్టారూ." అంటూ ఫోన్ పెట్టేసాడు సూర్య.
మాస్టారు సూర్య మాటలను తలుచుకొని ' నేను మీకుస్ఫూర్తి అనుకుంటారు. కానీ మనందరికీ ప్రేరణ దాత పరమేశ్వరం మాస్టారు.
ఆయన మనసు పరమేశ్వరం మాస్టారి పేరు తలచుకోగానే గతం లోకి జారుకుంది.
.......
రామచంద్రం మాస్టారుపేపర్ తిరగేస్తుండగా
"మాస్టారూ, మాస్టారూ" అని ఎవరో పిలచినట్లైంది.
'ఈ సమయంలో ఎవరా' అనుకుంటూ గేట్ వైపు చూసారు. పరమేశ్వరం మాస్టారు. ఆయన తన స్కూల్ లోనే పని చేసి రిటైర్ అయ్యారు.
మాస్టారు లేచి ఆయనని సాదరంగా ఆహ్వానించి
"ఏమిటి మాస్టారూ, ఇంత ఎండలో వచ్చారు, "
అంటూ " జానకీ, మాస్టారు గారు వచ్చారు, దాహానికి తీసుకురా." అని కేకేసారు."
పరమేశ్వరంగారు ఏదో చెప్పబోతుంటే చేతి తో ఆగమని సైగ చేసి "ముందు దాహం తీర్చుకోండి మాస్టారు" అన్నారు. ఇంతలో జానకి గారు పెద్ద గ్లాసుడు మజ్జిగ తెచ్చి ఇచ్చారు. అది తాగి దీర్ఘ శ్వాస తీసుకొని "అమ్మాయి, ప్రాణం లేచి వచ్చిందమ్మా" అన్నారు.
"ఇప్పుడు చెప్పండి మాస్టారూ, ఎండన పడి వచ్చారేమిటి? కబురు పెడితే నేనే వచ్చేవాడిని." అన్నారు రామచంద్రం మాస్టారు.
"వస్తారనుకోండి, కాని నా పనికి కూడా మిమ్మల్ని రమ్మనడం భావ్యం కాదు కదా" అన్నారు.
"అదేంటి మాస్టారూ, పెద్ద వారు. చెప్పండి. ఏమిటి విషయం?"
పరమేశ్వరం గారు " మాస్టారూ, మీ చేతుల మీదుగా ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు. పిల్లల పట్ల మీరు కనబరిచే శ్రద్ధ,
ఆప్యాయత, బాధ్యత నేనెరిగినవే. అందుకే ధైర్యం చేసి మీకు ఒక బాధ్యత ను అప్పగించాలని వచ్చాను. నన్ను నిరాశ పరచరని ఆశిస్తున్నాను."
అన్నారు.
"అదేంటి మాస్టారూ! మీరు చెప్పడం, నేను చేయక పోవడమా! చెప్పండి. నేను ఏంచేయగలను"? అన్నారు రామచంద్రం మాస్టారు.
"మాస్టారూ, నాకు తెలిసిన ఒక బీద కుటుంబం లో పిల్లవాడు చాలా తెలివైన వాడు, యోగ్యుడు. వాడిని చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. వాడిని మీరు దగ్గర పెట్టుకొని చదివించాలి. నేనే
ఆ పని చేయకుండా మీకు ఎందుకు అప్పగిస్తున్నానని మీరు అనుకోవచ్చు. మీకు తెలుసు, నేను రిటైర్ అయిపోయాను. ఇక్కడే ఉంటే నా దగ్గర పెట్టుకొని చదివించే వాడిని. కాని నా కొడుకు నన్ను తనతో తీసుకెళుతున్నాడు. వాడిని చదివిస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు మాట తప్పి వాడిని నిరాశ పరచలేను. అందుకే మీ సహాయం అర్థిస్తున్నాను." అని అన్నారు పరమేశ్వరం గారు.
"మాస్టారూ మీరు చేసే ఒక మంచి పనికి నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. నేను తప్పకుండా ఆ పిల్ల వాడిని చదివిస్తాను. మీ మాట నిలబెడతాను." అని రామచంద్రం మాస్టారు హామీ ఇచ్చారు. ఆ మాటకు ఎంతో పొంగిపోయి పరమేశ్వరం మాస్టారు వాడి ఖర్చు లకు తానే పైకం పంపిస్తానని చెప్పారు.
"లేదు మాస్టారూ, ఆ అవకాశం నాకివ్వండి. ఎంతోమంద విద్యార్థులకు మీరు ఈ విధంగా సహాయం చేసారని విన్నాను. మిమ్మల్ని చూసి మేమంతా సంతోషించామే కాని సహకరించాలి అన్న ఆలోచన చేయలేదు. ఈ రోజు అనుకోకుండా ఆ భగవంతుడు మీ ద్వారా ఆ అవకాశం నాకు కలగ చేసాడు. నేను కూడా ఇకనుంచి పేద విద్యార్థులకు నా చేతనైన సహాయం అందిస్తాను. ఈ మహత్కార్యం లో నన్ను పాలుపంచుకోనివ్వండి."
అంటూ చేతులు జోడించారు రామచంద్రం మాస్టారు.
పరమేశ్వరం గారు ఆనందంగా చేతులెత్తి దీవిస్తూ
" శుభం భూయాత్" అని నిష్క్రమించారు.
వారిని సాదరంగా సాగనంపారు రామచంద్రం మాస్టారు.
గతాన్ని తలుచుకన్న రామచంద్రం మాస్టారి పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆనాడు పరమేశ్వరం మాస్టారి స్ఫూర్తి తో తాను తనకు వీలైనంత మంది విద్యార్థులకు చదువు చెప్పించాడు. వారంతా ఈ రోజు చక్కగా స్థిరపడి తమకు తోచినట్లు ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఇంతటి విజయం పరమేశ్వరం మాస్టారి ప్రేరణ తోనే సాధ్యమైంది. ఇదంతా ఆయన చలవే. అనుకుంటూ మనసులోనేవారికి నమస్కరించారు.
*******